Previous Page Next Page 
వెన్నెల వాకిళ్ళు పేజి 20

 

    రామశేషు మాత్రం పనులన్నీ తమ్ముళ్ళ చేయడంవల్ల నింపాదిగా కూర్చుని చుట్ట కాల్చుకుంటున్నారు.

    దాదాపుగా ఊరంతా లగ్నపత్రికలు పంచారు.

 

    మొత్తం రెండువేల గడపలు వుంటాయి ఆ ఉళ్ళో.

    అంతా రామశేషు కూతురి పెళ్ళి ముచ్చట్లు చెప్పుకుంటున్నారు. ఆ ఊరిలో సర్వోత్తమరావంటే అంత ప్రేరుప్రఖ్యాతులున్నాయి.

    అయన కాబోయే ప్రెసిడెంటుగారని కరణం అప్పటికే ప్రచారాన్ని ముమ్మరం చేశాడు.

    ప్రస్తుత ప్రెసిడెంటు గోపాలరావు తర్వాత ఆ ఉళ్ళో పెద్ద ఆసాములు రామశేషు, సర్వోత్తమరావులే కావటంవల్ల ఆ పెళ్ళికి అంతటి ప్రాధాన్యత సంతరించుకుంది.

    "ప్రెసిడెంటుకు కూడా సర్వోత్తమరావు దంపతులే స్వయంగా ఇంటికి వెళ్లి లగ్నపత్రిక ఇచ్చి వచ్చారు.

    గిరిజను పరిరోజులక్రితం నుంచే ప్రతిరోజూ ఒక్కొక్కరుచొప్పున నలుగుపెట్టి పంపుతున్నారు.

    "అరేయ్ వెంకటేశం.....సర్విబాదులు ఇంకా రాలేదే? నువ్వెళ్ళి ట్రాక్టరులో వేసుకునిరా. అలాగే తాటాకు సరిపోతుందో లేదో ఒకసారి మేస్త్రిని అడుగు" అంటూ కేకశాడు సర్వోత్తమరావు.

    "అయ్యా, అలాగేనండి. ఇదిగో ఇప్పుడే వెళుతున్నా" అంటూ వెంకటేశం భుజంపైన తుండుగుడ్డ తీసి తలకు చుట్టుకుని పరుగుతిశాడు.

    కొన్ని క్షణాల్లోనే సర్విబాదులు ట్రాక్టరులో వచ్చింది. దాని చుట్టూ పిల్లలు కేరింతలు కొడుతూ మూగారు.

    "వాటిని లెక్కపెట్టి లోపలికి తీసుకురండి" చెప్పాడు సర్వోత్తమరావు.

    పనివాళ్ళు దాదాపు పదిమంది వాటిని ట్రాక్టరులో నుంచి కిందకుదించి లోపలికి తెచ్చిపెడుతున్నారు.

    "అరేయ్ తమ్ముడూ! ఈరోజు అయిపోతుందా పందిరి వేయటం?" అడిగాడు రామశేషు.

    "అయిపోతుందన్నయ్యా! రాత్రి ఎంత పోద్దుపోయినాసరే తెల్లారే సరికి పందిరి పూర్తిచేయాలని చెప్పాను మేస్త్రికి" అన్నాడు సర్వోత్తమరావు.

    "మంచిది" అన్నాడు రామశేషు క్లుప్తంగా.

    "అరేయ్ వెంకటేశం. నువ్వు పలుగు తీసుకుని ఇదిగో గుర్తుపెట్టిన చోట గోతులు తీయి. తర్వాత వాళ్ళు బాదులు నాటుతారు" అన్నాడు సర్వోత్తమరావు.

    "అలాగేనండి" అంటూ వాడు పలుగు తీసుకుని గోతులు త్రవ్వటం ప్రారంభించాడు.

    "కొబ్బరితాడు సరిపోతుందా?' అడిగాడు మెస్త్రిని సోమసుందరం.

