"పిల్లాడేదో తీస్కుంటే ఇలా ఇంటిమీదికొచ్చి ఇంత గొడవ చేస్తావా? ఏం తీసుకున్నాడో చెప్పు డబ్బులు మీ మొహాన కొడ్తాను" అంది వెనక్కి వెనక్కి అడుగులేస్తూ నర్మద.
"ఓయబ్బో మగారాణి! డబ్బులు నా మొఖాన కొట్టుద్దండీ. ఈ యవ్వారం ఎన్నాల్లకెల్లి జరుగుతుందో ఎవరికి ఎరుక? ఈనాడు నాకల్ల పడింది" అంటూ గోపీగాడ్ని రెండు చెంపలూ వాయించి నర్మదవైపు తోసింది.
నర్మద తల్లిపేగు పెరపెరమంది. "పసిపిల్లవాణ్ణి కొట్టడానికి నీకు చేతులెలా వస్తున్నాయి" అంది ఏడుపు బిగపడ్తూ.
"ముసల్ది కాలుజారి పడితే నానాతిట్లూ తిట్టి ఎల్లగొట్టడానికి నీకు రాలే చేతులు? అలాగే వచ్చాయే. దరమాత్మురాలిని ఎంత రొష్టుపెట్టావో మేమంతా చూస్తూనే వున్నామే. ఇంతకాలానికి నీ పిలక నా చేతిలో చిక్కి ఇట్టా వచ్చాను" అంది నర్మదమీదికొస్తూ.
"అయితే ఇప్పుడేమంటావు? నా ఇంటి విషయాలన్నీ ఎత్తి నా పరువు బజారుకీడ్చి న్యూసెన్సు చేస్తున్నావని పోలీసు కేసు పెడ్తాను" అంది భయంతో వణికిపోతూ.
"ఏంటీ! నామీద పోలీస్ కేస్ పెడ్తావా" అంటూ నర్మద జడ అందిపుచ్చుకుని ఒక్క గుంజు గుంజింది.
నర్మద కెవ్వుమని అరిచింది.
"పిలవ్వే ఎవరొస్తారో చూద్దాం! పోలీసోడ్ని పిలుస్తావో లేక ఇంకెవడ్నన్నా పిలుచుకుంటావో?" అంటూ అంతకంతకూ రెచ్చిపోతూ బుగ్గలు పొడిచింది నూకాలమ్మ.
"ఏయ్ ఏమిటిది? మంచీ మర్యాద ఉండక్కర్లేదా?" అన్న గద్దింపు వినబడి నూకాలమ్మ నర్మదని విడిచి వెనక్కి తిరిగింది. చీరె పైకెగ్గట్టి బిరబిరా వచ్చింది కావేరి. నూకాలమ్మకీ నర్మదకీ మధ్య వచ్చి నిలబడుతూ "ఏం జరిగిందలా రెచ్చిపోతున్నావు?" అనడిగింది కోపంగా.
"నీకెందుకమ్మా మధ్యలో? నువ్వుండు! దీని పిల్లగాడు నా కొట్టంతా కొల్లగొడ్తుంటే నేనూరుకుంటానా?" అంది నూకాలమ్మ.
"చిన్నపిల్లాడు తెలీక తీస్తే మందలించాలి. తల్లిదండ్రులకి చెప్పాలి. ఆ తర్వాత నీ నష్టమెంతో అది తీసుకుపోవాలి గానీ ఇలా యాగీ చేస్తావా?" అంది ఉరిమిచూస్తూ.
"ఏటమ్మా నువ్వు ఈ యమ్మ తరుపున మాటాడ్తన్నావు? దీనికెంత పొగరో నీకు తెల్దు" అంటూ ఏదో చెప్పబోతుండగా_
"నువ్వేం లోకోద్ధరణ చెయ్యక్కర్లేదు. నీ పని నువ్వు చూసుకో" అంది.
"ఏదో కోపం ఆపుకోలేక నాలుగు వాగాను. అంతేగానీ నాకేవన్నా ఇరోదమా?" అంటూ తలగోక్కుంటూ వెనక్కడుగేసి "ఏటీ ఇంట్లో పన్లు మానేసి జాతర చూస్తున్నారు. పదండెహె!" అంటూ జనాన్ని చెదరగొడ్తూ, సణుక్కుంటూ "నువ్వు సెప్పావని పోతున్నానమ్మో" అంటూ బొడ్లోంచి ఆకు తీసి సున్నం రాసుకుంటూ వెళ్ళిపోయిందది.
నలుగురిలో జరిగిన అవమానానికి నర్మద కుమిలి కుమిలి ఏడవసాగింది. కావేరి నెమ్మదిగా ఆమె భుజంమీద చెయ్యేసి "బాధపడకండి. దాని నోరంతే! అనడమేకాని అవతలివాళ్ళెంత బాధపడ్తున్నారో ఆలోచించలేని అజ్ఞాని" అంది.
