Previous Page Next Page 
నేటి కాలపు మేటి కథకులు పేజి 13


    బాపయ్య నాయుడు, చిన్నపరెడ్డి ఓ ఊర్లోరాజకీయ ప్రత్యర్ధులు, సమ ఉజ్జీలు కూడా, ఎన్నికల వేళ రెండువైపులా మద్యం, ధనం, మాటలూ ప్రవహిస్తున్న వేళ చిన్నపరెడ్డి అనుచరుడు కోటిగాడు క్రూరంగా హత్యచేయబడతాడు. సహజంగానే అనుమానం బాపయ్య నాయుడు పై వస్తుంది.... రాకపోయినా వచ్చేలా చిన్నపరెడ్డి చేస్తాడు. కోటిగాడి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటాడు చిన్నపరెడ్డి. ఆధారాలుండవు కనుక.. బాపయ్య నాయుడి అనుచరులకు అనుమానంతో అరెస్ట్ చేస్తారు పోలీసులు. ఈ లోగానే ఎన్నికలు జరగడం, సానుభూతి ఓట్లు పెరిగి చిన్నపరెడ్డి గెలవడం జరుగుతాయి. విజయోత్సాహంతో ఇంటికి వచ్చిన చిన్నపరెడ్డికి వీరయ్య ఎదురై ఒంటరిగా ఉన్నప్పుడు ప్రాణాలకు తెగించి చేసిన పనికి డబ్బులడుగుతాడు. ఇదే ఆఖరినీ, మళ్ళీ వస్తే బావుండదనీ చెప్పి కోప్పడినా నవ్వుతూ వెళ్ళిపోతాడు వీరయ్య.
    దుర్మార్గుల ప్రాపకం పగడ నీడ లాంటిదనీ, విశ్వాసంగా పనిచేసిన వాళ్ళను కూడా స్వార్ధం కోసం పావుల్లా వాడుకుంటారనే చేదు వాస్తవాన్ని తెలియజేసే ఈ కథను కామేశ్వరి యాభై ఏళ్ల క్రితమే రాశారంటే ఆమె సునిశిత దృష్టికి ఆశ్చర్యపోతాం. ముఖ్యంగా రాజకీయాల్లో గెలుపుకోసం అవసరమైతే తమవారి ప్రాణాలు తీయడానికి కూడా వెనుకాడరనే సత్యాన్ని చెబుతుంది ఈ కథ. అయితే కథ మొదట్లోనే కోటిగాడ్ని చిన్నపరెడ్డే చంపించి ఉంటాడనే అనుమానం పాఠకుడికి కలుగుతుంది. 'చిన్నపరెడ్డి (ప్రచారానికి) ఇంకా రంగంలోకి దుమకలేదేమిటని అందరూ చూస్తున్నారు' అని కథ మొదట్లోనే ఉన్న సూచన ఈ అనుమానానికి కొంత తావిచ్చింది. కథను మరికొంత జాగ్రత్తగా మలచి ఉంటే బావుండునేమో అనిపిస్తుంది. అయితే, ఆనాటికీ, ఇప్పటికీ ఎన్నికలప్పుడు పరిస్థితుల్లో మార్పులు రాకపోగా మరింత దిగజారాయి కూడా. రచయిత్రి మాటల్లోనే చెప్పాలంటే 'అప్పటికీ ఇప్పటికీ రాజకీయాల్లో ఏ మాత్రం మార్పు లేదు. ఆ కుత్సితాలు, కుతంత్రాలు, ఎత్తులు, పై ఎత్తులు, పదవి కోసం ఎంతకైనా దిగజారే అవకాశవాదాలు... ఇంకా ఎక్కువయ్యాయే గానీ తగ్గలేదు.' ఈ మాటలు అక్షర సత్యాలు.
