వండర్ ఫుల్, గ్రేట్ సస్పెన్స్" మహతి ఉషారుగా అంది. "నీ సస్పెన్సు సంగతి ఎలా ఉన్నా నేను ఇంటెడు చాకిరీ చెయ్యలేక చచ్చిపోతున్నాను. చిన్నఇల్లు కట్టండీ అంటే లంకంత ఇల్లుకట్టారు మీ అంకుల్. ఇప్పుడీ పనంతా ఎవడు చెయ్యాలి?" "నర్సమ్మను తీసేసివేరే పనిమనిషిని పెట్టుకోరాదా ఆంటీ?" మహతి మాట పూర్తి అయి కాకముందే బయట నుంచి నర్సమ్మ కోడలు గొంతు వినిపించింది. "అమ్మగారూ! అమ్మగారూ! మాఅత్తకు జరం వచ్చింది. ఈ పూట కూడా పనిలోకి రాలేదు. ఏమన్నా పని ఉంటే చెప్పండమ్మా! నే చేస్తాను" "దెయ్యంపట్టిన ఈ ముండ నాకేం పని చేస్తుందీ?" అనుకుంటూ ప్రొఫెసర్ భార్య బయటికి వచ్చింది.
పరశురాం దగ్గరనుంచి తిరిగి వచ్చిన మహతి డ్రాయింగ్ హాల్లో కూర్చున్న అతడ్ని చూసి విస్తుపోయింది. "హల్లో! ఎంతసేపయింది వచ్చి?" అతడు మౌనంగా ఆమెముఖంలోకి చూశాడు. "చాలా సేపు అయిందా?" మళ్ళీ ఆమే అడిగింది. అవునన్నట్టు తల ఊపాడు అతడు. ఏమిటీ వ్యక్తిత్వం! ఇంత సౌమ్యతా? ఎక్కడికెళ్ళావని కూడా అడగడేం? "సారీ రవీ! ఇంతసేపూ వంటరిగా కూర్చున్నావా?" మహతి చెప్పులువిడిచి సోఫాల మధ్యఉన్న కార్పెట్ మీద పాదాలు మోపింది. "ఏమిటి చూస్తున్నావ్? ఏదైనా కింద పడిపోయిందా?" అంటూ మహతి బ్యాగ్ టీపాయ్ మీదకు విసిరి అతనికి ఎదురుగా కూర్చుంది. "ఏమిటి చూస్తున్నావ్?" మళ్ళీ అడిగింది. సమాధానం లేదు. ఇంకా దీక్షగా చూస్తున్నాడు. "ఏమిటదీ?" ఆమె సోఫాలో ముందుకు వంగి అతడు చూస్తున్న వైపు చూసింది. "నీ పాదాల అందం!" ప్రశాంతంగా పలికిన ఆ కంఠం ధ్వనికి ఆమె వళ్ళు పులకించింది. సోఫాలో ముందుకు వంగిచూస్తూన్న మహతి ఒక్కసారిగా వెనక్కు జరిగి పమిట సర్దుకుంది. చీరకుచ్చిళ్ళను పదాల మీదకు లాక్కుంది. ఆమె బుగ్గల్లో ఎర్రగులాబీలు విరిశాయి. ఎదురుగా బల్లమీద మాగజైన్స్, ఎక్కడ పెట్టినవి అక్కడే ఉన్నాయి. "ఇంతసేపూ ఒంటరిగా కూర్చుని ఏం చేస్తున్నావ్?" " ఒంటరిగానా?" అతడి పెదవులపై చిరు దరహాసం విరిసింది. "మరి అమ్మతో మాట్లాడుతూకూర్చున్నావా?" మహతి లేచి లోపలకు తొంగి చూసి "అమ్మా" అనిపిలిచింది.
