Home » Dr jandhyala papayya sastry » Karunasree Saahithyam - 1


                                     ధర్మపరశు
    

    [జమదగ్ని శాంతమూర్తి. తపస్సంపన్నుడు. మహాఋషి.
    మునిపల్లెలో భార్యా పుత్రులతో కాపురం. పర్ణశాల
    పంచముందు ఉన్న గోమాత ఒక్కటే ఆయన సర్వస్వం.
    ఒకరోజు వేటకు వచ్చి ఆకలితో నకనకలాడే రాజుకూ
    పరివారానికీ ఆతిథ్య మిచ్చాడు జమదగ్ని మహాముని.
    
    పిలిచి పిండివంటలతో విందుచేసినందుకు ప్రతిఫలంగా
    ముని హోమధేనువు మీద కన్నుపడింది కార్తవీర్యుడికి.
    ఆ దురాక్రమణణు అంగీకరింపలేదు తపస్వి. రాజుగారికి
    కోపం వచ్చింది. నిరంకుశత్వం వేయికరాలు దాచుకొని
    ముందుకు నడిచింది.
    
    హింస అహింసమీద కత్తి దూసింది. అధర్మం ధర్మం
    మీద దాడి చేసింది. పశుబలం ఆత్మబలాన్ని పరాభ
    వించింది. బలవంతంగా ప్రజాధనం ప్రభుత్వ భవనంలో
    బందీ అయింది.
    
    గోమాత ఘోష విని అహింస కన్నులు తెరచింది.
    ధర్మపరశువు పైకి లేచింది. ఆత్మబలం విజయ యాత్ర
    సాగించింది. అధర్మమూ, దానిని సమర్దించిన శక్తులూ    
    పాటాపంచలయినవి. వేయిచేతులూ తెగిపడినవి. నిరంకు
    శత్వం నిర్మూలమయింది. ధర్మం జయించింది. ఇదీ
    పరశురామునిపై నా భావన. అదే నా ఈ 'ధర్మపరశు'
    కావ్య నిర్వచనం.]
    
    బ్రహ్మవర్చస్సు చిందు నీ ఫాలతలము !
    క్షాత్ర తేజస్సుఁజిమ్ము నీ నేత్రయుగళి !
    భార్గవా! నీవు క్షత్రియబ్రాహ్మణుఁడవొ !
    బ్రాహ్మణక్షత్రియుఁడవొ ! విభ్రాంతి గలిగె.
    
    అలిక ఫలకమ్ము పయి రక్త తిలక మేమి?
    క్రాంతిసంక్రాంత మగు పురోగమన మేమి?
    గండ్రగొడ్డలితో భుజాస్కంధ మేమి?
    విశ్వభీకరమైన ఈ వేష మేమి?

    ఎవఁడురా వాఁడు కదిపి కవ్వించినాఁడు
    మఱచి నిదురించు వీరకేసరిని తట్టి -
    ఎవఁడురా వాఁడు! తలదూర్ప నెంచినాఁడు
    అరిభయంకర మృత్యుగహ్వరములోన.
    
    ఎక్కడ కీ ప్రయాణము మునీంద్రకుమారక? జింకచర్మ మే
    దిక్కున పాఱవైచితి? విదేమి కనుంగవ చింతనిప్పులన్
    గ్రక్కుచునున్న? దుద్ద్రృత కరమ్మున నూగెడి ఆ కుఠార మే
    మ్రుక్కడి దానవాధముల మూపుల దూఁకఁగ నుత్సహించెరా?
    
    నడుము బిగించి వల్కలమునన్, జడలన్ సిగజుట్టి, కన్బొమల్
    ముడివడ, వీర రక్త మిడి మోమున, విప్లవ గర్జకుం దిశల్
    తడబడ, కాలరుద్రుని విధాన కుఠారము చేతబట్టి నీ
    వడుగిడ దద్దరిల్లినదిరా! పృథివీతల మొక్క పెట్టునన్ !!
    
