Previous Page Next Page 
హద్దులున్నాయి జాగ్రత్త పేజి 17

 

    అతని ముఖం నా ముఖం దగ్గరగా వస్తుంటే గోధూళి ఆకాశాన్ని ముద్దాడినట్లుంది.
    
    అతను నాకు దూరంగా జరుగుతుంటే, గోదారి తీరాన్ని వదిలి దూరం అవుతున్నట్లుంది.
    
    ఎన్ని క్షణాలయినా సరే ఈ భారాన్ని మోస్తూ నిశ్శబ్దంగా ఈ కాల వాహినిలో కలిసిపోయి, ఎవరికీ తెలియకుండా జలసమాధయిపోవాలని వుంది.
    
    శుద్ద సావేరి రిషభంలో కలిసి సాగిపోతుండగా ఏదో అపశృతి.... తంత్రి తెగి పడిన చప్పుడు.
    
    శరీరం బాధతో మూల్గింది. కళ్ళు విప్పి చూశాను. నా తీరం.....వెన్నెలా....శుద్దసావేరీ....మురళీనాదం ఏవీ లేవు!
    
    ఆనంద్ మాత్రం వున్నాడు. నన్ను తనవైపు బలవంతంగా తిప్పుకున్నాడు.
    
    "ప్రియ లేనట్లుంది వూళ్ళో!' ఆ భావన రాగానే అందమైన ఉద్యానవనంలో నుండి ఒక్కసారిగా బురద కాలవలోకి విసిరివేయబడినట్లు అనిపించింది. నా కలలని సైతం చిన్నాభిన్నం చేసే హక్కు ఇతడికెవరిచ్చారూ!
    
    అప్పటిదాకా స్వర్గారోహణ చేసిన శరీరం అతనికి సహకరించలేదు. ఫలితంగా అతని చేతిలో ప్రాణం పోయిన కట్టెలా మిగిలాను.
    
    ఆనంద్ పక్కమీద నుండి లేస్తూ "ఈడియట్.... చీర కట్టుకోగానే ఆడదానివై పోవు! ప్రియంవద దగ్గర నేర్చుకో!" అన్నాడు.
    
    'మీద పడగానే మగాడివైపోవు! ప్రదీప్ ని చూసి మనసుని శృతి చేయడం తెలుసుకో" అని నేను అంటే అతని మొహం ఎలా మారేదో కదా!
    
    పట్టుచీర కట్టుకుని 'పేరంటానికెళుతూ బురదలో కాలెయ్యడం అంటే ఇదే! నా మనసంతా చిరాగ్గా మారింది. ఆనంద్ ముట్టుకున్న శరీరాన్ని మసిలే నీళ్ళతో...వీలైతే డెట్టాల్ వేసి కడుక్కోవాలనిపించింది! ఇలా ఏ భర్తవల్ల అయినా భార్యకి అనిపిస్తే ఇంక వాడు చావడం నయం! నేను లేచి బాత్ రూంలోకి వెళ్ళిపోయాను.
    
    సాయంత్రం ఎప్పుడౌతుందా, కంప్యూటర్ సెంటర్ కి ఎప్పుడెళ్దామా అనుకుంటూ కాలు ఒకచోట నిలవకుండా పగలంతా ఎదురుచూస్తూ గడిపాను. సాయంత్రం గులాబీరంగు షిఫాన్ చీర కట్టుకున్నాను. శాండల్ వుడ్ పెర్ ఫ్యూమ్ స్ప్రే చేసుకుంటుంటే పెదవి మీదకి మల్లె తీగలా నవ్వుపాకింది. జుట్టుని బ్రష్ చేసి జడ అల్లకుండా వదిలేసి చెవి పక్కగా గులాబీ పువ్వు పెట్టుకున్నాను. నా కళ్ళు ఎప్పటికన్నా ఎక్కువ ప్రకాశవంతంగానూ పెదవులు మామూలుకన్నా ఎక్కువ ఎరుపుగానూ అనిపించాయి. గుండెలెందుకో భారంగా వూపిరి తీస్తున్నట్లు ఫీలయ్యాను.
    
    కారు ఎక్కగానే ఆలోచనలకి రెక్కలొచ్చినట్లు ఫీలయ్యాను.
    
    క్లాసు అయిపోయింది. న్నెఉ చెట్టుక్రింద నిలబడ్డాను.
    
    డ్రైవర్ దగ్గరగా వచ్చి "రండి మేడం.....పోదాం" అన్నాడు.
    
    "నేను ఫ్రెండ్ ఇంటికెళ్ళాలి. నువ్వెళ్ళిపో!" అన్నాను ధైర్యంగా.
    
    అతను ఏదో అనబోయి నా చూపులోని తీక్షణతకి జడిసి వెళ్ళిపోయాడు.
    
    చాలాసేపు గడిచిపోయింది. అందరూ ఒక్కొక్కరిగానూ....జంటలుగానూ వెళ్ళిపోయారు.
    
    ప్రదీప్ రాలేదు!
    
