Previous Page Next Page 
వెన్నెల వేట పేజి 12

    మళ్ళీ ఫోను మోగింది.

    హర్షిత వెళ్ళి తీసింది.

    అది ఫణికుమార్ ఫోన్.

    "వన్ మినిట్" అంటూ ఆనందమూర్తికి ఫోనిస్తూ  'ఫణి' అంది.

    ఆనందమూర్తి రిసీవర్ తీసుకుని 'హల్లో' అన్నాడు.

    "ఆనంద్! నేను నిన్ను కలవాలని హాస్పిటల్ కి వచ్చాను. అప్పుడే కారు దిగుతూ కనిపించాడు డాక్టర్ సూర్యచంద్ర. అతడితో మాట్లాడుతూ వెళ్లి అతని రూంలో కూర్చున్నాను. అంతే! అతడు నీకు ఫోన్ చెయ్యడం, నువ్వు రావడం అంతా జరిగిపోయింది. సారీరా..... నువ్వు రాజీనామా చేస్తావనుకోలేదు"

    "చేస్తే యేం?"

    "నెల అయ్యేసరికి వచ్చే జీతం....."

    "షటప్.....! ఆ మాత్రం సంపాదించుకోలేకపోలేను. పొద్దున్నపూట కూడా రేపటినుంచి క్లినిక్ కి వెళ్తాను. నో ప్రాబ్లమ్' అది సరే సండే మన ప్రోగ్రాం వుందా?" అడిగాడు మాట మారుస్తూ.

    "ఉంది. అది చెప్తామనే ఫోన్ చేశాను తప్పకుండా రావాలి. హర్షితకి కూడా చెప్పు."

                                                     *    *    *

    ఆదివారం ఫణికుమార్ ఇంట్లో సందడిగా వుంది. ఆనందమూర్తి, హర్షితా ఉదయమే వచ్చేశారు. అందరూ పిచ్చాపాటి కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నారు. లతిక, హర్షిత కలిసి వంట పూర్తిచేశారు. నలుగురూ డైనింగ్ టేబిల్ దగ్గర కూర్చున్నారు భోజనాలకి. సరదాగా జోక్స్ చేసుకుంటూ, కబుర్లాడుకుంటూ భోజనాలు చేస్తున్నారు.

    "ఆ రోజు మీరు మా ఆయనగారి ఆసుపత్రికెళ్ళి ఆస్త్మా పెషంటు వాసుదేవరావు ప్రాణాలు నిలబెట్టి మీ మిత్రుడికి చాలా సాయం చేశారు ఆనందమూర్తిగారూ! మీ పుణ్యమా అని పేషెంటు బతికాడు. ఈయనకి చెడ్డపేరు రాకుండా మీరు సాయపడ్డారు. మీకెలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియటం లేదు....." అంది లతిక. ఆనందమూర్తి చిరునవ్వు నవ్వాడు.

    "ఈ విషయాలన్నీ ఫణి చెప్పాడా?" అన్నాడు ఆనందమూర్తి.

    "ఆయనకి ఈ విషయాలన్నీ నాతో ముచ్చటించే తీరికకూడానా? నర్సింగ్ హోంలో విషయాలేమీ నాతో చెప్పరు. నిన్న ఆ పేషంటు పెద్దకొడుకు, మా ఇంటికొచ్చి మిమ్మల్ని కలవాలని మీ అడ్రస్ అడిగాడు. మిమ్మల్ని సాక్షాత్తూ దైవస్వరూపులుగా వర్ణించాడు. మీ అడ్రసూ, ఫోన్ నెంబరూ ఇచ్చాను. అతను మీ దగ్గరికొచ్చి కలవొచ్చు" అంది లతిక.

    "నిన్న వాసుదేవరావు పెద్ద కొడుకు మనింటికి వొచ్చాడా? మరి నాకు చెప్పలేదేం" అన్నాడు ఫణికుమార్ కొంచెం నొచ్చుకున్నట్టు చూస్తూ.

    "అతను వచ్చింది మీ గురించి కాదు. ఆనందమూర్తి గారి అడ్రసుకోసం అందుకేమీకు అతనొచ్చాడని చెప్పాల్సిన అవసరం ఉన్నట్టు నాకు అనిపించలేదు" అంది లతిక పరుషంగా.

    ఫణికుమార్ మనసు చివుక్కుమంది.

     "లతికా? ఏం మాట్లాడుతున్నావో నీకు తెలుసా? ఇతరుల ముందు నన్ను అవమానించాలనేగా ఇలా వాగుతున్నావ్?" కోపంతో అరిచాడు ఫణి.

    పరిస్థితిని అవగాహన చేసుకున్నాడు ఆనందమూర్తి.

    "ఫణీ! ఆవేశపడకు. ఇక్కడ బైటివాళ్ళు ఎవరున్నారనీ. లతిక ఏదో సరదాగా చెప్పింది. నువ్వలా ద్వేషపూరితంగా అరిస్తే ఎలా? ప్రేమించవలసిన దానిని ప్రేమించాలి. ద్వేషివలసిన దానిని ద్వేషించాలి. ఈరెంటికీ వ్యత్యాసం తెలియాలంటే వివేకం ఉండాలి" అన్నాడు ఆనందమూర్తి.

    "అదికాదు ఆనంద్. ఇప్పుడే కాదు. ఎప్పుడూ ఆమె ధోరణి ఇలాగే వుంటుంది. నన్ను చులకన చేసి మాట్లాడడం తనకి చాలా సరదా అయిన వ్యాసంగం. అందుకే ఆమె మాటలకి ఒళ్లు మండుతూ వుంటుంది" అన్నాడు ఫణి.

    "ఫణీ! ఎప్పుడూ కోపంతో విరుచుకుపడేవారు తమని తాము అనుక్షణం చంపుకుంటూన్నట్లు. డాక్టరువి అయివుండి ఈ విషయం నీకు తెలియక పోవడం దురదృష్టం. మనం సంతోషంగా జీవిస్తూ ఎదుటివారిని సంతోషపెట్టటమే ఉత్తమ జీవిత లక్ష్యం" అన్నాడు ఆనందమూర్తి.

    "ఒడ్డున వున్నవాడివి, ఎన్ని నీతులైనా చెబుతావ్. అనుభవిస్తున్న వాడిని ఈ బాధ నాకు తెలుస్తుంది. నామీదగానీ, నా వృత్తిమీద గానీ లతికకు కొంచెం కూడా గౌరవం లేదు" అన్నాడు ఫణి.

    "ఫణీ! అనవసరంగా లతికను ఆడిపోసుకోకు! నీ ప్రవర్తనే లతికను అలా తయారుచేసిందని ఎందుకు అనుకోవు? డబ్బు సంపాదనపట్ల నీకున్న ఆసక్తి పేషంట్ల ఆరోగ్యం పట్ల వుండదు. ఈ విషయం లతికకీ, నాకే కాదు. మీ పేషంట్లందరికీ తెలుసు. అది నీ అభివృద్దికి గొడ్డలిపెట్టు అవుతుంది. ఈ విషయంలో నువ్వు జాగ్రత్తపడకపోతే, ఎంతో కాలం ఈ ప్రొఫెషనల్ లో కంటిన్యూ కావడం కష్టం అవుతుంది" అంది హర్షిత, లతికను సపోర్ట్ చేస్తూ.లతికను సపోర్టు చేసిందన్న బాధకన్నా తనని అన్ సల్ట్ చేసిందన్న ఫీలింగు, ఫణికి మరింత కోపం తెప్పించింది.

 Previous Page Next Page