Previous Page Next Page 
మహాశక్తి పేజి 3

    అతన్ని లేవమన్నట్టు చిటికెలు వేసి చెయ్యి అందించాడు ఈశ్వర్. అతనికి జెన్నీ చెయ్యి అందివ్వలేదు.

    జెన్నీ లేవలేదు. మోకాలితో అతని ముఖంపైన కొట్టాడు. "అమ్మా?" అని అరిచి వెనక్కి పడ్డాడు జెన్నీ.

    "కమాన్..... హరియప్" అరిచాడు ఈశ్వర్.

    అప్పటికి ఈశ్వర్ బృందం అక్కడికి చేరుకుంది. ఉగ్రులై మహోదగ్రులై పోయారు రాజు పరిస్థితిని కళ్ళారా చూశాక మిత్ర బృందం.

    కళాశాల ఆవరణలో తమ మిత్రుడికి జరిగిన అవమానానికి ఆవేశం పట్టలేకపోయారు.

    రాజుని లేవదీసి నించోబెట్టాడు ముకుందం.

    రాజు నిలబడలేకపోయాడు. ఒళ్ళు స్వాధీనంలో లేదతనికి.

    ఈశ్వర్ ఫ్రెండ్స్ తో జెన్నీ చేత, అతని స్నేహితుల చేత బట్టలు విప్పదీయించి వరసగా నుంచోబెట్టి కాంటీన్లోంచి బయటకి మార్చ్ చేయించాడు సిగ్గుతో బయటకి నడిచారు వాళ్ళు.

    జెన్నీ వూహించని ఆ పరిణామానికి రగిలిపోతున్నాడు. తల కొట్టేసినట్టుగా ఉందతనికి.

    "యీసారి, మరోసారి ఇలా జరిగితే మీ తలలు గొరిగించి, గాడిదలపైన ఊరేగిస్తాను. ఖబర్దార్!" హెచ్చరించాడు ఈశ్వర్.

    "నువ్వంటూ మిగిలితే అలాగే చేద్దుగాని నీ ప్రాణాలు తీయకుండా నేను నిద్రపోను. జెన్నీ అన్నాడు కఠినంగా.

    "జెన్నీ! అలాంటి అవకాశం నీ కన్నా నాకే ఎక్కువ ఉంది. అంత తేలికగా నువ్వు నన్ను చంపగలిగితే యీ ఈశ్వర్ కి వ్యక్తిత్వమే లేనట్టు లెక్క. పులి పులితో పోరాడితే అందం. గాడిదతో కాదు. అందుకే నిన్ను విడిచిపెట్టాను" అన్నాడు ఈశ్వర్ కోపంగా.

    యీలోగా ప్రిన్సిపాల్. వి.కె.ఆర్. మరి కొందరు లెక్చరర్స్ అక్కడికి పరుగెత్తుకొచ్చారు. అక్కడ అండర్ వేర్స్ తో నిలబడి ఉన్న జెన్నీనీ, అతని స్నేహితులనీ చూసి ఈశ్వర్ పైన మండిపడ్డాడు ప్రిన్సిపాల్ వి.కె.ఆర్.

    "వ్వాట్ ఆల్ దిప్ హెల్ మిస్టర్ ఈశ్వర్? ఇంత దారుణంగా ఎందుకు వీళ్ళని కొట్టావు? నిన్ను సస్పెండ్ చేస్తాను. పోలీసు రిపోర్టు ఇస్తాను. ఐ హేట్ ఇన్ డిసిప్లిన్" అరిచాడాయన.

    ఈశ్వర్ ఆయన కేసి చూశాడు.

    క్రమశిక్షణకి సంబంధించినంత వరకూ నన్ను మీరెలా శిక్షించినా నాకు అభ్యంతరం లేదు సార్! కానీ నిజం తెలుసుకుని మీరు నిర్ణయం తీసుకోవడం మంచిది."

    "కంటికి కనిపిస్తుంటే ఇంకా నిజం, ఏమిటోయ్!" గద్దించాడాయన.

    "ఇటోసారి చూడండి. యీ రాజుని ఒంటరివాడ్ని చేసి, యీ అయిదుగురూ కలిసి దారుణంగా కొట్టి, బట్టలు విప్పించారు. అయిదుగురూ ఒక్కడ్ని చేసి కారణం లేకుండా కొట్టారు. అది అన్యాయం!

    "అది చూసి గుండె రగిలి. రక్షించమని ఆర్తనాదం చేసిన తోటివాడిని కాపాడ్డానికి వీళ్ళతో నే నొక్కడినీ తలపడ్డాను. న్యాయమైన యీ పోరాటంలో వీళ్ళని నేను గెలిచాను. రాజుకి అవమానం ఏ రీతిలో జరిగిందో, అదే పద్ధతిలో నేనూ వీళ్ళని శిక్షించాను.

    వాళ్ళు అయిదుగురు.

    నన్నేం చేయడానికైనా అవకాశం వాళ్ళకే ఎక్కువ ఉంది.

    ఇప్పుడు తప్పు నాదంటారా?

    ఆ జెన్నీదంటారా?"

    ప్రిన్సిపాల్ వి.కె.ఆర్. గుటకలు మింగాడు. జెన్నీకి వ్యతిరేకంగా తీర్పు చెప్పలేడు ఆయన. చెబితే అంకయ్య తన మీసాలు కత్తిరించేస్తాడు. అనవసరంగా తొందరపడ్డాననుకొని మనసులోనే చింతించాడాయన.

    "జరిగిందేదో జరిగిపోయింది..... ఇంకెప్పుడూ కొట్టుకోకండి. క్లాసులకి వెళ్ళండి!" బి.పి. పెరిగిపోయినట్టుగా అరిచాడు ప్రిన్సిపాల్ వి.కె. ఆర్.

    "ఇలా ఎలా వెళ్ళమంటారు క్లాసుకి?" ఎవరో కిసుక్కున నవ్వారు.

    "వేసుకోండి. ఎవరి బట్టలు వాళ్ళు వేసుకోండి" అరిచాడు మళ్ళీ వి.కె. ఆర్.

    ఈశ్వర్ మాట్లాడకుండా వాళ్ళ బట్టలు వాళ్ళకి ఇప్పించేశాడు.

    "నో.నో. ఇటీజ్ ఎ షేంఫుల్ థింగ్ - డిసిప్లిన్ బొత్తిగా కనబడకుండా పోతుంది" అనుకొంటూ లెక్చరర్లో కలిసి వెళ్ళిపోయాడు ప్రిన్సిపాల్ వి.కె.ఆర్.

 Previous Page Next Page