    ఒక్కొక్కసారి మనుష్యులు పట్టుదలలకు ఇచ్చిన ప్రాధాన్యత అసలు విషయానికి ఇవ్వరు. ఏ కారణంగానైనా ఒక పట్టుదలతో కొంత దూరం వెళ్ళాక ఒక్క నిముషమైనా ఆగి ఆలోచిస్తే ఆ పంతం తాలూకూ దుష్ఫలితాలు తగ్గుతాయనే ఆలోచనే వారికి కలగదు. చాలాసార్లు పెద్దవాళ్ళ పట్టుదలల మధ్య పేదవాళ్ళు, బలహీనులు నలిగిపోతారు కూడా, నగరంలో పెద్ద బట్టల షాపు బూల్ చంద్ ది. ఓ రోజు షాపు తెరవగానే రమా, మూర్తీ అనే దంపతులు బట్టలు కొనడానికి వస్తారు. రెండు గంటలకు పైగా సేల్స్ మాన్ రంగడు, యజమాని కొడుకు కిషన్ ఏకబిగిన చూపించినా ఒక్క చీర కూడా నచ్చదు రమకి. బాహాటంగానే ఆమె అసంతృప్తిని, నిరసనని తెలియజేస్తున్న కొద్దీ ఓనర్ కొడుకు కిషన్ లో ఆమె చేత ఎలాగైనా ఓ చీర కొనిపించాలనే పట్టుదలా, విసుగూ లోపల్లోపల పెరుగుతూ ఉంటాయి.
    భర్త కూడా విసుక్కోవడంతో చివరికి ఓ చీర కొనుక్కొని వెళ్ళిన రమ పది నిముషాల్లో వెనక్కు వస్తుంది భర్తతో సహా, అంతకుముందు షాపులో కొన్న మూడు చీరల ప్యాకెట్ వదిలి వెళ్ళానని చెబుతుంది. గంటకు పైగా వెతికినా ప్యాకెట్ దొరకదు సరికదా ఇరువైపులా పట్టుదలలు పెరిగి పోలీసులను పిలిచేదాకా వస్తుంది. వాళ్ళు రంగడ్ని చితకబాదినా తెలియదన్నమాట తప్ప మరో సమాధానం రాబట్టలేకపోతారు. చివరకు అందరి దృష్టిలోనూ తామే విలన్లుగా మారినట్లనిపించి మూర్తి, రమ దంపతులు వెళ్ళిపోతారు. నడవలేనంతగా దెబ్బలు తిన్న రంగడికి తిండి తెప్పించి, రెస్ట్ తీసుకోమని ఆనాటికీ సెలవిస్తారు. షాప్ బయట చెట్టు కింద ముష్టివాడు ఎంత కొట్టినా, చీదరించినా వాడి దగ్గరికే తోకూపుకుంటూ వస్తున్న గజ్జి కుక్కను చూసి నవ్వుకుంటాడు కిషన్. ఇదీ 'కుక్కబ్రతుకు' కథ. మధ్యలో రమ దంపతులు బయటకు వెళ్ళినపుడు 'చీరల గుట్టలోంచి చీరెలు తీసుకుని షాపు వెనకే ఉన్న ఇంట్లోకి వెళుతూ రంగడ్ని చూసి అదోలా నవ్వాడు కిషన్' అన్న వాక్యంతోనే ఆ చీరలు కిషన్ తీసాడని పాఠకుడికి తెలుస్తుంది. అయినా విశ్వాసం గల రంగడు నోరెత్తడు అని సింబాలిక్ గా 'కుక్క బ్రతుకు' కథలో చెబుతారు రచయిత్రి.
