Previous Page Next Page 
హద్దులున్నాయి జాగ్రత్త పేజి 16


    అతను మాట్లాడుతున్నంతసేపూ అది ఓ ఆడపిల్లతో అని తెలిసి నాకు తెలీకుండానే మనసు చేదుగా అయింది. ఎంత విచిత్రం. అతనెవరో ఓ గంట క్రితంవరకూ నాకు తెలీనే తెలీదు. అలాంటిది తెలిసిన గంటలోనే ఈ రకమైన జెలసీ! అది చాలా చెడ్డ సింప్టమ్ అది కలిగిందంటే అవతలి వాళ్ళతో మనం ఇన్ వాల్వ్ అవుతున్నట్టే లెక్క.
    
    కాఫీలొచ్చాయి. టేబుల్ మీద ట్రే వుంచుతున్న పన్నెండేళ్ళ కుర్రాడు నా మొహంవైపు ఉత్సుకతగా చూడడం నా దృష్టిని దాటిపోలేదు.
    
    "లోపల మీ మిసెస్ వున్నారా?" అడిగాను.
    
    "ఆవిడెవరూ?" అడిగాడు.
    
    "మీకింకా మేరేజ్ అవలేదా?" ఆశ్చర్యం వేసింది.
    
    "ఏం జెలసీగా వుందా?" అన్నాడు.
    
    ఆ మాట నిజం. పెళ్ళికాని వాళ్ళని చూస్తే చాలా జెలసీగా వుంటోంది.
    
    "ఇప్పటిదాకా ఆ కోరిక కలిగించిన అమ్మాయి నాకు తారసపడలేదు" అన్నాడు.
    
    నాకెందుకో ఆ మాట తృప్తినిచ్చింది. మగవాళ్ళు భగ్నప్రేమల గురించి కథలు చెప్తే వినలేం.
    
    "పెళ్ళయినవారిగా మీరేం సలహా ఇస్తారూ? చేసుకోమంటారా? వద్దంటారా?" అడిగాడు.
    
    ఎవరికో వెళ్ళి దణ్ణం పెడ్తే నన్ను పోలి బతకమందనీ, ఏం సలహా ఇవ్వనూ? నా జీవితం పెళ్ళితో నరకప్రాయం అయింది కాబట్టి అందరిదీ అలా వుండదుగా! ముఖ్యంగా మగవాడిది. పగ్గాలు ఎప్పుడూ వాడి చేతుల్లోనే వుంటాయి. ఇంకో శతాబ్దం గడిచినా పెద్ద మార్పు ఉండదు ఈ విషయంలో అనిపించింది.
    
    "మాట్లాడరేం?" అన్నాడు.
    
    "మిమ్మల్నీ, ఇంటినీ కనిపెట్టుకుని వుండడానికి ఓ మనిషి కావాలిగా" అన్నాను.
    
    "దానికి పెళ్ళెందుకూ? బహదూర్, మా వంటవాడు సాంబయ్య, కుర్రాడు రంగా వున్నారుగా, వీళ్ళకంటే బాగా కనిపెట్టుకుని వుంటుందా భార్య" అన్నాడు.
    
    "మిగతా అవసరాలు..." అని ఆపేశాను.
    
    "పెళ్ళి వల్లే తీరతాయనుకుంటే పొరపాటు" అన్నాడు.
    
    నాకు ఆనంద్ గుర్తొచ్చాడు నిజమే! ఇవన్నీ ఆనంద్ కి పెళ్ళి వల్ల రాలేదు. మరెందుకు చేసుకోడం?
    
    "లోకం కోసం ఓ పెళ్ళాం" అన్నాను.
    
    "నేను నా కోసం, నా ఆనందం కోసం బ్రతుకుతాను. దాన్నే స్వార్ధం అని లోకం అనుకున్నా నాకు ఫరవాలేదు. నాకు చెడ్డవాడనే బిరుదులిచ్చి సత్కరించినా మోస్తాను" అన్నాడు.
    
    "అలా అందరికీ వీలవదుగా" అన్నాను.
    
    "ఎవరి పరిధిలో వాళ్ళు వీలుచేసుకోవాలి. లేకపోతే వాళ్ళు ఇంకెవరిదో జీవితం జీవిస్తున్నట్లు" అన్నాడు.
    
    అర్ధం చేసుకోడానికి నాకు టైం పడుతుంది అనుకుంటూ "ఇంక నే వెళతాను" అన్నాను.
    
    "నడిచేనా?" అడిగాడు.
    
    "నడవగలిగినంత దూరం నడుస్తాను" అని - "మీతో గడిపిన ఈ కొద్దిసేపూ మరిచిపోలేనిది" అన్నాను.
    
    "థాంక్స్ ఎలాట్ రేపు సెంటర్ లో కలుద్దామా?" అడిగాడు.
    
    "ఊ" అన్నాను.
    
    "ఈలోగా వీలయితే మాట్లాడుకుందామా?" అడిగాడు.
    
    నేను నవ్వి పార్స్ లోంచి ఆనంద్ కార్డ్ తీసి అందించాను.
    
    అతను కూడా తన కార్డు అందించి "బై" అన్నాడు.
    
                                                            * * *
    
    ఆ రాత్రి నేను చాలా ఆలస్యంగా నిద్రపోయాను. ఫోన్ రింగవుతున్నట్లు అదాటుగా వుంది. వెళ్ళి చూస్తే మామూలే! మూగగా చూస్తోంది ఏవీ తెలీని ఆ పరికరం.
    
