Previous Page Next Page 
వెన్నెల వాకిళ్ళు పేజి 21

 

    "ఏం కరణం ! సర్వోత్తమరావు వాళ్ళ అన్నకూతురి పెళ్ళి ఆర్భాటంగా చేస్తున్నట్లున్నాడే?" అడిగాడు ప్రెసిడెంటు గోపాలరావు.

    "అయ్యా చిత్తం చేస్తున్నాడండి" అన్నాడు కరణం.

    "మరి నువ్వేం చేస్తున్నావ్? గుంజలు మోస్తున్నవా?" అన్నాడు సీరియస్ గా.

    "అయ్యా చిత్తం" అన్నాడు నీళ్ళు నములుతూ.

    "చిత్తం అంటావే....నిజంగానే గుంజలు మోస్తున్నవా?' అన్నాడు చుట్ట తీసి వెలిగించుకుంటు.

    "కాదండి....మాటలు మోస్తున్నాను" అన్నాడు నక్కలాగా నవ్వుతూ.

    "ఊ....చెప్పు ఏం మోసుకొచ్చావ్?" అన్నాడు గంభీరంగా గోపాలరావు.

    "దాదాపు ఊరంతా లగ్నపత్రికలు పంచారండి....మన అమ్మాయి గారి పెళ్ళికంటే ఘనంగా జరిపించాలని అన్నదమ్ములు అనుకుంటున్నారండి" అన్నాడు భయంగా ప్రెసిడెంటును చూస్తూ.

    "ఛత్ వెధవముండాకొడకా! నేను చెప్పిందేమిటి, నువ్వు చేసేదేమిటి?" అన్నాడు మండిపడుతూ.

    "అయ్యా! తమరు చెప్పినట్లుగానే సర్వోత్తమరావుని ఎన్నికల్లో నిలబడమని రోజు పోరు పెడుతూనే వున్నానండి. ఇప్పటికి తలకెక్కినట్లుంది. అమ్మాయి పెళ్ళయిన తరువాత చూద్దాంలే బావా అన్నాడండి."

    "ఆ అద్గది ముచ్చట అంటే.....వాడు ఎన్నికల్లో నిలబడి డబ్బు అంతా ఖర్చు జేసుకుని వోదిపోవాలి. అమ్మాయి పెళ్ళిచేసి, మళ్ళి ఎన్నికల కోసం ఖర్చు చేస్తే, వాడు సంపాదించింది సగం ఖర్చయిపోయినట్లే ముందు వాడి చేత పోటీ చేయించే పూచి నీది, వాడిని ఓడించే పూచి నాది" అన్నాడు ప్రెసిడెంటు.

    "అయ్యా చిత్తం" అంటూ చుట్టపీక కేసే చూస్తూ నిలబడ్డాడు కరణం.

    "వెధవ చుట్టపిక ఏం ఖర్మ కరణం. సర్వోత్తమరావుని ముగ్గులోకి దింపు, నీకు ఏం బహుమానం యిస్తానో చూడు" అంటూ జేబులోనుంచి చుట్టపీక తీసి విసిరాడు ప్రెసిడెంటు.

    దానిని లాఘవంగా పట్టుకుని, అపురూపంగా నోట్లో పెట్టుకుని వెలిగించుకున్నాడు కరణం.

    "మీకెందుకు నిశ్చింతగా వుండండి. ఈ ఉళ్ళో మీకు అన్ని విధాల గట్టి పోటీ యిస్తున్న సర్వోత్తమరావుని సర్వనాశనం చేయందే ఈ కరణం నిద్రపోడు. నన్ను నమ్మండి బాబూ...." అంటూ రెండు చేతులతో దణ్ణం పెట్టాడు కరణం.

    "నమ్మాను గనుకనే ఇంతటి భాద్యతను నీకు అప్పగించాను, తేడా వచ్చిందో......అని ఆపాడు.

    "అయ్యా! తమరి సంగతి తెలియంది కాదు. అడ్డు వస్తున్నాడని సొంత తమ్ముడ్నే చంపించారు...." అని యింకా ఏదో అనబోతుంటే.

    "కరణం ! చరిత్రలోకి వెళ్ళకు. నువ్వు చరిత్రలో కలిసిపోతావ్" అన్నాడు తీవ్రంగా.

