Previous Page Next Page 
కరుణశ్రీ సాహిత్యం-1 పేజి 18

   
                                         శాంతిదూత    
    
    అచ్చపు దాస్య శృంఖలములందుఁ దగుల్కొని శౌర్యధైర్యముల్
    చచ్చి కృశించు ఈ భరతజాతికి నూతన శక్తి దాతవై
    వచ్చినయట్టి సూర్యభగవానుఁడ వీవు; త్వదాగమమ్మునన్
    విచ్చెనులెమ్ము మా నయనవీథులఁ గ్రమ్మిన కాఱుచీకటుల్!
    
    పవలున్ రాత్రులు నెత్రుటేళ్ళు ప్రవహింపన్ పాపభూయిష్టమౌ
    నవకాళీ నరకమ్ములో చరణ విన్యాసమ్ము గావించినాఁ
    డవు, నీ శాంతిమయాస్యకాంతి గని "గూండా" లందఱున్ "విశ్వమా
    నవసౌభ్రాత్రవిధాత" ముందు శరసన్న్యాసమ్ము గావింపఁగన్ !
    
    నెత్తురు త్రావు రక్కసులె నీ చరణాలకడన్ వినమ్రులై
    కత్తులు బల్లెముల్ గదలు కఱ్ఱలు బాకులునుం దుపాకు లిం
    తెత్తున రాశిపోసి భజియించిరటే భవదంఘ్రి; మారణో
    న్మత్తుల మత్తు దింపఁగల మంత్రము లెచ్చట నేర్చుకొంటివో!!
    
    కండల్ నిల్వున చీల్చి సోదరుల రక్త మ్మాను నక్తంచరుల్
    'గూండా' మూకలు పిల్లికూనలవలెన్ కూర్చుండినారంట నీ
    జెండా నీడలలో, సుధామధుర వాక్ క్షీరమ్ములం ద్రాపి యీ
    గండాగొండిశిఖండులం దనువు నీ కారుణ్య మేపాటిదో !!
    
    జవహరుఁడల్లదే విజయశంఖము నొత్తుచునుండె కేల గాం
    డివము ధరించి, ఘంటలు ఘణిల్లున మ్రోగెను వీరభారతీ
    భవనము ముందు, పగ్గములు బట్టి ప్రజారథ మింక నాజవం
    జవముగ త్రోలుమా! "విజయసారథి"వై విజయమ్ము సేయుమా!
        
    దురహంకారులు స్వార్ధదూషితమతుల్ దుశ్శాసనుల్ దుష్క్రియా
    పరు లున్మత్త మహాపిశాచములు పైపై దూఁకి బాధించు నీ
    భరతక్షోణికి దిక్కు వేఱెవరు నీ ప్రాపొండు దక్కన్, స్వరా
    జ్యరథ మ్మెక్కి ప్రజాతతిన్ నడుపుమయ్యా! కర్మవీరాగ్రణీ !!
    
    'గుప్పెడు ప్రాణముల్ ప్రజలకోసమ యర్పణసేతు హింసయే
    తప్పనినాఁ'డటంచు బహుధా ప్రవహించిన నీ ప్రతిష్ఠకై
    ముప్పదిమూడుకోట్ల శిరముల్ ప్రణమిల్లెనుగాక గుండెపై
    నిప్పులకుంపటుల్ నిలుపనేర్తు రికెన్ని దినాలు సోదరుల్!
    
                                          రాష్ట్రసిద్ధి
    
    మీలో మీరు సవాలుకొట్టుకొని స్వామీ! 'ఆంధ్రరాష్ట్రమ్ము' బం
    గాళాఖాతములోన ద్రోసితిరి; పైగా తెల్గువా రన్నచో
    వేళాకోళము లయ్యె నల్గురకు; ఈ వేదాంత భాష్యాలతో
    కాలక్షేపము చాలు, నింక దిగుఁడీ కర్తవ్యరంగమ్మునన్ !!
    
    తోచీతోచని తోడిసోదరు లదేదో కోరుచున్నట్లుగా
    చూచీచూడరు నేడు నాయకవతంసుల్, చీటీకిన్ మాటికిన్
    పేచీ వేతురు, రాష్ట్రవాంఛయును తప్పేయయ్యె మావారికిన్!
    చీచీ ఎంతటి శోచనీయదశ వచ్చెన్ నేఁటి కాంధ్రోర్వికిన్ !!
    
    అరచుచు మూతినాకి 'అహహా' యని తోకలు త్రిప్పి, నేలపై
    దొరలుచు, వీలు చూచుకొని దూరుచు, చీకటి సందుగొందులన్
    దిరిగెడు గ్రామసింహముల తీరున నాయకులుండ, తెల్గు సో
    దరుల యదృష్టమందు గలదా అభివృద్ధియు రాష్ట్రసిద్దియున్ ?
    
    కాంతికి కళ్ళు మూసికొని, గాఢ తమోమయ ఘోర కాననా
    భ్యంతరమందు ద్రిమ్మరు దివాంధములై యభిమానశూన్యులై
    వంతలుపాడు మా తెలుఁగువారికి లక్ష యుగాలకైన గ
    త్యంతర మున్నదే? పరుల దాస్యము జాతికి ఖ్యాతి గూర్చునే ?
    
    కలయో-వైష్ణవమాయయో - యితర సంకల్పార్ధమో -ఏదియో
    తలపంజాలము; భారతావని స్వతంత్రంబయ్యె, మా దాస్య శృం
    ఖలముల్ ఖల్లున నేలపై తెగిపడెన్, గానీ - స్వరాష్ట్రమ్ముకై
    తెలుగుంబిడ్డ లొకింత నోచుకొనలేదే ఎంత దౌర్భాగ్యమో !!
    
