Previous Page Next Page 
రాగహేల పేజి 6


    
   "పరశురాంలాంటి సైకియాట్రిస్టు హిట్లర్ని ట్రీట్ చేసుంటే, అతడు యుద్దోన్మాదిగా మారిఉండేవాడు కాదు. లక్షలమందిని కాన్ సెంట్రేషన్ క్యాంపుల్లో పెట్టిపిచ్చివాళ్ళను చేసేవాడు కాదు" అంది ఆమె. అతను సంభాషణను ఎక్కడ్నుంచి ఎక్కడికో తీసుకెళుతున్నాడని ఆమెకు అర్ధమైంది. మరో మాటకు అవకాశం ఇవ్వకుండా మెట్లెక్కసాగింది. అతడు ఆమెను అనుసరించాడు. ఇద్దరూ కన్సల్టింగ్ రూం దగ్గరకు వచ్చి నిలబడ్డారు. పరశురాం బయటికి వస్తూనే వాళ్ళనుచూసి "హల్లో రవీ" అన్నాడు. "అంకుల్! కిరణ్! కిరణ్" తడబడుతూచెప్పింది. "ఓ యస్.యస్. కిరణ్!" అంటూ చెయ్యి ముందుకు చాచాడు. "అంకుల్ కు మతిమరుపు" సర్ది చెప్పడానికి ప్రయత్నించింది మహతి. "ప్రొఫెసర్! రవి ఎవరు?" కిరణ్ అడిగాడు. అది విననట్టే పరశురాం తన గదిలోకివెళ్ళి కూర్చున్నాడు. ఇద్దరూ అతనికి ఎదురుగా కూర్చున్నారు.  "రవి ఎవరో చెప్పారు కాదు" మళ్ళీ అడిగాడు కిరణ్. మహతి చిరాకుగా కుర్చీలోంచి కదిలింది. "రవీ.... అతడు నా పేషంట్" "నన్ను చూసి అతడనే ఎందుకనుకున్నారు?" "అతడూ నీ లాగే ఉంటాడు" "నిజంగానా?" "ష్యూర్ పరిచయం చెయ్యమంటావా?" "అవసరం లేదు" ఎండుపుల్లనుపుటుక్కున విరిచినట్టుగా అన్నాడు. "నీకు తెలుసా?" పరశురాంఅడిగాడు. తెలియదు, తెలుసుకోవాలనికూడా లేదు" "దెన్ ఫర్ గెట్ ఎబౌట్ హిం!" "తెలియని వాళ్ళనుమర్చిపోవడం ఎలా?" "యూ ఆర్ రైట్ మిస్టర్!" పరశురాండ్రా తెరిచి పైపు కోసం వెదుకుతున్నాడు. బుర్ర డిమ్ముగా ఉంది. పైపులో పొగాకు పొడుం కూరి అగ్గిపుల్ల వెలిగించాడు. గుప్పు గుప్పున పొగ వదులుతూ మహతిని చూస్తూ "మీ ఆంటీ నిన్ను ఒకసారి కలవమంది" అన్నాడు. "కిరణ్! నువు అంకుల్ తో మాట్లాడుతూ ఉండు. నేను ఆంటీని చూసొస్తాను" మహతిలేచి వెళ్ళింది. ప్రొఫెసర్ డోర్ లాక్ చేసి కిరణ్ కు ఎదురుగా కూర్చున్నాడు. తొమ్మిది గంటలకు మహతీ, అతనూ, ప్రొఫెసర్ పరశురాం ఇంట్లో నుంచి బయటికి వచ్చారు.    
    "అంకుల్ నిన్న ఏమయింది?" మహతి కుతూహలంగా అడిగింది. ప్రొఫెసర్ మహతిని మౌనంగా చూశాడు. "కిరణ్ గంటకు పైగా మీతో ఉండిపోయాడు. ఏం మాట్లాడాడు? నా గురించి ఏమయినా చెప్పాడా? అతడ్ని గురించి మీ అభిప్రాయం ఏమిటి?" మహతికి ఊపిరి సలపడం లేదు. "ఒక గంటతోనూ, ఒకరోజుతోనూ తేలిపోయే విషయం కాదు ఇది. ఇంకా అతడ్ని స్టడీ చెయ్యాలి. అతడిలో నువు చూడగలిగిన లక్షణాలన్నీ నిజమయినవి కావు. తాత్కాలికమైనవిగానే నాకు తోచింది. అతడు పైకి కన్పించేటంత ధైర్యశాలి కాదు. అంతర్గతమైన పిరికితనాన్ని కప్పిపుచ్చుకోవాలన్న ప్రయత్నం యొక్క ప్రతిఫలమే అతనిలో నువు చూస్తున్నది. అతను సహజంగా ధైర్యశాలి కాడు. సాహసి అంతకన్నా కాదు. అతనిలో బహిర్గతం అవుతున్న డైనమిజం వెనుక మందకొడితనం పేరుకు పోయి వుంది. అనుకున్నదేదో వెంటనే చెయ్యాలనిపట్టు పడతాడనికదూ నువు చెప్పింది?" "అవును అంకుల్" "అలా ఎందుకు చేస్తాడో తెలుసా" తల అడ్డంగా తిప్పింది. "అతడు ఎక్కువ ఆలోచించడు. అతడి ఆలోచనల మీద అతడికే నమ్మకం లేదు. అందుకే మధ్యలోనే తుంచి వేస్తాడు. మనసులో ఏదయినా మెదలగానే వెంటనే చేసెయ్యాలని తొందరపడతాడు".    
