Previous Page Next Page 
యమదూత పేజి 4

 

    "ఇన్ స్పెక్టర్! నిజం చెప్పండి! దినకర్ ని పోలీసు స్టేషన్ కి తీసుకెళ్ళి ఏం చేస్తారిప్పుడు?"
    
    "ఏం చేస్తాము? ప్రశ్నిస్తాం?"
    
    "అంతేనా?" అంది నిశాంత సంశయంగా పోలీసు లాకప్ లో జరిగే ఘోరాలను గురించీ, లాకప్ డెత్స్ గురించీ తను విన్నవీ, చదివినవీ అన్నీ ఒక్కసారిగా గుర్తొచ్చాయి నిశాంతకి. గొంతు తడారిపోయినట్లయింది.
    
    "పోలీస్ స్టేషన్లో మేము థర్డ్ డిగ్రీ వుపయోగించి ఇతన్ని హింసిస్తామేమోనని మీ అనుమానం! అవునా?" అన్నాడు జలీల్.
    
    దానికి సూటిగా సమాధానం చెప్పకుండా, పెదిమలు తడిచేసుకుంటూ అంది నిశాంత.
    
    "మీకు అభ్యంతరం లేకపోతే నేనూ పోలీస్ స్టేషన్ కి వస్తాను"
    
    విసుగ్గా అన్నాడు జలీల్.
    
    "దెన్ దట్ ఈజ్ యువర్ ఫ్యూనెరల్! మర్యాదస్తులు ఇలాంటి వ్యవహారాల్లో కలగజేసుకోకూడదని మర్యాదగా హెచ్చరించాను నేను. పోలీస్ స్టేషన్ కి రావాలని మీకు అంత ఉబలాటంగా వుంది కాబట్టి రండి!" అని ఆగి, తర్వాత సాలోచనగా అన్నాడు "అసలు మిమ్మల్ని కూడా ప్రశ్నించవలసిన అవసరం ముందు ముందు రావచ్చు. ఆ పని ఇప్పుడే పూర్తి చేసేస్తాను. కమ్! గెట్ ఇన్ టూ ద జీప్!"
    
    దినకర్, నిశాంత జీపు ఎక్కారు.
    
    జలీల్ కూడా ఎక్కాక పోలీసు జీపు బయలుదేరింది.
    
    ఇదంతా నోరు తెరుచుకుని చూస్తున్న ముద్దాయి జమ్మన్న తన అదృష్టాన్ని తనే నమ్మలేకపోయాడు.
    
                                                                 * * *
    
    పోలీస్ స్టేషన్ లో వున్న రూంలోకి వెళ్ళగానే కేస్ డైరీ తెప్పించి, ఆరోజు కోర్టులో జరిగిన విషయాలన్నీ అందులో సంగ్రహంగా రాశాడు జలీల్. వైదేహి హత్య కేసు అనుకోని మలుపు తిరగడం, ఆక్టర్ నిశాంతతో కలిసి కోర్టుకి వచ్చిన దినకర్ అనే వ్యక్తిమీదికి హత్యానేరం మళ్ళడం ఇవన్నీ పాయింట్ బై పాయింట్ రాశాడు.
    
    అతను రాస్తూ వుండగానే, "మే ఐ మేక్ ఏ ఫోన్ కాల్ టూ మై లాయర్?" అంది నిశాంత.
    
    "బై ఆల్ మీన్స్!" అని ఆగి, మళ్ళీ అన్నాడు జలీల్ "కానీ ఒక్క విషయం! మీరు నాతో ఫ్రాంక్ గా వుండండి. నేను కూడా మీతో ఫెయిరుగా, ఫ్రాంక్ గా వుంటాను. మీరు అతి తెలివిగా ప్రవర్తించాలని చూస్తే మాత్రం చేతులు ముడుచుకు కూర్చునే మనిషిని కాదు నేను. మీ లాయరెవరన్నారు?"
    
    "లాయరు భరద్వాజ్!" అంది నిశాంత. లాయరు భరద్వాజ్ ఏస్ క్రిమినల్ లాయరు.
    
