Previous Page Next Page 
శతఘ్ని పేజి 3


    
                                                               ప్రారంభం
    
    ఆమె నడుస్తూంది.
    
    అపరాత్రివేళ .......
    
    నగరం నడిబొడ్డునా నిర్జనంగా వున్న రోడ్డుపై ఏ పని మీదైనాకాని దిక్కులు చూడకుండా ముందుకు సాగిపోతోంది. దేశానికి స్వంతంత్ర్యం వచ్చిన నలభైమూడేళ్ళతర్వాత సరిగ్గా ఆగస్టు పదిహేను నాటి అర్దరాత్రి టేంక్ బండ్ విద్యుద్దీపాల కాంతిలో చీకటిసముద్రపు ఒంటరి నావలానడుస్తూ వెళుతోంది.
    
    "అర్ధరాత్రి వేళయినా స్వేచ్చగా ఆడది తిరిగితే తప్ప యీ దేశానికి నిజమైన స్వతంత్రం వచ్చినట్లుకాదు" అన్న గాంధీగారిసూక్తి గుర్తులేనట్టు అలజడులూ, అక్రమాలూ హత్యలూ, మానభంగాలూ, లాకప్ హత్యలూ, పోలీస్ లాఠీల ఝళిపింపులూ గుర్తుకు రానట్టు యధేచ్చగా సాగిపోతూంది.
    
    ఆమెపాలభాగం పై స్వేదం. నిద్ర మత్తులో కదులుతున్న ఆ గాలి గడుసు దెయ్యంలావేదం వల్లివేయడం ఆమె గమనించడంలేదు.
    
    అయిదునిముషాల వ్యవధిలో పోలీస్ స్టేషన్ చౌరస్తాదాటి ఇందిరా పార్కు వేపు మళ్ళింది.....
    
    క్రమంగా చీకటిలోకి అడుగుపెట్టింది...... రోడ్డు వారగా ముడుచుకుని పడుకున్న ఓ కుక్క 'గూర్' మంది. పార్కులో నుంచి కీచురాళ్ళరొద వినిపిస్తోంది.
    
    నడుస్తున్న ఆమె టక్కున ఆగింది వున్నట్టుండి......
    
    ఎవరో తెలీదు..... ఆమెకు అభిముఖంగా వేటకుక్కల్లా నిలబడి వున్నారు నలుగురు వ్యక్తులు.
    
    రెండడుగులు వెనక్కి వేసింది.....
    
    ఆ చిరుకదలిక చీకట్లో ఆమెనో ఖజురహోశిల్పాన్ని తలపుకి తెచ్చిందేమోవేట కుక్కలు యిప్పుడు తోడేళ్ళలా నవ్వాయి.
    
    వెనక్కి పరుగెత్తింది......
    
    తోడేళ్ళు వెంటపడ్డాయి......
    
    ఎంతో దూరంలో కాదు.....
    
    వందగజాల లోపునే లేడిపిల్లలా వారి చేతికిచిక్కింది.
    
    నట్టనడిరోడ్డుపై......
    
    రెక్కలు తెగిన పక్షిలా .....
    
    కోరికల నల్లమందుమత్తులో జోగుతున్న నలుగురు యువకుల మధ్య జీవంలేని గొర్రెలా వుండిపోయింది.
    
    చీకటికూలుతున్న చప్పుడు.....
    
    మంటలు అంటుకున్న వాసన.....
    
    ఇంతజరుగుతున్నా విచిత్రం ఆమె ప్రతిఘటించకపోవడం......
    
    అదే...... ఆ నాలుగు తోడేళ్ళనీ అమితంగా ఆశ్చర్యపరిచింది.
    
                                                                   * * *
    
    "బహుశా భయంతో మూగపోయివుంటుంది" ఓ విలేఖరి విశ్లేషించాడు ముఖ్యమంత్రి చెప్పిందంతా విని.
    
    మృదువుగా నవ్వాడాయన.
    
