కానీ అంతలో ఈ అవాంతరం! ఎలా?
అప్పుడు వునబడింది ఆకాశంలో.
గుండెలు అవిసిపోయేలా 'ట్టట్టట్టట్టట్ట' అని ఇనప రెక్కల శబ్దం .
నీరసంగా తలెత్తి చూశాడు ప్రొడ్యూసర్ భూషణం.
ఫైటింగ్ సీన్లకోసం తను బుక్ చేసిన హెలికాప్టర్ ఇప్పుడు వస్తోంది.
అంతా అయిపోయాక.
తనను తినేయ్యడానికి వస్తున్న బ్రహ్మాండమైన విషపు పురుగులా, గుండెని ఎవరో గుప్పెట్లో పట్టుకుని నొక్కేస్తున్నట్లు దుర్భరమైన బాధ కలిగింది.
మాసివ్ హార్ట్ ఎటాక్ వచ్చింది అతనికి. వెనక్కి విరుచుకుపడిపోయాడు అతను.
* * *
మద్రాసు! అడయార్ పార్క్ హోటల్.
అత్యాధునికమైన ఆ హోటల్ లో ఆరోజున హరీన్ నటించిన "కేడీ కిలాడీ' చిత్రం తాలూకు సిల్వర్ జూబిలీ ఫంక్షనుకి ఘనంగా ఏర్పాట్లు చేసి వున్నాయి. ఎనిమిది సెంటర్లలో పాతికేసి వారాలు ఆడింది ఆ సినిమా.
ఆ చిత్రం నిర్మాత రఘుపతి అదృష్టజాతకుడు. అతను దేన్నీ తాకితే అది బంగారమవుతుందని ఇండస్ట్రీలో కొంతమందికి నమ్మకం. అది అదృష్టం కాదు. అతని ముందు చూపు అని చాలామందికి గురి. అతను ఏం చేస్తే తామూ అదే చెయ్యడానికి తయారుగా వుండేవాళ్ళు కోకొల్లలుగా వున్నారు మద్రాసులో.
"కీడీ కిలాడి" సూపర్ సక్సెస్ అయింది. వెంటనే హరీన్, మధుమతి కాంబినేషన్ తో మరో పిక్చరు అనౌన్స్ చేశాడు రఘుపతి . ముహూర్తం షాట్ కి కొబ్బరికాయ కొట్టగానే ఏరియాల వారీగా బయ్యర్లు చిత్రాన్ని కొనడానికి ఎగబడ్డారు - కదేమిటని అడిగినవాళ్ళేవరు లేరు.
రఘుపతి పిక్చరు, హరీన్ , మధుమతి కాంబినేషను - ఐదుపాటలు అందులో ఒకటి ఊటీలో, ఒకటి కోడైకెనాల్ లో, ఒకటి కాశ్మీర్ లో - అది చాలు.
ఇంతకుముందు ఎవరూ విని కూడా వుండనంత రేటుకి అమ్ముడుపోయింది చిత్రం. వర్షంలా వచ్చిపడ్డాయి డిమాండ్ ద్రాప్తులు. ఒక పూటలో తొంబై లక్షలు వెనకేసుకున్నాడు రఘుపతి. మధ్యాహ్ననికల్లా ఆ తొంభైలక్షలు అతను కర్ణాటకలో పెడుతున్న ఒక లిక్కర్ బ్రూవెరీకి ట్రాన్స్ ఫర్ అయిపొయింది.
రికార్డు రేటుకి అమ్ముడుపోయింది చిత్రం. ఇంక పిక్చరు ఎలా వచ్చినా తనకి పోయేది ఏమీ లేదు. నష్టం అంటూ వస్తే అది ఏరియాలు కొన్నవాళ్ళే భరిస్తారు. దట్సాల్! తనకు పూచీలేదు.
ఆ ఊపులో బ్రహ్మాండమైన ఫంక్షను అరేంజ్ చేశాడు రఘుపతి. సాయంత్రం కాగానే పరిశ్రమలోని ప్రముఖులంతా ఒక్కొక్కరూ వస్తున్నారు ఫంక్షనుకి.
"ఏడయ్యా మీ హీరో? ఇంకా దిగాబడలేదా? అవుడ్డోరా ఏటి?" అన్నాడొక వృద్దుడయిన నిర్మాత. అయన మాట పాషాణం, మనసు వెన్న. అయన తిట్లే దీవెనలుగా భావిస్తారు ఇండస్ట్రీలో చాలామంది. చాలామందికి అయన పెద్ద దిక్కు.
