"చూడండీ! వీడెవడో రౌడీ, చెయ్యిపట్టుకులాగాడు" కళ్ళనీళ్ళు పెట్టుకుంది.
"ఎవడ్రా నువ్వు? ఒంటరిగా కనిపించినంతమాత్రాన చెయ్యిచ్చుకు లాగుతావా? సిగ్గులేదూ? వేషం చూస్తే మహరాజులా వున్నావ్" అరిచాడు.
"చూస్తారేంరా? ఇవాళ ఈ ఆమ్మాయయింది. రేపు మరొకరవుతారు. ఇలాంటి రోమియోలని ఊరికే వదిలేయకూడదు. నాలుగు తగిలిస్తే సరి, బుద్దొస్తుంది" అనడమే ఆలస్యం, కొన్ని చేతులు అజయ్ మీద విరుచుకు పడినాయి.
ఆమె తప్పించుకుని వెళ్ళిపోయింది. ఒళ్ళు హోనమై పడిపోయాడు అజయ్. నెమ్మదిగా ఒక్కొక్కరే వెళ్ళిపోయారు. చచ్చాడ్లే నా కొడుకు" అనుకుంటూ.
అంతసేపూ ఎక్కడికెళ్ళాడో తెలీని అజయ్ ఫ్రెండ్సంతా వెతుక్కుంటూ పార్కుకేసి వచ్చారు. చలనం లేకుండా పడున్న అజయ్ ని చూసి, కంగారుగా గెస్ట్ హౌస్ కి మోసుకెళ్ళారు. రక్తం కారినచోటల్లా శుభ్రం చేసి పట్టీలు వేశారు. మందులు, ఇంజక్షన్ లూ ఇచ్చారు. కాస్సేపటికి అజయ్ కి తెలివొచ్చింది. జరిగిన కథంతా చెప్పాడు.
"టిట్... ఫర్... టాట్... అన్నమాట" అన్నాడు వేణు.
"అన్నింటికీ బెట్స్ బెట్స్ అంటావ్, అయిందా పెళ్ళి? ఇంకెప్పుడూ ఇలాంటి పిచ్చి బెట్స్ కట్టకు" అన్నాడు మిశ్రా.
"ఏదేమైనా ఆ అమ్మాయి ధైర్యానికి మెచ్చుకోవాల్సిందే" అంది హేమ.
"హాట్సాఫ్" అంది మాలతి.
ఆ రాత్రంతా ఆమె కబుర్లే. అజయ్ కి 'కాంపోజ్' ఇచ్చి పడుకోబెట్టారు.
మాటలలో పడి ఏ అర్థరాత్రికో నిద్దరపోయారు అందరూ.
నిద్రలేచేసరికి బాగా ప్రొద్దుపోయింది. బద్ధకంగా ఉందేమో, కాఫీలు తాగుతూ మళ్ళీ బాతాఖానీలో దిగారందరూ. రోజూ ప్రొద్దున్నే హడావుడిగా ఆసుపత్రికి పరుగెత్తడం, రకరకాల రోగుల మధ్య, అనేక రకాల జబ్బులను చూస్తూ, ఉపశమనం కలిగంచడానికి ప్రయత్నిస్తూ తిరిగే డాక్టర్స్ విశ్రాంతికీ, మనశ్శాంతికీ కూడా దూరమవుతారు. రాత్రనక, పగలనక శ్రమపడి పనిచేసే వాళ్ళకి అప్పుడప్పుడు ఇటువంటి సరదాలు అవసరం.
అందరూ డైనింగ్ హాల్లో టిఫిన్ పూర్తిచేసి, అజయ్ మంచం దగ్గరకొచ్చి కూర్చున్నారు.
"లోపలికి రావచ్చా?"
"మాధవి"
కంగారుగా
"మళ్ళీ ఎందుకొచ్చింది?" అని భయపడుతూ అన్నారు వేణూ, మిశ్రా.
చూపులకు ముద్దబంతి పువ్వులా ఉన్న ఈ ముద్దరాలేనా ఇంత ధైర్యం చేసిందీ? అని ఆశ్చర్యపోయారు హేమ, మాలతి, సంగీతా.
"రండి" అన్నాడు అజయ్.
నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ వచ్చింది ఆమె. బిక్కుబిక్కుమంటూ అందరివంకా చూస్తున్న ఆ భీతహరిణేక్షణభావాలు చదివినట్టు" మనం అవతలికి పోదాం రండి" అన్నాడు కుమార్.
నెమ్మదిగా ఒక్కొక్కరూ అవతలికి వెళ్ళిపోయారు. "ఊ? చెప్పండి ఎందుకొచ్చారో?" అన్నాడు ముక్తసరిగా అజయ్.
"దెబ్బలు బాగా తగిలాయా?" తలొంచుకునే అడిగింది ఆమె.
"ఆ మీ పుణ్యమా అంటూ బాగానే తగిలాయి" అన్నాడు.
"చూడండీ! శరీరానికి తగిలిన దెబ్బలు మందు పడితే మానిపోతాయ్. కానీ, మనసుకి తగిలిన దెబ్బలు జన్మలో మానవు. మీ బెట్ కోసం ఆరోజు బజారులో నా పరువు తీశారు. నలుగురి నోళ్ళలోనూ పడ్డ ఆడపిల్ల జీవితం ఏమవుతుందో ఆలోచించారా?"
"క్షమించండి. నాకు తెలుసు. నేచేసింది తప్పేనని, తగిన శాస్తి చేసి నా కళ్ళు తెరిపించారు"
"దయచేసి అలా అనకండి. మీకు శాస్తి చేయించడం నా ఉద్దేశం కాదు. కాని మీరు చేసిన పనివలన ఒక ఆడపిల్ల జీవితంలో ఎటువంటి పరిణామాలొస్తాయో తెలియజెయ్యడం నా విధిగా భావించాను. ఎందరికో ప్రాణాలు పోసి ఉద్దరించగల డాక్టర్లు మీరు. 'బెట్' అంటూ పంతాలకు పోయి అయిన పనీ, కానీ పని చెయ్యడం ఉచితం కాదు."
ఆమె అంటున్న ప్రతి మాటా అజయ్ చెవులలో రింగుమంటోంది. ఆ పలుకులలోని నిజాయితీ అతణ్ణి ముగ్ధుణ్ణి చేస్తున్నాయి.
"మాధవి నన్ను క్షమించు. మరెప్పుడూ ఇటువంటి పనులు చెయ్యను. "ప్రామిస్" ఆమె చేతిలో చెయ్యేశాడు.
సంతోషంగా నవ్వింది ఆమె.
"బాబోయ్! మళ్ళీ కేకలు పెడతావేమో!" చెయ్యి లాక్కోబోయాడు నవ్వుతూ.
రెండు కప్పులలో కాఫీ, బిస్కట్లూ తీసుకుని అక్కడికొచ్చిన కుమార్ రెండడుగులు వెనెక్కేశాడు.
ఆమె చటుక్కున చెయ్యి లాక్కుంది.
"కాఫీ తీసుకోండి" అన్నాడు అజయ్.
"ఇప్పుడెందుకండి అనవసరంగా శ్రమ తీసుకుంటున్నారు" అంది కుమార్ కేసి చూస్తూ మాధవి.
"శ్రమపడింది నేను కాదు. క్యాంటీను కుక్కు."
అందరూ ఫకాల్మని నవ్వేశారు.