ఇప్పటికి ఓ వందైనా పెళ్ళిచూపులు జరిగి వుంటాయి. కానీ, ఒక్కటి నిశ్చయం కాలేదు. వీర్రాజుకి నచ్చక కాదు- కిన్నెర ఇష్టపడక.
ఆమెకున్న కచ్చితమైన అభిప్రాయాలేమిటో వీర్రాజుకు తెలిదు. తెలిసింది ఒక్కటే. అతడికి ప్రాణమైన కూతురు కోరినవాడ్ని కట్టబెట్టడం.
"ఇంకో ముప్పై సెకండ్లు....." మంగ రిస్ట్ వాచీ చూసుకుంది.
ఒళ్ళు మండిపోయింది కన్నారావుకు, అరనిముషం అంది నిముషం క్రితం. ఇప్పుడు ముప్పై సెకండ్లు అంటుంది. అసలు అర నిముషానికి ముప్పై సెకెండ్లు అని మేధామేటిక్స్ పోస్టు గ్రాడ్యుయేట్ గా కేకపెట్టి చెప్పాలనుకున్నాడు కాని, ఎందుకో మంగని చూసినా భయమేసింది.
పనిమనుషులు కూడా రిస్టు వాచీలు పెట్టుకుంటారని తెలిసింది ఈ లోగిలిలోనే కాబట్టి, ఆమెను గదమాయించడము నేరామేమో అన్నట్టు-- ఇంటి పరిసరాలు చూసుకుంటూ కూర్చున్నాడు చిన్నగా కంపిస్తూ.
అధునాతనంగా లేదు కాని, పూర్వం చక్రవర్తుల కోటలాగే ఉంది. విశాలమైన హల్లో అమ్మాయిగారు నడవటానికేమో ఓ ఎర్ర తివాచీ గోడ మీద ఓ ముసలాయన తైలవర్ణ చిత్రం. రెండు పక్కలకూ గురిపెట్టిన బాణాల్లాంటి ఆ ముసలాయన మీసాలు. ఇంచుమించు అదే టైపు మీసాల్ని యింకా స్పృశిస్తున్న ఆరడుగుల వీర్రాజుగారి రూపం. ఏభై దాటినా పూర్వాశ్రమంలో పులులతో కుస్తీలు పట్టిన కసరత్తు శరిరంలా ఆ గాంభీర్యం.
ఎందుకు 'పెళ్ళిచూపుల్లా' కాక 'పులి చూపుల్లా' అనిపించి , పారిపోవాలన్నంతవణుకుడు పుట్టుకురాగా "అమ్మా!" అన్నాడు నీళ్ళు నముల్తూ.
ఈ పిలుపు మాత్రం వినేసింది మంగ.
"మళ్ళీ సైలెన్స్!"
ఎంత బ్రిటిషు వాళ్ళతో బాంధవ్యాల్ని పెంచుకుంటే మాత్రం యిక్కడ పనిమనిషి ఇంగ్లీషులో గావుకేక పెట్టడం సమంజసంగా అనిపించడం లేదు.
"అదిగో వస్తున్నారు అమ్మాయిగారు!"
అప్పుడు చూశాడు కన్నారావు.
హటాత్తుగా అక్కడ గాలిగడ్డ కట్టుకుపోయినట్టయింది.
రాయంచలా ఒక్కో మెట్టు దిగుతూ వస్తూంది కిన్నెర.
రెండు పదుల వయసు మించని కిన్నెర నడుస్తున్నట్టు లేదు. చంద్రకాంత శిలానినిర్మితమైన తుణిరం కదులుతున్నట్టుగా వుంది.
ఆమెకి పసిమి ఛాయ కూడా కాదు. గాలి అలల రాపిడికి కందిన ప్రకృతిని సైతం ఉడికించే విచిత్రమైన కాంతి. వెన్నెల నుంచి నేలకు వలస వచ్చిన పాలపుంతలా, రోదసి పుటల నుంచి రాలిన హరివిల్లు కళ్ళలో అసూయను నింపగలిగే విశ్లేషణ చెందని వర్ణంతో మెరిసిపోతుంది.
అది చూపులు కూడా కావు. కలంతో కాక కలల విలువల్ని ఉలులతో చెక్కగలిగే కవుల ఉహలకు మాత్రం అర్ధమయ్యే అవ్యక్త కావ్య రుచులు.
ఆమెకు వట్టి అంగసౌష్టవం కూడా కాదు. చూస్తే నయాగరా. తాకితే
కంచు నగారా.