నర్మద వెంటనే ఆమె చెయ్యి గట్టిగా పట్టుకుని "అంటే ఎంత బాధగా ఉంటుందో నాకిప్పుడే తెలిసింది కావేరి! ఇన్నాళ్ళు నేనొకళ్ళననడమే కానీ నన్నెవరూ మొహంమీదిన్ని మాటలనలేదు. అందుకే ఆ అవమానం, బాధా నాకు తెలియలేదు. నాకిప్పుడే తెలిసింది నా నోటి వల్ల ఇతర్లెంత బాధపడ్డారో!" అంటూ ఇంక మాట్లాడలేక వెక్కి వెక్కి ఏడ్చింది.
"ఊర్కోండి! మీరిలా బాధపడ్తూ కూర్చుంటే ఎలా? లేచి పిల్లల్ని చూసుకోండి. వాళ్ళసలే బిక్కచచ్చిపోయున్నారు. గోపీగాడ్ని దగ్గరకు తీసుకుని నెమ్మదిగా సముదాయించండి. వాడు భయపడిపోయాడు. మీరీపూట వంట కూడా చెయ్యొద్దు. నేనే పంపిస్తాను. ఆయనొచ్చేవరకూ ఒంటరిగా ఉంటే ఏవేవో ఆలోచనలు వస్తాయి. తాళం పెట్టి మా ఇంటికొచ్చేయండి... పదండి" అంటూ బలవంతపెట్టి పిల్లల్నీ, నర్మదనీ ఇంటికి తీసుకొచ్చింది కావేరి.
"రామ్మా రా!" అంటూ ఎదురొచ్చి ఆప్యాయంగా ఆహ్వానించింది వర్ధనమ్మ. పిల్లల్ని తీసుకుని "రండి మనం అప్పచ్చులు తిందాం" అంటూ లోపలికి తీసుకెళ్ళింది జయ. కావేరి వేడివేడిగా కాఫీ తెచ్చిచ్చి, "మొహమాటపడొద్దు. అయినా ఇరుగు పొరుగన్నాక ఒకరి కష్టంలో ఒకరు పాలుపంచుకోవాలి" అంది.
"మీ మంచితనంతో నన్ను చెప్పుపెట్టి కొట్టినదానికంటే ఎక్కువ శిక్ష వేస్తున్నారు. ఇన్నాళ్ళ పరిచయంలో నేనెప్పుడూ మీతో ఒక మంచిమాట కూడా మాట్లాడలేదు. పైపెచ్చు సమయం దొరికినప్పుడల్లా నొప్పించాను. క్షమించండి అని అడగడానికి కూడా నాకర్హత లేదు" అంది ఏడుస్తూ.
"క్షమించడానికి నువ్వేమంత తప్పుచేశావమ్మా! మమ్మల్ని కాదుగాని ఆ మహాతల్లిని దేవతలాంటి మనిషిని నువ్వు తప్పకుండా క్షమాపణ అడగాలి. ఆఖరిరోజుల్లో ఆమె తృప్తిగా నీ చేతుల్లో కన్నుమూసే భాగ్యాన్ని ఇవ్వమ్మా. పరాయివాళ్ళు పంచభక్ష పరమాన్నాలు పెట్టి రాజవైభవంగా చూసినా అయిన వాళ్ళ దగ్గర పచ్చడి మెతుకులు తిన్న సాటిరాదు. తల్లి కొడుకు నెత్తిన రాయెడ్తాడని కదూ, నెత్తిమీద పెట్టి పెంచుకుంటుంది" అంది వర్ధనమ్మ.
"పిన్నిగారూ! ఇంక చెప్పకండి. అనకు సిగ్గుతో చచ్చిపోవాలనిపిస్తోంది" అంది రెండు చేతులతో మొహం కప్పుకుని.
"రేపు మనం సింధూవాళ్ళింటికెళ్తున్నాం.. వచ్చేటప్పుడు అమ్మమ్మగారితో వస్తాం" చెప్పింది కావేరి ఆమె తల నిమురుతూ.
"తప్పకుండా!" అంటూ కౌగిలించుకుంది కావేరిని.
* * * *
"నువ్వు చేసిన పని బాగాలేదమ్మా! అలా వచ్చెయ్యకుండా ఉండాల్సింది" అంది వసుధ తల్లితో.
"నువ్వు కూడా అలా అంటావేంటే? నాముందే ఆ అమ్మాయి వాణ్ణి తీసిపారేసి మాట్లాడ్తుంటే నాకెలా వుంటుందీ? అత్తగారిగా నాకెలాంటి గౌరవం లేకపోయినా భర్తగా వాణ్ణన్నా గౌరవించద్దూ! తనెంత చదువుకుందో వాడూ అంతే చదువుకున్నాడుగా" అని ఆవిడ అంటుంటే "మీ అమ్మాయెంత చదువుకుందని నామీద ఆధిక్యత చూపిస్తోందండీ!" అన్నాడు చక్రధర్ వెనుకనుంచి.
అనుకోని సంఘటన ఎదురైనట్లు తెల్లబోయి చూసిందావిడ.
"అక్కడున్నది చదువుకాదు! చనువు" అన్నాడు అతను నవ్వుతూ.