అతను వదిలేశాడు.
నేనేం చేశానూ? అంతవరకూ కావాలనుకున్న దాన్ని చేయి జార్చేసుకున్నాను.
"సారీ!" అన్నాడు.
నాకు తెలుసు. ఇంకా అతను ట్రై చెయ్యడు. నేను అతన్ని ఇష్టపడుతున్నానన్న విషయం అతని చెయ్యి నా భుజం మీద బిగుసుకున్న మరుక్షణమే అతనికి తెలుసు! ఇష్టంలేని దానినయితే అప్పుడే వదిలించుకోవాలిగా? ఇంతసేపు ఎందుకు ఆగడం? ఇది కూడా స్త్రీ అభిజాత్యానికి సంబంధించిన అంశమే అనుకుని వుంటాడు.
ఆ మౌనాన్ని విరగ్గొట్టటానికి "నాకు పెళ్ళయింది" అన్నాను.
"తెలుసు" సీరియస్ గా అన్నాడు.
"మరి మీరూ..."
అతను నావైపు చాలా మామూలుగా ఏ భావం లేకుండా ఒక గౌతమ బుద్దుడూ....కేలండర్ లో గాంధీమహాత్ముడి టైప్ లో చూస్తూ "ఒక పరపురుషుడి ఫోన్ కోసం రాత్రల్లా ఎదురుచూడడానికీ, అతను కనిపించకపోతే ఏడవడానికి అడ్డంరాని మీ పెళ్ళి, ముద్దుకి అడ్డయిపోయిందా?" అన్నాడు.
చెంపదెబ్బ కొట్టినట్లు అనిపించింది. అతను ఇన్ డైరెక్ట్ గా మానసిక వ్యభిచారం శారీరకమైన దానికన్నా హీనం అని చెబుతున్నాడు. నాకు రాత్రి వచ్చిన కల జ్ఞాపకం వచ్చింది. అతనికీ నాకూ మధ్య ప్రాపంచికమైన ఏ అడ్డూ లేకుండా ఒంటరిగా తీరంలో ఇద్దరమే....అప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడెందుకు కలిగిందీ?
"నాకు చాలామంది గర్ల్ ఫ్రెండ్స్ వున్నారు" అతను చెపుతున్నాడు. "నేను ఎవరినీ ఈ విషయంలో బలవంతం చెయ్యలేదు. వాళ్ళకి ఇష్టమైతేనే! నాకు పెళ్ళి కాకపోయినా బ్రహ్మచారిని కాదు! ఆడవాళ్ళు చాలా చిత్రంగా ప్రవర్తిస్తారు" అతను గట్టిగా నవ్వాడు. నేను అతని కళ్ళల్లోకి చూశాను.
"ఇష్టపడే వస్తారు. వచ్చాకా నా చేత బతిమాలించుకోవాలని చూస్తారు. కొంతమంది బాగానే ఎంజాయ్ చేసి తర్వాత ఏడుస్తారు. ఇంకా కొంతమంది మెడలోని మంగళసూత్రం తీసి దిండుక్రింద పెట్టి అప్పుడు సరేనంటారు.
ఎవర్ని ఎలా అర్ధంచేసుకోవాలో తెలీదు. కానీ ఒక విషయం మాత్రం తెలుసు. వీళ్ళంతా శృంగారం అనేది జీవితానికి చాలా అవసరం వైవాహిక జీవితం అంటే పప్పూ, అన్నం, డబ్బు మాత్రమే కాదు అనే భావజాలంలో పడి వ్యక్తపరచలేక తన్నుకుంటున్నారని!" అన్నాడు
నా ప్రస్తుత మానసికస్థితికి సరిగ్గా సరిపోయే మాటలే చెప్పాడు. అవి కఠోర సత్యాలు. అయినా నేను ఒప్పుకోలేను. ఉగ్గుపాలతో నా మనసులో జీర్ణించుకుపోయిన భావం 'స్త్రీకి మాత్రం శీలం అవసరం' అన్నది. దాన్ని ఎలా తోసిపుచ్చడం. శరీరాన్ని, మనసునీ, అదుపులో పెట్టుకోలేక తాళిబొట్టుని తలగడక్రింద దాచి ద్వైదీభావంతో కొట్టుమిట్టులాడే స్త్రీల సంఘర్షణ ఇతనికి నవ్వుగా వుందా? నాకు తెలీదు.
అమాయకపు నీహారికల మాటునుండి తొలి మంచుకిరణం పడి తళుక్కున మెరిసే మంచు ముత్యంలాంటి స్త్రీ యవ్వనం ఆవిరైపోయేలోగానే సప్తవర్ణాలు నింపుకుని సంపూర్ణత్వాన్ని పొందాలి. ఆ సువర్ణకాలాన్ని ఏ కర్కశమైన ఇనుపపాదమో నాశనం చేసేస్తుంటే చేసే తిరుగుబాటే ఆ విశృంఖలత!
ఎక్కడో మద్దిచెట్లకి ఉయ్యాలలేసుకుని ఊగుతూ, "అట్లతద్దోయ్.....ఆరట్లూ" అది పాడుకున్న ఆ ముగ్ధ మెడలో పసుపుతాడు వేయించుకుని పాలగ్లాసుతో శోభనం గదిలోకి అడుగుపెడుతుంది. పాలలాంటి స్వచ్చమైన నా మనసునూ, ఎవరూ సంతకం చేయని తెల్లకాయితంలాంటి ఈ శరీరం నీకోసం....అంటూ పంచదార చిలకలూ ఆకుమడుపు సేవలూ భర్తకి అందించాలని వేగిరపడుతుంది. పాలు వేడి ఆరే లోగానే తగలని అన్యాపదేశంగా హెచ్చరిస్తుంది.