    ప్రొఫెసర్ పరశురాం పైపు ఆరిపోయింది. అగ్గిపెట్టె కోసం వెదకసాగాడు. పుస్తకాల మధ్యవున్నా అగ్గిపెట్టెతీసి అందించింది మహతి. "కిరణ్ లో కన్పించేదంతా పై పై మెరుగులేనా?" మహతి నిరాశగా అడిగింది. "మెరుగులు కాదు. ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే అవి మెరుపులే. ఆ మెరుపుల్లో మనిషి ఎక్కువకాలం ఉండలేడు" ప్రొఫెసర్ పైపు వెలిగించే ప్రయత్నంలో ఆగాడు. పెట్టెలో ఉన్న రెండు పుల్లలూ వెలిగి ఆరిపోయాయి. అయినా పైపు వెలగలేదు. "ఉండండి అంకుల్, ఆంటీ నడిగి అగ్గిపెట్టె తెస్తాను" అంటూ మహతిలేచి నిలబడింది. "ఆగు బేబీ, అవసరంలేదు. నేను బయటికి వెళ్ళాలి. చూశావా? ఈ పైపు ఒక్కొక్కసారి ఒక్క అగ్గిపుల్లతోనే వెలుగుతుంది. మరోసారి అగ్గిపుల్ల వెలక్కుండానే విరిగిపోతుంది. ఈ సారి రెండు అగ్గిపుల్లలు వెలిగినా పైపు వెలిగించుకోలేకపోయాను. అలాంటిది మనుషుల ఎంపికలో ఎన్ని పొరపాట్లు జరగడానికి అవకాశం వుందో చూశావా?" "అంకుల్ ఇంతకూ మీరిచ్చే సలహా ఏమిటి? కిరణ్ కు దూరంగా వుండమనేగా?" బాధగా అంది మహతి. "ఆ మాట నేను చెప్పలేదే?" "మీరు చెప్పకపోయినా మీ మాటల కర్ధం అదేకదా! అంకుల్ మీరొకసారి రవిని కూడా చూడండి. ఆ తరువాత మీ అభిప్రాయం ఏదో చెప్పండి"    
    "అవును--మర్చిపోయాను అడగడం. నిన్న రవిని తీసుకొస్తానన్నావుగా? మరి కిరణ్ ని తీసుకువచ్చావేం?" "నిన్న సాయంకాలంరవిక్సోం ఎదురుచూస్తూ కూర్చున్నాను కాని హఠాత్తుగా కిరణ్ వచ్చి పడ్డాడు. మూవీకి వెళదామని పట్టుబట్టాడు. అతడు ఆగడని నాకు తెలుసు. బయలుదేరాను. మాకోసం మీరు ఎదురుచూస్తూంటారనీ తెలుసు. త్రోవలో హఠాత్తుగా ఏదోగుర్తొచ్చినట్లునటించి ఇటుతీసుకొచ్చాను. ఆంటీకి వంట్లో బాగాలేదనీ, ఆమెను చూసి వెళదామనీ నచ్చజెప్పి తీసుకొచ్చాను". "ఆమెకు ఇప్పుడెలా ఉంది" "ఎవరికీ అంకుల్" "మీ ఆంటీకి" మహతి అదిరిపడింది. "ఏమిటి అంకుల్, మరీ ఇంత పరధ్యానం? ఆంటీకి వంట్లో బాగా లేదని నిన్న కిరణ్ తో అబద్దం ఆడానని చెబుతుంటే, మీరేమో..." "అదికాదు బేబీ, మీ ఆంటీ ఈరోజు వంట్లో బాగా లేదంది. నువ్వుప్పుడు ఆమెను చూసి వచ్చావేమోననుకున్నాను" "లేదంకుల్, ఆ సంగతి అసలు నాకు తెలియదు. ఆంటీని చూసొస్తా" అంటూ మహతి నిలబడింది.   
    "ఎంతసేపయింది మహతీ నువొచ్చి" అంటూ వసుంధరమ్మే గదిలోకి ప్రవేశించింది. "ఆంటీ మీ దగ్గరకే వస్తున్నా. ఇప్పుడు వంట్లో ఎలా ఉంది?" ఆదుర్దాగా అడిగింది మహతి. "నాకేం తల్లీ, బాగానే ఉంది" "అంకుల్ మీ ఆరోగ్యం బాగాలేదని చెప్పారు ఆంటీ" "అయ్యోరాత! పనిమనిషి నర్సమ్మకు వంట్లో బాగాలేదని ఇవాళపనికి రాలేదు. పొద్దుట ఆ మాటే ఈయనగారితో అన్నాను. నీతో నా ఆరోగ్యం బాగా లేదని చెప్పారా? ఈ మతిమరుపు మనిషితో వేగలేక చస్తున్నాను మహతీ". "నర్సమ్మ అంటేగుర్తొచ్చింది. నర్సమ్మ కోడలికి ఎలా ఉంది ఆంటీ" మహతి అడిగింది. "అది మూడు రోజులకొకసారి జుట్టు విరబోసుకొని ఇంటి మీద కొస్తుంది. ఆ తర్వాత దాని అత్త నర్సమ్మ వంట్లో బాగాలేదని పనికి ఎగనామం పెడ్తుంది". "అయితే నర్సమ్మ చెప్పింది తనకోడలికి వంట్లో బాగా లేదనా? మరినువేమిటి తనఒంట్లో బాగాలేదని చెప్పావ్" ప్రొఫెసర్ భార్యను నిలదీశాడు. ఏమిటో ఆ అత్తాకోడళ్ళనాటకం? దొంగముండలు ఇద్దరూ కలిసే ఈ నాటకం ఆడుతున్నారేమో?" "అంకుల్! అత్తాకోడళ్ళ కధ ఒక మలుపు తిరిగింది.

 Previous Page Next Page