"అవుట్ డూరే సార్! అక్కడ ఒక చేజ్ సీనూ, హెలికాప్టర్ లో ఒక ఫైటింగ్ సీనూ వున్నాయట. ఆ రెండూ చూసుకుని అదే హెలికాప్టర్ లో సాయంత్రానికి ఇక్కడ వాలుతానన్నాడు. రావాలి" అన్నాడు రఘుపతి., చేతికి వున్న ఖరీదైన రోలెక్స్ వాచ్ వైపు చూసుకుంటూ.
అప్పుడు కంగారుగా వచ్చాడు రఘుపతి వాళ్ళ పొడక్షన్ మేనేజర్. గుసగుసగా రఘుపతి చెవిలో ఏదో చెప్పాడు.
వెంటనే వివర్ణమైపోయింది రఘుపతి మొహం.
"సరిగ్గానే విన్నావా?" అని గదమాయించాడు ప్రొడక్షన్ మేనజర్ ని.
"అవును సార్........సరిగ్గానే విన్నాను" అన్నాడు ప్రొడక్షన్ మేనేజరు భయపడుతూ.
"ఏమిటి......ఏం జరిగింది?" అన్నారు అందరూ.
"హరీన్ ఎవరో అమ్మాయిని రక్షించబోయి వరదలో కొట్టుకుపోయాడట" అన్నాడు రఘుపతి దిగాలుపడి.
వెంటనే కల్లోలం మొదలయింది అక్కడ. అందరూ ఒక్కసారిగా మాట్లాడటం మొదలెట్టారు. అవును ........హరీన్ కి జలుబు చేస్తే తను తుమ్మవలసి వచ్చేటంతగా అతని మీద ఆధారపడిపోయి వుంది ఇండస్ట్రీ. అతను యావరేజ్ న సంవత్సరానికి పది పిక్చర్స్ చేస్తాడు. ఏ క్షణంలో లెక్కపెట్టి చూసినా అతని మీద పరిశ్రమ పెట్టిన పెట్టుబడి అయిదారు కోట్లకి తక్కువ వుండదు.
అలాంటిది, హరీన్ వరదలో కొట్టుకుపోతే, అతనితో బాటు ఆ కొట్లన్నీ కొట్టుకుపోయినట్లే. కుటుంబాలకు కుటుంబాలు వీధిన పడవలసి వస్తుంది ఇప్పుడు. దెయ్యాన్ని చూసినవాడిలా నీలుక్కుపోయాడు రఘుపతి. హరీన్ తో కొత్త పిక్చరు అనౌన్స్ చేసి తొంబై లక్షలు తీసుకున్నాడు తను. అది ఇంకో చోట పెట్టుబడి పెట్టేశాడు.
ఇప్పుడు హరీన్ రాకపోతే? పిక్చరు తియ్యలేకపోతే? ఆ డబ్బు అంతా తిరిగి ఇచ్చెయ్యాలి తను.
తొంభై లక్షలు ! ఎలా ఇస్తాడు?
రఘుపతి బ్లడ్ ఫ్రెషర్ పెరిగిపోయింది. అది గమనించి ఎవరో పెరుగెత్తికెళ్ళి డాక్టరుకి ఫోన్ చేశారు.
అప్పుడు వృద్ద నిర్మాత అందరిని అనునయిస్తూ అన్నాడు. "మరేం ఫర్లేదు. ఎలీకప్టర్ ఆడనే వుందిగా. మనోళ్ళు వోదల్రు. ఎలికాప్టర్ లో ఎల్లాన్నా మనోన్ని వెనక్కి తెస్తారు. కంగారుపడమోకండి."
అదే సమయంలో అక్కడికి వురికి వచ్చాడు ప్రెస్ రిపోర్టర్ ధనుంజయ్. రొప్పుతూ అన్నాడు.
"హారీన్ ని వెదకడానికి హెలికాప్టర్ వెళ్ళింది. కానీ హరిన్ దొరకలేదు. ఇవి దొరికాయి నదిలో?" అన్నాడు డ్రమెటిక్ గా.
అందరూ అతని వైపూ చూశారు.
అతని చేతుల్లో ఒక టెర్రీవుల్ ప్యాంటూ, ఒక ఎర్రటి చీరె వున్నాయి.
