Previous Page Next Page 
వెన్నెల వాకిళ్ళు పేజి 19

 

    ఆ మాటలకు అందరూ ఘోల్లున నవ్వారు.

    "ఏంటి అంతగా నవ్వుకుంటున్నారు? ఇక కిందకు రారా ఇక్కడేఉండిపోటారా ఏంటి ఈరాత్రికి?" అన్నాడు అప్పుడే పై కొచ్చిన సోమసుందరం.

    "బాబాయ్ నువ్వా? పాపం పిన్ని మీద దిగులేసుకుని పైకొచ్చావా?" అంది జయంతి.

    "దిగులా ఎందుకు? ప్రాణానికి హాయిగా వుంది....కిందకు దిగిందంటే ఒకటే నస పెట్టి చంపుతుంది" అన్నాడు నవ్వుతూ.

    "అలాగా? అయితే మీరేళ్ళండి, నేను ఇక్కడే ఈ పిల్లల్తో పాటు పడుకుంటాను" అంది బింకంగా.

    "అలాగే, పిల్లలూ! మీరందరూ చకచక కిందకు వెళ్ళిపొండి" అన్నాడు సీరియస్ గా.

    "అబ్బ! ఏం తెలివో" అంది శివపార్వతి నవ్వుతూ.

    దాక్షాయణి ఆ మాటలకు పెద్దగా నవ్వింది.

    "అబ్బ! భలేవుందే పైన వెన్నెల. వదినా ఏమి అనుకోకు, ప్లీజ్.....చిన్న కోరిక" అన్నాడు సోమసుందరం చిన్నపిల్లాడిలా.

    "ఏంటి సుందరం?" అంది దాక్షాయణి ఆశ్చర్యంగా.

    "ఏంలేదు వదినా! ఇంత చక్కటి వెన్నెల, చల్లని గాలి, దూరంగా కాలువ, అందులో పడవ," అంటూ ఇంకా ఏదో చెప్పబోతుంటే మధ్యలో కల్పించుకుని జయంతి అంది.

    "ఏంటి బాబాయ్! కవిత్వం ఉట్టిపడుతుందే!" అంది జయంతి.

    "అవున్రా జయంతి! అందుకే వదినా ప్లీజ్!" అన్నాడు.

    "అసలు విషయం చెప్పకుండా వదినా ప్లీజ్....వదినా ప్లీజ్ అంటావే చెప్పు" అంది నవ్వుతూ.

    "ఏంలేదు వదినా! ఓ సిగిరెట్ కాల్చుకుంటాను" అన్నాడు బ్రతిమాలుతూ.

    "నేను అనుకున్నాను, వద్దు నోరుమూసుకుని కూర్చోండి" అంది శివపార్వతి.

    "పాపం! కల్చుకోనియిలే పార్వతి అంతగా అడుగుతుంటే వద్దనటం పాపం" అంది దాక్షాయణి.

    "థాంక్స్ వదినా" అంటూ జేబులో నుంచి సిగేరేట్ తీసి వెలిగించాడు.

    "ఎందుకు బాబాయ్ సిగిరెట్ కాలుస్తారు?" అడిగింది జయంతి.

    "అది నీకు తెలియదులేరా!" అన్నాడు సోమసుందరం.

    "అన్నట్లు బాబాయ్, నాన్నగారూ, నువ్వు ఊరంతా రోడ్లు వేస్తారు, బిల్డింగ్ లు కడతారు కదా! మనింటికి మెట్లు ఎందుకు కట్టలేదు? రేపు గిరిజక్క పెళ్ళిలోపు డాబాపైకి మీరు మెట్లు కట్టించాలి" అంది జయంతి.

    "మంచి ప్రశ్న, ఇంతవరకు మాకూ ఆ ఆలోచన రాలేదురా...అదేంతపని ....వెంటనే కట్టించేద్దాం" అన్నాడు సోమసుందరం ఆనందంగా సిగరెట్ కాలుస్తూ.

