"వెండితెర మీద చూడలేదా?" అన్నాడు హరీన్ చిరునవ్వుతో. గండం గడిచింది కాబట్టి అతను ఇంక మామూలు మూడ్ లోకి వచ్చేస్తున్నాడు.
ఉహు!" అని దిగులుగా తల పంకించింది ఆ అమ్మాయి. "నేను చాలా బీదదాన్ని! సినిమాలకి ఎలా వెళ్ళగలను!"
"అరె అలాగా! ఐయామ్ సారీ!" అన్నాడు హరీన్ సానుభూతిగా . "మీ పేరేమిటి?"
"కరుణ" అంది ఆ అమ్మాయి నెమ్మదిగా.
అతను మళ్ళీ గుర్రాన్ని దువ్వాడు. "కరుణా.........ఇవ్వాళ దీనివల్లే మనం బతికిబయటపడ్డాం" అన్నాడు అభిమానంగా.
గుర్రం అతని మాటలు అర్ధం చేసుకున్నట్లు సంతోషంగా సకిలించింది.
అప్పుడు మళ్ళీ గమనించాడు హరీన్ - నీటిమట్టం క్రమక్రమంగా పెరుగుతోంది. నీళ్ళు వాళ్ళ పాడాలని తడుపుతున్నాయి. ఇంకా సేపట్లో మోకాళ్ళని తాకుతాయి.
ఆ తర్వాత?
ఇంకతను చెయ్యగలిగింది ఏమీ లేదని అర్ధమయింది హారీన్ కి. చావుకోసం వేచివుండడం తప్ప వేరే మార్గం కనబడటం లేదు.
ఆ అమ్మాయి వైపు చూశాడు హరీన్. కరుణ మొహం తెల్లకాగితంలా పాలిపోయివుంది భయంతో.
ఆ అమ్మాయి దృష్టిని మళ్ళించడానికి గానూ అన్నాడు హరీన్ -
"అదిగో చూశారా ఆ మొక్క! కామాక్షి కాయల మొక్క అది. నాకు ఆ కాయలంటే ప్రాణం! చిన్నప్పుడు మా ఉళ్ళో తోటలెంబడీ , దొడ్ల వెంబడీ తిరుగుతూ అవి కోసుకుతినేవాణ్ణి. నిజం చెప్పాలంటే ఆ రోజుల్లో బఠాణీలు కొనుక్కోవడానికి కూడా నా దగ్గర డబ్బులుండేవి కావు. ఇలా కామాక్షి పళ్ళు, సీమచింతకాయలూ సంపాదించి తింటుండేవాణ్ణి. దొరికిపోతే అప్పుడప్పుడు తన్నులు కూడా తినేవాణ్ణనుకోండి!" అని నవ్వాడు. ఆ రాళ్ళ గుట్టలమధ్య కొద్దిగా మట్టి వుంది. అక్కడ విశృంఖలంగా పెరుగుతున్నాయి కొన్ని కామాక్షి కాయల మొక్కలు. సుక్షమైన టమాటా పళ్ళలాగా వుంటాయి దాని పళ్ళు.
మృత్యు ముఖంలో వుండి కూడా మాములుగానే మాట్లాడుతున్న హరీన్ వైపు చిత్రంగా చూసింది కరుణ.
"మీరు కూడా తింటారా!" అని నాలుగు పళ్ళు తెంపి ఇచ్చాడు హరీన్.
వాటిని తింటూ అంది కరుణ. "మా ఇంట్లో పెద్ద పెరడు వుండేది. అందులో ఇలాంటి చెట్లు చాలా వుండేవి. నేను ఎప్పుడన్నా ఈ పళ్ళు తినబోతే మా అమ్మ తిట్టేది! 'ఆ పిచ్చి పళ్ళు తినకు అసహ్యం. కావాలంటే బుట్టలో యాపిల్ పళ్ళున్నాయి కోసుకుతిను' అని కోప్పడేది" అంది స్వగతంలా.
హరీన్ ఆగి, ఆ అమ్మాయి వైపు పరీక్షగా చూశాడు.
"అదేమిటి? ఇప్పుడేగా మీరు చెప్పింది - మీరు చాలా బీదవాళ్ళని!" అన్నాడు నిదానంగా.
