Previous Page Next Page 
హద్దులున్నాయి జాగ్రత్త పేజి 15


    
    "మరదే....జీవితం అంటే ఎప్పుడూ నవ్వుతూ వుండడం. మీలా మోనాలిసా చూపులతో రేషన్ చిరునవ్వులతో సరిపెట్టెయ్యడం కాదు" అన్నాడు.
    
    అంటే అతను నన్ను గమనిస్తున్నాడన్న మాట. నేను గంభీరంగా మారాను.
    
    ఇప్పుడు అతడు నా పర్సనల్ విషయాలు అడుగుతాడు. ఎక్కడ్నుండీ మొదలుపెట్టాలా అని ఆలోచించసాగాను.
    
    "ఐస్ క్రీం తింటారా? కూల్ గా వుండే ఆలోచనలు వస్తాయి" అని అన్నాడు.
    
    నేనేమాట చెప్పేలోగానే - "జస్ట్ ఏ మినిట్" అంటూ కారు దిగి పార్లర్ వేపు గబగబా వెళ్ళాడు.
    
    నేను ఎదురుగుండా వున్న అద్దంలో నా మొహం చూసుకుంటూ కూర్చున్నాను.
    
    ఎవరితనూ....ఇతనితో నేను ఇలా రావటం ఏవిటీ? కులాసాగా ఐస్ క్రీమ్ తినడం ఏవిటీ? ప్రొద్దుట లేచి అనుకున్నానా ఇలా జరుగుతుందనీ....
    
    అనుకోనివి జరిగిపోవడమేగా జీవితం అంటే!
    
    అతను రెండు కోన్ ఐస్ క్రీములు తెచ్చి ఒకటి నాకు అందిస్తూ-
    
    "పట్టుకోడానికి కాదు తినడానికి" అన్నాడు.
    
    "థాంక్స్" అని అందుకున్నాను.
    
    "ఎక్కడ డ్రాప్ చెయ్యమంటారూ?" అడిగాడు.
    
    "మీ ఇష్టం" అన్నాను.
    
    "అయితే అసలు ఎక్కడా వదలకుండా అలా రాత్రంతా తిప్పుతూనే వుంటాను ఆలోచించి మాట్లాడండి" అన్నాడు.    

    ఒక్కస్కహనం ఆ ఊహే ఎంత మధురంగా అనిపించింది ఏం ఉందా ఇంట్లో? నా కోసం ఎదురుచూసే మనిషా? ఓ సరదానా? ఓ ముచ్చటా?

    ఆనంద్ కి మనసైతే మొరటు శృంగారం, తాగొస్తే బండబూతుల కార్యక్రమం. మావయ్య, అత్తయ్యల ఎగ్జిబిషన్ పేరంటాలూ, వ్రతాలూ, జయంతి అహంకారపు చూపులూ, అన్నింటినీ మించి సవతి చూపించే ఆధిపత్యం....వీటన్నింటికీ దూరంగా ఏదయినా దీవిలోకి వెళ్ళిపోతే....ఆ వెళ్ళిపోవటం కూడా ఎవరయినా మనసుకి బాగా నచ్చి ఆహ్లాదంగా మాట్లాడే వాళ్ళతో అయితే.....
    
    "ఏవిటండీ ఇదీ? నేను పక్కన వుండగా అలా ఒక్కరే వూహల్లోకి వెళ్ళిపోవడం అన్యాయం" అన్నాడు.
    
    "ఆ! ఏం లేదు" అని తడబడ్డాను.
    
    "డ్రీమింగ్ ఎబౌట్ మి" ఎడ్వర్ టైజ్ మెంట్ లోలాగా అన్నాడు.
    
    నేను మళ్ళీ నవ్వేసాను.
    
    "ఏమీ అన్ రీజనబుల్ గా అనుకోకపోతే పైకి చెప్పొచ్చు" అన్నాడు.
    
    నేను మౌనంగా వుండటంతో - "అయితే చాలా ఆన్ రీజనబుల్ గా అనుకున్నారన్నమాట నా గురించి" అన్నాడు.
    
    అతను బాగా మాట్లాడటమే కాదు- బ్రిలియంట్ కూడా!
    
    "ఐస్ క్రీమ్ అయిపోయింది. బయలుదేరదామా?" అడిగాడు.
    
    మళ్ళీ తల వూపాను.
    
    "ఒద్దంటున్నారా? బావుండదేమో ఇలా రోడ్ మీద రాత్రి అంతా కూర్చుంటే...." అన్నాడు.
    
    "ఛీ! వెళదామంటున్నాను" అన్నాను.
    
    "మరి నోటితో చెప్పచ్చుగా" అని స్టార్ట్ చేసాడు.
    
    ప్రదీప్ ఏదో హిందీ పాట హమ్ చేస్తున్నాడు.
    
    నాకయితే..."ఆజ్ ఫిర్ జీనేకి తమన్నా హై..." అని పాడాలనిపించింది.
    
