అభిరామాకృతులైన నీ కృతులు నవ్యత్వాభిరామమ్ములై
ప్రభుతం గన్నవి యావదాంధ్రజన హృత్పద్మమ్ములన్, భాను స
న్నిభ! యుష్మత్కవితారుణ ప్రభలు నిండెన్ గేహగేహాల; మా
యభివాదమ్ములు గొమ్ము వేమన కవీంద్రా! కర్మయోగీశ్వరా!
తీయతీయని నీతి జాతీయములను
తెలుఁగుబిడ్డల నోటి కందించినావు,
కాగుడింతాలలో డిప్పకాయ గూడ
అప్పగించును నీ 'ఉప్పుకప్పురంబు'.
పొట్టి చొక్కాలతో నింత బొట్టెలమయి
వీథిబడి కేగు తొలి సంజ వేళలందు!
ఆటవిడుపులనాఁడు మా అయ్యవారు
చెప్పినారయ్య! మాకు 'నీ చిత్తశుద్ధి'
గొడ్లు మేపుకొనే కుఱ్ఱకుంక మొదలు
శ్రుతులు వ్రేలాడు వృద్ధపండితుని వఱకు
వేమన కవీంద్ర ! నీగీతి విననివాఁడు
కానరాఁడిప్పటికి తెల్గుగడ్డమీఁద.
నీతి కేతనంబు నీ చేత ధరియించి
చెడుగుమీఁద దాడి చేసినావు;
నీదు మకుటశోభ నిండెను సర్వత్ర
విశ్వమందు నీవు శాశ్వతుఁడవు !
సంఘ సంస్కర్తవై దురాచార విష వి
దగ్ధ జగతికి నూత్న చైతన్య మొసఁగి
త్రోవ చూపించినావు ముందునకు నీవు -
మంచి మొనఁగాడవయ్య? వేమన కవీంద్ర !
నీ మనోహర మకుట సన్నికటమందు
వెలుఁగుబాటలు గన్నారు తెలుఁగువారు;
వెలయుచున్నారు సాహితీవీథులందు
నెందఱో పిల్ల వేమన్న లిప్పుడిపుడు.
[ఉదయం సుమారు ఏడుగంట లవుతుంది.
బజారున వస్తున్న దొక పాకీపిల్ల. చేతిలో
చీపురుకట్ట-చంకన చింపిరితట్ట. బాలభానుడు
తన లేత కరాలతో ఆమెను లాలిస్తున్నాడు.
భగవతి వసుంధర అడు గడుగుకూ ఆమె
చిన్ని పాదాలను ముద్దుపెట్టుకుంటున్నది.]
తన సుఖము వీడి తోడి సోదరుల సౌఖ్య
మునకె జీవిత సర్వస్వమును వ్యయించి,
ఏవ మెఱుఁగని నీ యమాయికపు ప్రేమ
లో తెఱుఁగజాల దీ స్వార్ధ లుబ్ధ జగతి.
నీ పవిత్ర ప్రకృతి స్వదేశోపకృతికి
త్రోవ చూపించెలే మహాత్ములకుఁ గూడ;
భరత జనయిత్రి ప్రేమంపు పసిడిముద్దు
తొలుదొలుత నీవె అందుకొందువు గదమ్మ!
చీపురు నొక్క చేత, ఒక చేతను చింపిరి గంపఁబూని, యీ
పాపపు గుప్ప లూడ్చెదవు బాలిక! చీదర లేదె సుంత? నీ
యోపిక చూచి మెచ్చి తలయూచు జగత్పిత కన్నుగొల్కులన్
తేపకు తేపకున్ బయలుదేఱు నవే నులివెచ్చ బాష్పముల్ !!
ఆకల్పాంతము నీ పవిత్ర దినచర్యల్ నిత్యనిర్ణిద్ర వి
శ్వైక ప్రేమ మహాగమమ్మునకు 'తూచా' పోని వ్యాఖ్యానముల్;
"పాకీదానిగ" నాడిపోసికొను ఈ పాపిష్ఠిలోకమ్ము నీ
"బాకీ" తీర్చుకొనంగలేదు జగదాంబా! జన్మ జన్మాలకున్.