"అవును! కానీ అప్పట్లో మేము చాలా ధనవంతులం. అంటే నా చిన్నప్పుడన్నామాట! హాయిగా, దర్జాగా వుండేవాళ్ళం మేము. ఉన్నట్లుండి మా జీవితంలోనే పెద్ద వరద వచ్చినట్లు అయిపొయింది. మా నాన్నగారు కనబడకుండా పోయారు. ఉన్నదంతా ఉడ్చుకుపోయింది . మేము రోడ్డుమీద పడ్డాం! నాకు ఇంకా కళ్ళకి కట్టినట్లుంది ఆరోజు. పందొమ్మిది వందల డెబ్బయ్ తొమ్మిది. సెప్టంబరు మొదటి తారీఖు. నేను అప్పట్లో ఆరో క్లాసు చదివేదాన్ని" అని కరుణ కలవరిస్తున్నట్లు.
ఆ తారీఖు వినగానే ఉలిక్కిపడి చూశాడు హరీన్.
పందొమ్మిది వందల డెబ్బయ్ తొమ్మిది! సెప్టంబరు మొదటి తారీఖు!
సరిగ్గా ఆ రోజు నుంచే తమ కుటుంబానికి వరదలాగా డబ్బు రావడం మొదలెట్టింది.
చాలా కాకతాళీయంగా ఉంది ఇది!
వాళ్ళకి డబ్బుపోవడం మొదలయినరోజు నుంచే తమకి డబ్బు రావడం......చాలా చిత్రం!
అతను అలా ఆలోచిస్తూ ఉండగానే వరదనీరు నడుము దాకా వచ్చింది.
4
వారా నీటి మట్టం క్షణక్షణానికి పెరుగుతోంది.
మృత్యువుని ముఖాముఖీ ఎదుర్కోవలసి వచ్చిన సమయం ఆసన్నమైందని గ్రహించాడు హరీన్.
కానీ ఈ అమ్మాయి , ఈ కరుణ ఇప్పుడు ఎలా ఫీలవుతోంది, వెదుకుతున్నట్లు ఆ అమ్మాయి మొఖంలోకి చూశాడు హరీష్.
చిత్రంగా ఆ అమ్మాయి మోహంలో ఇందాక వున్న భయం ఇప్పుడు కనబడటంలేదు. లీడర్ షిప్ క్వాలిటీ వుంది హరీన్ లో . అతని సమక్షంలో వున్న వాళ్ళకి కూడా అతని ఉత్సాహం , ధైర్యం అంటువ్యాధిలా అంటుకుంటాయి.
"నేను దిక్కులేనిదాన్ని!" అంది కరుణ మెల్లగా. "నేను బతికినందువల్ల, ఒరిగే మేలు ఏమీ లేదు. నేను చనిపోయినందువల్ల జరిగే నష్టం కూడా ఏమీ లేదు. నా ఆతృత అంతా మీ గురించే! మీరు కోట్లాది ప్రేక్షకుల ఆరాధ్యదైవం! మీకేమన్నా అయితే......." అని సగంలో ఆపేసింది కరుణ.
తేలిగ్గా నవ్వేశాడు హరీన్.
"చావడం నాకు బాగా అలవాటేనండి! ఇదివరకు మూడు సినిమాల్లో చచ్చిపోయాను నేను. మీరేం వర్రీ కాకండి!' అన్నాడు సరదాగా.
అతని మాటలు వింటుంటే కరుణకి అనిపించింది - రియల్ లైఫ్ హీరో ఇతను! నిజం!
మళ్ళీ కరుణ వైపు చూశాడు హరీన్.
కొద్ది నిమిషాల క్రితం లేత తమలపాకుల లాంటి ఆమె పాదాల పైన పాంజేబుపట్టాలలా మెరిసింది వరదనీరు. ఆ తర్వాత నాజుకైనా ఆమె నడుము చుట్టూ వడ్డాణములా గోచరించింది. ఆ తర్వాత నునుపైన ఆమె భుజాలకు పెట్టుకున్న నాగవత్తులలాగా అనిపించింది. మరి కొద్దిసేపటికి శంఖం లాటి ఆమె మెడలో వేసుకున్న హారంలాగా కనబడింది. చివరగా వరదనీరు ఆమె శిరోజాల చుట్టూ పెట్టుకున్న ఆభరనంలా కనబడింది.
అంతే........
ఆ తర్వాత ఇంక నీరు తప్ప కరుణ కనబడలేదు హరీన్ కి. ఆమె చెయ్యి మాత్రం అతని చేతిలో బిగుసుకుపోయింది.
