ఆశ్చర్యం.......
ఆమె అర్ధనగ్నంగా వుంది......
ఆమె శరీరం కాలిన బొబ్బలతో వికృతంగా వుంది.
అతడిలో ఆందోళన ఉధృతమౌతుంది.
"ఎవరమ్మా" మనసు ద్రవించిందేమో ఉద్విగ్నంగా అడిగాడు......" ఎవరు నువ్వు? నిన్నింత దారుణంగా కాల్చినవ్యక్తులెవరు?"
"నువ్వే......"
పిడుగులా వినిపించింది.
"నీసాటి మనుషులే"
నీరసంగా తూలిపోయింది.
"ఆందోళనపడకు...... నేను కాలుతున్న కాష్టంలా నీకు కనిపిస్తున్నా అప్పుడెప్పుడో రాముడుపాలించిన రాజ్యాన్ని..... ప్రపంచ దేశాలపురోగమనానికి అంచెలంచెలుగా ఆసరానిచ్చిన పాంథశాలని...... నాన్నా...... నేనెవరోకాదు....." రొప్పుతూ స్వప్నంలోలా అంది "నేనయ్య...... మూడు వైపులసాగరాల్ని కన్నీళ్ళతో నింపుకున్న నువ్వునిలబడ్డ ద్వీపకల్పాన్ని"
"అమ్మా....." అతడి ఫాలభాగం స్వేదంతో పేరుకుపోయింది. "అంటే...... నువ్వు....."
"అలనాటివేదాన్ని.....పరజాతిశృంఖలాలతో గుండెచిట్లిన రత్నగర్భాన్ని......అనంత సౌందర్య సంచయాన్ని...... తత్వాన్ని...... గౌతముడి న్యాయ దర్శనాన్ని....... ధర్మ సంస్థాపనా కోసం గీతను అందించిన భగవద్గీతను..... ఆనాడు స్వర్ణచరితను యిప్పుడు జీవాన్ని కోల్పోతున్న జీవ సంస్కృతిని...... అగ్ని పునీతను అయినా మళ్ళీ అగ్నికి ఆహుతమవుతున్న భారతిని...... రగులుతున్న భారతాన్ని"
యుగంపగిలి శిథిలమైన చప్పుడు......
వెన్నులోనుంచి జారిన ఓ ఆర్తిగీతి...... నిజమా ...... ఇది నిజమేనా...... సుజలాం సుఫలాం మలయజ శీతలాం....... సశ్య శ్యామలాం...... ఈమె భారతేన...... అయినా యిదేమిటి..... ఏమిటిలా అయిపోయింది.
ధర్మం శరణం గచ్చామి అంటూ ఉచ్వాస నిశ్వాసాల ప్రణవనాదంలా భాసిల్లినయీ తల్లి కేమైంది......సర్వాభరణాలంకృతమైనచిలకాకు పచ్చ చీరధరించి ప్రపంచమంతాపచ్చగా వుండాలనికోరుకుంటూ ప్రేమాస్పదయింద్రనీలాల కాంతుల్ని అనంతం దాకా వెదజల్లిన అమ్మ యిలా శుష్కించిపోయిందేం?
ఏదీ! నవ ప్రపుల్ల నందనవన శోభితమైన నీ శరీరకాంతి ఏమయింది? చుట్టూ కెరలిత సముద్రాలతో సశ్యశ్యామలం చేసేనదీ నదాలతో సుహసినిల సుమధురభాషిణిల నిన్నటిదాక బ్రతికిన యీకళా నిక్షేపం యిల నైసర్గికరూపాన్నే కోల్పోయిందేం......
"ధన్యోస్మి తల్లీ" చేతులు జోడించాడు" నీ దర్శనంతో నా జన్మ ధన్యమైందమ్మ...... కాని ఏం ఆశించి యీ సామాన్యుడి ముందిలా ప్రత్యక్షమయ్యావు....."
అశ్రుసిక్తనయనాలతో చూస్తూంది.......
"జననీజన్మభూమి స్వర్గం కన్న గొప్ప అని ప్రపంచానికి తెలియచెప్పిన ఓ మాతృమూర్తీ..... ఏమిటీరోదన..... ఏమైందమ్మా..... మాటాడు."