    ప్రదీప్ నవ్వూ, నడకా, మాటా అన్నీ ఓ రకమైన ప్రొఫెషనల్ స్టయిల్ లో వున్నాయి. అతని బిహేవియర్ లో ఏదైనా పొరపాటు దొర్లిందా.....వెగటుగా అనిపించిందా అని ఎంత ఆలోచించినా ఒక్కటైనా తట్టలేదు.
    
    చీకటి ప్రేవులు చించుకుని పుట్టిన వెన్నెలకందులా వున్నాడు చంద్రుడు. అతని నవ్వులు వెన్నెలై తీరం వెలుగు నింపుకున్నట్లుగా ధగధగలాడిపోతోంది. వెండి కుప్పలాంటి ఇసక దిబ్బమీద అతను వెల్లకిలా పడుకుని వున్నాడు.
    
    సముద్రం తాకుతుంటే పాదాలని వెనక్కి తీసుకుని నేను అతనికేసి చూసాను.
    
    మొహం మీద పడుతున్న జుట్టుని వెనక్కి తోసుకోకుండా అతనూ నన్నే చూస్తున్నాడు.
    
    గాలి బలంగా నా బట్టల్ని లాగి పారెయ్యడానికి ప్రయత్నిస్తోంది. గుండెలకి ఎప్పుడో స్వేచ్చ లభించింది. చీర దూరంగా నీళ్ళల్లో కొట్టుకుపోతూ కనిపించింది. చలికి ఒణుకుతూ చేత్తో గుండెల్ని కప్పుకుని అతనివైపు చూశాను.
    
    అతను రమ్మన్నట్లుగా చేతులు జాపాడు. 'నీకూ నాకూ జోడు.....రాడా చంద్రుడు తోడు' అన్నట్లు.
    
    చంద్రుడు తప్ప ఎవరూ లేని ఏకాంతం. మనసులో జలతరంగిణి మ్రోగినట్లయింది. నడుము తంబురయై ఈ భారాల్ని మోయలేనని ఊగింది. పెదవులు విచ్చుకోగానే వీణ తీగె సారించి వదిలినట్లు తియ్యని 'ప్ప్' అనే శబ్దం వెలువడింది. సముద్ర ఘోషకి నేపథ్యంగా నా కాలి మువ్వలు కంజర్లు మ్రోగించాయి. సా....రీ.....గా....మా.....పా....దా....నీ.....సప్తస్వరాలు నా ఒంటినిండా పాకి నిలవనియ్యలేదు. అడుగు కదిపితే నాట్యం అవుతోంది. పెదవి విప్పితే రాగం పలుకుతోంది. కన్నులు విప్పితే కమ్మని కవి భావనలా కవిత్వం వుబుకుతోంది. ఒక్కసారిగా నన్ను నేను నిలవరించుకోలేక అతనివైపు పరిగెత్తాను.
    
    యుగాల తరబడీ దప్పిక గొన్నవాడికి జలధార లభించినట్లు అతని పెదవులు నేను దాచుకున్న అమృతాన్ని గ్రోలడానికి ఆరాటపడ్డాయి. నాకు ఊపిరి సలపనివ్వకుండా అతను నన్ను మొత్తంగా పీల్చేస్తున్న భావన. అతని చేతిలో వీణనయ్యాను. తంబురనయ్యాను. వేణువునయ్యాను. రసశోధనలో అతను రతీపతే అయ్యాడు.
    
    'అమలిన శృంగారం....అమర ప్రేమలూ మనకొద్దు. అద్వితీయాలూ, అలౌకికాలూ అసలే వద్దు. అంతర్మథనం ఒద్దుగాక ఒద్దు ఇంతకన్నా మోక్షం ఏం వుంటుంది?
    
    ఏ తెల్లవారు ఝాములో ఆఖరి చుక్క వెళ్ళిపోతూ, వెళ్ళిపోతూ చెవిలో గుసగుసగా "రాత్రంతా కళ్ళు విప్పార్చుకుని చూసీచూసీ మంటలు పుడుతున్నాయి. నీకింకా తనివి తీరలేదా పిల్లా" అంది.
    
    పక్కకి ఒత్తిగిల్లలేని నా అవస్థ దానికి ఎలా చెప్పనూ? అతని చేతిలో బందీ అయినా నా శరీరం స్వతంత్రం సంపాదించుకోవడానికి సుముఖత చూపించడం లేదు. చెవి తమ్మి.....కనురెప్ప....పెదవి అంచు....వేలి చివర్లు.....ఏభాగం వదిలిపెట్టాడనీ! గుచ్చుకునే, ఒరుసుకునే, రాసుకునే అతని బలమైన దేహంతో చెలిమి చేసిన నా తనువు వీడ్కోలు పలకలేక నీరసంగా గారాలు పోతోంది. జడపాయలని వేళ్ళతో విడదీస్తూ, పాదాల మీద మునివేళ్ళతో రాస్తూ అతను అలిసిపోనీ వీరయోధుడిలా మళ్ళీ దుందుభి మ్రోగిస్తున్నాడు. ఆ రణభేరికి నా తనువు జడిసి మరింతగా అతన్ని హత్తుకుపోతోంది. ఈ రణం.....మరణం వరకూ సాగితే అతని ఋణం ఎలా తీర్చుకోనూ అనిపించింది.

 Previous Page Next Page