మావయ్య ఫోన్ చేశాడు. "ఈరోజు క్లాస్ కి వెళ్ళకు. అత్తయ్య నిన్నెవరో బంధువుల ఇంటికి తీసుకెళుతుందిట. శ్రీమంతం పేరంటానికి" అన్నాడు.
కోడల్ని బలవంతంగా గొడ్రాల్ని చేసి ఎవరింటికో వెళ్ళి గాజులు తొడిగించడానికి సిగ్గుండాలి!
"నాకు కారొద్దు నేనే వస్తాను" అన్నాను.
"నీ ఇష్టం!" అన్నాడు మావయ్య.
నాకు కారుని చూస్తే చాలు రెక్కలు చాపుకుంటూ వచ్చే రాబందే జ్ఞాపకం వస్తుంది. అమ్మమ్మ దగ్గరున్నప్పుడు ఎంత బావుండేదనీ! నేనూ మాధవీ మొక్కజొన్న కండెలు కొనుక్కుని వలుచుకుతింటూ దారేపోయేవాళ్ళకి అది పేర్లు పెట్టి వెక్కిరిస్తుంటే నవ్వుకుంటూ....అంతా మమ్మల్నే చూస్తున్నా పట్టించుకోకుండా అది రోడ్లన్నీ, ఇళ్ళ నీ తేడా లేకుండా స్వచ్చంగా పిల్ల కాలవలో చేపల్లా ఎగిరెగిరి గంతులేస్తూ వుండేవాళ్ళం అమ్మమ్మ కాల్చిన కొయ్యి రొట్టెముక్క అంటే దానికి ఎంతో ఇష్టం! పాపిష్టిదాన్ని పిలిచి ఒక్కపూట అన్నం కూడా పెట్టలేకపోతున్నాను. మాధవిని ఎంతగానో చూడాలని వుంది. కానీ నేను వెళితే అన్నీ చెప్పాల్సి వస్తుంది. దాని దగ్గర దాచలేను. దాని చదువుకి ఆటంకం. బాధపడుతుంది. అసలే ఐ.ఏ.ఎస్ కి ప్రిపేర్ అవుతోంది. డిస్టర్బ్ చెయ్యకూడదు.
నా కనీసపు కోర్కె రోడ్డుమీద నడవడం! చిన్నప్పుడు డబ్బులు లేక మైళ్ళకొద్దీ దూరం నడుస్తూ ఎవరైనా కనికరించి లిఫ్ట్ ఇస్తే బావుణ్ణు. లేదా బస్ కి అయినా డబ్బులిస్తే బావున్ను అనుకునేదాన్ని. అదే ఈ రోజున...స్వేచ్చగా నా మానాన నన్ను నడవనిస్తే చాలు అనుకుంటున్నాను., 'ఏ' క్లాసు ఖైదీలాంటి జీవితం కడుపునింపడానికి పచ్చడి మెతుకులు దొరికితే చాలు అనుకున్నప్పుడే సుఖంగా వున్నాను. ఇప్పుడు ఏం కావలిస్తే అది తినచ్చు. ఎవడికి కావాలి తిండి? మనిషి బ్రతకడానికి కావాల్సింది రుచైన భోజనం కాదు. మనసుకి నచ్చే విషయం. జీవితం మీద అనురక్తి లేనప్పుడు బ్రతకడం ఒక బతుకుకాదు!
ఎవరూ నన్ను పట్టించుకోడం లేదు. అనవసరంగా ఈ మావయ్యా, ఆనంద్ ఏదేదో వూహించుకుంటారు, అయినా పద్దెనిమిదేళ్ళ అమ్మాయిని చూసినట్లు ఇప్పుడు నన్ను ఎవరు చూస్తారూ? నా ఆలోచనకి నాకే కోపం వచ్చింది. పాతికేళ్ళ పరువం పెళ్ళయిందని విడిచి పెట్టేస్తుందా? అప్పుడే నా మనసుకి వృద్దాప్యం వచ్చేస్తోందా?
కారు హారన్ అనుకుంటా, పక్కకి జరిగాను. అయినా ఇంకా మోగుతూనే వుంది.
విసుగ్గా వెనక్కి తిరిగి చూశాను.
ప్రదీప్ కావాలనే హారన్ మోగిస్తూ నవ్వుతున్నాడు.
నాకు ఒక్కసారిగా సంతోషం....అంతలోనే కోపం కలిగి తల తిప్పుకున్నాను.
పక్కకి వచ్చి కారాపి డోర్ తీసి పట్టుకున్నాడు.
నేను ఎక్కుతాననే!
ఎక్కి కూర్చున్నాను.
"ఎక్కడికి మేడం? చెప్తే ఈ డ్రైవర్ అక్కడే దించుతాడు" అన్నాడు.
నేనేం మాట్లాడలేదు. మనసులో 'నిన్నంతా ఎవరో ఆ కామినితో బిజీగా వున్నారా? ఫోన్ అయినా చెయ్యలేదు....ఇక్కడ ఓ పిచ్చిది ఎదురు చూస్తుంటుందని వూహించనైనా లేదా? ఎన్నో రోజుల తర్వాత ఏడిచాను తెలుసా?' అనాలని అనుకున్నాను.