    సత్యతపోధనుండవె! ప్రశాంతుఁడవే! జమదగ్ని రేణుకా
    పత్యమవే! మహేశ్వరుని భక్తుఁడవే; మఱి బ్రాహ్మణుండవే!
    జాత్యనురూప ధర్మగుణసంపద నెంచక రౌద్రమూర్తివై!
    హత్యల కిట్లు పాల్పడితివా! మతిపోయినదా! భృగూద్వహా !
    
    నే నొక సార్వభౌముఁడ ననే మధమే తలకెక్కెనో! కనుల్
    గానఁడు కార్తవీర్యుఁ;డధికారము మౌనిజనమ్ముమీఁదనా!
    ధేనువు నీయకున్న గురుదేవునిపై పగబట్టి ద్వేష రో
    షానల దుర్విదగ్దుఁడు దురాక్రమణంబున కుద్యమించునా?
    
    ఇంటికి పిల్చి స్వాగతము నిల్చి, ప్రియంబున విందు సేయుటే    
    కంటక మయ్యెనా ప్రభువుగారికి!! ఆశ్రమ హోమధేనువున్
    గెంటుకపోయె క్రౌర్యము చిగిర్చిన వేయికరాలు సాచి!! ఈ
    కొంటెతనమ్ము రక్తబలి గోరదె హైహయరాజవంశమున్ !!
    
    మాలిమీ చేసి ఎంత బతిమాలిన గోవు నొసంగనట్టి "గూం
    డా"లకు బుద్దిసెప్పెడు కుఠారముధాటికి నిల్వలేక గ
    గ్గోలయిపోయి రాజుకొడుకుల్ కనుచాటుగ ఆశ్రమంబులో
    కాలిడి నీవు లేని తఱి కంఠము కోసిరటే తపోధనున్!
    
    "పఱపఱ గొంతుకోసిరి కృపారహితాత్ములు గోలపెట్టి బి
    ట్టఱచెడి నన్ను లెక్కగొనరైరి రవంతయు రామ రామ?" యం
    చిరువదియొక్కమారు జనయిత్రి యురస్థ్సలి బాదుకొన్నదా!
    తఱిమినదా! నినున్ రుధిరధారల తండ్రిఋణమ్ము దీర్పఁగన్!
    
    గడగడలాడె రాచతలకాయల స్వర్గపుమెట్లు కట్టు క
    ట్టడి జగజెట్టి! నీ బొమముడిన్ గని దైవతరాజు కాళ్ళు, త
    ల్లడపడి సంభ్రమించి రుడురాడ్ దినరాజులు; రాతిగుండియల్
    'దడదడ' కొట్టుకొన్నవిగదా గిరిరాజునకున్ పరంతపా!
    
    ఎయ్యెడ నేర్చుకొంటివి మునీ! గడితేరిన రాచవారితో
    కయ్యము సేయునేర్పు? మొనగాఁడవు! కోసితి వూచకోత; అ
    క్షయ్యములయ్యె నీ విజయగాథలు భావిచరిత్రలోన; మా
    యయ్య! అనుగ్రహించి ఇఁకనైనను గొడ్డలి క్రిందపెట్టుమా!
    
    చిన్నతనంబునన్ శివుని శిష్యుఁడవై రజతాద్రిమీద గై
    కొన్న మహాప్రయాసమునకున్ ఫలితార్ధ మిదే నటయ్య! ఏ
    మన్న నికేమియున్నది మహాబలికాండ సమాప్తమయ్యె; ఇం
    కెన్ని యుగాల కీ రుధిర మెండునొ భారతభూమి గుండెపై!
    
    దర్ప మెలర్ప వైరి వసుధాపతులన్ వధియించి తండ్రికిన్
    దర్పణ మాచరించితివె తద్రుధిరమ్ముల; భూమిభారమున్
    దీర్పఁగ జన్మమెత్తితివి; దేశము కంటకశూన్యమయ్యె; "రా
    మార్పణ" మయ్యె క్షుద్రములు స్వార్ధపరత్వ నిరంకుశత్వముల్!
    