కాస్ట్యుమ్స్ డిజైనర్ ఆ ప్యాంటు వైపు కళ్ళార్పకుండా కాసేపు చూసి "ఆ ప్యాంటు హరీన్ గారి కోసం నేను కుట్టిందే" అన్నాడు హీనస్వరంతో.
"హెలికాప్టర్ లో ప్రొడ్యూసర్ భూషణన్ని తిసుకోచ్చేసి అపోలో హాస్పిటల్లో చేర్చారు. ప్రమాదకరంగా వుంది. అయన పరిస్థితి" అన్నాడు రిపోర్టర్ ధనుంజయ్.
ఆ మాటలు వింటూ అప్రతిభులై నిలబడిపోయారు అక్కడున్న వాళ్ళందరూ.
5
సముద్రపు ఒడ్డున వుంది ఆ బ్రహ్మాండమైన భవంతి ఎకరాల మేర స్థలం. మధ్యలో ఇల్లు. ఇంటి చుట్టుతా తోట.
ఇంటివెనక కాంపౌండ్ వాల్ ని అనుకుని బీచ్, దానివేనకే ఎగసిపడే సముద్రం.
ఇంటిముందు ఆకుపచ్చటి పర్షియన్ తివాచీలా వున్న లాన్ లో తెల్లటి గాడ్డెన్ చెయిర్స్ వేసి వున్నాయి. వాటి మధ్యలో టీపాయ్ దానికి గ్లాస్ టాప్ వుంది.
అప్పుడే తలంటి పోసుకుని, జుట్టుకి , మీసాలకి రంగు వేసుకున్న విస్వనాధం లాన్ లోకి వచ్చి కూర్చున్నాడు. అతను జుట్టుకి నల్ల రంగు వేసుకున్నా అది అతని వయసుని ఏమాత్రం దాచి పెట్టడం లేదు. యాబై ఏళ్ళుంటాయి అతనికి. కానీ వడలిపోయి అరవై ఏళ్ళవాడిలాగా కనబడతాడు విశ్వనాధం. బాగా ఒంగిపోయి వున్నాడు మనిషి. శారీరక శ్రమ అనేది సంవత్సరాల క్రితమే మర్చిపోయినట్లు జవజవలాడుతూ జవసత్వాలు ఉడిగిపోయి కనబడుతోంది అతని వళ్ళు.
న్యూస్ పేపర్ బాయ్ గేటు తెరచుకుని లోపలికి వచ్చాడు. ఆరోజు మార్కెట్ లోకి వచ్చిన అన్ని దినపత్రికలూ మెగాజైనులూ వినయంగా టీపాయ్ మీద పెట్టాడు.
యధాలాపంగా అతనివైపు చూశాడు విశ్వనాధం. అతను రోజూ వచ్చే పేపర్ బాయ్ కాదు. కొత్త కుర్రాడు.
తర్వాత పత్రికల వైపు దృష్టి సారించాడు విశ్వనాధం. అతని చూపులు ఒక మేగజైను మీద నిలిచిపోయాయి. శృంగార కధల పత్రిక అది.
"ఎందుకు తెచ్చావ్ ఈ మేగజైను? ఎవరు తెమ్మన్నారు?" అని విరుచుకుపడ్డాడు విశ్వనాధం.
"మీ అమ్మయిగారే తెమ్మన్నారు సార్!" అన్నాడు పేపర్ బాయ్ భయంగా.
"మా అమ్మాయా? నీకేమన్నా మతిపోయిందా? మా అమ్మయేవరూ?"
సరిగ్గా అదే సమయంలో ఇంట్లో నుంచి వయ్యారంగా నడుస్తూ లాన్ లోనికి వచ్చింది ప్రియంవద. పొడుగ్గా, బలంగా వుంది ఆమె. అతి పల్చటి ఉల్లిపొరలాంటి చీరకట్టుకుని వుంది.
కళ్ళార్పకుండా ఆమెవైపు కొద్ది క్షణాలు చూస్తూ వుండిపోయాడు పేపర్ బాయ్. తర్వాత వున్నట్లుండి స్పృహలోకి వచ్చినట్లు అన్నాడు. "అదిగో! ఆ అమ్మాయిగారేనండీ!"
అది వినగానే తలకోట్టేసినట్లయింది విశ్వనాధానికి. ప్రియంవద అతని కూతురు కాదు. అతని భార్య.
"షటప్.......ఆమె అమ్మాయిగారు కాదు అమ్మగారు. గుర్తుంచుకో!" అన్నాడు మండిపడుతూ.
విశ్వనాధాన్ని , ప్రియంవదని వింతగా మర్చి మార్చి చూశాడు పేపర్ బాయ్. తర్వాత "సారీ సార్!" అని చెప్పి గిరుక్కున వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు.
వాడు వెనక్కి తిరగ్గానే నవ్వుకుంటున్నాడా? నవ్వాపుకుంటున్నాడా?
పరుగెత్తికెళ్ళి, వాణ్ని ఆపి, వాడి మొహంలోకి తొంగి చూడాలనిపించింది విశ్వనాదానికి.
"గుడ్ మార్నింగ్ మైడియర్!" అంది ప్రియంవద "అండ్ ఏ వెరీ హాపీ బర్త్ డే టూ యూ!"
"థాంక్యూ!" అని నవ్వి, ఆమె వైపు పరీక్షగా చూశాడు విశ్వనాధం.
తనకు యాభై ఏళ్ళు. కానీ అరవై ఏళ్ళ ముసలాడిలా కనబడతాడు.
ప్రియంవదకి ముప్పై. కానీ ఇరవై ఏళ్ళ కన్నెపిల్లలాగా కనబడుతుంది. ఆమె శారిరతత్వం అంతే.
ఒక కుర్చీని అతనికి తాకేంత దగ్గరగా లాగి కూర్చుంది ప్రియంవద. కమ్మటి రెవలాన్ పరిమళం ఆమె వంటిమీద నుంచి అతని నాసికాపుటాలకి సోకుతోంది.
యునిఫారం వేసుకుని, తలపాగా పెట్టుకున్న ఒక నౌకరు వచ్చి బ్రేక్ ఫాస్ట్ ట్రే టీపాయ్ మీద భయభక్తులతో పెట్టి వెళ్ళిపోయాడు.
దానిమీద వున్న లేసుగుడ్డ తొలగించింది ప్రియంవద. నాలుగు శాండ్ విచెస్ , ఒక పాట్ లో కాఫీ డికాక్షన్ , పాలు పంచదార.
అవి కాక ఒక విస్కీ బాటిలు!
"బ్రేక్ ఫాస్ట్ తోనే విస్కీ మొదలా?" అంది ప్రియంవద.
"ఇవాళ నా బర్త్ డే కదా! సెలెబ్రేషన్" అని నవ్వి విస్కీ బాటిలు ఓపెన్ చేశాడు విశ్వనాధం. అతని చేతులు స్వదేనంలో లేకుండా వణుకుతూ వుండటం క్రీగంట గమనించింది ప్రియంవద.
విస్కీ గ్లాసులో పోసుకుని గటగట తాగాడు విశ్వనాధం. వెంటనే ఖణేల్ ఖణేల్ మని దగ్గడం మొదలెట్టాడు.
"తాగుడు తగ్గించమంటే వినరు గదా!" అంది ప్రియంవద గారంగా గొంతుపెట్టి. "ఇంకో గ్లాసు తాగితే మీరు గుర్రం ఎక్కేస్తారు. అందుకని ఈ లోపలే నేను మీకొక శుభవార్త చెప్పేయాలి."
కళ్ళు చిట్లించి చూశాడు విశ్వనాధం - "శుభవార్త? ఏమిటది?"
"ఇవాళ మీ బర్త్ డే కదా.......అందుకని మీకోమంచి బహుమతి!"
"ఏమిటో అది? చెప్పేయ్ రాదూ?"
"మీ వీపు మీదెక్కి గుల్లం గుల్లం అని స్వారి చేసే మొనగాడు వస్తున్నాడులెండి ఈ ఇంట్లోకి.
అప్పటికే మత్తు మెల్లిగా ఎక్కుతోంది విశ్వనాధనికి.
"మొనగాడా? వాడెవడూ?" అన్నాడు.
"ఇంకెవరు........మీ కొడుకు"
బెనక్కి జారగిలబడి నవ్వాడు విశ్వనాధం. ఆ నవ్వులో సంతోషం లేదు. పొడిదగ్గులాగా వుందా నవ్వు.
"నా కొడుక్కి ఉత్తుత్త గుర్రం అట ఆడే వయసు ఎప్పుడో దాటిపోయింది ప్రియంవదా! వాడు ఇప్పుడు పోగరమోతు అడవి గుర్రాలని కూడా మచ్చిక చేసుకునేటంత మొనగాదయ్యాడు" అన్నాడు నిస్తేజంగా.