"క్షేమమా!" కొంటెగా అడిగాడు.
"ఎలా కనపడుతున్నానూ?" వాడిగా అడిగాను.
"చాలా అందంగా!" ఠక్కున జవాబిచ్చాడు.
అతను ఎదుటివాళ్ళకి షాక్ కొట్టేటట్లు మాట్లాడటం ప్రాక్టీసు చేసుంటాడు.
"మీ చెవులకి రింగులకన్నా జూకాలే బావున్నాయి. నగలు ఆడవాళ్ళని ఎబ్బెట్టుగా చూపిస్తాయి అనుకున్నాను కానీ అందాన్ని ఎక్కువ కూడా చేస్తాయని ఈ రోజే తెలిసింది. పట్టుచీరలో...చీజ్ బర్గర్ లా వున్నారు. అసలే చాలా ఆకలిగా వుంది" అన్నాడు.
అతను ఆపకుండా అలా మాట్లాడుతూనే వుంటే బావుణ్ణు అనిపించింది. సంవత్సరాల తరబడీ ఘనీభవించిన శబ్దం అక్షరాలుగా మారి జలజలా రాలుతుంటే దోసిళ్ళతో అందుకుని త్రాగెయ్యాలనే వెర్రి ఆశ!
"ఏమిటీ మౌనం? మనం లైబ్రరీలో వున్న ఫీలింగ్ కలుగుతోంది-" అన్నాడు.
నాకు ఎన్నో అడగాలనివున్నా, అడగలేక ఏడుపు తన్నుకొచ్చేసింది. రెండు చేతుల్లో ముఖం దాచుకుని వెక్కి వెక్కి ఏడుస్తూనే వున్నాను.
ప్రదీప్ నన్ను ఓదార్చే ప్రయత్నం ఏమీ చెయ్యలేదు.
"దిల్ కెహతా హైతో కెహెనో దో....ముజె తుమ్ సె మొహబ్బత్ హోగయా హై....ముజె....ఫల్ కోంకే ఛావ్ మే రహేనేదో..." అని కూల్ గా పడుతూ డ్రైవ్ చేస్తున్నాడు.
నాకు ఉక్రోషం వచ్చి "మీరు నా గురించి ఏమనుకుంటున్నారసలు?" అన్నాను.
"ఏం అనుకోమంటారూ?" సీరియస్ గా అడిగాడు. నాకు నోటమాట రాలేదు.
"లిఫ్ట్ ఇస్తే ఏడుస్తోంది. ఇష్టంలేదేమో అనుకోమంటారా? నేను నిన్నంతా కనిపించలేదని ఇష్టం భరించలేక ఏడుస్తోంది అనుకోమంటారా? ఏమనుకోడానికి మనకసలు పరిచయమే మొన్నగా!" అన్నాడు.
అతనన్నది నిజమే! నాకెంతో సిగ్గేసి కళ్ళు తుడుచుకుని "నిన్న ఫోన్ చేస్తానన్నారు చెయ్యలేదు. సెంటర్ కి వస్తానని రాలేదు....ఎందుకూ?"
"అందుకని ఏడ్చారా?" అడిగాడు.
"ఊ!"
"అయితే మరి మీరెందుకు చెయ్యలేదూ? సెల్ నెంబర్ కూడా కార్డ్ లో వుందిగా?"
ఏం చెప్పాలో తోచలేదు.
"మగవాళ్ళే ముందు చెయ్యాలి. ఆడవాళ్ళు తమంతట తాము బైట పడిపోకూడదు అనుకున్నారా? మీ అవసరానికీ మా అవసరానికి కూడా మేమే ఎందుకు చెయ్యాలండీ? మళ్ళీ మాట్లాడ్తే సమానత్వం....సమానత్వం అని స్లోగన్స్ యిస్తారు. మాటల్లో గన్స్ పేలుస్తారు. ఔనా?" అన్నాడు.
చాలా సూటిగా అడిగాడు. నిజమే! అతని ఫోన్ కోసం అతనికంటే నేనే ఎక్కువ ఆతృత పడ్డాను. అలాంటిది కాస్త చొరవచేసి ఫోన్ చెయ్యలేకపోయాను. స్త్రీని కదా నేను చెయ్యడం ఏమిటీ.....అతనే నా వెంట పడాలనే ఈగో ఏ మూలనో వున్నట్లుంది.
ఎక్కడో కొలనులో కలవల్లా.....వనంలో దవనంలా శరత్ కలం జాలువార్చిన పాత్రలా....కృష్ణశాస్త్రిని పరవసింప చేసిన ఊర్వశిలా...వెలుగు నీడలా నడుమ ఆడే ఎంకిలా.....భావుకత్వపు పరదాలు దాటి వివశత్వపు శిఖరాలు చేరడానికి ఆరాటపడే ఒక చరణానినై.....పల్లవికోసం అతనివైపు చూశాను.
అతను నన్ను ఎప్పుడు దగ్గరగా తీసుకున్నాడో నాకు తెలియనే లేదు. అంతగా అతని ఊహల్లో మునిగిపోయాను.
నా ముఖాన్ని పైకెత్తి పెదవులని అందుకోబోతుండగా "ఒద్దు" అంటూ దూరంగా జరిగాను.