"లేరు లైబ్రరీకి వెళ్లారు" "ఎంతసేపయింది?" "గంట పైగా అయ్యింది" చెంపలపైకి జారిన ఆమె ముంగురులు కేసి చూస్తూ అన్నాడు. "అయితే ఇంతసేపూ ఎవరితో మాట్లాడుతున్నావ్?" మహతి ఆశ్చర్యంగా అడిగింది. "నీతోనే!" అతని కళ్ళలో మెరుపులు. "రవీ?" ఆమె ముఖం వెలవెల బోయింది. "అదుగో! అక్కడ వున్న నిన్ను చూస్తూ కూర్చున్నాను" ఎదురు దివాన్ మీదఉన్న వీణను చూస్తూ అన్నాడు. "మహాతిని చూస్తూ కూర్చున్నారా?" హాయిగా నవ్వేసిందామె. "వీణకు మరోపేరు మహతి. నీకు మరో పేరు వీణ. నువు నా కళ్ళముందు లేకపోయినా ఆ వీణలో నిన్ను చూడగలను. అది నాకు దేవుడిచ్చిన వరం" "అయితే ఓ వరప్రసాదూ 'నేను' అనే నాతో నీకవసరం లేదన్న మాట. మహతి నారదుని వీణ పేరు...." మునిపంటితో పెదం నొక్కిపట్టిరవి ముఖంలోకి చూసింది. అ్వాడు. ఆ నవ్వులో అనిర్వచనీయమైన భావాలెన్నో ఆమెకు స్పురించాయి.
అతడు లేచి నిలబడి ఆమె కళ్ళలోకి చూశాడు. "ఇప్పుడా?" "ఊ( ఇప్పుడే!" అడుగు ముందుకు వేశాడు. "రవి ఇప్పుడు! నాకా మూడ్ లేదు" "మూడ్ బాగా లేనప్పుడే అవసరం" "అలసటగా ఉంది" "ఐదు నిముషాలంటే ఐదు నిముషాలు" ఆమెచేతులు పట్టుకుని ప్రాధేయపడ్డాడు. ఆమె కరిగిపోయింది. దివాన్ మీద కూర్చుని వీణను శృతిచేసింది మహతి. రవి హృదయం ఆనందపు ఆర్ణవమైంది. పదినిముషాలు గడిచిపోయాయి. అర్ధగంట గడచిపోయింది. ఆమె వీణ వాయిస్తూనే ఉంది. వీణాతంత్రుల మీద నాట్యం చేస్తున్న ఆమె చేతివేళ్ళ మీదే ఉంది అతని దృష్టంతా. చెవులకు వీణావాద్యంతప్ప మరొకటి విన్పించడం లేదు. "చాలు" అని అంటాడేమోననే ఆశతో ఆమె అప్పుడప్పుడు అతని కేసి చూస్తోంది. కాని అతను మరో ప్రపంచంలో ఉన్నాడు. ఆమెకు విసుగు పుడుతోంది. అయినా అతడు అది గమనించేస్థితిలో లేడు. తన్మయత్వంతో అంటున్నాడు. ఆమెకు చేతివ్రేళ్ళు నొప్పి పెడుతున్నాయ్. అతడు సంగీత లహరిలో తేలిపోతున్నాడు. ఆమె మధ్య మధ్య తలెత్తి రెప్పవాల్చకుండా అతడ్ని చూస్తోంది. ఆమె చేతివేళ్ళు యాంత్రికంగా వీణ తీగలమీద వేగంగా కదులుతున్నాయి.
ఆమె బుర్రలో ఆలోచనలు పరుగులు తీస్తున్నాయి అంతకంటే వేగంగా. నిజంగా తనను ప్రేమిస్తున్నాడా? ఆరాధిస్తున్నాడా? లేక.....లేక......కేవలం సంగీత ప్రియుడేనా? తన ఒళ్ళో ఉన్న మహతిని మాత్రమే ప్రేమిస్తున్నాడా? అతనే తన వీణను మహతి అనడం ప్రారంభించాడు. తనకంటే తన వీణ (మహతి)నే ఎక్కువగా ఆరాధిస్తున్నాడా? అందుకే తనచుట్టూ తిరుగుతున్నాడా? మహతి అపసరం పలికింది. తీగ తెగిపోయింది. వీణను పక్కన పెట్టిలేచింది మహతి. రవి నిర్వీన్నుడయ్యాడు. తెగిన తీగకేసి దిగులుగా చూస్తున్నాడు. అతని కళ్ళలో నీళ్ళు చిప్పిల్లాయి. ఆమెలో ఉద్రిక్తత చల్లారిపోయింది. అతడ్ని జాలిగాచూసింది. "రవీ!" అతడు మౌనంగా చూశాడు. "బాధపడకు, కొత్తతీగ కొనుక్కొద్దాం పద!" ఆ మాటలు విన్న అతడి ముఖం వెలిగిపోయింది. కళ్ళల్లో అనిర్వచనీయమైన భావం ఏదో దోబూచులాడింది. అతడ్ని చూస్తూ ఆమెఅలాగే ఉండిపోయింది. "కాలం అక్కడే ఆగిపోతే ఎంత బాగుంటుంది?" మనసులో అనుకుంది మహతి.
