అని పెడబొబ్బ పెడుతూ మెరుపులా పైకి లేచి సైకిల్ని అక్కడే ఒదిలేసి కాలేజీలోకి పరుగుదీశాడు రాజు.
అతని వెనక పడ్డారు వాళ్ళు లేడిని తరుముతున్న పులుల్లా. అయితే రాజు వాళ్ళకి చిక్కకుండా పరుగెత్తుకుంటూ కాంటీన్ లోకి పరుగుతీశాడు. అక్కడ ఈశ్వర్ గానీ, తనవాళ్ళుగానీ ఉంటారన్న నమ్మకం అతన్ని అక్కడికి తీసుకెళ్ళింది. కానీ...... కానీ......
ఎదురుగా జెన్నీ కనబడ్డాడు. బ్రౌన్ కలర్ కళ్ళూ, చెదిరిన జుత్తూ, ఆకలిగా ఉన్న పులిలా చూశాడు రాజుని జెన్నీ
రాజుకి పై ప్రాణాలు పైనే పోయాయి.
అతనూహించినట్టు తనవాళ్ళు లేకపోగా జెన్నికి ఎదురుపడ్డాడు. జెన్నీ తన తోలు ఒలిచేస్తాడు.
అయిపోయింది. తనకి చావు దెబ్బలు తప్పవు.
వెనక్కి తిరిగాడు పారిపోవడానికి.
అప్పటికే తనని వెంటాడిన వాళ్ళు అక్కడికి చేరారు.
ముందు జెన్నీ, వెనక వాళ్ళు. పారిపోయే అవకాశం లేదతనికి. జెన్నీ విసురుగా చేతిలోని కాఫీగ్లాసుని రాజు ముఖంకేసి కొట్టాడు.
"చచ్చాన్రో?" చావుకేక పెట్టాడు రాజు గ్లాసు భళ్ళున బద్దలైంది.
రాజు ముక్కులోంచి రక్తం కారుతోంది.
వెనక నించొకడు రాజు నడుంపైన కొట్టాడు. నడుం విరిగిపోయింది రాజు విసురుగా వెళ్ళి బల్లపైన పడ్డాడు ఆ ఊపుకి బల్లతో సహా కింద పడిపోయాడు. దెబ్బలాటచూసి అక్కడున్న స్టూడెంట్స్ బయటికి పరుగెత్తుతున్నారు భయంతో. ఆడపిల్లలు కాఫీగ్లాసులు ఒదిలేసి కెవ్వుమని కేకలు పెడుతూ పరుగులు తీశారు.
"ఈశ్వర్! ఈశ్వర్!" ఉరకులు పరుగులతో ఈశ్వర్ వర్గం మనిషి చలపతి పరుగెత్తుకొచ్చాడు.
ఈశ్వర్ కదలకుండానే అతనికేసి చూశాడు. చలపతి మొఖం కేసి చూస్తూ అతనికి చెప్పకుండానే అర్ధమైంది. తన వాళ్ళలో ఎవరిపైనో అఘాయిత్యం జరుగుతోంది. తను వెళ్ళి ఆదుకోవాలి అని.
"కాంటీన్లో మన రాజుని ఆ జెన్నీగాడు చంపేస్తున్నాడు" ఆయాసంతో చెప్పాడు చలపతి.
చలపతి మాటలు పూర్తి కాలేదు.
ఈశ్వర్ ఎగిరి నుంచున్నాడు.
అభ్రపథాన అమరావతికుంచి అభ్రమణి తీక్షణ కిరణాల్ని ఛేదిస్తూ కదిలివస్తున్న అభ్రమాతంగిలా, మరుభూమిలోని పిశాచాలని చీల్చిచెండాడడానికి వచ్చిన కంఠేకాలుడిలా అడుగు ముందుకేశాడు ఈశ్వర్.
నాలుగే నాలుగంగల్లో కేంటీన్ ముఖద్వారం దగ్గర నిలబడ్డాడు. లోపలనుంచి దొర్లుకుంటూ వచ్చిన ఓ సీసాపైన అతని పాదంపడింది.
అప్పటివరకూ రాజుని కొట్టడంలో నిమగ్నమైన జెన్నీ, అతని ముఠా ఈశ్వర్ ని చూడగానే క్షణకాలం నిశ్ఛేష్ఠులయ్యారు.
అప్పటివరకూ అసనాతురుడైన అశ్రవుడిలా తన సహచరుడి పైన హింస జరిపిన జెన్నీనీ, అతని ముఠావాళ్ళనీ మూడో కన్ను తెరిచిన అష్టమూర్తిలా చూశాడు ఈశ్వర్.
రాజు ఒంటిపైన షర్టు, పాంటు లేవు. అండర్ వేర్ తో చతికిలబడి ఉన్నాడు. దేహమంతా కమిలిపోయి, రక్తసిక్తమై ఉన్నాడు అతన్నలా చూడగానే ఈశ్వర్ ఆగ్రహంతో రెచ్చిపోయాడు.
కాలి కిందున్న బాటిల్ని బూటుతో గట్టిగా నొక్కాడు. అది భళ్ళున బద్దలైంది పగిలిన ఆ సీసాని చేతిలోకి తీసుకుని జెన్నీ మనుషులకేసి విసిరాడు ఈశ్వర్.
"అమ్మో?" అరిచాడొకడు. అది సూటిగా వెళ్ళి రాజుని సైకిల్ నుంచి కిందపడేసిన వాడి జబ్బకి గుచ్చుకుంది.
విరిగిన ఉర్వీధనంలా, పులికి జెన్నీ పైకి దూకాడు ఈశ్వర్. అలా దూకుతూనే పిడికిలి బిగించి అతని గడ్డం కింద కొట్టాడు. ఆ దెబ్బని కళ్ళముందు మెరుపు మెరిసినట్టయిందతనికి. జెన్నీ ఎగిరి వెనక్కి పడ్డాడు.
తమ నాయకుడు కింద పడగానే మిగిలిన నలుగురూ ఈశ్వర్ మీదకి వచ్చారు.
ఎగిరి ఒక కాలితో ఒకణ్ణి డొక్కలో, రెండో కాలితో మరొకడి ఛాతీమీద కొట్టాడు ఈశ్వర్. రెండు పిడికిళ్ళు బిగించి ముక్కు దూలాలు విరిగేలా మిగిలిన ఇధ్దర్నీ కొట్టాడు ఈశ్వర్. కెవ్వుమని కేక వేస్తూ కింద పడిపోయారు వాళ్ళు.