    "అయ్యో...అయ్యో....నేను ఎందుకు వెళ్తానండి! బుద్ది గడ్డితిని అలా మాట్లాడాను. ఇక మాట్లాడను బుద్దోచ్చింది. బుద్దోచ్చింది" అంటూ రెండు చెంపలు గట్టిగా వాయించుకున్నాడు.

    "నువ్వు నా మనిషివని ఏమాత్రం అనుమానం రాకూడదు. తెలిసిందా? ఏదైనా అత్యవసరమైన పనుంటేతప్ప నా దగ్గరికి రాకు, మళ్ళి వాళ్ళకు అనుమానం వస్తుంది" అన్నాడు గోపాలరావు.

    "అయ్యా చిత్తం! ప్రస్తుతం అత్యవసరమైన పనివుండే వచ్చానండి. ఏంలేదు మా రెండో అమ్మాయి పెద్దమనిషి అయింది....ఏదో మీ తహతకు తగినట్లు" అని యింకా ఏదో చెప్పబోతుంటే.

    "నోర్ముయ్! నీ ముఖానికి తాహతుకూడానా" అంటూ జేబులో నుంచి కొన్ని నోట్లు తీసి ఇవిగో ప్రస్తుతానికి యివి వుంచు. ఇక నువ్వు వెళ్ళు, చెప్పింది గుర్తుందికదా...తేడా వస్తే చరిత్రలో కలిసిపోతావ్ జాగ్రత్త" అన్నాడు గోపాలరావు

    "అయ్యో మిరిన్నిసార్లు చెప్పాలా! వస్తానండి మళ్ళి కలుస్తాను" అంటూ వెళ్ళిపోయాడు కరణం.
    
                                               *    *    *    *

    "అరేయ్ వెంకటేశం! ఆ గ్యాస్ లైట్లు వెలిగించు" కేకేశాడు సర్వోత్తమరావు.

    "అయ్యా చిత్తం" అంటూ వెంకటేశం గ్యాస్ లైట్లు తీసుకుని వెలిగించడం ప్రారంభించాడు.

    "జాగ్రత్త! అసలే గాలి బాగా విస్తుంది" అన్నాడు సర్వోత్తమరావు.

    పందిరి దాదాపు పూర్తయిపోయింది. ఆకులు సగం కప్పేశారు.

    "మేస్త్రి నిజంగానే పనిమంతుడురా అన్న మాటప్రకారమే ఏడు గంటలకు పూర్తిచేసేటట్లే వున్నాడు " అన్నాడు సర్వోత్తమరావు.

    "అవునన్నయ్యా! నాకూ ఆశ్చర్యంగానే వుంది" అన్నాడు సోమసుందరం.

    వెంకటేశం లైట్లన్నీ వెలిగించాడు.

    "ఒకలైటు తీసుకెళ్ళి పంచలో పెట్టు, జాగ్రత్త, గ్యాస్ అయిపోవటంతోనే మళ్ళి గ్యాస్ కొట్టటం నీ భాద్యతే. నీకు యిక వేరే పని లేదు. ఒకవేళ వేరే పనిలో ఉన్నా, గ్యాస్ లైట్లన్నీ ఓ కంట కనిపెట్టే భాద్యత నీదే" అన్నాడు సోమసుందరం సీరియస్ గా.

    "అయ్యా అలాగేనండి! నా కంటికి రెప్పలాగా చూసుకుంటానండి" అన్నాడు నవ్వుతూ.

    "భేష్! ఇదిగో ఇదుంచు" అని పదిరూపాయల నోటు అందించాడు సోమసుందరం.

    దాన్ని అపురూపంగా అందుకుని జేబులో పెట్టుకున్నాడు.

    "మేస్త్రి! ఇంకా ఆకు కప్పటం ఎంతసేపట్లో అవుతుంది" అడిగాడు సోమసుందరం.

    "ఎంతండి బాబూ! అరగంటలో అయిపోతుంది. తరువాత పంచె కడతాం సరేనా?" అన్నాడు.

    "అలాగలాగే తొందరలేదు, నిదానంగా శుభ్రంగా చేయి పని" అన్నాడు సోమసుందరం.

 Previous Page Next Page