    "భరద్వాజా! ఆయన సంగతి నాకు బాగా తెలుసు. నా సంగతి ఆయనకి ఇంకా బాగా తెలుసు. నా పేరు చెబితే గజదొంగలు కూడా గజగజలాడిపోతారు. మొన్నో కేసు జరిగింది తెలుసా. ట్రిపుల్ మర్డరు కేసు! ఎవరికీ కొరుకుడుబడని ఆ కేసుని సాల్వ్ చేసింది నేనే!" అని తను టేకప్ చేసి విజయం సాధించిన కేసుల లిస్టు చదివాడు జలీల్.
    
    ఇది సైకలాజికల్ వార్ ఫేర్ లో మొదటి భాగం అని అతనికి తెలుసు. తన గొప్పలు తాను చెప్పుకోవడం అతనికి ఇష్టం వుండదు. కానీ నేరస్తులను భయపెట్టడంలో ఈ స్వోత్కర్ష బాగా పనికి వస్తుందని అతనికి అనుభవపూర్వకంగా తెలుసు.
    
    "ఆ అల్మారాలో వున్న మెడల్సు అన్నీనాకువచ్చినవే!" అని చెప్పి, తర్వాత అన్నాడు జలీల్. మీరు మీ లాయరు భరద్వాజగారికి నిరభ్యంతరంగా ఫోన్ చేయవచ్చు. కానీ దానికి ముందు ఒక్క అయిదు నిమిషాలు మీరిద్దరూ నా ప్రశ్నలకి సమాధానాలు, వున్నది వున్నట్లు చెప్పాలి. ఓకే? ముందు ఇతనితో మాట్లాడతాను. మిష్టర్! చెప్పండి! అసలు మీరెవరు? మీ బ్యాక్ గ్రవుండ్ ఏమిటి?"
    
    అప్పటికి షాక్ లోనుంచి తేరుకున్నాడు దినకర్. ఇందాకటి తడబాటు ఇప్పుడతనిలో కనబడటం లేదు. కూల్ గా వున్నాడు.
    
    "చెప్పండి!" అన్నాడు జలీల్.
    
    "నిజం చెప్పమంటారా! అబద్దం చెప్పమంటారా?"
    
    "నిజం చెప్పండి! ఐవాంట్ ది ట్రూత్. ద హోల్ ట్రూత్ అండ్ నథింగ్ బట్ ట్రూత్! కమాన్! షూట్!"
    
    కొద్ది క్షణాలు మౌనంగా వుండి అన్నాడు దినకర్ "అసలు నేనెవరో నాకు తెలియదు."    

    తీక్షణంగా మారింది జలీల్ చూపు.
    
    "వాట్ డూ యూ మీన్?" అన్నాడు తీవ్రంగా. "జోకు చేస్తున్నారా?"
    
    "కాదు నిజమే చెబుతున్నాను! నేనెవరో నాకు తెలియదు! నేను ఎక్కడినుంచి వచ్చానో, నా పుట్టుపూర్వోత్తరాలేమిటో ఏమీ నాకు తెలియవు! ఇన్ ఫాక్టు, అసలు నేనెవరినో ఎవరన్నా చెప్పగలిగితే వాళ్ళకి రుణపడి వుంటాను. నేనెవరో తెలుసుకోవడానికి నేనే తీవ్రంగా ప్రయత్నిస్తున్నాను కూడా!" అన్నాడు దినకర్.
    
    తన ప్రశ్నలకు అతను ఏం సమాధానం చెబుతాడో అని చెవులప్పగించి వింటున్న జలీల్ కి, "నేనెవరో నాకే తెలియదు" అని అతను చెప్పగానే కలిగిన మొదటి రియాక్షను.
    
    దినకర్ ని పటపట నాలుగు కొట్టాలని.
    
    థర్డుడిగ్రీ వుపయోగించడం జలీల్ కి అంత ఇష్టమైన పనేమీ కాదు. సాధ్యమయినంతవరకూ నాగరికమైన పద్దతులలోనే నిజం రాబట్టాలని చూస్తూ వుంటాడు అతను.
    
    కానీ, కొంతమంది నేరస్తులతో వ్యవహరించేటప్పుడు మామూలు పద్దతులు పనిచేయవని కూడా అతనికి బాగా తెలుసు.
    
    కొంతమంది స్పెషల్ టైపు నేరస్తులతో డీల్ చెయ్యడానికి కొన్ని రకాల స్పెషల్ టైపు మెథడ్స్ ఉపయోగించాలి.
    
    ఉపయోగిస్తాడు కూడా!
    