భయోద్విగ్నంగా కంపిస్తోంది.....
ఏ తురుషుల దండయాత్రల ఛాయలో వందల సంవత్సరాల విదేశీపదఘట్టనతో దేహంపై యింకా మానని గాయాలబాధో---యిప్పటికీ కలవరపెడుతున్నట్టురొప్పుతూనే అంది నిస్త్రాణంగా" నానా ..... నాకు బ్రతకాలనుంది....."
అతడి మనసు ద్రవించిపోయింది."అమ్మా........ అజరామరమైన కీర్తిగల నీకు మరణమెక్కడిది.......
"నేనోచిరిగిపోతున్న చివరిపుటని...... అంతరించిపోతున్న ఆఖరి అధ్యాయాన్ని....." ఆమె గొంతు పూడుకుపోతూంది....."నాన్నా కొనవూపిరితో మిగిలిన నన్ను చూసి కూడా యింకా నా దైన్యస్థితిని అర్ధం చేసుకోవడంలేదూ...... మరణవాంగ్మూలం లాంటినా అభ్యర్ధన వింటూసైతం రక్తప్లాంతమైతున్న నా చరిత్రని నువ్వుతిరగరాయాలి."
"నేనా" ఆశ్చర్యంగా అడిగాను.
"అటు చూడు....." కొనవూపిరి లా ఆయాసపడిపోతూంది.
"అక్కడ రవి జాబిలీ మానభంగాలతోనా శరీరం తూట్లుపడిపోతూంది....... మాయా త్యాగిపై నీ సోదరులు సాగిస్తున్న మారణహోమంతో నా ప్రేవులు చిట్లిపోతున్నాయి...... నిరంతర జాజ్యల్యమానస్వేహవాసాలను చేధించుకుని సాగుతున్నమత విద్వేషాలతోనా నరాలు తెగిపోతున్నాయి...... నన్ను వివస్త్రనిచేసి నా చీర కుచ్చెళ్ళును పీకి ఆ పీలికలని జండాలుగా మార్చుకుని అక్కడ రక్తపాతాన్ని సృష్టిస్తున్నారు......అది మాత్రమే కాదు......" ఆగింది....... కాదు...... మరేదో చెప్పాలని విశ్వ ప్రయత్నం చేస్తూంది......
'అమ్మా...... మాటాడు.....'
"మాటాడమ్మా....... నేను నీ గొంతుగా మారినావాళ్ళకి నేనేం చెప్పాలో ఇంకా
స్పష్టంచేయి....."
కూలిపోతున్న ఏ విశ్వాసాల రాపిడికో ఆమె నేత్రాలకటకటాల నుంచిగంగా యమునలు ఉరికి వస్తుంటే కనిపిస్తున్న ఏ దృశ్యాల క్రీనీడలు అగ్ని జహ్వాలుగా మారి కలత పెడుతున్నాయో.......
"అదిగో...... అక్కడ నా బిడ్డలు...... నీ చిన్ని తమ్మళ్ళు.....చెల్లెళ్ళు...... ఆత్మాహుతులఅగ్నికి ఆహుతైపోతున్నారు...... కనిపించడం లేదూ...... ఆ పసి కందుల ఆర్తనాదాలు నీకు వినిపించడంలేదూ...... సంఘం పేర్చినలాక్షా గృహంలో పిచ్చకగూళ్ళు కట్టుకుంటూ ఎదగాల్సిన వయసులో రాజీవ్ గోస్వాములు, వంశీలు, మోనికా చడ్డాలు, శ్యామాగుస్తల ఆత్మాహుతులు నిన్ను కదిలించడం లేదూ....... అది ...... అది యికముందు జరక్కూడదు...... జరక్కుండా నువ్వుచూడాలి....."