    మే మిక చూడలేము - విరమింపుము వీరవిహారయాత్ర నో
    స్వామి! భవత్కుఠారము కసాయిదుకాణము చేసివైచె నీ
    భూమి సమస్తమున్, చెదరిపోవుచునుండె కనుల్, ప్రచండ తే
    జో మహనీయమూర్తి! దయచూడుము; వీడు ముదగ్రారూపమున్!
    
    బ్రద్దలైనవి శత్రుపక్షవక్షఃకవా
        టములు నీ గండ్రగొడ్డలికి దాకి
    పొరలిపాఱినవి నెత్తురుటేళ్ళు వీర వి
        స్ఫూర్తి నీ కంటికెంపును గ్రహించి
    దిమ్మెక్కినవి అష్టదిగ్గజమ్ముల శ్రవ
        ణములు నీ సింహనాదముల కులికి
    అల్లాడిపోయిన వాదిశేషుని వేయి
        తలలు నీ కాలి తాపులకు నోర్చి
    
    ఎంత సాహసమో! ఎవ్వరెంచఁగలరు-
    ఎట్టిస్థ్యైర్యమొ! ఎవ్వరూహించఁగలరు-
    నీవు పరశువు చేఁబూని నిల్చినంత
    అడలిపోయినదోయి ! బ్రహ్మాండమెల్ల.
    
    గొడ్డలి పూని భూపతుల కుత్తుకలన్ దెగవేసి రక్తపుం
    గడ్డ యొనర్చి తీ భరతఖండము భార్గవరామ! ఎట్లు లో
    బడ్డదిరా నవోత్సలమువంటిది నీ హృది! సత్యశౌచముల్
    గొడ్డరిపోయెనే! చెరువుకొందువె! మౌనికుల ప్రతిష్ఠలన్!
    
    ఒక్క మునియేమి ఇరువది యొక్క మాఱు
    దర్పధను లగు నృపుల విదల్చుటేమి?
    ఏ మహాశక్తియో పొంగులెత్తి పొరలి
    ఱక్కలల్లార్చెఁగాక వేఱొక్కఁడగునె!
    
    'గోవు కొట్లాట' కా దిది - దైవబలము
    దానవబలమ్ముపై జయధ్వజమునెత్తె;
    ఇది ప్రతిక్రియ కాదు దుర్మద నిరంకు
    శ ప్రభుత్వముపై ప్రజాశక్తి గెలుపు !!
    
    ఎవ్వ రేమనుకున్న నీ కేమి? దైవ    
    శక్తి నీయందు కలదు దీక్షాతపస్వి!
    కడుగుకొనుమయ్య! రక్తపంకమ్ము తొలఁగ
    నర్మదాతీర్ధమందు నీ 'ధర్మపరశు'!
    
    'తల్లిని జంపె' నంచు అయథార్థ కథానికలన్ చరిత్రలో
    నల్లిరి గాని, నమ్మదుగదా మది! దుస్సహ దుష్టశక్తులన్
    త్రుళ్ళడగింపముందునకు దూఁకు భవాదృశ సత్యవీర శౌ
    ర్యోల్ల సితప్రభావు, లెటు లోర్తు రకారణమాతృహత్యకున్!
    
                                       మా గాంధీతాత
    
    అడుగుపెట్టినచాలు అవనీంద్ర రత్న రం
        జిత కిరీటములు హారతు లొసంగు!
    బయలుదేఱినచాలు జయజయధ్వనులతో
        గ్రామాలు గ్రామాలు కదలివచ్చు!
    కొంగుబట్టినచాలు కోటానుకోట్ల హ
        స్తములు బంగారు వర్షములు గురియు!
    పెదవి యొకింత విప్పినచాలు లక్షల
        కొలఁది తలల్ వచ్చి కొలువుతీర్చు!
    
    నవ్వినంజాలు పతిత మానవ సమాజ
    మానమ్ములు దేదీప్యమానము లగు!!
    పట్టుపట్టిన చాలు సమ్రాట్టులైన
    తలలువంతురు మా గాంధితాత ముందు !!

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra