అధ్యాపకురాలిగా తన వృత్తి ధర్మాన్ని నిర్వర్తిస్తూనే రచనా రంగంలో కూడా తనదైన ముద్ర వేసిన వీరు దాదాపు 200 కథలూ, అనేక వ్యాసాలూ, కవితలూ, ఆకాశవాణి కోసం నాటికలూ రచించారు. పిల్లలతో ప్రేమయాత్ర, తప్పటడుగు, లేడీస్ స్పెషల్, తెల్లకాకులు వంటి ఇరవై నవలలు పత్రికల్లో సీరియల్సు గా ప్రచురితమై తర్వాత పుస్తకాలుగా వచ్చాయి. కన్నడం, తమిళం, హిందీ, మరాఠీ భాషల్లోకి వీరి రచనలు అనువదించబడ్డాయి. అనేక సాహితీ సారస్వత సభలలో సన్మానాలు అందుకున్నారు. కమలాకర లలితకళాభారతి వారు వీరిని 'సాహితీ రత్న' బిరుదుతో సత్కరించారు.
ఉన్నత విద్యనభ్యసించి, ఉద్యోగినిగా స్వయం సమృద్ధిని సాధించిన పరిమళగారి రచనలన్నిటిలోనూ ఆమె అభ్యుదయ భావాలు, తార్కిక దృష్టి వ్యక్తమవుతాయి. కళాశాల నేపథ్యం, పరిశోధనల ప్రస్తావనా వీరి రచనల్లో విరివిగా కనిపిస్తాయి. 'మిస్ సుధారాణి', 'ఇంటా బయటా', తప్పెవరిది?', 'ఉమెన్స్ కాలేజీ' కథల్లో కళాశాల వాతావరణాన్నీ, 'పద్మశ్రీ ప్రొఫెసర్', 'ప్రొఫెసర్ పరమేశం', 'ఆంతర్యం అట్టడుగున' వంటి కథల్లో యూనివర్శిటీ వాతావరణాన్నీ చిత్రిస్తూ వ్యక్తి చదువుకీ, ప్రవృత్తికీ మధ్యగల వైరుధ్యాన్ని చూపించడం ద్వారా ఈమె మానవ నైజాన్ని ఆసక్తికరంగా ఆవిష్కరించారు. అనేక కోణాలనుండి ఆనాటి విద్యావ్యవస్థని దృశ్యమానం చేసిన రచనలామెని.
1967నాటికే కులాంతర మతాంతర వివాహలనీ ఇతివృత్తంగా తీసుకుని కథారచన చేసిన పరిమళ గారు, తన కథల్లో ఆనాటి సమాజంలో బలంగా ఉన్న పిత్రుస్వామ్య వ్యవస్థని ప్రశ్నిస్తూ, స్త్రీ పురుషుల మధ్య ఉండవలసిన సమన్యాయాన్ని తన రచనల్లోని పాత్రల ద్వారా ప్రతిపాదించారు. అస్తిత్వ వాదాలు వేళ్ళూనకముందే, అన్ని వాదాల వెనకా ఉన్న మానవతావాదాన్ని బలపరచేలా సంభాషణలని తీర్చిదిద్దారు. అరవయ్యవ దశకంలోనే ఈమె 'వివాహబంధం స్త్రీ పురుషుల మధ్య నమ్మకమూ స్నేహమే పునాదిగా సాగాలనీ, అప్పుడే అది నూరేళ్ళ బంధంగా నిలుస్తుం'దనీ తన రచనల్లో సూచించడం విశేషం. స్త్రీవాదం రాకపూర్వమే స్త్రీల అస్తిత్వ చైతన్యాలను సుస్పష్టమైన రీతిలో అక్షరబద్ధం చేసిన సాహిత్యంలో ఈ కథలది ప్రముఖస్థానమని చెప్పుకోవాలి.
రచయితల రచనల్లో సమకాలీన సమాజమూ, నైసర్గికతా స్పష్టంగా చిత్రించబడటం ఆవశ్యకమైన అంశం. ఆయా కథలూ, నవలలూ చదివినపుడు ఆనాటి సమాజమూ, ఆ ప్రదేశమూ ఎలా ఉండేవో భవిష్యత్తరాల వారికి అవగాహన కలిగేలా సాహిత్యం ఉండాలి. పరిమళా సోమేశ్వర్ గారి రచనల్లో ఆనాటి హైదరాబాద్ నగర స్వరూపం స్పష్టంగా చిత్రీకరించబడింది. ఆ రోజుల్లో భాగ్యనగరంలో తరచుగా చోటుచేసుకున్న మత కలహాలూ, కర్ఫ్యూలూ ఎలా ఉండేవో వీరి రచనల్లో కనిపిస్తుంది.
పరిమళా సోమేశ్వర్ గారి కథల్లో ప్రస్తుతం లభ్యమవుతున్న కథలు చదివితే, ఇతివృత్తపు ఎన్నికలోనూ, పాత్రల మనస్తత్వ చిత్రణలోనూ ఈమె చక్కని వైవిధ్యం చూపించగలిగారని అర్ధమవుతుంది. ఎన్నుకున్న ఇతివృత్తాన్నిబట్టి ఈ కథలని పది వర్గాలుగా విభజించి విశ్లేషించడం జరిగింది.
అధ్యాపకులూ, విద్యార్ధుల మధ్య అనుబంధం మీద వచ్చిన కథలు
మిస్ సుధారాణి: ఇది రచయిత్రి మొదటి కథే అయినా ఈ కథ చదివితే చక్కని ఎత్తుగడా, ముగింపులతో కూడిన కథారచనలో ఆమె అప్పటికే పరిణతి సాధించారనిపిస్తుంది.