    "హయ్ గిరిజక్కా! ఇక మీకు నిచ్చెనతో పనిలేదు" అని దూరంగా జరిగింది మళ్ళి.

    "సోమసుందరం ! పెళ్ళిపనులు ఎంతవరకు వచ్చాయి?' అడిగింది దాక్షాయణి.

    "పెండ్లి పత్రికలు అచ్చుకు ఇచ్చాను వదినా! అవి రావటంతోనే అందరికి పంచటం. ఇక బియ్యం, పప్పులు వగైరాలన్నీ ఓరోజు సురేంద్రని పట్నం తీసుకెళ్ళి బండిమీద వేసుకురావాలి. రెండ్రోజుల్లో పందిళ్ళు వేయిస్తున్నాం. దాదాపు అన్ని పనులు అయిపోయినట్లే" అన్నాడు.

    "పెళ్ళికి పదిరోజులు ముందు చినకారు పెట్టండి. మన దగ్గర బండువులందర్నీ కారులో తీసుకురావచ్చు" అంది దాక్షాయణి.

    "పెడుతున్నాం వదినా! ఆ విషయం వేరే చెప్పాలా? సురేంద్రగాడి పెళ్ళి వారం రోజులు జరిపిస్తున్నాం" అన్నాడు సోమసుందరం సిగరెట్ ఆఖరి దమ్ము గట్టిగా పిల్చి విసిరిపారేస్తూ.

    అంతలో కిందనుంచి "జయంతి! ఇక కిందకురండి చాలా పొద్దుపోయింది' అంటూ కస్తూరి కేకేవేసింది.

    "అమ్మో....అమ్మ పిలుస్తుంది. పిన్ని, ఇక కిందకు పోదామా?" అంది జయంతి.

    "పదండి పోదాం టైం అప్పుడే పదకొండు అయింది" అన్నాడు వాచి చూసుకుంటూ సోమసుందరం.

    "అమ్మో....పదకొండా?!" అంది దాక్షాయణి.

    "కబుర్లు చెప్పుకుంటుంటే అసలు టైమే తెలియలేదు. పదండి పోదాం, సురేంద్రా! ముందు నువ్వు క్రిందకు దిగి నిచ్చెన జాగ్రత్తగా పట్టుకో నాయనా" అంది శివపార్వతి.

    "అలాగే అత్తయ్యా.....!" అంటూ సురేంద్ర గబగబా కిందకు దిగాడు.

    "బాబాయ్! నువ్వుమాత్రం రేపే మెట్లు కట్టడం ప్రారంభించు..." అంది జయంతి.

    "కట్టిస్తారా. అసలు ఇన్నాళ్ళు కట్టించకపోవడమే పొరపాటు. రేపు పెళ్ళివాళ్ళు వచ్చినప్పుడు అందరూ ఎంచక్కా డాబా పైనే పడుకోవచ్చు" అన్నాడు సోమసుందరం.

    అందరూ ఒక్కొక్కరే కిందకు దిగాసాగారు.

                                                 10
    సమయం ఉదయం పదిగంటలు.

    అప్పుడే సూరీడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు.

    రామశేషు గొడ్లసావిట్లో వాలుకుర్చిలో కూర్చుని చుట్ట తాగుతున్నాడు.

    సర్వోత్తమరావు అందరికి పనులు పురమాయిస్తున్నాడు.

    ఇంటిముందు ఆవరణలో పిల్లలంతా పెద్దగా కేకలేస్తూ ఆడుకుంటున్నారు.

    ఆడవాళ్ళంతా వంటపనిలో నిమగ్నమై వున్నారు.

    గిరిజ పెళ్ళి ఇంకా పదిరోజులు మాత్రమే వుంది.

    దాదాపు పెళ్ళి పనులన్నీ పూర్తయ్యాయి.

    లగ్నపత్రికలు కూడా అందరికి పంచారు.

    బంధువులు ఒక్కొక్కరే చేరుకుంటున్నారు.

 Previous Page Next Page