కుక్షిస్థ మ్మగు కుళ్ళెఱుంగఁడు - కృశాంగం డీడ్వలే కీడ్వఁగా
రిక్షాలో జనుచున్న ఆ పశువు దారిన్ తొల్గిపో వంచు ని
న్నా క్షేపించుణు పండుకోతివలె మోమంతా కనుల్ చేసి, ఏ
మో క్షోభించును కొంప మున్గి నటు లబ్బో! ఎంత బిబ్బోకమో!
ఈ గతి నేహ్య మెల్ల సహించి యుగమ్ములనుండి చేయు నీ
త్యాగము గుర్తెఱుంగదుగదా! నెల కిచ్చెడి రెండణాలకే
యాగముసేయు లోకము, యథార్దముగా తన సేవకోసమే
భాగవతమ్ములోని భగవంతుడు నిన్ను సృజించినట్లుగన్.
చెల్లి! నీ బీద మోము దర్శించినంత
విసము గుఱిపించు నేమి రక్కసి జగమ్ము?
మానవత్వమ్మునే యవమానపఱచు
పసరముల సంత యిది! దయారసము సున్న.
ఒక్క రో జీవు వీథుల నూడ్వకున్న
తేలిపోవును మా పట్టణాల సొగసు;
బయటపడునమ్మ; బాబుల బ్రతుకు లెల్ల
ఒక క్షణ మ్మీవు గంప క్రిందకును దింప.
పావనమ్మైన నీ ప్రజాసేవకొఱకు
త్యాగమయమైన నీ జీవితమ్ముకొఱకు
కార్పలే దొక్క కరుణాశ్రుకణముగూడ !!
జార్పలే దొక్క వేఁడి నిట్టూర్పుకూడ !!
ఉక్కు పాదాలతో నిన్ను ద్రొక్కు 'దున్న
పోతు సంఘమ్ము'పై సానుభూతి చాలు;
కడుపు గడవంగ చాల మార్గములు గలవు
బైటబడుమమ్మ! ఈ మూగ బ్రతుకునుండి.
'పాకీపిల్ల' వటంచు నిన్ను నిరసింపంజూతు రమ్మా! స్వయం
పాకస్వాములు కొంతమంది, ఇది యే పాపంబొ! మూన్నాళ్ళలో
నే కన్నుల్ తలకెక్కి వెన్క గన రీ నిర్భాగ్యదామోదరుల్ !!
పాకీదేగద మాకు మా జనని బాల్యమ్మందు సంజీవనీ !
మాతృస్థానము నందుకొన్న యది యుష్మన్మూర్తి లోకాన, ఊ
హాతీత ప్రణయాధిదేవతకు పుణ్యక్షేత్రమే యయ్యె నీ
చేతోవీథి, పరార్ధచింత నుపదేశించున్ భవద్వృత్తి, ప్ర
ఖ్యాతంబైనది నీ ప్రవృత్తి, ఇవిగోనమ్మా! నమోవాకముల్ !!
ముందడుగు
కైసేసినారు! నీ కవికుమారులు శార
దాదేవి మెత్తమెత్తని పదాలు
చిందించినారు! నీ శిల్పకారులు కళా
కల్యాణి కడకంట కాంతిలహరి
వ్రాయించినారు! నీ వైజ్ఞాణికులు వృక్ష
ములచేత మనసులోపలి నిజంబు
కరగించినారు! నీ గాయకాగ్రణులు గుం
డెలు లేని మొండిబండలను కదిపి
అభ్యుదయ మార్గమందు ముందడుగు వేసి
జతన మొనరింపుమోయి! భారతకుమార!
చేత జాతీయ కేతనశ్రీ తలిర్ప
వెలుఁగఁగలవోయి! విజ్ఞానవీథులందు.