Previous Page Next Page 
రాకోయి అనుకోని అతిథి పేజి 4

   

      ఆమె వాదన లాజికల్ గా అందర్నీ ఆకట్టుకోవడమేగాక సంఘంలో పెరగాల్సిన స్త్రీ పాత్ర విషయంలో ఇన్ స్టింక్ట్ ని సూచిస్తూంది.... అది మాత్రమే గాక ఆమెకివున్న సాంఘిక నిబద్దతని, విషయ పరిజ్ఞానాన్నీ వ్యక్తం చేసింది.
    
    "చాలా తెలివితేటలు, చేవ వుండీ ఐరన్ లేడి అనిపించుకున్న మార్గరేట్ థాచర్ కేవలం స్త్రీ కావడం మూలంగానే తన స్థానాన్ని కోల్పోయింది..." చైర్మన్ అన్నాడు బ్రిటన్ పార్లమెంటుకి సంబంధించిన వాస్తవాన్ని ఎరుకపరుస్తూ.
    
    "అక్కడ ఆమె స్థానాన్ని కోల్పోయింది స్త్రీ కావడంమూలంగానే అంటే నేను అంగీకరించలేను సర్..." మెంబర్సునంతా కలియచూస్తూ వినయంగా అంది "ఆమె ఓటమికి కారణం స్త్రీత్వంకాదు... తన పార్టీ పరంగా ప్రజల్ని రంజింపచేయలేని పోలసీ మేటర్స్... ప్రజల ఆలోచనలలో వచ్చిన మార్పు..." తన వాదనని మరింత బలంగా సమర్ధించుకునే ప్రయత్నంలో అందామె. "ఆమె అడ్మినిస్ట్రేటర్ గా బలహీనురాలయితే ఐరన్ లేదీగా ఆమెకా గుర్తింపు వచ్చేదికాదు! స్త్రీలు బలహీనులు కారని నిరూపించిన ఇందిరాగాంధీగాని, మార్గరేట్ థాచర్ గాని వేర్వేరు కోణాల్లో తమ ఉనికిని ఏ క్షణంలో అయినా కోల్పోయినా వారి చరిత్ర చెరిగిపోనిది! ఇక్కడ స్త్రీలు అంటూ మేన్షన్ చేశారు కాబట్టి మరో నిజం మీకు గుర్తుచేయాలి. నలభై అయిదు సంవత్సరాల వయసున్న లేడీ కేంప్ బెల్ కేవలం అయిదేళ్ళ క్రితం పార్లమెంటులో అడుగుపెట్టి ఈ శతాబ్దంలో కెనడా ప్రధానమంత్రి కాగలిగిన మహిళ అయింది... ఆమె పొజిషన్ తాత్కాలికం కావచ్చుగాని, విమర్శలకు తలవొగ్గని స్థాయిలో ఎనదర్ ఐరన్ లేడీ అన్న కెనేడియన్ మీడియా నమ్మకాన్ని నిజం చేస్తోంది"
    
    గతం వర్తమానాల మధ్య ఆశా నిరాశల మధ్య నీరసంగా పేరుకున్న నిశీధాన్ని రెండుగా చీల్చి శూన్యం ఎంతటి అనంతందాకా విస్తరించినా ఆ మధ్యలో మేధతో నేను ఇమడగలనూ అంటూ నిబ్బరంగా చెప్పగలుగుతున్న ఈ అమ్మాయిలా కాక వేర్వేరు కోణాల్ని దర్శించే కాంతికిరణాలను వెదజల్లే ప్రిజమ్ లా అనిపిస్తూంది.
    
    "ఓ.కె. మిస్ అశ్రితా!" మూడో మెంబరు ఆమెను తదేకంగా చూస్తూ అన్నాడు "హఠాత్తుగా మీరు భారత ప్రధాని అయితే ఏ జాగ్రత్తలు తీసుకుంటారు?"
    