    ఒకరిమొహాలొకరు చూసుకున్నారు విలేకర్లంతా. ఆగస్టు పదిహేనోతేది రాత్రి తనపరిపాలనలో శాంతిభద్రతలు ఎంత గొప్పగా వెల్లివిరిసిపోతున్నదీ రేడియో టీవీల్లో ఊదరగొట్టి చెప్పిన ముఖ్యమంత్రి మరుసటి రోజే ప్రెస్ కాన్ ఫరెన్స్ పెట్టినిన్న రాత్రి జరిగిన ఓ మానభంగం గురించి సినిమా కధలా చెప్పడంవారి వూహకి అంతుబట్టడం లేదు.    

    జరిగిందానికి సిగ్గుపడక పని కట్టుకుని మరీపిలిచి చెబుతున్నాడేం?
    
    అసలు పోలీసుల దృష్టికీ, ప్రెస్ దృష్టికీ పోనీ ఆ మానభంగం గురించి సరాసరి ముఖ్యమత్రిగారి కే ఎలా తెలిసింది?
    
    "దీన్నిబట్టి మీకు అర్ధమవుతున్నదేమిటి?"
    
    "మీ పరిపాలనలో శాంతిభద్రతలు దారుణంగా విచ్చిన్నమైపోతున్నాయి.......
    
    సరిగ్గా ఆగస్టు పదిహేనోతేదీ రాత్రినాడేయిలా జరగడం ఈ రాష్ట్రంలో గూండాలు యెంత స్వేచ్చగా విశృంఖల విహారం సాగిస్తున్నదీ పోలీస్ ఫోర్స్ యెంతపటిష్టంగా పనిచేస్తున్నదీ స్పష్టం చేస్తుంది"
    
    "శభాష్.......మంచి పాయింటు పట్టేశారు" అభినందించారు ముఖ్యమంత్రిగారు.
    
    "అందుకే ముందుగా రాష్ట్ర పోలీసు శాఖ అత్యున్నతాధికారిని శలవుపై వెళ్ళిపొమ్మని ఆదేశించాను...... వెంటనే సన్యాసిరావు ఆ పదవిని చేపట్టమని చెప్పాను"
    
    మధ్య ఈ సన్యాసి రావెవరో అర్ధం కాలేదు.
    
    కాని డిజిపిని పక్కకు ఎందుకు తప్పించిందీ బోధపడిపోయింది.
    
    ఆ మధ్య ముఖ్యమంత్రిగారి బంధువొకాయన బ్రోతల్ హవుస్ నడిపిస్తుంటే పోలీస్ శాఖపట్టుకుని నిర్భంధించడంవారికింకా గుర్తుంది. అది డిజిపి సరాసరి పత్రికలకి చేరేసిన దగ్గర్నుంచీ డిజిపికి, ముఖ్యమంత్రికి మధ్య గొడవ మొదలైపోయింది.
    
    "మరి హోం శాఖని కూడా చేపట్టిన ముఖ్యమంత్రిగా జరిగిన మాన భంగంగురించి యింకా ఏ చర్య తీసుకోబోతున్నారు?"
    
    మృదువుగా నవ్వారాయన.
    
    పదవిలోకివచ్చిన యేడాదికాలంలో ఇలా అయనచాలాసార్లు నవ్వారు కాని యీరోజు నవ్వడంలో అర్ధంకాని మరో కొత్త అర్ధమేదోకనిపించింది.
    
    "మంచిప్రశ్న......ఆ మాటకొస్తే నన్ను మీరు అడగాల్సినప్రశ్నా యిది"
    
    "మీరు దాటేయకుండా జవాబుచెప్పాల్సిన ప్రశ్నకూడా" ఓ విలేఖరి వ్యంగ్యంగా అడిగాడు. ఆయన సంగతి బాగా తెలుసి వుండటంతో.
    
    "విలేఖర్లంటే ఇలా ఉండాలి"
    
    "మేం ఉంటాం....." అదే విలేఖరిరెట్టించాడు...... "మీరు జవాబు చెప్పండి"

 Previous Page Next Page