Next Page 
మధుకీల పేజి 1

                               మధుకీల
                                                                          ------- యామినీ సరస్వతి
    సైకిల్ ఎక్కబోతున్న సుధాకర్ చెల్లెలు కేకకి ఆగిపోయాడు.
    "ముఖం కడుక్కున్నావా?"
    "ఎందుకు?"
    "నాన్నగారు పూజచేశారు. ప్రసాదం తీసుకుంటావా?"
    చేయి చాపాడు సుధాకర్.
    "ఇంతకీ ముఖం కడుక్కున్నావా?" రెట్టించింది జయప్రద.
    "ముఖం ఎందుకు కడుగుకుంటారో తెలుసా? నోటి దుర్వాసన పోవటానికంతే! నా నోరు ఎప్పుడూ దుర్వాసన వేయదు. అదంతా నీకు తెలియదులే! ఆ కొబ్బరి ముక్కలు యిలా పడెయ్."
    ఏదో గొణుగుతూ కొబ్బరిముక్కలు, బెల్లంముక్క అన్నగారిచేతిలో వేసింది జయప్రద. టక్కున నోట్లే వేసుకున్నాడు సుధాకర్.
    "ఛ,ఛ"
    "ఏం?"
    "భగవత్ ప్రసాదం కళ్ళకద్దుకోకుండా నోట్లో వేసుకోవచ్చా?"
    "జయా-అవన్నీ పిచ్చిపిచ్చి సంప్రదాయాలు. అందులో ఏముంది, మనకిది దక్కిందికదా అనే వుద్దేశ్యంతో కళ్లకద్దుకునే వారు పూర్వులు, వాళ్ళదో చాదస్తం."
    "నీదే మంచి తెలివితేటలులే, బుద్ధిగా చదువుకోరా బాబూ అని కాలేజీకి పంపిస్తూవుంటే నీ బుద్ధి పెడదారులు పడుతోంది. మీ నాన్నగారితో చెప్పి ఇక చదువు చాలిపించి ఎక్కడో నాలుగురాళ్ళు యిచ్చేచోట పడవేయిస్తేసరి" అంది అప్పుడే అటుగా వచ్చిన అన్నపూర్ణ.
    "నీకో నమస్కారం, ఆ పని మాత్రం చేయకు." అని సర్రున సైకిలు దూకించుకుని వెళ్ళాడు సుధాకర్.
    మసక చీకట్లు వచ్చాయి. వెలుగురేఖలు పరుచుకుంటున్నాయ్. అన్నపూర్ణ ముఖాన కుంకుమ బొట్టులా సూర్యోదయం అవుతోంది. ఇంటి ముందు కల్లాపి చల్లసాగింది జయప్రద.
    భర్తకి కాఫీ యివ్వటానికి యింట్లోకి వెళ్ళిపోయింది అన్నపూర్ణ.
                             *        *        *
    వళ్ళు విరుచుకుని లేచాడు మధు. కళ్లు తెరిచి చూసేసరికి ఎదురుగా గోడకున్న గడియారంలో ఏడుగంటలు దాటి పది నిమిషాలు గడిచినట్టుగా చూపుతున్నాయి ముళ్లు.
    బ్రష్, పేస్ట్ అందుకుని పెరట్లోకి వెళ్ళి తీరిగ్గా ముఖం కడుక్కుని స్నానంచేసి వచ్చేసరికి ఎనిమిది గంటలైంది. కొడుకుచేతికి కాఫీ అందిస్తూ అంది అన్నపూర్ణ "కాఫీ తాగేసరికి ఎనిమిదైంది, నీవు మార్కెట్ కి వెళ్లేదెప్పుడు? కూరగాయలు తెచ్చేదప్పుడు? మళ్ళీ తొమ్మిది దాటగానే కంచంలో అన్నీ వుండాలి- నీకు, చేతికెదిగొచ్చిన కొడుకులున్నందుకు ఫలమేం? అన్నీ ఆయనే చూసుకోవాలి. మీరు ఎప్పుడు బాధ్యత తెలుసొస్తుందో ఏమో?"
    తల్లి యిచ్చిన కాఫీ అందుకుని, చివాట్లని తింటూ కాఫీ తాగేడు మధు!
    "ఎన్నని ఏమిలాభం? వాగి వాగి నా నోరు పడిపోతుందేమో కానీ మీరుమాత్రం మారరు."
    కాఫీగ్లాసు కిందపెట్టి అన్నాడు మధు- "మా అక్క దేవత! మేం ఎన్ని తప్పులు చేసినా సర్దుకుని పోతుంది. అయినా అమ్మా! మా గోములు మా ఆటలు ఎన్నాళ్లు సాగుతాయ్. మీరిద్దరూ చల్లగా వున్నన్నాళ్లెకదా?"
    "ఇదొకటి నేర్చారు, నా కెందుకు బాబూ! ఎవతినో ఒకదాన్ని తెచ్చి ముడివేయించి మీ చెంబూ, చేటా చేతికిచ్చి పంపితేసరి! సంసారం బాధ్యత మీదపడితే కానీ తెలియదు."
    పెళ్ళిమాటెత్తితే సరికి మధు అక్కడ నిలవడు. ఇప్పుడూ అంతే! మరో మాటకు తావివ్వకుండా లేచి వెళ్ళిపోయాడు.
    అంతలో అటుగా వచ్చాడు సుందర్రావు కూరగాయల సంచితో "ఓయ్ వంటింటి మనిషీ! ఇంకా కొడుక్కి కాఫీఇవ్వటంలోనే మునిగివున్నావా? నాకు ఆఫీసుకి టయమవుతోంది. త్వరత్వరగా వంటకానీ ఇదిగో కూరగాయలు" అన్నాడు.
    జవాబు చెప్పకుండా సంచి అందుకుని వెళ్ళిపోయింది అన్నపూర్ణ.
    మరోగంట తరువాత సుందర్రావు, మధు భోజనానికి కూర్చున్నారు. జయప్రద గడపలో కూర్చుని ఆవారం వీక్లీ చదువుతోంది.
    "మీ కెప్పుడూ ఆఫీసూ, తప్పితే ఇల్లు మరో గొడవ పట్టదు."
    "నన్ను భోజనం చేయనిస్తావా?"
    "నేనేం మీ నోటికీ చేతికీ అడ్డురావటం లేదు."
    "మాటలుమాత్రం విసురుతున్నావ్"
    "బావుంది మంచీ చెడ్డా మీతో చెప్పకపోతే ఎవరితో చెప్పుకోవాలి."
    "ఇప్పుడా?"
    "ఇప్పుడుతప్పితే మీరు నామాట వినేదెప్పుడు."
    "సరి! సరి! పాతికేళ్ళుగా అలవాటైంది ఈరోజుతో మానుతావా? చెప్పు విందాం."

Next Page