"ఛీ...ఛీ అలా ఏడవకూడదు. తప్పు. లే" అని తన కాళ్ళమీద తలపెట్టి ఏడుస్తున్న కోడల్ని లేవనెత్తి అక్కున చేర్చుకుంది తులశమ్మ.
"నేను రాక్షసిని. నిర్దయురాలిని. హృదయంలేని శిలని. మిమ్మల్ని అనరాని మాటలన్నాను. ఎంతో కష్టపెట్టాను. మీరు పెద్దమనసుతో నన్ను క్షమించినా, ఆ దేవుడు నన్ను క్షమించడు" అంటూ వెక్కివెక్కి ఏడ్చింది నర్మద.
"తెలియనితనం వల్ల నువ్వు చేసిన తప్పులన్నీ పశ్చాత్తాపంతో కడుక్కుపోయాయి. వూర్కో" అంది తులశమ్మ.
సింధూ, కావేరీ ప్రేక్షకుల్లా చూస్తుంటే "పదండత్తయ్యా మనింటికెళ్ళిపోదాం. పిల్లలెదురుచూస్తుంటారు" అని ఆవిడ చీరలూ రవికెలూ మడతపెట్టసాగింది నర్మద.
"వెళ్ళిపోతావా అత్తయ్యా?" అంది సింధు.
తులశమ్మ లేచి సింధు తలమీద చెయ్యేసి నిమురుతూ "ఎక్కడికెళ్ళిపోతున్నాను? మళ్ళీ వస్తూనే వుంటాను నా బంగారుతల్లి దగ్గరకి" అని తలమీద ముద్దుపెట్టి "సింధూ! నువ్వు నన్ను మహారాణిలా చూశావు. ఇసుమంత కష్టం కలగనివ్వలేదు. నువ్వేకాదు ఆ అబ్బాయి కూడా కన్న కొడుక్కన్నా ఎక్కువగా చూశాడు. మీ ఆదరణా, ఆప్యాయతా నేను పోయేదాకా మరిచిపోను. ఇదే ఆదరణా ఆప్యాయతా నా కొడుకు దగ్గర దొరికితే ఎంత బావుండేదని ప్రతిరోజూ ఏడ్చేదాన్ని. ఎందుకంటే మొదటి నుంచీ కొడుకు దగ్గరుండడం విధాయకం అని మన రక్తంలో జీర్ణించుకుపోబట్టి. అలాగే మీ అత్తగారికీ ఉంటుంది తల్లీ! మనవల మీదా, కొడుకు మీదా మమకారం లాగుతుంది. పేగు సంబంధం కదా! పెద్దవాళ్ళం, ఛాదస్తంగా ఏదో అంటుంటాము. పట్టించుకోకూడదు. 'నొప్పించకతానొవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు' అన్నట్లుగా ఉండాలి" అంటూ అటూ ఇటూ చూసి చిన్నగొంతుకతో "జీతానికి పనిచేసేవాళ్ళకి డబ్బుమీద తప్ప, మనమీదేం ఆపేక్ష ఉండదమ్మా! నీ అత్తగారికి, నీ పిల్లల మీదున్నంత ప్రేమ పనిమనిషికుంటుందా? పైగా ఇంకో విషయం కూడా వెళ్ళిపోతున్నాను కాబట్టి చెబుతున్నాను. నేను మంచంలో ఉన్నంతకాలం మీ చిట్టెమ్మ బాగానే ఉందికానీ ఈ మధ్య నేనింట్లో తిరగడమొచ్చాకా అదీ, ఇదీ అలా చేస్తావెందుకూ? ఇన్ని కొన్నావెందుకూ? అనడుగుతుంటే దానికి కంటక ప్రాయమైపోయాను. 