"అమ్మా......" కంపించిపోయాడతడు "నేనెంతటి వాడ్నమ్మా....... ఉద్యమాల కోసం ఆత్మాహుతుల పేరిట మంటల్లో తనను తాము అంతం చేసుకునే ఆ పసికందుల్ని నేనెలా వారించగలను"
"వాస్తవాన్ని తెలియచెప్పి" టక్కున అంది, "అవునునాన్నా...... రేపటి పౌరులుకావాల్సిన యీ పసికందులకి చితికిన ఆశలచితి మంటలనుంచి చలి కాగుతున్ననా రాక్షస పుత్రుల అసలురంగు నీ మిగతా సోదరులకి తెలియచెప్పాలి......"
"ఎవరావ్యక్తులు."
"దశాభ్దాలక్రితం దాకా పరదాస్యశృంఖలాల అలసట నుంచి నేనింకా తేరుకోకముందే నన్ను మళ్ళీ చీకటి కూపంలోకి నెడుతున్న రాజకీయవ్యవస్థకి చెందిన నీ అన్నలూ తమ్ముళ్ళు."
"కాని......." అవాక్కయ్యాడు క్షణంపాటు" ఏం చేసినా కాని వాళ్ళూ నీ బిడ్డలే
కదూ......"
"ఇదేనాన్నా" ఉక్రోషంగా చూసింది అంత నిస్సహాయస్థితిలో కూడా "నీలాంటి మేధావర్గం ఇలా ఆలోచించినంతకాలం నాకు ముక్తిలేదయ్యా...... యీ క్షణంలో నేనుకోరుతున్నది శవయాత్రా ప్రశాంతత నిండిన సంరంభం కాదు...... తలారిగామారిన చూస్తూ బ్రతకడం నా వల్ల కాదు.......నాన్నా ....." ఊపిరి అందనట్టు విలవిల్లాడిపోయింది.
"రేపటితరానికి బాధ్యతగల నువ్వు అందియ్యాల్సింది వికృత భవిష్యత్ స్వప్నాలు కాదు...... మండుతున్న దావానల వలయ ఉష్ణోగ్రతల్ని చల్లార్చగలకొట్టుకుంటున్న బాల్యాన్ని కాదు...... శోషనుంచి మౌన ఘోష నుంచి మనిషి వడివడినడవగలిగే స్థయిర్యం...... కుటిల రాజకీయసమస్యల శిలల్ని చీల్చి మొలిచే చిరుమొక్కల సింహనాధం..... నేను బ్రతకాలీ అంటే యిది నువ్వుచేయగల్గాలి నాన్నా...... కనీసం నువ్వు నీలాంటి మరి కొందరు యీ హామీ యిస్తే కొనవూరిపితోనైనా నేను కడదాకా...... మి ...... గి ....... లి ...... పో ...... తా ....... ను."
నిశ్శబ్దం.....
జీవచ్చవంలా చూస్తుందామె......
జీవనాడిని పరీక్షించి బ్రతికివుందో లేదో చెప్పగల సమర్ధత లేదతడికి......
కాని అర్ధమైంది అమ్మ చివరికోరిక.....
ఆలోచనకీ ఆలోచనకీ మధ్యశూన్యం......
సాధ్యమో, అసాధ్యమో తెలీనిజాగృతి కోసం ధ్యానంగా సాగించాల్సిన పోరాటానికి మనము పడే సంచలనం.....
"అమ్మా" చేతులు ముకుళించాడు.
"సాధించగలనని గర్వంగా చెప్పటానికి నేను భగత్ సింగ్ నీ, సీతారామరాజుని కాను...... ఓ మామూలు రచయితని...... ఇంకిపోతున్న జీవనది లాంటి ఆశతో విరుగుతున్న వంతెనలకి ఆసరా ఇవ్వాలని నీ ఆశీస్సులతో సాగిపోతున్నానే తప్ప గెలిచానని రేపు నీకు చెప్పగలనోలేనో తెలీనివాడ్ని. అయినా ఆలోచనల అగ్ని కీలలకి యిదిగోయీ క్షణమే రూపం యివ్వాలని ప్రయత్నిస్తూ నీ సమక్షంలోనే శ్రీకారం చుడుతున్నాను...... సారే జహా సే అచ్చా అని నీ గురించి నా చుట్టూవున్న మనుషులకి మరో సారి తెలియచెబుతున్నాను......"
* * *