    దీపం పెట్టని ఇల్లులా తయారయ్యింది నా మనసు! కాళ్ళని బలవంతంగా ఈడవాల్సి వచ్చింది. నడుస్తూ వస్తుంటే ఎవడో పక్కనుండి వెళ్తూ-
    
    "హాయ్ బ్యూటీ...వస్తావా..." అంటూ స్కూటర్ మీద దూసుకుపోయాడు. వెధవ, నన్ను బ్యూటీ అని నిజంగా అన్నాడో....అంతే ఇంగ్లీషు వచ్చో తెలియలేదు. అయినా 'వస్తావా?' అన్నవాడు ఆగకుండా పోతే ఎలా? నోటితో తీర్చుకునే ఆబా వెధవలు! నిలబెట్టి వరసగా షూట్ చేసి పారెయ్యాలనిపించింది.
    
    కళ్ళు మసక మసకగా అయ్యాయి. కన్నీళ్ళా! ఎంత విచిత్రం అవి ఇంకా ఇంకిపోలేదు. ఈ మధ్యన ఆనంద్ ఎంత పొడిచినట్లు మాట్లాడినా, అత్తయ్యా, మావయ్యా నా ముందే ప్రియ గురించి పొగిడినా, జయంతి తేలిగ్గా తీసిపారేసినా ఏం చేసినా రాని కన్నీళ్ళు ఎందుకింత తియ్యగా వస్తున్నాయి.
    
    ఇంటికొచ్చేటప్పటికి కళ్ళు పీకేస్తున్నట్లు ఒకటే నెప్పి! కాస్తా కూస్తా దూరం లేదు మరి! ప్రదీప్ ని తలుచుకుంటే చాలా కోపంగా వుంది. నిశ్శబ్దంగా వున్న తటాకంలో రాయి విసిరి అలజడి సృష్టించి ఏవీ ఎరగనట్లు చక్కాపోయాడు! ఇదో రకమైన శాడిజం అనిపించింది. డాబామీద కెళ్ళి మల్లెమొగ్గలు కోద్దామన్నా, చెట్లకి నీళ్ళు పోద్దామన్నా....ఏ పనీ చేయబుద్దికాలేదు. వంట కూడా చెయ్యలేదు. టీవీ చూసినా, పుస్తకం తిరగేసినా విసుగుపుడ్తోంది. ఫోన్ వైపే చూస్తూ రాని మనిషి కోసం తలుపు వైపే చూస్తూ దుర్బరంగా గడిచింది కాలం!
    
    రాత్రి ఆనంద్ తలుపు తోసుకుని నా గదిలోకి రాగానే ఎలర్ట్ అయి "నాకు అస్సలు ఓపికలేదు! మీ గదిలోకి వెళ్ళండి" అన్నాను.
    
    "ఎవడితో తిరిగొచ్చావు?" చాలా సూటిగా అడిగేసాడు.
    
    నేను భయపడినంతా అయింది. రాక్షసుడికి అనుమానం వచ్చేసింది. ఇంక ఆరాలు తీయడం ప్రారంభిస్తాడు. వీడు వుంచుకున్న దాని ఇంట్లో పడుకుని కట్టుకున్న దానిమీద నిఘా పెడ్తాడు. వీడుట్టి వెధవ! తెలుగు భాషలో అతన్ని తిట్టడానికి ఏ తిట్టూ మిగలలేదు ఇంక.
    
    "కారు వద్దన్నావట?" అడిగాడు.
    
    "నడవాలనిపించింది..." అన్నాను.
    
    "ఆనంద్ గాడి భార్య బజార్న పడిందిరోయ్! అని అందరూ అనుకోవడానికా?" కోపంగా అడిగాడు.
    
    అందరూ అనుకుంటారనేగానీ వీడికేం లేదా! రహస్యంగా ఏవైనా చెయ్యొచ్చన్నమాట అనుకున్నాను.
    
    "తిక్క వేషాలెయ్యకు. నా సంగతి తెలుసుగా!" అన్నాడు.
    
    నాకు మాధవి గుర్తొచ్చింది. ఆ రోజున ఆ రౌడీగాడి చేత దాన్ని కొట్టించిన వీడ్ని నేను వదిలిపెట్టకూడదు! మొహం పగిలేట్లు కొట్టించాలి. కాదు....కాదు. వీడు పడి చచ్చిపోతున్న ఆ పరువుమీద కొట్టించాలి. ఆ దెబ్బకి వీడూ, వీడి నాన్నా, అమ్మా, చెల్లీ అందరికీ దిమ్మ తిరిగిపోవాలి!
    
    "రేపటినుండీ క్లాసు అయిపోగానే ఇంటికి రా! లేకపోతే మానిపించెయ్యాల్సొస్తుంది" అనేసి వెళ్ళిపోయాడు.
    
    తోలు బొమ్మలాడించేవాడిని అనుకుంటున్నాడా? వీడు ఆడిస్తేనే నేను ఆడాలా? దారం కాస్త పుటుక్కున తెంపుకున్నానంటే వదిలిపోతుంది అనుకున్నాను.

 Previous Page Next Page