'మీకిన్ని ఆరాలెందుకూ? మా అమ్మగారే అడగరు' అంటూ మొహం ముడుచుకుంటోంది. ఒక్కోసారి పిల్లల్ని కూడా నానామాటలూ అంటోంది. నువ్వేం పట్టించుకోవుగానీ నీ ఇంట్లో నెలకి ఏడెనిమిదొందలు నష్టమవుతోంది. షాపులో ఫస్టునాడు డబ్బు కట్టడమేకానీ ఏది ఎంతెంత ఇల్లుజేరుతుందో నీకక్కర్లేదు. ఇంట్లోంచి ఏ వస్తువు మాయమవుతుందో కూడా నువ్వు చూసుకోవు. నీకు తీరుబడిలేదు. దానికిది బాగా అలుసైపోయింది. నేను కానీ మీ అత్తకానీ ఉంటే దాని ఆటలు సాగవేమోనని భయం. అందుచేత ఏదో ఒక పోట్లాట పెట్టుకుని ఆవిడ్నీ నన్ను కూడా వెళ్ళగొట్టాలని ప్రయత్నిస్తోంది. పిల్లలు కూడా చిట్టెమ్మ షాపు దగ్గర ఏవేవో కొని ఎవరెవరికో ఇచ్చింది, కూరలు కొని ఎక్కడో ఇచ్చి వచ్చింది అని చెప్తున్నారు! మీరా లోన్లవీ తీసి బంగళా కట్టుకున్నవాళ్ళు. సంపాదనంతా రెక్కలు ముక్కలు చేసుకుని సంపాదించినదే కానీ వెనుక ఆస్తిపాస్తుల మీదొస్తున్న రాబడి కాదు. ఇంట్లో ఖర్చు అధికం! కాస్త చూసుకో. నీకు టైముండదు! మీ అత్తగారుంటే దానికి పగ్గంవేసిన దానివవుతావు. అదీకాక అబ్బాయి కూడా తల్లి వెళ్ళిపోయాక చాలా బాధపడ్తున్నాడు. మెత్తనివాడు. నోరు తెరిచి ఏమీ అనడు కానీ ఇదివరకటిలా లేడు. మన ముందు అమ్మా అమ్మా అంటూ వగలొలకబోసే ఈ పనివాళ్ళే వెనకాతల, ఆ మొగుడంటే లెక్కలేదు. అత్తని వెళ్ళగొట్టింది అని ఇరుగూ పొరుగూ వాళ్ళకి ప్రచారం చేస్తారు. ఇంట్లో విషయాలు బజార్న పడెయ్యడం వాళ్ళకో సరదా. ఇంతగా ఎందుకు చెబుతున్నానంటే నా సింధు బంగారు తల్లి. దాన్ని గురించి ఎవరైనా చెడుగా అనుకుంటే నేను భరించలేను. దేవత బొమ్మ మీద ఏ రంగో ఒలికిపోతే ఎంత బాధగా ఉంటుందీ? అలాగే వుంటుందమ్మా పుట్టింటివాళ్ళకు ఆడపిల్ల మీద మాటొస్తే. నేనెన్నోసార్లు గమనించాను. ఆ చిట్టెమ్మ ఏమైనా అలా కాదు ఇలా అని చెబితే నువ్వు వింటావు. ఒక్కోసారి దానికి కోపమొస్తుందేమోనని చాలా నెమ్మదిగా సమాధాన పరుస్తూ మాట్లాడతావు. ఎందుకంటే అది పనిమానేసి వెళ్ళిపోతుందేమోనని నీకు భయం. కానీ అదే అణకువా, నెమ్మదితనంలో సగం నీ అత్తగారి దగ్గర చూపిస్తే గనుక ఆవిడెక్కడికీ వెళ్ళదు. నిన్నూ, పిల్లల్నీ కనిపెట్టుకుని ఇక్కడే ఉంటుంది. సొంతమనిషి. సాటి పరాయివాళ్ళెప్పుడూ రారు. డబ్బు కోసమో మరింకే ఆశతోనో కాక ప్రేమతో పేగుపాశంతో చేసేవాళ్ళు దొరకడం బహుకష్టం! డబ్బు పెట్టినా నావాళ్ళు అనే మనుషులు దొరకరమ్మా. ఎంతో జీవితాన్ని చూసి ఆఖరి మజిలీలో వున్న అనుభవంతో చెప్తున్నాను విను" అంది.
