"ఫణీ! హర్షిత చెప్పినదాంట్లో నూటికి నూరుపాళ్ళూ నిజం వుంది. లతిక అయినా హర్షిత అయినా, నిన్ను విమర్శిస్తున్నారంటే వాళ్లకి నీమీద కోపం వుండి కాదు కదా! నీ మంచి కోసమే వాళ్లలా చెప్తున్నారు. అంచేత నీ ప్రవర్తన కొంచెం మార్చుకొంటే మంచిది. ఏమంటావ్?" అన్నాడు ఆనందమూర్తి నవ్వుతూ.
"నిన్ను మా ఇంటికి సెలవు రోజున భోజనానికి పిలిచింది నీతో పాఠాలు చెప్పించుకోవటానికే కాబోలు. హాపీగా ఈరోజు గడుపుదాం అనుకుంటే, నా మూడ్ అంతా పాడుచేశారు మీరంతా కలిసి" అంటూ టేబుల్ దగ్గర్నుంచి లేచి విసురుగా వాష్ బేసిన్ దగ్గరికెళ్ళి చేతులు కడిగేసుకున్నాడు.
"అదేమిటండీ! భోజనం చెయ్యకుండానే చేతులు కడిగేసుకున్నారు?" కంగారుపడుతూ అడిగింది లతిక.
"మీ అందరి చీవాట్లతో నా కడుపు నిండిపోయింది. మీరు తినండి" అన్నాడు ఫణికుమార్ చేతులు తుడుచుకుంటూ.
"ఫణికుమార్ స్టూడెంటుగా వున్నప్పుడు ఎలా వున్నాడో ఇప్పుడూ అలాగే వున్నాడు. ఏ మార్పూలేదు. ముక్కు మీద కోపం పోలేదు. లతిక ఫణి ముక్కుకి తాడేసి కడుతుందనుకున్నాను. కానీ చెయ్యలేకపోయింది" అంది హర్షిత ఉడుక్కుంటూన్న ఫణికుమార్ వైపు చూసి నవ్వుతూ. అయినా ఫణికుమార్ కోపం తగ్గలేదు. సీరియస్ గా వెళ్ళి సోఫాలో కూర్చున్నాడు. మిగిలిన వాళ్ళంతా ముక్తసరిగా ఏదో తిన్నామంటే తిన్నామని భోజనాలు ముగించారు.
అంతలో ముందు తలుపుల దగ్గర బైట ఏదో చప్పుడైంది. ఫణికుమార్ అటు చూశాడు. మూసివున్న తలుపు అవతల ఎవరో నిలుచుని తలుపు సందులోంచి చూస్తూన్నట్లు సందేహం కలిగింది ఫణికుమార్.
"ఎవరక్కడ?" అరిచాడు.
ఆ అరుపువిని ఆ నీడ వేగంగా కదిలింది. పరుగెడుతున్న అడుగుల చప్పుడు వినిపించి, ఫణికుమార్ ఆలస్యం చేయకుండా , ఒక్క ఉరుకున డోర్ దగ్గరికెళ్ళి గభాల్న తెరిచాడు.
అందరూ ఫణికుమార్ వెనకాలే వెళ్లారు ఆదుర్దాగా.
కాంపౌండు గోడ ఎక్కి అవతలికి జంప్ చేస్తున్న వ్యక్తిని చూసి ఫణికుమార్ ఆశ్చర్యపోయాడు.
కాంపౌండు గోడ అవతలికి జంప్ చేసిన వ్యక్తిని గురించి ఆలోచిస్తూ లోపలికి వచ్చాడు ఫణికుమార్.
"ఆ వచ్చింది ఎవరు?" అడిగాడు ఆనందమూర్తి.
"నా పేషంటు వాసుదేవరావు పెద్దకొడుకు" అన్నాడు ఫణికుమార్.
"లోపలికి రమ్మనలేదే" అంది లతిక.
"అతను ఉంటేగా రమ్మనడానికి. నేను తలుపు తెరిచేసరికి పిట్టగోడ దూకి పారిపోయాడు."
"పారిపోయాడా? అతనికి పారిపోవలసిన అవసరం ఏమొచ్చింది? ధైర్యంగా మాట్లాడవచ్చుగా!" అంది హర్షిత. ఆనందమూర్తి ఆలోచిస్తూ కూర్చున్నాడు. "ఫణి! నువ్వు మరో విధంగా భావించకుండా వుంటానంటే నాకు తోచిన విషయం చెప్తాను" అన్నాడు ఆనందమూర్తి నవ్వుతూ.
"నీ విషయంలో నేను ఎలాంటి అపోహపడను. నిరభ్యంతరంగా చెప్పొచ్చు" అన్నాడు ఫణికుమార్.
"నేను మొన్న వచ్చినప్పుడు, ఎంతో క్రిటికల్ గా వున్న వాసుదేవరావుకి. నా చేతుల మీదుగా ట్రీట్ మెంట్ ఇచ్చేసరికి, ఆయనకి కొంత రిలీఫ్ ఇచ్చింది. దాన్తో అతని కొడుక్కి నామీద, నా హస్తవాసి మీద గురి కుదిరినట్టుంది. నీ దగ్గర వైద్యం చేయించుకుంటూంటే, ఆర్నెల్లలోనూ కనిపించని మార్పు. అరగంటలో తన తండ్రిలో చూసుకున్నాడు. అందుకే తన తండ్రికి నన్ను వైద్యం చేసి ఆరోగ్యవంతుణ్ణి చేయమని అడగాలని నిర్ణయించుకున్నాడు. అందుకే నువ్వు లేని సమయంలో నీ ఇంటికొచ్చి లతిక దగ్గర నా అడ్రసూ, ఫోన్ నెంబరూ తీసుకున్నాడు. నన్ను కలుసకుందామని మా ఇంటికి ఫోన్ చేసి అడిగితే, మా పనిమనిషి మేము ఇక్కడికి వచ్చినట్టు చెప్పి వుంటుంది. అంచేత నన్ను ఇక్కడే కలుసుకుని మాట్లాడదామని వచ్చి ఉంటాడు" అన్నాడు.
ఫణికుమార్ మొహంలో కోపం, ద్వేషం, అసూయా, పొంగుకొస్తున్నాయి. అయితే అవి కనబడనీయకుండా జాగ్రత్తపడుతూ, "అయితే నిన్ను కలుసుకోకుండా ఎందుకు వెళ్లిపోయాడు?" అడిగాడు.
"అదే! అతను తలుపు వెనక ఉండగానే నువ్వు చాలా కోపంగా మాట్లాడుతూ వుండడం గమనించి, ఇది సమయం కాదని, ఇప్పుడు ఆ విషయం మాట్లాడితే , నీ నుంచి వ్యతిరేకతను ఎదుర్కోవలసి వస్తుందని జంకి, మన కళ్లల్లో పడకుండా, గుట్టు చప్పుడు కాకుండా, గోడ దూకి వెళ్ళిపోయి వుంటాడు" జరిగిన సంఘటనని విశ్లేషించి చెప్పాడు ఆనందమూర్తి.
ఫణికుమార్ అనుమానంగా ఆనందమూర్తి వైపు చూశాడు.
"అంటే....వాసుదేవరావు కొడుకు తన తండ్రికి ట్రీట్ మెంట్ ఇవ్వమని నీకు ఫోన్ చేసి అడిగాడా? అంతే అయి ఉంటుంది" అని తనను తాను సమాధానపర్చుకున్నట్టు అన్నాడు ఫణి.
"అతను నాకు ఫోన్ చెయ్యలేదు" అన్నాడు ఆనందమూర్తి.