Previous Page Next Page 
భామ కలాపం పేజి 3

 

    రత్నాకరరావు దంపతులు తేరుకునేలోగానే కారు కదిలి వేగంగా వెళ్ళిపోయింది.


    "ఆ డాన్సరుగారు ఎంత తల తిక్కమనిషో, అంతకు మించిన తిక్కలాడిలా  ఉన్నాడే ఈ మినిస్టరు!" అన్నాడు రత్నాకరరావు చిరాగ్గా.


    పార్టీ మూడ్ పాడయిపోయింది, అందరూ గుంపులు గుంపులుగా చేరి జరిగిన దాన్ని గురించి మాట్లాడుకుంటున్నారు.


    సుదీర మోహంలో ఉత్సాహం తగ్గిపోయింది. ఇదంతా చిన్నతనంగా ఉంది తనకు.


    "అసలు ఈయన్ని ఎందుకు పిలిచావ్?" అన్నాడు రత్నాకరరావు కోపం అంతా సీత మీద చూపిస్తూ.


    వేళ్ళతో కణతను నొక్కుకుంది సీత. "ఏం చేస్తాం మరి? మనకు ఆయనతో పని ఉండే! గడ్డి పడేస్తే తినే మనిషి కాడు. కాబట్టి కొంచెం మర్యాదలు చేసి దువ్వుదాం అని పిలిచాను. రేపు మన ఫైలు మీద సంతకం పెట్టె దాకానే ఈయనకి భయపడాలి. ఆ తర్వాత ఆయన్ని ఇక పట్టించుకోవలసిన కర్మ ఉండదు. మీరు వెళ్ళి ఆ కుర్రాడితో కాస్త మంచిగా మాట్లాడిరండి!" అంది.


    "నేనా! నేను వెళ్ళనంటే కోపం ఆపుకోలేక మరి నాలుగు అంటించి మరి వస్తాను. సారధిని వెళ్ళమను" అన్నాడు రత్నాకరరావు.

 

    సారధి వాచ్ చూసుకున్నాడు. "షెడ్యుల్ ప్రకారం నేను అరగంటలో డిల్లి వెళ్ళాలి. అక్కడ మన కేసు........." అని ఆపేశాడు సగంలో.


     "అవును........నువ్వు డిల్లి వెళ్ళాలి కదూ! పోనీ నువ్వు వెళ్ళొస్తావా సుదీరా?"


    నిరసనగా చూసింది సుదీర. "నేనా? నేను వెళ్ళి ఆ పోగారబోతు డాన్సరుకి అపాలజీ చెప్పి వస్తానని నువ్వు అనుకుంటూ వుంటే మమ్మీ, నువ్వు గొప్ప భ్రమలో ఉన్నవన్నమాట! అంది విసురుగా.


    "అయినా వాళ్ళకి వీళ్ళకి మనం భయపడటం ఏమిటి? ఎవరూ వెళ్ళక్కర్లేదులే" అన్నాడు రత్నాకరరావు. అతనికి ఆవేశమే గానీ సీత లాగా ముందు చూపు లేదు. అతని పోలికే వచ్చింది సుదీరకి.


    అతని వైపు హేళనగా చూసింది సీత. "మొదటినుంచి మీ మాట ప్రకారమే పోయి వుంటే మనం ఇంకా గుడిసెల్లోనే ఉండేవాళ్ళం. గుడ్డెద్దు చేలో పడ్డట్టు దుకేయ్యడం కాదు పౌరుషం అంటే! అదును చూసి చావుదెబ్బ కొట్టాలి. ఒక వారం రోజులపాటు ఈయన కాళ్ళు మనం పట్టుకోక తప్పదు. వారం రోజుల తరువాత మన కాళ్ళ దగ్గర ఈయన ఉంటాడు.


    "ఏం .....వారం రోజుల్లో ప్రపంచం తలక్రిందులవుతుందా?" అంది సుదీర.