    ఇలా ఎలా సాధ్యం అన్న ఆలోచన గురించి ఆమె పట్టించుకోలేదు. ఆమె కళ్ళముందు కులాల, మతాల, వర్గాల, ప్రాంతీయతా భేదాల పోరాటాలు కదలాడుతుంటే, ఆశ్రితపాతాలు మేధస్సుని అణగదొక్కి, వ్యక్తిగత స్వార్ధాలతో సాగిస్తున్న దమనకాండలు, నిరుద్యోగ సమస్య, కుంటుపడుతున్న ఉత్పాదకశక్తి, పొలిటికల్ లాబీల కక్షలూ కార్పణ్యాలూ మెదులుతుంటే నెమ్మదిగా అంది-
    
    "నేను ప్రధానమంత్రిని అయితే... ముందుగా ఎకనమిక్ జస్టిస్ గురించి ఆలోచిస్తాను. ఉన్నవాడూ అన్న వైవిధ్యమే ఇప్పటి రిజర్వేషన్స్ కీ, రాజకీయ కాలుష్యంతో జరిగే పోరాటాలకీ కారణమని తెల్సి మనిషి పెర్ కేపిటా ఇన్ కమ్ పెంచి పోనర్టీ లైన్ దిగువున వున్న వ్యక్తులకు ఆర్ధికంగా బలాన్ని చేకూర్చుతాను. జాతీయ ఆదాయాన్ని పెంచి నిరుద్యోగ సమస్యను పారద్రోలి ఆకలిమీదున్న వాడ్ని ఆయుధాలుగా వాడుకునే కుహనా రాజకీయ నాయకుల కదలికల్ని నియంత్రిస్తాను... అంతర్జాతీయ స్థాయిలో ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామిక దేశమైన భారతదేశానికి తిరుగులేని గుర్తింపుని కలిగిస్తాను....ఇవన్నీ సాధించటానికి ముందు నేను ఆశ్రయించేది రాజ్యంగ ప్రక్షాళన..."
    
    మెంబర్సంతా విస్ఫారిత నేత్రాలతో చూస్తూంటే, స్వప్నంలోలా చెప్పుకు పోయింది ఆత్మవిశ్వాసంతో "ఆ ప్రక్షాళన మొదలయ్యేది ఎగువ స్థాయినుంచి కాదు- దిగున స్థాయినుంచి....ప్రజలకి కనీస అవసరాలతో పాటు అక్షరాస్యత నా మొదటి టార్గెట్ అవుతుంది. ఆవిధంగా సాధించాక అవగాహన కలసిన ఓటర్సే రాజకీయ నాయకుల్ని ఎన్నుకునేట్టు ఓటింగ్ హక్కుకి కనీస విద్యార్హత అవసరమయ్యేట్టు చేస్తాను. అంతేకాదు.... వేలిముద్రలు వేస్తే చాలు ఎమ్మెల్యేలు, ఎం.పి.లు కావటానికి అర్హులే అనే స్థితినుంచి రాజకీయ అభ్యర్ధులు కనీసం డిగ్రీ వుంటే తప్ప ఎలక్షన్లలో పార్టిసి పేట్ చేయకుండా శాసనాల్ని తీసుకొస్తాను....ఒకవేళ విద్యార్ధులైన ఆ వ్యక్తులు కూడా కరప్టెడ్ గా ఆలోచిస్తే ఏ నియోజకవర్గంనుంచి ఎన్నిక అయ్యారో అ నియోజకవర్గపు ఓటర్లు ఆ వ్యక్తిని అనర్హుడ్ని చేసే పద్దతికి రాజ్యాంగంలో ప్రొవిజన్ని కలిగిస్తాను..."
    
    ఓ వరుసక్రమంలో కేండిడేట్ సమస్యని క్షుణ్ణంగా విశ్లేషించడమే గాక, తనకంటూ ఓ వ్యక్తిత్వం వుందనే ధోరణిలో తనేం చేయాలన్నిది సూటిగా వ్యక్తీకరించగలుగుతుంది. రీజనబుల్ రిస్క్స్ తీసుకోవటానికి తన జడ్జిమెంటుని ఇదమిత్ధంగా తెలియచేయగలుగుతుంది. నిజానికి ఇప్పుడు అడిగింది ప్రొవోకేటివ్ క్వశ్చన్ అయినా చాలా ప్రశాంతంగా జవాబు చెప్పగలిగింది.
    