ఆ ముగ్ధత్వపు సిగ్గుతెరలు సున్నితంగా తప్పించి అనురాగం కలిపినా అనుభవాన్నీ సంతోషాన్ని మిగిల్చే కాంక్షలనీ ఆమెకి అందించగల మగవాళ్ళు ఎంతమంది వుంటారు ఈ లోకంలో?
భార్య అంటే పగలు వంటా? రాత్రి పడకా అనుకునే పురుషులు సగటున అరవైశాతం అని అంచనా! భర్తల ప్రవర్తనా, భార్యల సంతృప్తీ అనే అంశంపై సర్వే చేస్తే సగంమంది మగవాళ్ళకి హార్ట్ ఎటాక్ వస్తుంది.
"శీతాకాలం రాత్రి చలి నెగడులా వేసవిలో వీచే పిల్లగాలిలా మృదువుగా పలకరించి మనసుని ఆహ్లాదపరిచే ఓ స్నేహహస్తం కోసం మనసు తపించడం తప్పా?" అడిగాను.
"అంత స్వచ్చమైన స్నేహాన్ని ఆశించే మాటైతే మీరు ఇప్పుడే నా కారు దిగిపోవచ్చు! అపోజిట్ సెక్స్ అన్న ఆకర్షణ తప్ప ఒక ఆడపిల్లతో మాట్లాడటానికి నాకు ఏమీ వుండదు. ఈ రోజు పేకాటలో స్టేకు పెంచుదామా....లేక స్టాక్ మార్కెట్ ఎలా వుందీ? లాంటి కబుర్లు చెప్పుకోడానికి నాకు కావలసినంతమంది మగస్నేహితులున్నారు..." అన్నాడు.
అతనంత నిర్మొహమాటంగా ఓర్పుగా మాట్లాడగానే నేను హతాశురాలినై పోయి చూశాను. మగవాళ్ళు నేర్పుగా వచ్చే డొంకదారిలో ఇతను రావడం లేదు. విరించి యిలా మాట్లాడలేదు. అతనికి వెన్నెముక లేదన్నాను. మరి ఇంత ధైర్యంగా తన అనైతికమైన ప్రవర్తనని సమర్ధించుకుంటున్న ఇతన్ని ఏమనాలి?
భారత స్త్రీ! అతన్ని అనైతికమనే ముందు నీ ప్రవర్తనని నువ్వు ఓసారి సరిచూసుకో! కొంగు గుండెలపై నిండా కప్పుకుంటే పాతివ్రత్యం కాదు. గుండెలోని తలపుల్లోకి పరపురుషుడ్ని రానీయకపోవడమే పాతివ్రత్యం. ఎంతమంది ఇల్లాళ్ళు గుండెలపై చెయ్యివేసుకుని మేము పతివ్రతలం అని చెప్పగలరూ? నా మనసు నిలదీసింది.
"ఇక్కడ కారు ఆపండి" అన్నాను.
మనసులో అనుకున్నవేవీ బయటికి అనలేకపోవడం, చెయ్యలేకపోవడం...తరతరాలుగా ఈ బలహీనతలే స్త్రీని పవిత్రంగా వుంచుతున్నాయి.
అతను కారు ఆపాడు.
"థాంక్స్! వెళ్లొస్తాను" అంటుంటే నా గొంతు వణికింది.
అతను తల ఊపి స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయాడు. రైలు ప్రయాణంలో కలిసి వుండేది కొద్దిసేపైనా మనసులు విప్పి మాట్లాడుకుంటాం. ఆ తర్వాత మన స్టేషన్ రాగానే వాళ్ళని మరిచిపోతాం. ప్రయాణానికి జీవితానికీ దగ్గర పోలిక వుంది. అప్పుడప్పుడూ రెండింటిలోనూ ఏక్సిడెంట్లు వుంటాయి!
నేను నిస్సత్తువగా అడుగులు వేస్తున్నాను. ఏదో పోగొట్టుకున్నానని నాకు తెలుస్తోంది. చిన్నపిల్లవాడి చేతిలోంచి గాలిపటం ఎగిరిపోతే పెద్దవాళ్ళు వాడిగోడు పట్టించుకోకుండా లాక్కెళ్ళిపోతుంటే వాడికెలా వుంటుందో నా మనసుకి అలా వుంది.
నాలుగు అడుగులు వెయ్యగానే నా పక్కన కారొచ్చి ఆగింది. నేను ఆపుకోలేని ఆనందోద్వేగంలో పడిపోయాను.
ప్రదీప్ తీక్షణంగా చూస్తూ అన్నాడు.
"మనసుని పెట్టడానికి ఇంకా ఎవరూ పంజరాలు తయారు చెయ్యలేదు. దాని పగ్గాలు వదిలిపెట్టిన రోజున మీకు అవసరమయితే నాకు ఫోన్ చేయండి...బై" అని రివర్స్ చేసుకుని వెళ్ళిపోయాడు.