మరి కొద్ది క్షణాల తర్వాత హరీన్ ని కూడా ముంచివేసింది వరదనీరు.
జలసమాధి అయిపోయినట్లు వుండిపోయారు ఇద్దరూ.
* * *
అక్కడ -
ఈ దుర్ఘటన తర్వాత యూనిట్ అంతా కాకవికలై పోయింది. తాము ఏం చెయ్యాలో , అసలు ఏమి చెయ్యగలరో ఎవరికి తోచటంలేదు.
గుంపులుగా చేరి ఇదంతా చూస్తున్న అభిమానులలో అంతులేని అలజడి చెలరేగింది.
ఒక టీనేజ్ అమ్మాయి - తన ఆరాధ్యదైవమైన హరీన్ ఇంక తిరిగి బతికివచ్చే అవకాశం లేదని రూడీ కాగానే, పెద్దగా రోదిస్తూ వెళ్ళి నదిలో దూకేయ్యబోయింది, తను కూడా ప్రాణత్యాగం చేసేయ్యాలన్న ఆరాటంలో.
ఆ అభిమాని చెయ్యబోతున్న అఘాయిత్యాన్ని సరిగ్గా చివరి క్షణంలో గమనించాడు స్టంట్ మాన్ రతన్. వెంటనే ఎగిరి గాలిలో ఒక పిల్లి మొగ్గ వేసి ఆ అమ్మాయి ముందు నిలిచాడు. అతను తన ఆత్మహత్య ప్రయత్నం భగ్నమై పోయినందుకు వలవల ఏడవటం మొదలెట్టింది ఆ అమ్మాయి.
హీరోయిన్ మధుమతి తన టెంటులో కూర్చుని దుఖంతో కుమిలిపోతోంది. హరీన్ మాటలు, చేష్టలు సమ్మోహనకరంగా వుండే అతని చూపులూ - ఇవన్నీ మాంటేజ్ షాట్స్ లాగా గుర్తుకువస్తున్నాయి ఆమెకి.
గుండె పగిలిపోతున్నట్లు అనిపిస్తోంది.
ప్రొడ్యూసర్ భూషణం ఒకచోట కుప్పకూలిపోయినట్టు కూర్చుని వున్నాడు. వరసగా కప్పులు గెలుస్తున్న రేసుగుర్రంలాంటి వాడు హరీన్. అతనిమీద డబ్బు కాచి జాక్ పాత కొట్టాలనుకునే నిర్మాతలు బోలెడుమంది వున్నారు. వారిలో తను ఒకడు. అష్టకష్టాలు పడి, అంత బిజీహీరో దగ్గర డేట్స్ సంపాదించి, భారీ ఎత్తున పిక్చరు మొదలెట్టాడు తను. లక్షలు మంచినీళ్ళలా ఖర్చు పెట్టాడు. ఇప్పటికి పదిహేను రీళ్ళు తీసారు. ఇంక ఒక రీలు తీస్తే తన సినిమా పూర్తయిపోతుంది.
ఆ సమయంలో గనక హరీన్ కి ఏమన్నా అయిందంటే, తన జీవితంలో ప్రళయం వచ్చినట్లే! ఇంక కోలుకోలేడు తను!
దాదాపు ఎనభై లక్షలు ఖర్చయింది ఇప్పటికి. ఆ డబ్బులో చాలా భాగం మార్కెట్లో వడ్డీకి అప్పు తెచ్చిన సొమ్మే.
ఇప్పుడుగనక హరీన్ కి ఏమన్నా అయితే, ఈ పిక్చర్ ని ఎలా పూర్తిచేస్తాడు! ఎలా రిలీజ్ చేస్తాడు? రిలీజ్ తను చెయ్యకపోతే ఈ అప్పులన్నీ ఎలా తీరుస్తాడు?
తలుచుకున్న కొద్ది అతని గుండె చెరువైపోతోంది. ఈ చేజ్ శీను కాక, మరొక హెలికాప్టర్ ఫైటింగ్ సీను వుంది పిక్చర్లో ఈ రెండు సీన్లు తీసేస్తే తన పిక్చరు దాదాపు బయటపడినట్లే. అ తర్వాత కొద్దిగా పాచ్ వర్క్ మాత్రం మిగిలివుండేది.