"నువ్వన్నది నిజమే అత్తయ్యా! నేను నువ్వొచ్చినప్పటి నుంచీ ఎంత బిజీగా ఉన్నా తీరుబడి చేసుకుని నీతో అరగంటైనా గడుపుతున్నాను. కానీ ఆవిడతో ఎప్పుడూ అలా గడపలేదు. మనసు విప్పి మాట్లాడలేదు. ఏ మాటంటే ఏమనుకుంటారో అని నేనూ, ఆవిడా కూడా గిరిగీసుకుని కూర్చుంటాం. నిజమే! కలసి మాట్లాడుకుంటే మనకింతలేసి సమస్యలుండవనిపిస్తోంది. నేను నా పొరపాట్లు దిద్దుకోవడానికి ప్రయత్నిస్తాను. నా అంతట నేనే వెళ్ళి ఆవిడను తీసుకొస్తాను. కోడలిని చూడగానే నీ కళ్ళల్లో కనిపించిన ఆనందం ఆవిడ కళ్ళల్లోనూ చూడాలి. పిల్లలు, అరుణ్ నన్నో దోషిలా చూస్తున్నారేమో అనిపిస్తోంది. త్వరగా నా తప్పులు దిద్దుకోవాలి" అని స్థిరంగా చెప్తున్న సింధూని దగ్గరకు తీసుకుని నుదుటిమీద చుంబించింది తులశమ్మ.
నర్మదా, కావేరి తులశమ్మని తీసుకుని వెళ్ళిపోయాక ఇల్లంతా ఒక్కసారిగా బావురుమనిపించింది సింధుకి. నాలుగురోజులే ఉండి వెళ్ళిపోయినప్పటికీ తులశమ్మ బాగా అలవాటు అయిపోయింది పిల్లలకి. ఎప్పుడూ బిజీగా ఉండే తల్లిదండ్రులతో తీరని సరదాలన్నీ ఆవిడ దగ్గర తీర్చుకునేవారు. రోజూ రాత్రుళ్ళు చెరోప్రక్కనా కూర్చోపెట్టుకుని కథలు చెప్తుంటే ఇంతింత కళ్ళు చేసుకుని వినేవారు. తనొచ్చినప్పటినుండీ రమ్యకి జుట్టు కత్తిరించనివ్వలేదు తులశమ్మ. ఓపిగ్గా జడేసి సాయంత్రంపూట దొడ్లో పూసిన పువ్వులు మాలకట్టి పెట్టేది. "వీరివీరి గుమ్మడిపండు..." అని ఆవిడ కళ్ళుమూసి ఆడిస్తుంటే పిల్లల సంతోషం చెప్పనలవికాదు. "అమ్మమ్మా ఇక్కడే వుంటావు కదూ! ఎక్కడికీ వెళ్ళవుగా" అని రోజూ అడిగేవారు. ఇంటికొస్తూనే "అమ్మమ్మా అమ్మమ్మా" అంటూ ఆవిడ గదిలోకెళ్తారు. ఆవిడ లేదని తెలిస్తే ఇల్లు పీకి పందిరేస్తారు. రమ్య రాగం మొదలెడ్తే ఆపదు. ప్రొద్దుటే రంయనీ, తేజానీ తీసుకుని బజారుకెళ్ళాడు అరుణ్. వాళ్ళొచ్చేలోపల తను అత్తగారిని తీసుకురావాలి. వాళ్ళకి ప్రెజెంట్ సర్ ప్రైజ్ ఇవ్వాలి అనుకుంటూ సింధు గబగబా తయారై బయల్దేరింది.