అదోలా నవ్వుతూ విశ్వనాధం గ్లాసులోకి మరికొంత స్కాచ్ వంపింది ప్రియంవద.
దాన్నంతా ఆబగా ఒక్క గుక్కలో తాగేశాడు విశ్వనాధం. కొద్ది క్షణాల గడచినా తర్వాత హటాత్తుగా తట్టింది అతనికి. ఇందాక ప్రియంవద అన్నమాటల తాలూకు పూర్తీ అర్ధం.
"ప్రియంవద..........ఏమిటి? ఏమన్నావు నువ్వు?" అన్నాడు అయోమయంగా.
"అదే" అని సిగ్గు నటించి, "మీరు తండ్రి కాబోతున్నారు" అంది.
"ఇప్పుడా! ఈ వయసులోనా?" అన్నాడు విశ్వనాధం అపనమ్మకంగా.
"మహా ఏం పెద్ద వయసుందేమిటి మీకు? చూడడానికి అలా కనబడతారు గానీ, అమ్మో......ఘటికులే! మీ సంగతి నాకు తెలియదా!" అంది ప్రియంవద వగలుబోతు.
"ప్రియంవదా!" అన్నాడు విశ్వనాధం వెర్రిగా చూస్తూ. "ఏం చెద్దాం ఇప్పుడు?"
"ఇదెక్కడి పిల్లాడమ్మా?" అని నోటికి చెయ్యి అడ్డం పెట్టుకుని నవ్వింది ప్రియంవద. "చేసేదేముంది! పిల్లల్ని కన్నవాళ్ళందరూ ఏం చేస్తున్నారూ? పిల్లల్ని పెంచుతారు. పెద్ద చేస్తారు. చదువూ సంధ్యా చెప్పిస్తారు. పెళ్ళిళ్ళు పేరంటాలూ చేస్తారు. ఇప్పుడు మనం చేయ్యబోయేది అదే"
"కానీ ప్రియంవదా! ఇప్పటికే మనకు ఒక కొడుకు వున్నాడు.."
వెంటనే నీరసంగా అంది ప్రియంవద. "అతను మీ మొదటి భార్య కొడుకు! అతను నా కొడుకు ఎలా అవుతాడు?"
ఏదో అనబోయి, మళ్ళీ అంతలోనే తమాయించుకుని ఊరుకున్నాడు విశ్వనాధం.
కటువుగా మారింది ప్రియంవద గొంతు. "ఇప్పుడు ఉన్నవాడు మీ కొడుకు! ఇప్పుడు పుట్టబోయేది మన కొడుకు..........అర్ధమయిందా?" అంది.
నిస్పృహగా అన్నాడు విశ్వనాధం. "ప్రియంవదా.......మన పరిచయమై పదేళ్ళు దాటుతోంది. పదేళ్ళ నుంచి పిల్లలు పుట్టలేదు మనకు. నేను పెద్దవాణ్నయిపోతున్నాను. ఇంక పిలల్ని కనేవయసు దాటిపోతోంది అనుకున్నాను నేను. ఒకవిధంగా ఆ ఉహ నాకు ఊరట కలిగించింది. ఎందుకంటే, ఈ వయసులో పిల్లల్ని కానీ ఎలా పెంచుతాం ప్రియంవదా? మనకు మళ్ళీ ఇంకో కొడుకు పుట్టాడనుకో!వాణ్ణి స్కూల్లో చేర్చేటప్పటికే నాకు యాబై అయిదేళ్ళు దాటుతాయి. వాణ్ణి హైస్కూల్లో చేర్చేటప్పటికి నాకు అరవై వచ్చేస్తుంది. వాడు కాలేజీ చదువుకి వచ్చేసరికి నేను కాటికి జాపుకుని వుంటాను. ఒకవేళ కొడుకు కాకుండా కూతురు పుట్టిందనుకో! ఇంక అమ్మాయికి పెళ్ళీ పేరంటాలు......లాభం లేదు ప్రియంవదా - ఇవన్నీ మనం చెయ్యలేం."
అప్రసన్నంగా మారిపోయింది ప్రియంవద మొహం.
"అంటే? అబార్షన్చేయించుకోమని మీ ఉచిత సలహానా?"