    వెల్! ఇప్పుడా అవసరం రాబోయేటట్లు వుంది!
    
    తనెవరో తనకే తెలియదుట వీడికి!
    
    తనెవరో తెలిసేటట్లు చేస్తాడు! ఇన్ స్పెక్టర్ జలీల్ అంటే ఎవరో కూడా తెలిసివచ్చేట్లు చేస్తాడు.
    
    అతని మోహంలో మారుతున్న భావాలని గమనించి ఆదుర్దాగా అంది నిశాంత.
    
    "అతను చెబుతుంది నిజమే ఇన్ స్పెక్టర్!"
    
    "ఏమిటి? తనెవరో తనకి తెలియదనా?"
    
    "అవును! అతను అమ్నేసియాతో బాధపడుతున్నాడు."
    
    అమ్నేసియా అంటే జ్ఞాపకశక్తి క్షీణించిపోవడం అని తెలుసు జలీల్ కి.
    
    "అమ్నేసియా అంటే నాకు తెలుసు! కానీ తనెవరో తనకి తెలియనంతగా మర్చిపోవడం అసంభవం!"
    
    "అసంభవం కాదు అరుదు. కానీ అప్పుడప్పుడు ఇలాంటి కేసులు జరుగుతూనే వుంటాయి" అని త్వరత్వరగా చెప్పింది నిశాంత. "ఇన్ స్పెక్టర్! మీరు మేము చెబుతున్నది నమ్మకూడదని ముందే స్థిరనిర్ణయం ఏర్పరచుకొని వుంటే, నేను మిమ్మల్ని నమ్మించలేను. కానీ, అర్ధం చేసుకోవాలని ప్రయత్నిస్తే మాత్రం నేను చెప్పేదానిలో నిజం మీకు కనబడుతుంది" అని ముందుగా క్లుప్తంగా అమ్నేసియా అంటే అసలు ఏమిటో మెడికల్ టెర్మ్స్ లో వివరించింది డాక్టర్ నిశాంత. తర్వాత అంది.
    
    "భిక్కూరు తెలుసా మీకు?"
    
    "భిక్కూరా? అడవి అంచులో ఉంటుంది కదూ? పేరు విన్నాను."
    
    "అక్కడ వున్న ప్రైమరీ హెల్తు సెంటర్ కి నేను అంబులెన్స్ తీసుకుని వెళ్ళవలసి వచ్చింది ఒకసారి. పని చూసుకుని తిరిగి వస్తుంటే దినకర్ కనబడ్డాడు దారిలో. చిన్న నది వుంది. దాని మీద చిన్న బ్రిడ్జి సగం నీళ్ళలో సగం ఒడ్డు మీదా వుంది ఇతని శరీరం."
    
    "జస్ట్ ఏ మినిట్!" అన్నాడు జలీల్. "ఇతను అంతకుముందే మీకు తెలుసా?"
    
    "లేదు అదే నేను మొదటిసారి అతన్ని చూడడం"
    
    "మరి ఇతని పేరు దినకర్ అని ఎలా తెలుసు? అతనే చెప్పాడా?" అన్నాడు పెద్ద పాయింట్ పట్టుకున్నట్లు, "తన పేరు మాత్రం గుర్తు ఉండి మిగతావి ఎలా మర్చిపోతాడు ఇతను?"
    
    "దినకర్ అనే పేరు నేనే పెట్టాను"
    
    "ఐసీ!"
    
    "వంటిమీదంతా గాయాలతో వున్న దినకర్ తన గురించిన వివరాలు ఏమీ చెప్పలేకపోతున్నాడు. అతన్ని యాంబులెన్స్ లో ఎక్కించి ఫస్టు ఎయిడ్ చేసి తర్వాత నా నర్సింగ్ హోమ్ కి తీసుకొచ్చాను"
    
    "ఇలాంటి కేసులు పోలీసులకి రిపోర్టు చెయ్యాలి. మీరెందుకు చేయలేదు?"
    
    అసహనంగా అంది నిశాంత.
    
    "పోలీసుల ట్రీట్ మెంట్ ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు. ఇంతకుముందు రెండుమూడు కేసుల్లో చూశాను. దినకర్ కి అసలే మతిస్థిమితం లేదు. పోలీసులకి రిపోర్టు చేస్తే ఉన్న మతి కూడా పోగొడుతారనిపించింది."

 Previous Page Next Page