మగతనపు మర్యదను మరిచి ఉప్పెనలాంటి ఉత్సాహంతో అల్లుకుపోయి కోరిక కత్తుకల్ని అడకత్తెరలో బంధించి నొక్కిపెట్టి ఆడుకోవాలనిపించే అసాధారణమైన సౌందర్యం.
అంత ప్రత్యేకతతో పాటు ఆమెలో అమితమైన అహం కూడా స్పష్టమవుతుంది. ఎంతటి సంస్కారవంతుడినైనా శ్రుంగార కాంక్షతో కోటగోడల దాటించి కిరాయి వేటగాడుగా మార్చగల పొగరు కనిపిస్తుంది.
కిన్నెర కూర్చుంది ఓ సోఫాలో.
ఆడతనాన్ని అహం ఓడిస్తుంటే- "నన్ను చూడాలని వచ్చిన యువకుడు ఇతనేనా?" అంది చెమటతో తడిసిన కన్నారావును కన్నార్పకుండా చూస్తూ.
మధుర సుధా స్వర వీణలా అనిపించింది కంఠం వినగానే. కాని, అంతకుమించి కంగారు కలిగింది కన్నరావులో.
జవాబుగా అమ్మా, నాన్నలు 'అవును' అనకపోవడంతో పళ్ళికిలించాడు కన్నారావు "మరేం" అంటూ.
"మరేం" లోనే మరేదో కనిపించిన కిన్నెర వెంటనే కన్నేర్రగా చూడలేదు "మీరు పోస్టు గ్రాడ్యుయేటా?"
ఇంకా నయం నీది చదువుకున్న మొహంలా లేదని మొహం మీదనే అనలేదు.
"మరేం!" ఈసారి కన్నారావు తల్లి జవాబు చెప్పింది-- "చిన్నతనం నుంచి మావాడు క్లాసులు ఫస్టులో పాసయ్యే వాడమ్మా! ఏదో మా మాట కాదనలేక......"
"అంటే?" టక్కున అడిగింది కిన్నెర.
రొట్రు పడిపోయింది కన్నారావు తల్లి. "అదేనమ్మా! ఇప్పుడిప్పుడే పెళ్ళి యిష్టం లేకపోయినా నీ అదృష్టానికి వాణ్ణి ఒప్పించగలిగాం: అనాలనుకుంది కాని, అలా అంటే కొంప మునిగేట్టుందని అర్ధంచేసుకుని వెంటనే సరిదిద్దుకుంది. "ఇంకా పై చదువులు చదివిగాని పెళ్ళి చేసుకోనన్నాడు నువ్వు పెళ్ళిచూపులకు వెళ్ళేది మహానుభావుడు వీర్రాజు గారి కూతుర్ని చూడటానికిరా అనేసరికి చంకలు గుద్దుకుని సిద్దపడ్డాడు......కదురా కన్నా!"
"మరేం...." సిగ్గుతో మెలి తిరిగిపోయాడు కన్నారావు.
"మీరు వచ్చింది కిన్నేరను చూడటానికా, లేక వీర్రాజు కూతుర్ని చూడటానికా?" అడిగింది కిన్నెరే.
ఈ ప్రశ్నేమిటో ముందు అర్ధం కాలేదు కన్నారావు తల్లికి.
అర్ధమైంది కేవలం వీర్రాజుకి మాత్రమే. వీర్రాజు కూతురుగా కాక తనకంటూ అస్తిత్వం కావాలనుకునే కిన్నెర ఇప్పుడు తన పరువూ తీసేట్టుందని గ్రహించిన వాడై, వెంటనే పొద్దుటే రాసుకున్న సంపెంగ నూనె మీసాల మీది నుంచి చేయి తీసేశాడు. ప్రస్తుతం తన పరువు కాపాడుకోవటమూ తన ప్రధమ కర్తవ్యంగా భావించిన వాడై ఓ నవ్వు నవ్వాడు. "అమ్మాయిని పెంచింది తన కాళ్ళపై తాను నిలబడి ఆలోచించగలిగే కూతురుగా?" అన్నాడు.
కొంచెం విషయం తెలిసినట్టయింది గోపాలరావుకు. ఇక లాభం లేదనుకుని వేగంగా సరిదిద్దాడు. "అంతేనమ్మా.....నేను కూడా మీ నాన్నగారి టైపే కాబట్టి మీ నాన్న కూతుర్ని కాక మాకు కావాల్సిన కిన్నేరని చూడాలనే వచ్చాం."