    "మొత్తం ప్రపంచం సంగతేమో గానీ, రాజకీయ ప్రపంచం మాత్రం తలక్రిందులవబోతోంది. వేదిక మీద ఉపన్యాసాలు ఎన్ని ఇచ్చినా, మంత్రి వర్గాలేప్పుడు కులాల ప్రాతిపదిక మిదఎర్పాటు అవుతాయి! మన కులం తాలుకూ ప్రతినిధిగా ఈయన్ని తీసుకున్నారు. కాని ఏం లాభం! కట్టేలాంటి మనిషి! తను తినడూ, ఇంకోళ్ళని తిననివ్వడు! నీతి, నిజాయితీ అంటూ ఒకటే ఉకదంపుడు.! ఇలాంటోడ్ని ఎవరు మాత్రం ఎంతకాలం భరిస్తారూ? అందుకే అందరూ పూనుకుని దింపేస్తున్నారు.


    "జస్ట్ ఏ మినిట్. మమ్మీ!" అంది సుదీర. "ఈ మూడు గంటల్లో మూడుసార్లు కులం ప్రస్తావన విన్నాను నేను. వెంకట్ గిరిజన్ అని, దీప ఇంటర్ కాస్ట్ మేరేజ్ చేసుకుందని, ఇప్పుడు- ఈయనకి కులాన్ని బట్టె మంత్రివర్గంలో స్థానం వచ్చిందని ! కులం అంటే అంత పిచ్చి ఏమిటి? ఏ శతాబ్దంలో ఉన్నాం మనం?" అంది చీదరగా.

 

    సుదీర వైపు జాలిగా చూసింది సీత. "నువ్వు అమెరికా నుంచి తిరిగి వచ్చి వారం రోజులే అయింది. సుదీ! అందుకే నీకు తెలియదు. ఇక్కడ, ఈ ఇండియాలో పుట్టినప్పటి నుంచి చచ్చేదాకా చదువుకి, ఉద్యోగాలకి, పేరంటాలకి, పెళ్ళిళ్ళకి, పండగలకి, పబ్బాలకి, రాజకీయాలకి కూడా కులం ప్రసక్తి లేకుండా జరగదు. ఇంకో నెల పోనీ! నీకే అర్ధం అవుతుందిలే!" అంది.


    "ఈ చాదస్తపు మినిస్టరు పోతాడంటున్నావ్ గానీ, వీడు పోయి మరో తుగ్లక్ వస్తాడేమో మన ప్రాణానికి?' అన్నాడు రత్నాకరరావు.


    మిస్టిరియస్ గా నవ్వింది సీత. "మీకు బాగా అనుకూలమైన వాళ్ళే వస్తారులెండి!"


    "అంత గ్యారెంటిగా చెబుతున్నావే........ఎవరే కాబోయే మంత్రి?"

 

    "నేను!" అంది సీత క్లుప్తంగా.....మన కులానికి ప్రతినిధిగా!"

 

                                                                              ----------------

 

    నేను వెళ్ళలేను మమ్మీ! నన్ను బలవంత పెట్టద్దు." అంది సుదీర మర్నాడు పొద్దున.


    "మళ్ళీ మొదటికొచ్చావా? నా మాట వినమ్మా! మా బంగారు కొండవి కదూ! నేను కాబోయే మినిస్టరుని....వెళ్ళి అతని కాళ్ళ మీద పడితే ఏం బాగుంటుంది చెప్పు? నువ్వయితే ఏదో చిన్న పిల్లవి........వెళ్ళి సరదాగా మాట్లాడి వచ్చినట్లుంటుంది."


    "అది కాదు మమ్మీ! ఎలాగూ ఇంకో వారంలో నువ్వే మినిస్టరై పోతానంటున్నావు . పైగా , ఈ పోర్టు ఫోలియోనే నీకు ఇస్తారన్నావు. అలాంటప్పుడు మనం వీళ్ళకు భయపడేదేమిటి? రేపు ఆ చెయిర్లో కూర్చున్న తర్వాత మన ఫైలు మీద నువ్వే దర్జాగా ఆర్డర్ పాస్ చేసెయ్యవచ్చు కదా!"


