కొడుకు ఏ స్థితిలో వున్నదీ వెంటనే తెలుసుకోవాలన్న ఆలోచన ఆయన్ని ఎంత ఆందోళనపరిచిందీ అంటే ఆటోలో హోం మినిస్టరుగారి బంగళాకి బయలుదేరారు. పదిహేను నిమిషాల ప్రయాణం ఆయన్ని చాలా అలసటకి గురిచేస్తుంటే గూర్ఖాని నెట్టుకుంటూ లోపలికి చొచ్చుకుపోయారాయన.
అక్కడి దృశ్యం ఆయన ఊహకందనిది.
అప్పటికే స్తంభానికి కట్టబడివున్న రాజేష్ శరీరం రక్తసిక్తమై వుంది. అయినా హంటర్స్ అతడి శరీరాన్ని తాకుతున్నాయి. సమీపంలోని ఉయ్యాల్లో కూర్చుని స్వైరవిహారాన్ని పర్యవేక్షిస్తున్న హోం మినిస్టర్ సూర్నారాయణ పిచ్చుక మీద సంధిస్తున్న బ్రహ్మాస్త్రంలా అనిపించాడు.
తండ్రిని చూడగానే అంతసేపూ అమ్మా అంటూ మూలుగుతున్న రాజేష్ నీళ్ళు నిండిన కళ్ళతో "నాన్నా" అన్నాడు దీనంగా.
బ్రతికుండగానే తోలు వలుస్తుంటే మేక చేసే ఆర్తనాదంలాంటి రాజేష్ పిలుపు ఏ గుండె గోడలకి తగిలి ప్రతిధ్వనించిందో మాస్టారు అమాంతం సూర్నారాయణ పాదాలపై వాలిపోయారు "అయ్యా... నా బిడ్డ..."
జవాబుగా సూర్నారాయణ కాలు కదిలి మాస్టారి గుండెల్ని తాకింది. బక్కచిక్కిన మాస్టారి శరీరం రెండడుగులు పైకి లేచి దబ్బున నేలమీద పడింది.
"నా...న్నా" రాజేష్ గొంతు నాళాలు పగిలిపోయాయి. నేలజారిన ఏ నీతి శతకపు సూక్తుల్నో వేదుకుతున్న వృద్దుడిలా తండ్రి బలాన్ని కూడగట్టుకుని మళ్ళీ సూర్నారాయణ పాదాలవైపు ప్రాకుతుంటే రాజేష్ ఎంత కలవరపడిపోయాడని.... తనకయిన గాయాలకి కాదు, వందల వేలమంది విద్యార్ధుల్ని తీర్చిదిద్ది అలసటగా వడలిన తండ్రి శరీరం ఇప్పుడు తనకోసం తూట్లు పడుతుంటే తట్టుకోలేక "వద్దు నాన్నా.... వెళ్ళిపో" అన్నాడు నీరసంగా, నిస్త్రాణగా.
అయినా మాస్టారు ఆగలేదు.... మరోసారి సూర్నారాయణ పాదాల్ని తాకారు కంపిస్తున్న చేతుల్తో "నా బిడ్డ తప్పు చేస్తే నన్ను చంపండమ్మా.... పసికందు..."
"ఈసారి ఉయ్యాలలో నుంచి ఆవేశంగా పైకి లేచిన సూర్నారాయణ మాస్టారి మెడపట్టుకుని గాలిలోకి లేపాడు. ఊపిరి అందని పావురాయిలా ఆయన గిలగిల కొట్టుకుంటుంటే చిన్మయానందంగా కొంతసేపు చూసిన సూర్నారాయణ శాడిస్టిక్ గా మళ్ళీ విసిరేశాడు.
"నీ కొడుకు నా కూతుర్ని కామెంట్ చేస్తాడా?"
చిట్లిన నుదురుకన్నా ఈ అభియోగమే ఎక్కువ బాధ కలిగించిందేమో నిస్సత్తువగా చేతులు జోడించారాయన. "లేదు మినిస్టరుగారూ... నా కొడుకు అంత ధైర్యవంతుడు కాదు"
అయినా వినిపించుకునే స్థితిలో లేడు సూర్నారాయణ...
వినిపించుకుంటే తను చేస్తున్నది తప్పని అతడికీ తెలిసిపోతుంది. అది సూర్నారాయణ కిష్టంలేదు. తన కూతురు శ్వేత ఎంత మొండిపిల్లో అతడికి తెలుసు. అదొక్కటే కాదు, శ్వేత రాజేష్ వెంట పడటమూ తెలుసుకున్నాడు. అందుకే కొంతకాలం ఆ విషయంలో మధనపడ్డ సూర్నారాయణ నిన్నరాత్రి కూతురు క్లాసులో జరిగిన పరాభవం గురించి చెప్పేసరికి వెంటనే రియాక్టయ్యాడు. ఓ జటిల సమస్యని పరిష్కరించే అవకాశం కూతురే కలగచేయడంతో ఇదిగో ఈ నరమేధానికి పూనుకున్నాడు. శ్వేత మీద ఇక ఎప్పటికీ ఆసక్తి కలగని, స్థాయికి రాజేష్ ని లాక్కుపోవాలి. చంపడం కాదు సాధ్యమైనంత ఎక్కువగా కంగారు పెట్టాలి. అంతే!
"ముసలి గాడిదా" సూర్నారాయన పాదం మాస్టారి డొక్కని తాకింది. పగిలిన నిఘంటువులా నేలకి వాలిపోయారాయన. ఆయన ప్రాణాలు పోలేదు. కడగంటిపోతున్నాయి. వయసుడిగిన ఒక వృద్దుడని తెలిసి కూడా ఇంత దారుణంగా హింసించగల వ్యక్తులుండగలరని బ్రతుకు చరమాంకాన తెలిసినందుకేమో పగిలిన నిఘంటువై నిన్న తెలిసిన జీవితసత్యాలకి కొత్త అర్ధాల్ని వెదుక్కుంటున్నారు. "వెంటనే ఊరు ఖాళీ చేసి వెళ్ళిపో, లేదంటే నీ కొడుకు నీకు దక్కడు"
మరేదో చెబుతున్నా వినిపించడం లేదు. అలసటగా ఉబికిన కన్నీళ్ళు ఆ వృద్ద గురుబ్రహ్మ కళ్ళని మసకగా మార్చుతుంటే రాజ్య బహిష్కరణకి తను సిద్దమే అన్నట్టు తల పంకించారు ఆయన. ఆ తర్వాత కొడుకుతో బాటు బయటికి నడుస్తూ చివరగా చేతులు జోడించారు. అది నమస్కారం కాదు దశాభ్దాల కృషితో త్రికరణ శుద్దిగా సాధించిన రుష్యత్వం కొడుకుని దక్కించుకున్నందుకు వ్యక్తం చేస్తున్న కృతజ్ఞత.
నడుస్తున్న శవంలా తండ్రిని కావలించుకుంటూ అన్నాడు రాజేష్ - "నేనే తప్పూ చేయలేదు నాన్నా"
క్షణం ఆగారాయన.
"పిచ్చి కన్నా" చచ్చిపోతున్న కేలండర్లా నిర్జీవంగా చూశారాయన రుధిర వర్షంలో తడుస్తూ ఈ క్షణానికీ ఇంకా రాని పోలీసులే గుర్తుకొచ్చారో... సవ్యసాచిలాంటి ఉన్నత స్థాయిలో వున్న ఓ అధికారి వ్యక్తిత్వమే కలతపెట్టిందో నెమ్మదిగా అన్నారు "ఆడపిల్లలా సిగ్గుపడే నువ్వు అంత సాహసం చేస్తావని ఎలా అనుకోను..."
ఆ తర్వాత మాట్లాడలేకపోయారు... చాలా మాట్లాడాలని వుంది కానీ నజ్జుగా మారిన శరీరం సహకరిస్తేగా...
అమ్మా సరస్వతీ... నీ సేవలో ఆరు దశాబ్దాల జీవితాన్ని పునీతం చేసుకున్నానని పొంగిపోయానే... నేనున్నది కూపస్థ మండూకోపనిషత్తులో అని ఎందుకు తెలియచెప్పలేదమ్మా... దోషంలేని జీవిత వాక్య నిర్మాణంలో వున్న ఇద్దరు పిల్లల్నీ ప్రయోజకులుగా తీర్చిదిద్దానని సంబరపడ్డానేగాని నేనున్నది అపశ్రుతుల పంకంలో అన్న సత్యాన్ని ఈ చరమాంకందాకా తెలుసుకునే అవకాశాన్ని ఎందుకివ్వలేదు...
కళ్ళనుంచి నీళ్ళు స్రవిస్తుంటే హఠాత్తుగా కూతురు గుర్తుకువచ్చింది.
ఇంట్లోనే వుంటే ఈ సన్నివేశాన్ని ఎలా ఎదుర్కొనేదో...
కానీ ఆశ్రిత ఇక్కడ లేదు.
ఐ.ఎ.ఎస్ ఇంటర్వ్యూకని ఢిల్లీ వెళ్ళింది ఆ ముందురోజే.
* * *
సరిగ్గా ఉదయం పదకొండుగంటల ఏడు నిమిషాలకి యు.పి.యస్సీ ఆఫీసులో అడుగుపెట్టింది ఆశ్రిత.
"గుడ్ మాణింగ్ టు యు ఆల్ సర్స్"
చైర్మన్ తోబాటు ఛాంబర్ లోని ఆరుగురు మెంబర్స్ నీ గ్రీట్ చేసిన ఆశ్రిత వారి అనుమతి కోసమన్నట్టుగా చూస్తుంటే "ప్లీజ్ బి సీటెడ్" అంటూ తనకు అభిముఖంగా వున్న కుర్చీ చూపించాడు చైర్మన్.
తెలుగుతనం వుట్టిపడేట్టు పట్టుచీర కట్టుకుని నుదుట బొట్టుతో ఆశ్రిత మొదటి చూపులోనే అందర్నీ ఆకట్టుకుంది. పెదవులపై మరీ మరీ చూడాలనిపించె దరహాసం, చూపులలో చెరగని ఆత్మవిశ్వాసం ఆమె అందాన్ని ద్విగుణీకృతం చేస్తుంటే పొందికగా కుర్చీలో కూర్చుంది.
తననే తదేకంగా చూస్తున్న ఆశ్రితని ఏకాగ్రంగా పరికిస్తూ ముందుగా చైర్మన్ అడిగాడు. "పోస్టు గ్రాడ్యుయేషన్ అయ్యాక మీకున్న అర్హతని బట్టి మరేదన్నా ఉద్యోగం కోసం ప్రయత్నించక సివిల్ సర్వీసెస్ నే ఎందుకు ఎన్నుకున్నారు?"
మృదువుగా నవ్వింది ఆశ్రిత "నేను పెరిగిన పరిసరాలు, బాల్యంనుంచీ సాంఘికంగా నేను గమనించిన విషయాలు నన్ను ఈ మార్గంలో అడుగుపెట్టటానికి ప్రోత్సహించాయి. ప్రతి ఉద్యోగానికి చివరి లక్ష్యం బ్రతుకుతెరువు అయితే సివిల్ సర్వీసెస్ లో సంపాదించుకోగలిగే ఈ స్థానం బ్రతుకుతెరువుకన్నా మనచుట్టూ వున్న సంఘానికి నిజాయితీగా ఏదో చేయగల అవకాశం కలిగించే సంతృప్తిని అందిస్తుంది.... జాబ్ సేటిస్ ఫేక్షన్ కి, ఛాలెంజింగ్ కెరీర్ కీ ఐ.ఎ.ఎస్ ని మించిన అర్హత లేదన్నది నా అభిప్రాయం"
తన మనసులోని అభిప్రాయాన్ని దృఢంగా, సూటిగా చెప్పగలిగిన ఆశ్రితలో నెర్వస్ నెస్ కనిపించలేదు.... తమ ముందున్న అభ్యర్ధికి రేషనల్ ధింకింగ్, ఏదో చేయాలన్న తపన మాత్రమేగాక చేసి తీరగలనన్న నమ్మకమూ వుంది.
"మీరు సోషియాలజీ పోస్ట్ గ్రాడ్యుయేట్ కాబట్టి సోషల్ డార్వినిజమ్ లో ఇరవయ్యో శతాబ్దపు స్త్రీ పాత్ర గురించి వివరించి చెప్పండి" మరో ప్రశ్న అడిగాడు చైర్మన్.
ప్రశ్న జటిలమైనదే.... అయినా ఆశ్రిత తొణకలేదు. పది సెకండ్లపాటు సాలోచనగా చూసి ఆ తర్వాత చెప్పడం ప్రారంభించింది ధారాళమైన ఇంగ్లీషులో...
"ఈ సంఘంలో భిన్నవర్గానికి చెందిన వ్యక్తులు తమ మనుగడకి మాత్రమే కాక ఉన్నత స్థానాలను ఆక్రమించుకోటానికి, వున్నవాళ్ళుగా చలామణీ కావటానికి సాగించే పోరాటం సోషల్ డార్వినిజానికి ప్రాతిపదిక లాంటిది. బ్రిటీష్ నేచురలిస్ట్ డార్విన్ సిద్దాంతాలను అన్వయించి నిర్వచింపబడుతున్నదీ సోషల్ డార్వినిజమ్...డార్విన్ నమ్మకం ప్రకారం ప్రాణులుగాని, మొక్కలుగానీ పురోభివృద్ది చెందిన మౌలికంగా నేచురల్ సెలెక్షన్ని బట్టి....నేచురల్ సెలక్షన్ అనే థియరీలో పరిసరాలకి ఇమడగల ఆర్గానిజం మాత్రమే ఆ తర్వాత ప్రాణంతో మిగిలింది, తన సంతతిని పెంచుకోగలిగింది.... ఇదే సిద్దాంతం ఈనాడు సంఘంలో కొందరు బలవంతులు కావటానికిగాని, ఆర్ధికంగా కొందరు వెనుకబడి వుండటానికిగానీ కారణమంటూంది సోషల్ డార్వినిజమ్..... చాలామంది సోషల్ సైంటిస్టులు ఈ రోజు అంగీకరించని సత్యమిది.... మౌలికంగా డార్విన్ సిద్ధాంతం ఆమోదయోగ్యమే కాని ఈ రోజు డబ్బున్నవాడి కొడుకే అర్హుడిగా చలామణీ కావటానికీ, సంఘంలో బలమైన వర్గమే ఇంకా బలాన్నిపుంజుకోవడానికి గాని నేచురల్ సెలక్షన్ థియరీ విరుద్దమంటున్నారు".
క్షణంపాటు ఆగింది ఆశ్రిత. ఆమె ఫాలభాగంపై పేరుకున్న స్వేదబిందువులు పాలపుంతలోని నక్షత్రాల్లా మెరుస్తూంటే కర్చీఫ్ తో సుతారంగా అడ్డుకుని తిరిగి చెప్పడం ప్రారంభించింది. "నేను వ్యక్తిగతంగా ఇప్పటి సోషల్ సైంటిస్టుల వాదాన్ని అంగీకరించలేకపోతున్నాను. ఎందుకంటే- ఇప్పటికీ సంఘంలో చెలామణీ కాగలుగుతున్నది అర్హులే అని నమ్ముతున్నాను కాబట్టి డబ్బుతో, పలుకుబడితో కొందరు కొన్ని సాధించి వుండవచ్చు. మేధస్సుతో సంబంధం లేకుండా కొందరు ఉన్నత స్థానాల్ని సొంతం చేసుకొని వుండొచ్చు. కాని అది చాలా స్వల్పం! ఆ స్వల్పాన్ని పరిగణనలోకి తీసుకుని సంఘమంతా అలాగే వుందనుకోవడం దారుణం..."
ఆశ్రిత మాటల్లో అసాధారణమైన ఆశావాదం కనిపించింది బోర్డు మెంబర్సందరికీ ఎరుపు చెక్కిళ్ళపై విరిసిన చెంగల్వల్లా ఆమె మేధసైతం స్నిగ్ధ దరహాస పరిమళాన్ని చిమ్ముతుంటే ఆసక్తిగా వింటున్నారు అంతా.
"ఒకనాడు స్త్రీ ఇంటికీ, వంటకీ పరిమితమైతే, ఈ రోజు సాంఘికంగా, విద్యాపరంగా, స్థాయీపరంగా మగాడితో పోటీపడే దశను చేరుకుంది. పిల్లలకి పాలిచ్చే స్థాయినుంచి పాలించే యంత్రాంగంలోనూ అడుగుపెట్టి బేరియర్స్ ని బ్రేక్ చేయగలుగుతుంది. సాంప్రదాయకవాదులు అంగీకరించలేని మార్పే కావచ్చు...కాని సంఘంలో ఇమడటానికి తనూ స్ట్రగుల్ కాగలుగుతూంది. ఫిట్టెస్ట్ సర్వైవల్ కోసం పోరాడుతూవుంది. ఇదీ ఒక రకంగా సోషల్ డార్వినిజానికి అనుకూలమైన నేచురల్ సెలెక్షన్ ప్రోసెస్సేగా..."
"మీ ఆంద్రప్రదేశ్ లో ప్రతి స్త్రీ ఇలాగే ఆలోచిస్తుందా?" మరో మెంబరు అడిగాడు వెంటనే.
"ఇండియాలో యునిసెఫ్ రిప్రజంటేటివ్ డాక్టర్ ఎమీ వాట్నా బే సర్వే ప్రకారం మన దేశంలో మూడువందల మిలియన్ల నిరక్షరాస్యులుంటే అందులో ఏభైశాతం ఆంద్రప్రదేశ్ లోని అమ్మాయిలే.... ఈ సర్వేలో తేలినది ఫిఫ్త్ గ్రేడ్ కూడా పూర్తిచేయని స్త్రీల గురించి మాత్రమే అని మీరు అంగీకరించాలి. కాని ప్రైమరీ ఎడ్యుకేషన్ లో ఎనభై మూడు శాతం ఎన్ రోల్ మెంట్ జరుగుతూంది... ఇది కేరళ, తమిళనాడు రాష్ట్రాలకన్నా తక్కువ కావచ్చుగాని చదవాలీ అనే ఆలోచన స్త్రీలలోనూ, చదివించాలనే ధ్యాస తల్లిదండ్రులలోనూ వున్నా ఆర్ధికమయిన దుస్థితి వారిని ముందుకు సాగనివ్వడంలేదు. ఈ డ్రాపవుట్స్ ని తగ్గించడానికి యూనిసెఫ్ నిర్విరామముగా కృషిచేస్తూంది. వెంటనే కాకపోయినా క్రమంగా ఆ మార్పు సాధించి తీరుతుంది"