    'గట్టు తెగింది' కథ తొలి తెలంగాణా ఉద్యమానికి సమాంతరంగా ఆంధ్రా వారు నడిపిన ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ నేపథ్యంగా 1970ల ప్రాంతంలో రాసిన కథ. కథ జరిగిన ప్రాంతం హైదరాబాదే. అల్లర్లు, ధర్నాలు, బస్సుల దహనం, రైళ్ళను ఆపడం, బాష్పవాయు ప్రయోగం, లాఠీచార్జి, కర్ ఫ్యూ లాంటివన్నీ తీవ్రంగా కొనసాగుతున్న సందర్భం. ముల్కీ నిబంధనల వల్ల ఆంధ్రా ప్రాంతం వారికి అన్యాయం జరిగిందని భావించిన యువకుల్లో ప్రసాద్ ఒకడు. ఓ రాత్రంతా ఇంటికి రాకపోయేసరికి కర్ ఫ్యూ లో ఎక్కడ చిక్కుకున్నాడో అని తల్లిదండ్రులు ఆందోళన పడుతుండగా మర్నాడు ఉదయమే కర్ ఫ్యూ సడలించాక ప్రసాద్ ఇంటికి వస్తాడు. ఎంతో ఆవేదనతో, దుఃఖంతో తన ప్రాణ స్నేహితుడు శ్రీనివాస్ పోలీస్ కాల్పుల్లో చనిపోయాడని చెబుతాడు.. అతని శవయాత్రను ఒక నిరసన ఊరేగింపుగా ఘనంగా చేయాలంటూ, ఉద్యమంలో బలి అయినా సరేనంటూ మళ్ళీ వెళ్ళిపోతాడు. అతన్ని వెనక్కు పీల్చుకురమ్మన్న తల్లితో 'గట్టు తెగిన ప్రవాహం వెనక్కు మళ్ళదు. ఏమి జగరనుందో?' అంటాడు తండ్రి. దీనిని ఒక కథగా కన్నా ఒక సంఘటనగా భావించవచ్చు. కామేశ్వరి ఎన్నో సార్లు చెప్పినట్టుగా ముందు తరాలవారు ఈ కథలు చదివితే అప్పటి సామాజిక, ఆర్ధిక, రాజకీయ పరిస్థితులెలా ఉన్నాయో తెలుస్తుందనేది నిజం. బయట ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నప్పుడు ఒక వ్యక్తి రాత్రంతా ఇంటికి రానప్పుడు అతని ఉనికి తెలియక ఇంట్లో వాళ్ళు పడే బాధ ఎలాంటిదో ఇప్పుడు మొబైల్ ను ఒక నొక్కు నొక్కితే చిటికెలో సమాచారం తెలిసే రోజుల్లో బతుకుతున్న వాళ్ళకు ఇలాంటి కథల ద్వారానే తెలుస్తుంది.
    ఈ సమాజమే కొందరి జీవితాలను అగాధంలోకి నెట్టేస్తుంది. వారిని బిచ్చగాళ్ళుగా, దొంగలుగా, హంతకులుగా, పతితలుగా తయారు చేస్తుంది. మళ్ళీ వాళ్ళ దీనావస్థను చూసి వెక్కిరిస్తుంది. ఆ అవహేళనలు వారిలో కసినీ, పగనూ పెంచుతాయి. మోసగాళ్ళుగా, నేరస్తులుగా మారుస్తాయి. ఇదంతా ఒక విషవలయం ఇందులో చిక్కుకున్న కవిత లాంటి వాళ్ళ కథే 'మానవత్వం మరువకు'. వేరే మార్గం లేక బలవంతంగా సెక్స్ వర్కర్ గా మారిన కవితకు ఎయిడ్స్ సోకుతుంది. తగు జాగ్రత్తలతో ఆరోగ్యమైన జీవిత విధానాన్ని కొనసాగించవచ్చునని డాక్టర్ ఆమెకు సలహా ఇస్తుంది. క్షణికావేశంలో, ఉక్రోషంతో....తన దగ్గరికి వచ్చిన వారందరికీ విషయాన్ని దాచిపెట్టి జబ్బును అంటించాలనే నిర్ణయం తీసుకుంటుంది ఆమె. మళ్ళీ ఆలోచిస్తే తమ వీధిలోనే కొందరు మగవాళ్ళ వల్ల అభం శుభం తెలియని వారి భార్యాపిల్లలకు ఆ వ్యాధి సోకడం గుర్తుకొచ్చి..... తెలిసి తెలిసి మనవల్ల ఎవరికీ అపకారం జరగకూడదని భావిస్తుంది. చివరికి ఒంటరిగా ఉండే ఓ ముసలావిడకు సహాయంగా వెళ్ళడానికి నిర్ణయించుకోవడంతో కథ ముగుస్తుంది. ఇలాంటి సందర్భాల్లోనే రచయితలు అవసరం. సమాజం మీద కసీ, కోపం, తప్పు చేసిన ఎందరో తప్పించుకొని తిరుగుతూనే తనకు మాత్రమే శిక్ష పడిందన్న ఉక్రోషం.....పెల్లుబికి ప్రతీకార చర్యలకు పాల్పడే వారిలో ఎవరైనా ఇలాంటి కథలు చదివితే ఎదుటి మనిషికి తెలిసీ అన్యాయం చేయడం ఎంత అమానవీయమో తెలుసుకుంటారు. సాహిత్యం యొక్క ప్రయోజనం అదే! 

 Previous Page Next Page