    నవ్వంది సీత. "పవరులోకి వచ్చి రాగానే మన ఫైలు మీద మనమే సంతకాలు పెట్టేసుకుని, లైసెన్సులు తీసేసుకుంటే జనం ఊరుకుంటారా? అందుకే ఆయన పదవిలో ఉండగానే అయన చేతే సంతాకాలు పెట్టించేయ్యాడానికి ఈ తొందర. నువ్వు బయలుదేరు."


    "ఓహ్! మమ్మీ!" అని గారంగా విసుక్కుంటూ లేచింది సుదీర.


    షవర్ బాత్ తీసుకుని, లావెండర్ కలర్ చైనా సిల్క్ చీర కట్టుకుని, అప్పుడే విరిసిన పువ్వులా సువాసనలు వెదజల్లుతూ పోర్టికోలోకి వచ్చింది. ఫోర్డు ఫాల్కాన్ కారు నిలబడి ఉంది. పోర్టికోలో డ్రైవర్ ఛోటూ మెత్తటి ప్లానల్ గుడ్డతో నీడలు తేలేల కారుని తుడుస్తున్నాడు.


    వెనక సీట్లో కూర్చుంది సుదీర. లోపలనుంచి మెరుపులా పరుగెత్తి వచ్చి, ఆమె పక్కనే కూర్చుంది ఒక డాల్మేషియన్ జాతి కుక్క.


    "సిల్వర్ ! దిగు!" అని గద్దించింది సుదీర.


    నాలుక బయట పెట్టి రొప్పుతూ, జాలిగా చూసింది సిల్వర్.


    ఆ చూపులకి కరిగిపోయింది సుదీర. "నాటి బాయ్! సరే రా!" అంది.


    ఛోటూ కారుని ముందుకి పోనిచ్చాడు. చిన్న చిన్న సందుల్లో మలుపులు తిరిగుతూ భరత్ వాళ్ళ ఇల్లు చేరేసరికి నలబై నిముషాలు పట్టింది.

 

    ఆ వీధిలో ఇళ్లన్నీ పాతకాలపువి. చాలా ఇళ్ళకి ప్రహరి గోడ లేదు. రోడ్డుమిదకే గదులూ, అరుగులు కట్టేశారు. ఒక్క భరత్ వాళ్ళ ఇంటికి మాత్రమే కాంపౌండ్ వాల్ ఉంది. అది కూడా ఒక చోట పడిపోయింది. ఆ కంతలో నుంచి ఒక మేక లోపలికి కాళ్ళు పెట్టి, అందుబాటులో ఉన్న ఒక చెట్టు ఆకులని తెంపి తింటోంది. ఆ గోడకి గేటు ఒకప్పుడు ఉండేదేమో గానీ, ఇప్పుడు మాత్రం లేదు. వెయ్యి గజాల స్థలంలో మధ్యగా కట్టిన పాతకాలపు పెంకిటిల్లు అది. ఇంటి గుమ్మం ముందు నిలబడి చూస్తే వెనక పెరట్లో ఉన్న తులసికోట, కనబడుతోంది. వసారాని జేగురు రంగు కొయ్య స్తంబాలు నిలబెడుతున్నాయి. ఇంటికి ఎడమవైపు ఒక అంకణం కప్పు శిధిలమై కూలిపోయింది.


    లోపలనుంచి సన్నటి గొంతుతో ఎవరో అమ్మాయి పాడుతున్నట్లు వినబడుతోంది. డానికి తగినట్లు గజ్జెల చప్పుడు, సామూహికంగా, లయబద్దంగా వినబడుతున్న పద ధ్వని.

