"ఇప్పుడు అలా రాజీపడక ఏం చేస్తావులే!"
అనసూయ చివ్వున తలెత్తి సావిత్రి ముఖంలో చూసింది.
"నీకు నిజంగా నా మీద కోపం వచ్చింది కదూ!" అనసూయ సంభాషణ మరోవైపు మళ్ళించింది.
"ఎందుకూ?"
"పెళ్ళికి పిలవలేదని?"
"అవును! కాపురానికి వచ్చాక ఒక ఉత్తరం వ్రాసావు! నయమే బిడ్డ పుట్టాక రెండు వార్తలూ తెలియజేస్తూ రాయలేదు."
"పోనియ్ ఇప్పుడు కోపం పోయిందా? నా ఉత్తరానికి సమాధానం ఇవ్వకపోతే ఎంత బాధపడ్డానో తెలుసా!"
"కొయ్!"
"నిజమే!"
"నిజమే అయితే మరో వుత్తరం రాసేదానివి. అయినా కొత్త కాపురం. నీకు వుత్తరాలు రాసే తీరిక ఎక్కడ్లే"
"నీ మొహం!"
"అది సరేగాని ఎన్నో నెల?"
"ఛ! ఇంకా అదేం లేదు"
"మీ ఆయన ఆఫీసు నుంచి ఎన్ని గంటలకు వస్తాడు?"
"మద్రాసు వెళ్ళారని చెప్పాను గదే!"
"అవునవును! మీ హనీమూనే చెడగొట్టాను పానకంలో పుడకలా తయారయ్యాను."
"నీ మొహం"
"అనూ! నీ మొహం అనే మాట మాత్రం నువ్వు మర్చిపోలేదే! మాటకు ముందు అనేదానివి నీకు 'నీ మొహం' అని నిక్ నేమ్ పెట్టింది రమ గుర్తుందా? ఇన్నిటికీ నీ హనీమూన్ చెడగొట్టిన దాన్నయ్యాను. ఒకేసారి పిల్లలతో హనీమూన్ కు వెళ్ళు. ఒక నవలలో చదివాను. అప్పుడు ఇంకా ప్రేమ ఘాటుగా ఉంటుందట."
"తెలుగు నవలా?"
"అవును? అది సరేగాని మీ ఆయన ఎప్పుడొస్తాడే."
"నాలుగు రోజుల్లో వస్తారు. నీ సంగతి చెప్పవేమే?"
"ఏం చెప్పను? నువ్వు అడగందే?"
"అమ్మా నాన్న బాగున్నారా?"
"ఆ"
"నువ్వు పెళ్ళెందుకు చేసుకోలేదు?"
సావిత్రి సమాధానం ఇవ్వలేదు.
అనసూయ సావిత్రి ముఖంలోకి చూసింది.
సావిత్రిముఖం అదోలా అయిపోయింది.
కళ్ళల్లో నీలినీడలు కదిలాయి.
అనసూయ సావిత్రినే చూస్తూ వుండిపోయింది.
ఏమైంది దీనికి?
ఎందుకు పెళ్ళిమాట ఎత్తగానే అంత దిగులుగా కనిపించింది?
"నువ్వు వెళ్ళిపోయావ నేను ఎం.ఏ సైకాలజీ చేశాను. ఒక సంవత్సరం యింట్లోనే వుండిపోయాను. అది సరేగాని మీ అమ్మగారు ఎక్కడున్నారు!"
"అన్నయ్య దగ్గర కాకినాడలో వున్నారు."
అనసూయకు సావిత్రి తన నుంచి ఏదో దాస్తున్నట్టు అర్ధం అయిది. అనసూయ మళ్ళీ ఆమె పెళ్ళి గురించి అడగలేదు.
5
రెండురోజులు అనసూయ సావిత్రికి హైదరాబాద్ అంతా తిప్పి చూపించింది. చార్ మీనార్, సాలార్ జంగ్ మ్యూజియం, గండిపేట, గోల్కొండ మొదలైన చూడవలసినవన్నీ చూపించింది.
లాడ్ బజార్ లోని గాజుల దుకాణాలను చూసి సావిత్రి ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బై పోయింది. రకరకాల గాజులు పిచ్చిగా కొన్నది. అనసూయకోసం కూడా వద్దంటున్నా వినిపించుకోకుండా అద్దాలూ, చిన్నపూసలూ పొదిగిన లక్కగాజులు కొన్నది.
"నీకు నేను ఇవ్వాలి. నువ్వు నాకివ్వడం ఏమిటి?" నొచ్చకుంటూ అన్నది అనసూయ.
"నన్ను పరాయిదాన్నిగా చూస్తున్నావన్న మాట!"
"అలాగ ఈ జన్మలో అనుకోను!"
"మరి ఎవరు కొంటేనేం!"
అదే సమయంలో పెళ్ళిమేళాలు విన్పించాయి. షహనాయి, నౌబాత్ ఖానాలు మోగుతున్నాయ్. గాజులుకొట్టు బయటకొచ్చి అనసూయ చూసింది.
"సావీ! సావీ! ఇలారా!"
అప్పటికే ఏదో ఆలోచిస్తున్న సావిత్రి అనసూయ ప్రక్కన వచ్చి నిల్చుంది.
పెళ్ళి కొడుకు గుర్రం మీద ఉన్నాడు ముఖం అంతా మల్లెపూల దండలతో కప్పబడి ఉన్నది.
"ముస్లింల పెళ్ళికొడుకు ఆ దుస్తులు చూడు నక్కీ కుట్టి ఎలా మెరుస్తున్నాయ్యో!"
సావిత్రి ఉలకలేదు పలకలేదు.
అనసూయ ప్రక్కకు చూసింది. సావిత్రి ముఖం ఏదోగా వున్నది. కళ్ళు పెళ్ళికొడుకుని చూడడం లేదు. దూరంగా అనసూయ చూపుకు అందని దేనినో చూస్తున్నట్టు దూరంగా అనసూయ చూపుకు అందని దేనినో చూస్తున్నట్టు ఉంది.
"ఏమిటే సావీ! అలా అయిపోయావేం?"
సావిత్రికి అనసూయమాట విన్పించలేదు.
సావిత్రి తృళ్ళిపడింది.
"ఏమిటే అంత ఆలోచన?"
సావిత్రి వెంటనే సమాధానం ఇచ్చే స్థితిలో లేదు. పూర్తిగా మూడ్ నుంచి బయటపడలేదు.
అనసూయ జాలిగా సావిత్రి ముఖంలోకి చూసింది. పాపం! తనకు ఇంకా పెళ్ళికాలేదుగా? బి.ఏ. చదివే రోజుల్లోనే ఎం.ఏ. చదవననీ, పెళ్ళి చేసుకుంటాననీ అనేది. పెళ్ళి మేళాలు వింటూ, పెళ్ళికొడుకుని చూసేసరికి ఆమె మనసు ఆమె వశం తప్పింది. అనసూయ సావిత్రిని చూస్తుంటే జాలివేసింది.
"వెళ్ళిపోదామా ఇంకా గాజులు చూస్తావా?"
"వెళ్ళిపోదాం!" యధాలాపంగా అన్నట్టే అన్నది.
టాక్సీ ఇల్లు చేరేంతవరకూ సావిత్రి మాట్లాడలేదు. సీటుమీద వాలి కళ్ళు మూసుకుంది.