మ్యూజికల్ ఇన్ స్ట్రుమెంట్సు షాపు ముందు కారాపి ఇద్దరూ దిగారు. అప్పుడే షాపు షట్టర్స్ వేస్తున్నారు. రవి గబగబా మెట్లెక్కాడు. "వీణ తీగ కావాలి" షాపు యజమాని రవిని ఎగా దిగా చూశాడు. ఒక్క క్షణం ఆలోచన..... తీగకోసం మళ్ళీ షాపు తెరవాలా?" రవి పొడి పొడి గా అన్నాడు. 'సారీ' అంటూ షట్టర్సు కు తాళం వేశాడు. రవి క్రుంగిపోయాడు. తిరిగి కారు దగ్గర నిలబడి ఉన్న మహతి దగ్గరకు వచ్చాడు. "ఇప్పుడు మునిగిపోయిందేముంది? రేపు కొనుక్కోవచ్చు. చిన్న చిన్న విషయాలకు అంతగా బాధపడ్తావేమిరవీ? వెళ్దాం పద?" మహతి అతని చెయ్యి పట్టుకొని లాగింది. "ఎక్కడికీ?" ""పిక్చర్ కు" "ఇప్పుడేం పిక్చరూ?" మహతి వాచీచూసుకొని "టైం ఉంది. సెకండ్ షో మొదలు అయి ఉండదు, పద". "మీ అమ్మగైర్కి చెప్పిరాలేదుగా? ఆమె నీ కోసం ఎదురు చూస్తుండదూ?" "ఫర్వాలేదు, ఫోన్ చేసి చెబుతాను. పద" అంటూ మహతి కారెక్కింది. రవి కారు స్టార్ట్ చేసి "ఏ పిక్చర్ కు!" అన్నాడు నీరసంగా. "పిక్చర్ ఆఫ్ డోరియన్ గ్రే. సరస్వతీ పిక్చర్ ప్యాలెస్ లో ఆడుతోంది. ఇదే ఆఖరిరోజు. ఆఖరాట కూడా". థియేటర్ ముందు కారాపాడు రవి ఆమె దిగి కౌంటర్ దగ్గరకెళ్ళింది. రవి కారు పార్కుచేసి వచ్చాడు. ఆమె చేతిలో ఉన్న టిక్కెట్లు చూసి "నువ్వు తీసుకున్నావా?" అన్నాడు గిల్టీగా. "ఏం తీసుకోకూడదా?" ఆమె అంది. "నేను కదా తీసుకోవాల్సింది" తనకు థానే చెప్పుకుంటున్నట్టుగా మంద్రస్థాయిలో అన్నాడు అతను. "ఏం ఎందుకని? మగవాడివనేనా?" అతన్ని చూసీ చూడనట్టేచూసి, హాలు మెట్లు ఎక్కసాగింది ఆమె. ఆమెను అనుసరించాడు అతను. పిక్చర్ మధ్యలో రెండుమూడుసార్లు రవితో మాట్లాడటానికి ప్రయత్నించింది మహతి. కాని అతను తెర మీదనుంచి దృష్టి కదిలించకుండా కూర్చున్నాడు. ఇంటర్ వెల్ లో లైట్లు వెలిగాయి. "మహతీ!" ఆ పిలుపు ఏదో వింతగా విన్పించింది ఆమెకు. చివాల్న తలతిప్పి చూసింది. అతడి కళ్ళు ఎర్రగా ఉన్నాయి. ముఖంలో ఉద్రేకం కొట్టవచ్చినట్టుగా కన్పిస్తోంది.