Next Page 
కేదారం పేజి 1

                                 


    
                                                     కేదారం

                                                                             డా . దాశరధి రంగాచార్య

 

                                    

   
    చంద్రుడెలాంటివాడు? భయపడే గుండెలాంటివాడు. ఆ విషయం తొలిసారి గ్రహించింది లాలా. వెన్నెల నిదురపోదు. సదా మేల్కొనే ఉంటుంది. అదీ ఆనాడే తెలిసిందామెకు. ఆమె గుండెలమీద వడగళ్ళవాన దాడిచేసింది. ఆమె చూస్తుండగానే నీలందుప్పటిలాంటి పాత ఆకాశం రూపంమార్చుకుంది. కొత్త ఆకసానికి రెండే రెండు రంగులున్నాయి. ఒకటి దుఃఖిత హృదయంలాంటి మసిపులుముకున్న  నీలంరంగు మరొకటి పెళ్ళికూతురు కళ్ళలోలాంటి అరుణిమ. కేదార రాగం ఈ రెండు రంగుల్తోనే ఏర్పడింది. ఈ రెండు రంగులే హృదయాకాశంలో వెలుగుచీకట్ల దోబూచులాటలు. ఈ రెండురంగులే ఆశకు నిరాశకూ సంకేతాలు.
    కళ పాటపాడుతూంది. లాలా వింటున్నది. అప్పుడు ఆమెకు స్పురించింది. కళ వెన్నెల రాత్రిని చిత్రిస్తూందని వెన్నెలరాత్రిని చిత్రించడానికి ఆ రెండురంగులే కావాలి.
    లాలా తరవాత ఆలోచించలేకపోయింది.
    కళ కొలను ఒడ్డున కూర్చుంటుంది. ఆమె భుజాన తంబురా ఉంటుంది. పాట పాడుతుంటుంది. కళ్ళు నీళ్ళలో ఆడిస్తుంటుంది. కళ పాట శ్రావ్యంగా ఉంటుంది. అందులో ఆకర్షణ ఉంది. అది జనాన్ని లాక్కొనిపోతుంది. వారు మెల్లమెల్లగా అడుగులువేస్తూ సాగిపోతుంటారు. వారి అడుగుల క్రిందినుంచి, వెన్నెల వెలుగులు పరుచుకున్న నీరు మెల్లమెల్లగా కదలిపోతుంటుంది. ఇంతలో వారి భుజాలకు మెత్తమెత్తని రెక్కలు మొలుస్తాయి. వారు రెక్కలు రెపరెపలాడిస్తారు. ఎగురుతారు. ఆకాశంలో విహరిస్తారు మబ్బులతో దోబూచులాడ్తారు.
    నేటి వెన్నెల్లో మధురవేదన ఉంది. ఉదాసీనం అయిన నవ్వుంది. ఈ ఉద్యానం పెరుగుతూంది - వామనునిలా అది ఆకాశాన్ని అంటుతూంది. పూలు వికసించాయి. వాటి కళ్ళలో ఏదో నిరీక్షణ ఉంది. లాలాకు నిరీక్షణ కనిపించింది. అనంతమైన నిరీక్షణ!
    ఆమె ఒక్క నీటిచుక్కకోసం లోకంసాంతం గాలిస్తూంది. కేకలు పెడ్తూ తిరుగుతూంది. ఆమె పెదవులు అక్తర్ మామ పెదవుల్లా ఆరిపోయాయి. ఎండి పోయాయి. ఆమె కళలా పచ్చబడిపోయింది. కలలుసైతం వట్టిపోయిన కనులు కలవరపడుతున్నాయి. తంబూరాకు తలానించి పాకుతూంది-సాగిపోతూంది.
    "కై సే కహుఁమై సాజన్ బివా నీంద్ వ అయే"
    "ఎలా చెప్పుదునే ప్రియుడులేక నిదురరాదని ఏల?"
    కేదార రాగపు స్వరాలు నలువైపులా వ్యాపించాయి. తెల్లని వెలుగులు పరచాయి. అవి దుఃఖపు చీకట్లు పారదోలే వెలుగులు, ఆశలు వెన్నెల వెలుగులు, వెలుగుల నిరీక్షణల నీడలు.