    
    కారు ఆగిన శబ్దం విని, ఒక అమ్మాయి కిటికిలోంచి  తొంగిచూసి బయటికి వచ్చింది. ఉన్నట్లుండి నవనవలాడుతూ పొడుగ్గా పెరిగిపోయిన లేత మొక్కలా ఉంది తను. ఆ పొడుగుకి తగినంత ఒళ్ళు ఇంకా రాలేదు. ఒళ్ళు చేశాక ఇంకా ఎంతో బాగుంటుందనిపిస్తుంది చూసేవాళ్ళకి. లేడిపిల్ల కళ్ళలాగా చాలా పెద్ద కళ్ళు. ఆ కళ్ళలోని ఎక్స్ ప్రేషన్స్ చూస్తుంటే భరతే గుర్తు వస్తాడు. నవ యవ్వనానికి సూచనగా కుడి చెంపమీద ఎర్రటి చిన్న మొటిమలు రెండు- చిటికెడు కుంకుమ జల్లినట్లు కనబడుతున్నాయి. కొబ్బరి నూనే పూసుకుని సున్నగా దువ్వి వేసుకున్న పెద్ద జడ నిగనిగలాడుతోంది.


    కొత్తవాళ్ళతో మాట్లాడేటప్పుడు ఆ ప్రయత్నంగానే ఇంగ్లీషులోకి జారిపోతుంది సుదీర. అమెరికన్ ఉచ్చారణతో "ఐ వాంట్ టు సీ మిస్టర్ భరత్" అంది.


    "రండి! అన్నయ్య పిల్లలకు డాన్సు పాఠాలు నేర్పిస్తున్నాడు. ఇంకో పావుగంటలో అయిపోతుంది" అంది లోపలికి దారితిస్తూ.

 

    సందేహంగా వెంట నడిచింది సుదీర.


    డ్రైవర్ ఛోటూ మళ్ళీ ఫ్లానల్ గుడ్డ తీసి కారు తుడవడం మొదలేట్టాడు. కుక్క సిల్వర్ కారులోంచి కిందికి దూకి, నేలని వాసన చూస్తూ, ఇంటి చుట్టూ ఒకసారి పరిగెత్తి వచ్చింది.


    వసారా దాటి ఇంట్లోకి వెళ్లగానే అక్కడ హాలు ఉంది. హల్లో కూడా కొయ్య స్తంబాలు ఉన్నాయి. కుడిచేతి వైపు ఒక గది. ఎడమ చేతి వైపు మరొక గది.


    హాల్లోని గోడలకి పైభాగాన సన్నటి చెక్క బద్ద బిగించి ఉంది. దాని మీద ఒక వైపంతా దేవుళ్ళ ఫోటోలు, రవివర్మ వేసిన సరస్వతి, లక్ష్మీదేవి, శ్రీరామ పట్టాభిషేకం, అకుమిడ పడుకుని కాలి బొటనవేలు నోట్లో పెట్టుకుంటున్న బాలకృష్ణుడి బొమ్మా ఉన్నాయి.


    మరో వైపు గోడకి దేశ నాయకుల ఫోటోలు మహాత్మాగాంధీ, పండిట్ నెహ్రు, ఉక్కుమనిషి వల్లభ భాయ్ పటేల్, ఇక్బాల్, ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు, కట్టమంచి రామలింగారెడ్డి, ఛత్రపతి శివాజీ, పృధ్విరాజు చౌహాన్, రాణా ప్రతాప్-


    ఇంకో గోడకి ఆ కుటుంబ సభ్యుల ఫోటోలు ఉన్నాయి. భరత్ పోలికలే ఉన్న ఒకాయన నెహ్రుకి దండ వేస్తున్నప్పుడు తీసిన ఫోటో వుంది. మరో దానిలో లాల్ బహుదూర్ శాస్త్రి ఆయన భుజం మీద ఆప్యాయంగా చెయ్యి వేసి మాట్లాడుతున్నారు.


    వెనకగా ఉన్నది పూజ గది అయి వుండొచ్చు. కర్పూర హారతి, అగరొత్తుల వాసనా, పారిజాత పుష్పాల పరిమళం గాలిలో తేలి వస్తున్నాయి. చిన్న గంట గణగణ మోగింది.

 Previous Page Next Page