కథలో కాలేజీ విద్యార్ధిని సుధారాణి, కెమిస్ట్రీ లెక్చరర్ శేఖర్ మాష్టార్ని మూగగా ప్రేమిస్తుంది. అతనికి తనపట్ల ఉన్నది ప్రేమ కాదని తెలిసి ఆమె హృదయం ముక్కలైపోతుంది. భగ్న హృదయంతో కన్యగానే మిగిలిపోయిన ఆమె ఆరేళ్ళ తర్వాత చదువు పూర్తి చేసుకుని కెమిస్ట్రీ లెక్చరరవుతుంది. తాను నిర్వహించవలసిన లాబొరేటరీ క్లాసులో తనలాంటిదే మరో విద్యార్ధిని సరోజ ఆమెకు తారసపడుతుంది. తాను నడిచివచ్చిన దారిలోనే ఆమె అడుగులు వేస్తోందని సుధారాణికి అర్దమై ఆమె పట్ల సహానుభూతి కలుగుతుంది. ఒకరోజు నారాయణరావు సుధారాణికి తన పెళ్ళి శుభలేఖ అందిస్తాడు. లాబ్ క్లాసులో సుధారాణి టేబుల్ మీద మాష్టారి పెళ్ళి శుభలేఖ సరోజకి కనబడుతుంది. ఆమె జలజల రాలే కన్నీటిని ఆపుకోబోయి విఫలమవడంతో కథ ముగుస్తుంది.
కథలో కెమిస్ట్రీ లాబ్ లో విధ్యార్దుల ప్రయోగాలు, విధ్యార్ధులు తమకిచ్చిన రకరకాల రసాయనాల సాంపిల్స్ ని పరీక్షించి ఆ మూలకం లేదా కాంపౌండ్ ఏమిటో తెలుసుకోవడం, సరైన ఫలితం రాగానే వారి మొహాల్లో కనబడే సంతోషం, సైన్సు విద్యార్ధులందరికీ అలవాటైన అనుభవమే. నిజ జీవితంలో తమకెదురైనది నిజమైన ప్రేమా, మరోటా అనేది పరీక్షించి తెలుసుకోగలిగే ప్రయోగశాల కూడా ఉంటే బావుంటుందనే ధ్వని కథలో కనబడుతుంది. సరోజ మిగిలిన విద్యార్ధుల్లాగా ఇచ్చిన మిక్స్చర్ ఏమిటో వేగంగా కనుక్కోలేకపోవడం, తరచుగా ప్రయోగం పూర్తికాక లాబ్ క్లాసులో ఆఖరిదాకా ఉండిపోవడం కూడా జీవితంలో ఆమె మానసిక స్థితిని సూచిస్తుంది. తీసుకోవలసిన జాగ్రత్తల్లో చిన్నపాటి లోపాలున్నా ఫలితం తప్పుగా రావడం సైన్సు విద్యార్ధులకి తెలిసిన విషయమే. అలాంటి సహజమైన సంఘటనల ద్వారా, ఆమె దేన్ని పరస్పర ప్రేమ భావనగా తలచిందో అది ఆమె ఊహే గాని వాస్తవం కాదన్న సూచన కథకి చక్కని గాఢతని సమకూర్చింది.
కాలేజీలోకి అడుగుపెట్టగానే అపుడపుడే యవ్వనంలోకి ప్రవేశిస్తున్న విద్యార్ధినుల లేత మనసులు పాఠాలు చెప్పే లెక్చరర్ల పట్ల ఆకర్షించబడడం, వారికి వేరొకరితో వివాహమవగానే వాళ్ళు భగ్నహృదయలుగా మిగిలిపోవడం వాస్తవ జీవితంలో అక్కడక్కడా కనిపిస్తుంది. నిష్ఫలమైన ఇలాంటి ఆకర్షణా వలయాల్లో చిక్కుకోకుండా తమని తాము హెచ్చరించుకుందుకైనా విధ్యార్ధినులు ఇలాంటి కథలు చదివితే బావుండుననిపిస్తుంది.
ఇంటా బయటా: శశి ఉత్తమపురుషలోచెప్పిన కథ ఇది. కొత్తగా వచ్చిన ఇంగ్లీష్ లెక్చరర్ నారాయణరావుని గొప్ప వ్యక్తిత్వం గల ఉన్నతుడిగా ఊహించుకుంటుంది విద్యార్ధిని శశి. భార్యపై చేయిచేసుకుని హింసించే అతన్ని ప్రత్యక్షంగా గమనించి హతాశురాలవుతుంది.
భార్య పోయాక రెండో భార్యగావచ్చిన రమణి తన మొదటి భార్యకి పుట్టిన కొడుకు గోపీని సరిగా చూడదనే అనుమానంతో ఆమె జీవితాన్ని నరక ప్రాయం చేస్తాడు నారాయణ రావు. తండ్రి ప్రవర్తన వల్ల పన్నెండేళ్ళవాడైన గోపీకి సవతితల్లి అంటే విపరీతమైన అసూయా, ద్వేషమూ. విధ్యార్ది దశలోనే పరిచయమైన మరో స్త్రీతో వివాహేతర బంధం నడుపుతున్న నారాయణరావు, ఆమెతో తన సంబంధాన్ని రమణి దగ్గర తరచూ ప్రస్తావిస్తూ, ఆమెని మనోవేదనకి గురిచేస్తూ ఉంటాడు.