    ముంగలఁగానుపించి, పదిమూరల దూరము పోయి, అంతలో
    చెంగట కేగుదెంచి, చెయి జిక్కి; విచిత్రముగా నదృశ్యమై,
    'బంగరులేడి' వోలెఁ గనుపట్టుచునున్నది రాష్ట్రసిద్ధి - 'త్రై
    లింగమహారథమ్ము' కదలింపుఁడు భారత రాజవీథులన్ !!
    
    'రంగా దక్షత 'టంగుటూరి' యసిధారా దీక్ష 'పట్టాభి' మం
    త్రాంగ ప్రౌఢిమ యీ త్రయమ్మును సమైక్యంబై విజృంభించినన్
    సాంగోపాంగ సమృద్ధమై మనకు రాష్ట్రం బబ్బదా - పండవా
    బంగారంబులు! నిండవా తెలుఁగు శోభల్ దేశదేశమ్ములన్ !
    
    మన పుణ్యవాహినీ మధురాంబుపూరంబు
        జలధి గర్భములోఁ గలిపివైచి
    మన భాసమానాసమాన శేముషి, వృథా
        వాదోపవాదాల వ్యయముసేసి
    మన స్వజాతీయాభిమాన సౌభ్రాత్రమ్ము
        పదవులకోసమై బలియొనర్చి
    మన విశాలాంధ్ర నిర్మాణ దీక్షాస్ఫూర్తి
        పరుల హస్తాలలో ధారవోసి
    
    మన పురా శౌర్య ధైర్యసంపదలు వర్ణ
    మత విభేదపిశాచి కాహుతి యొనర్చి
    తెలుగుగడ్డకు తలవంపు తెచ్చినాము
    మేలుకొనుఁ! డింక మన రాష్ట్ర మేలుకొనుఁడు !!
    
                                     భారతభాగ్య దేవత
    
    కత్తి కదల్పలేదు! విశిఖాల విదల్పనులేదు! గాండివం
    బెత్తనులేదు! ఏక్రియ జయించితివో నరమాంస పారణో
    న్మత్తుల? నీ ప్రభావము లమానుషముల్ !! భవదీయ శాంతి సం
    పత్తికి దోసిలొగ్గెను ప్రపంచము!! భారత భాగ్యదేవతా!
    
    పుటలా డెబ్బదియెన్మి దేగినవి బాపూజీ పయఃకావ్య సం
    పుటిలో; పైపుట త్రిప్పులోపలనె మా పున్నెమ్ము మిన్నంది ప్ర
    స్ఫుట భంగిన్ వినిపించే నేఁటి కిట సంపూర్ణ స్వతంత్ర ప్రజా
    పటలీ వీరవిహార విశ్వవిజయప్రస్థాన భేరీధ్వనుల్ !!
    
    'యుగపురుషుండ'వంచు 'పురుషోత్తమమూర్తి' వటంచు 'మూర్తిమ
    జ్జగదనురాగ శాంతిమయ సాత్వికశక్తి' వటంచు వేనవేల్
    మొగముల ప్రస్తుతించెను ప్రమోదముతో జగమెల్ల నిన్ను; ఏ
    మగుదురు నీకు? తొల్లిటి మహమ్మదు క్రీస్తును బుద్ధదేవుఁడున్.
    
                                            హత్య
    
                                                (బాపూజీ హత్య వినగానే విధి నుద్దేశించి)
    
    హంత! ఇదేమి? నీదు ప్రణయాంకతటమ్మున నిద్రపుచ్చి నీ
    వింతటి వాఁడికత్తి నిటు లేటికి గ్రుచ్చితివోయి నిర్దయ
    స్వాంతుఁడ! నాదు పేద హృదయమ్మున; చేయి కదల్పఁబోకు, ప్రా
    ణాంతకమైన యీ నరకయాతన గుండెలు మోయలేవురా !!
    
                                      విషక్షణము
    
    ఉయ్యాలలో నూగుచున్న ముద్దుల బిడ్డ
        లేచి కెవ్వున కేకవైచెనేమి?
    పాకలో లేగకు పాలిచ్చు గోవు 'అం
        బా' యంచు గొంతెత్తి యఱచెనేమి?
    జల జల ప్రవహించు జమున నిస్తబ్దయై
        నిలచి కన్నుల నీరు నింపునేమి?
    చక చక పొలము దున్నుకొని పోయెడి
        రైతు నాగలి ముందుకు సాగదేమి?
    
    కోటల ఆఱుగంటలు కొట్టఁబోవు
    వాని హస్తాలు గడ గడ వణకునేమి ?
    ఏ మహాత్ముని గుండెపై కెక్కి చనెనొ
    కాలపురుషుని రథరథాంగములు నేఁడు !!
    
                                             దుర్దినము
    
    కనిపింప దిదియేమి? కనక కాంతులు చిందు
        సత్యావతార ప్రశాంతమూర్తి!
    వినిపింప దిదియేమి? వీనులవిందుగా
        'రఘుపతి రాఘవ రామ భజన'! 
    కళ దప్పెనేమి ఏకాలమ్ము కలకల
        లాడుచునుండు బిర్లాలమేడ!
    తలవంచెనేమి? మిన్నులు ముద్దుగొను మూడు
        రంగుల వీరభారత పతాక!
    
    తడిసిన దిదేమి? కన్నీటి ధారలందు
    భరతజనయిత్రి ఖద్దరు పైటచెఱఁగు -
    ఏమొ పోగొట్టుకొన్నట్టు లేడ్తురేమి?
    గోడుగోడున నలుబదికోట్ల ప్రజలు !!!

 Previous Page Next Page