    చివరగా అడిగాడు చైర్మన్ "ప్రస్తుతం ప్రభుత్వాన్ని ఇబ్బందిపెడుతున్న- లేదూ ప్రభుత్వ విధానాల్ని ప్రతిఘటించి అస్తవ్యస్తతకి కారణమవుతున్న సమస్య లేమిటి? వీటిని ఓ కొలిక్కి తీసుకురావాలీ అంటే మీరు ఇవ్వగలిగే సలహాలేమిటి?"
    
    "సర్..." సమస్యల సీరియస్ నెస్ ని, మేగ్నిట్యూడ్ ని గుర్తుచేసుకుంటూ అంది మన దేశాన్ని ప్రస్తుతం పీడిస్తున్న సమస్యలు- కుల మత పోరాటాలు, ప్రాంతీయ విభేదాలు, భాషా సమస్యలు, లంచగొండితనం, నిరుద్యోగ సమస్య వీటన్నిటి ఆధారాలతో తమ పదవుల్ని కాపాడుకోటానికి రాజకీయ నాయకులు చేస్తున్న ప్రయత్నాలు.... యస్.... పదవిలో వున్న వ్యక్తులు పరిష్కారంకన్నా స్వలాభాపేక్షతో వీటన్నిటినీ ఉపయోగించుకుంటూ, తమని తాము కాపాడుకుంటున్నారని నేను కచ్చితంగా చెప్పగలను. రాజ్యాంగం అందించిన వ్యక్తి ప్రాథమిక హక్కుల్ని ఏ దేవుడ్నయినా కొలిచే అవకాశాల్ని ఏదన్నా మాట్లాడగలిగే వాక్ స్వాతంత్ర్యాన్ని ఆయుధాలుగా ఉపయోగించుకునే ప్రజల హక్కుల్ని నాయకులు అందంగా వాడుకుంటూ దేశ శాంతిభద్రతలను విచ్చిన్నం చేస్తున్నారు..."
    
    ఇప్పుడు పరిష్కారమార్గాన్ని సూచిస్తూ చెప్పింది అనలిటికల్ గా. "ప్రభుత్వం ఇంటెలిజెన్స్ వింగ్స్ ద్వారా అలాంటి నాయకుల కదలికల్ని కనిపెట్టాలి... ఆ శక్తులు రూలింగ్ పార్టీలో వున్నా ప్రతిపక్షాల్లో వున్నా ప్రజలముందు దోషులుగా నిలబెట్టి వారికి సరైన శిక్షలు విధించాలి. అలాంటి నాయకుల అండను కోరుకునే పరిస్థితి ప్రజలకి రాకుండా నిరక్షరాస్యత, నిరుద్యోగం, పెరుగుతున్న జనాభా, ఆహార సమస్యల్ని వెంటనే పరిష్కరించటానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి....జాతీయ ఆదాయం పెరిగేట్టు చూడాలి..."
    
    "వెల్ మిస్ ఆశ్రితా...! నవ్వుతూ అన్నాడు ఓ మెంబరు "మిమ్మల్ని చూస్తుంటే ఓ మధ్యతరగతి అమ్మాయిలా వున్నారు. మీలో ఇంత పెద్ద అవగాహన ఏర్పడడానికి కారణం మీకున్న పుస్తక పరిజ్ఞానమా? లేక మీరు పెరిగిన వాతావరణమా?"
    
    "పుస్తక పరిజ్ఞానం కొంతైనా పెరిగిన వాతావరణం మరికొంత... నన్ను బాల్యంనుంచీ ప్రేరేపించి నన్ను ఇప్పటికీ ఓ విద్యార్దినిగా నేర్చుకోటానికి దోహదం చేసింది మా తండ్రిగారు.... ఉత్తమ ఉపాధ్యాయుడిగా మూడుసార్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ బహుమతిని అందుకున్న మా నాన్నగారు రాజారాం..."
    
    అక్కడ హఠాత్తుగా నిశ్శబ్దం ఆవరించింది.

 Previous Page Next Page