    లాలా జీవితంలో తొలిసారి వెన్నెల వెలుగులు చవిచూసింది. వారు వెన్నెల్లో విహారానికి వెళ్ళారు - అక్తర్ మామవెంట. ఆక్తర్ మామ కవిగానే తెలుసు లాలాకు. ఆనాడే ఆమెకు తెలిసింది అతడు విఫలప్రేమికుడని. కవి అన్వేషణకు బయలుదేరితే చంద్రుడు ముందు బయలుదేర్తాడట. కాగడా పట్టుకొని దారి చూపుతాడట. ఆక్తర్ మామ వెన్నెల్లో బయలుదేర్తాడు. గ్రామగ్రామం వాడవాడలా తిరుగుతాడు. ఏదో వెదుకుతూ తిరుగుతాడు. అది సూర్యుని వెలుగుకు కనిపించిందట. వెన్నెల్లోనే కనిపిస్తుందట. ఆక్తర్ మామ కూడా దేనికోసమో వెదుకుతాడని తెలిసి లాలా ఆశ్చర్యపడింది.
    ఇవ్వాళ ఆక్తర్ మామ దేనికోసమూ వెదుకుతున్నట్లులేదు. విరిసిన వెన్నెలను ఆనందిస్తూన్నట్లూ లేదు. వెళ్ళిపోతున్నాడు. కొండమీదినుంచి దొర్లే రాయిలా కాలిబాట వదిలాడు. అడవులవైపు సాగిపోతున్నాడు. కొద్దిసేపటిలో అంతా తోటలో కూడారు. కళ కేదారం పాడుతూంది. వింటున్నారు.
    స్వరం సుందరంగా ఉంది. రాగం రమ్యంగా ఉంది. సంగీతం వినే ఓపిక ప్రసాదించమని భగవంతుని ప్రార్దించింది.
    అక్తర్ మామ రాతిబెంచీమీద కూర్చున్నాడు. శిలాప్రతిమలా మారిపోయాడు. తల్లి తన ముద్దులకొడుకు శవానికి అగ్గిపెట్టినట్లు సిగరెట్టుమీద సిగరెట్టు అంటిస్తున్నాడు.
    'కళ ను చూస్తే లోకంలోని కళలన్నీ కాలికి బుద్ది చెపుతాయి. కొత్త కార్టూనిస్టు ఉబుసు పోకకు గీసిన స్కెచ్ లా ఉంటుందామె. ఆమె ఎవరినో ప్రేమించిందట వెర్రిగా. ప్రేమ ఫలించలేదట. దేవదాసిగా మారిపొయిందట. గుళ్ళోని రాతిదేవున్ని పలికించలేకపోయిందట. బయటపడిందట. విప్లవకారుల్లో కలిసిందట. అలంకారిక ప్రేమనుంచి వాస్తవ ప్రేమవైపు ప్రయాణం సాగించిందట అన్వేషణలో అరిగిన బాటలు, మాసిన మార్గాలుబట్టి పయనించింది. ఊళ్ళు గాలించింది. దేవాలయాలు వెదికింది. కమ్యూనిస్టు పార్టీ కార్యాలయానికి కూడా చేరింది. సంగీతజ్ఞానం ఆర్జించింది. కాని ఆమె వెదుకుతున్నవా డెక్కడున్నాడు? ఆమె మనోమందిరంలో ఉన్నాడు. ఆమె తంబురా తీవల్లో ఉన్నాడు.
    కళ వదనంలో నిరాశ నిట్టూరుస్తూంది. అయినా లాలా గెలిచింది. కళ వదనం వికసించింది. ఆమె కేదారం అందుకుంది. పాట మధురంగా సాగింది.
    "కైసే కహుఁమై సాజన్ బినా నీంద్ న ఆయే"
    గానంలో కరిగిపోయింది లాలా. కళను అప్పుడు అర్ధంచేసుకుందామె. కళకు పుట్టిన్నాటి నుంచీ కంటికి కునుకులేదు. భుజంమీద విచిత్రవీణ దాల్చుతుంది. పాట పాడుతుంది. మనసులో వెలసినవాడికోసం వెదుకుతుంది. ఊరూరూ, వాడవాడా తిరుగుతుంది. ఇది లాలా గ్రహించిన సత్యం.

Next Page