    "సరిపోతుంది చాలు. కాకపోతే.....పురికొస మరో రెండు కట్టలు తెప్పించండి" అన్నాడు మేస్త్రి.

    "అన్నట్లు....అరేయ్ వెంకటేశం గ్యాస్ లైట్లు తెమ్మన్నాను తెచ్చావా?' అడిగాడు సోమసుందరం.

    'అయ్యా.....తెచ్చానండి. లోపల పెట్టాను" అన్నాడు.

    "ఎన్ని తెచ్చావు?" అడిగాడు సోమసుందరం.

    "నాలుగు తెచ్చానండి" అన్నాడు వాడు.

    "అన్నయ్యా! గ్యాస్ లైట్లు నాలుగు సరిపోతాయా.....?" అడిగాడు సోమసుందరం.

    "మరో రెండు తెప్పించకపోయావా?" అన్నాడు సర్వోత్తమరావు.

    "అలాగే తెప్పిస్తాలే. అరేయ్ వెంకటేశం! నువ్వు ఆ పని పూర్తి చేసి మరో రెండు గ్యాస్ లైట్లు తీసుకురా" అన్నాడు సోమసుందరం.

    "చిత్తం అలాగేనండి" అన్నాడు వెంకటేశం.

    "మేస్త్రి! ఇక మీ పని మొదలేయండి. ఇప్పుడు పదకొండు అవుతోంది. రాత్రి పదింటికల్లా పందిరి పూర్తిచేయాలి...." అన్నాడు సోమసుందరం.

    "పదింటివరకు ఎందుకండి. ఏడింటికి పూర్తయిపోతుంది" అన్నాడు మేస్త్రి బీడి వెలిగిమ్చుకుంటు.

    "పూర్తయితే మరీ మంచిది" అన్నాడు సోమసుందరం.

    "ఇంకా నీకేం కావాలో ఇప్పుడే చెప్పు. నేను పట్నం పోతున్నాను. వచ్చేటప్పుడు తెస్తాను" అన్నాడు సోమసుందరం.

    "ఇంకేమున్నాయండి...అన్నీ వచ్చేసాయి. ఆ....మర్చిపోయానండి పందిరికింద కట్టడానికి తేల్లపంచే కావాలిగదండి...." అన్నాడు మేస్త్రి తల గోక్కుంటూ.

    "అందుకే చెప్పమంది. ఎన్ని మీటర్లు కావాలో చెప్పు కొలిసి. నేను ఇప్పుడే వస్తా" అంటూ లోపలికి వెళ్ళాడు సోమసుందరం.

                                        *    *    *    *

    ఏమండీ! వంటయిపోవచ్చింది భోంచేసి వెళ్ళండి. అసలే ఎండాకాలం" అంది శివపార్వతి.

    "భోజనమా, ఇప్పుడేం భోజనమే ఇప్పుడోద్దు" అన్నాడు.

    "అదేంటి సుందరం! రెండు ముద్దలు తినివేళ్ళు. అమ్మాయ్ నువ్వు పెట్టు అతను అలానే అంటాడు" అంది కస్తూరి.

    "ఇప్పుడొద్దు వదినా! ఓ గంటలో వచ్చేస్తాగా" అన్నాడు సోమసుందరం.

    "పట్నం పొతే గంటలో రావటం ఎలా కుదురుతుంది. రెండు ముద్దలు తిని వెళ్ళు, కాకపోతే వచ్చిన తరువాత మళ్ళి తినుదువుగానీ.....అంది కస్తూరి.

    "సరేలే! ఇంకా ఎంత టైం పడుతుంది?" అడిగాడు శివపార్వతిని.

    "ఎంత పదినిమిషాలు, మీరు కాళ్ళు చేతులు కడుక్కుని రండి ఈలోపు నేను వడ్డిస్తాను" అంది పార్వతి.

                                       *    *    *    *

 Previous Page Next Page