    "పాటలు వింటారా?" అడిగాడు.
    
    "ఒద్దు మీరే పాడండి" అన్నాను.
    
    "బావుందండీ....ఊరికే లిఫ్టు ఇవ్వటమే కాకుండా మిమ్మల్ని అలరించాలన్న మాట" అన్నాడు.
    
    నాకెందుకో ఈ కొద్దిసేపట్లోనే అతనితో బాగా చనువు పెరిగినట్లు అనిపించింది.
    
    "మీ ఇంటిదాకా దింపనా....కాస్త దూరంలో వదిలిపెట్టనా?" అని అడిగాడు.
    
    ఆలోచించి - "చాలా దూరంలో" అన్నాను.
    
    అతను ఆశ్చర్యాన్ని దాచుకోలేక - "వాట్!" అన్నాడు.
    
    "స్వేచ్చగా నడిచి వెళ్ళాలనిపిస్తోంది" అన్నాను.
    
    "ఓ! అయితే ఓ పనిచేద్దాం దార్లో గుడిశెలో ఓ కప్పు కాఫీ తాగి వెళదాం" అన్నాడు.
    
    "గుడిసెలోనా?" అన్నాను.
    
    "ఔను....చూద్దురుగాని రండి" అన్నాడు.
    
    ఒక అందమయిన బంగళా ముందు కారాగింది. దాని పేరు 'లవర్స్ హట్' అని వుంది.
    
    "ఇదే నా గుడిశ. ఎలా వుంది?" అడిగాడు.
    
    "అద్భుతం" అన్నాను.
    
    ఇంటి ముందున్న తోటే చాలు అతని టేస్ట్ చెప్పటానికి, ఇంటివరకూ పద్దతిగా వేసిన లాన్ శ్లాంటింగ్ గా వున్న రూఫ్ మీదకి పాకిన లేత రంగుల పువ్వులున్న క్రీపర్స్ ఒక రంగుల పొదరిల్లులా వుంది.
    
    లాన్ లో రెండు కుర్చీలూ ముందు చిన్న టీపాయ్ పొందిగ్గా వేసి వున్నాయి.
    
    "కూర్చోండి" అని లోపలికి వెళ్ళాడు.
    
    మనసంతా మెడిటేషన్ చేసినంత ప్రశాంతంగా మారింది. ప్రశాంతత పరిసరాల వల్ల రాదు. మనస్థితివల్ల వస్తుంది. మనసు బాలేనప్పుడు కోయిల పాటే కారుకూతలుగా చిరుగాలే భరించలేని రొదగా విసుగ్గా వుంటుంది.
    
    నా జైల్లో నాకెప్పుడూ చిరాగ్గానే వుంటుంది.
    
    అతను వచ్చేలోగా మేగజైన్స్ ఏవయినా చూద్దామని తీసుకున్నాను. 'భారతీయ శిల్పకళలు', 'భారతీయ సంస్కృతీ సంపదా' ఇలాంటివే కొన్ని పుస్తకాలున్నాయి. అతని టేస్ట్ అంచనా వెయ్యడం చాలా కష్టం అనిపించింది.
    
    ఇంతలో అతను వచ్చాడు. స్నానం చేసి ఫ్రెషప్ అయి వచ్చినట్లున్నాడు.
    
    తెల్లని లాల్చీలో స్వచ్చంగా వున్నాడు. "సారీ లేట్ అయింది" అన్నాడు కూర్చుంటూ డెనిమ్ పెర్ ఫ్యూమ్ తాలూకు మాస్క్ లైన్ వాసన ముక్కుపుటాలకి గుప్పున తగిలి ఒకలాంటి సంకోచం కలిగింది. మొదటిసారిగా ఇతను నా గురించి ఏమనుకుంటున్నాడో ఇలా అడగగానే అన్నిటికీ ఒప్పుకుంటున్నందుకు అన్న సందేహం కలిగింది.
    
    "బహదూర్" అని వాచ్ మెన్ ని పిలిచి లోపలికెళ్ళి వంటమనిషితో చెప్పి కాఫీ పంపించమన్నాడు.
    
    "నేనింక వెళతాను" అన్నాను.
    
    "కాఫీలు రానీయండి" అన్నాడు.
    
    "తాగాకే వెళతాను. మీరూ ఎప్పుడయినా మా ఇంటికి రావాలి" అన్నాను.
    
    "ష్యూర్! దానికోసమే ఎదురుచూస్తున్నాను" అన్నాడు.
    
    అతని కార్డ్ లెస్ మ్రోగింది. తీసి - "హల్లో.....హాయ్....కామినీ వాటే సర్ ప్రైజ్! ఎప్పుడు దిగావు.....రేపు కలుద్దామా....మా ఫ్లాట్ కొచ్చెయ్యి.....ఓ.కే....కాస్త బిజీగా వున్నాను బై" అన్నాడు.

 Previous Page Next Page