ఆచారి భార్య జయలక్ష్మికి పెళ్లైన పన్నెండేళ్ల తరువాత వచ్చిన కాన్పు ఇది. సహజంగా కొంచెం అపురూపమే అయితే జయలక్ష్మి మరీ అపురూపం చేస్తూంది! మంచం మీది నుండి కాలు క్రింద పెడితే కడుపులో బిడ్డ కందిపోతుందేమోనన్నంత సుకుమారం ఒలకబోస్తూంది!
జయలక్ష్మి వాగ్దాటికి పనిమనుషులెవరూ ఆ ఇంట్లో నాలుగు రోజులు నిలువరు! సాధారణంగా పనులు ఇంట్లో వాళ్లే చేసుకోవడం అలవాటు. శంకరి వచ్చాక వంటపని, అంట్ల పని అన్నీ ఆమె మీదనే పడ్డాయి!
"ఛీ! స్వంత చెల్లెలికి తిండి పెట్టడానికి పనిచేయించుకొనే దౌర్బాగ్యుడిలా కనిపిస్తున్నానా?" అని ఆచారి అన్నాడే కాని, ఇప్పుడు చెల్లలు చేయకపోతే ఇంటో వంటా వార్పుకి చాలా కష్టమయ్యేట్టుగా వుంది! ఇంట్లో చెల్లెలు లేకపోతే అది వేరే సంగతి! తనే చేసి పెట్టేవాడేమో భార్యని కూర్చోబెట్టి!
* * * *
పెరట్లో ఆవుకి గడ్డి వేస్తున్నది శంకరి.
పెరటి గోడవతలి నుంచి ప్రక్కింటి రుక్మిణమ్మ అడిగింది. "పనైందా, శంకరీ?"
"లేదత్తా! రాత్రికి వంటచేయాలి"
"గట్టుకు రాళ్లు మోసినట్టుగా అంతేగా మన జన్మ? తెల్లారి లేచినప్పటి నుంచి పని... పని! పురుళ్లు, పుణ్యాలు, పండుగలు పబ్బాలు! మనం లేకపోతే వీళ్లకెక్కడ తెల్లవారుతుంది? అవునూ.... మీ వదిన మరీ అంత సుకుమారంగా, మంచం మీది నుంచి కాలు క్రింద పెట్టకుండా చేయించుకొంటూందేమే? ఒంట్లో రక్తం ఆడొద్దూ! మంచం మీదే కాళ్లూ చేతులు పట్టుకుపోతే బిడ్డనెలా కంటుంది? కడుపుతో వున్న వాళ్లు అటు ఇటు తిరుగుతూ ఆ పనీ ఈ పనీ చేస్తుంటేనే కాన్పు తేలిగ్గా అవుతుంది!"
"ఆమెకా మాటల చెప్పేవాళ్లేవరు?"
"రాత్రి ఎనిమిదింటికి గుళ్లో పురాణ కాలక్షేపానికి వస్తావా?"
"భోజనాలయ్యి, వంటింట్లో పని చక్కబెట్టేసరికి పదవుతుందత్తా!"
"మనకింక మిగిలింది కృష్ణా రామా అనుకోవడమే కదా? దానికి కూడా టైం మిగుల్చుకోకపోతే ఎలాగే, తల్లీ?"
"ఇరవయ్యో ఏట అరవయ్యో ఏడు వస్తుందా, అత్తా నీ పిచ్చిగానీ!" శంకరి శుష్కంగా నవ్వింది.
"ఊరుకోవే, తల్లీ! నీ మాట లెవరైనా వుంటే బరితెగించిన దానివనుకొంటారు! ఇప్పటికే నువ్వు బొట్టు గాజులు తీసివేయకుండా వుంచుకున్నావని లోకమంతా కారాలు మిరియాలు నూరుతుంది! ఇహ ఈ మాటలు కూడా వింటే నువ్వేదో పాడు పని చేస్తున్నావనుకొంటారు!"
"అనుకోనీ, అత్తా! నేను తప్పు చేస్తేకదా నాకు భయం?"
"నువ్వు కొసనాలికతోటైనా భర్తా, సంసార సౌఖ్యం రుచి చూశావు! నేనదీ లేదు కదా? పదేళ్లకే ముండు మోసాను! గౌను తీసే వయసులో ఈ తెల్ల చీర కట్టించారే, తల్లీ! అన్నదమ్ముల పెళ్లాలకూ, అక్క చెల్లెళ్లకూ పురుళ్లు పుణ్యాలు పోయడంలోనే వయసు వుడికిపోయింది! పెళ్ళిళ్లు, పేరంటాలు, పిల్లా - జల్లా - వీళ్లింత ఆనందంగా వున్నారు కదా? ఒక్కనాడు కూడా ఈ జీవి గురించి ఆలోచించినవాళ్లు లేరు! 'అక్కా! పెద్ద కూతురు కాన్పుకు వచ్చింది. కాస్తా సాయంరావూ" అని ఓ చెల్లెలుపిలిస్తే 'అక్కా! నీ కోడలు క్రొత్తగా కాపురానికి వెడుతూంది. కాస్త నాలుగు రోజులు వెంటవుండి సంసారం చక్కబెట్టిరావూ?" అని ఓ తమ్ముడు పురమాయిస్తాడు. ఈ చేతులతో ఎందరిని శోభనాల గదిలోకి పంపానో! ఎందరికి పురుళ్లు పోశానో!" కాని, నా బ్రతుకులో మాత్రం ఓ అచ్చటా ముచ్చటాలేదు!" సందర్భం వచ్చి నప్పుడల్లా ఆవిడ గుండెల్లో మంట వెళ్లబోసుకొంటూనే వుంటుంది!
రుక్మిణమ్మకి ఇప్పుడు అరవయ్యేళ్లు. బాల్యవివాహం పదో ఏటనే భర్త చనిపోయాడు! అప్పటినుంచి పుట్టింట్లోనే దిగబడిపోయింది. ఆవిడ కట్టుకొనే తెల్లచీరలాగే ఆవిడజుట్టు కూడా తెల్లబడిపోయింది. వయసుతో పాటు స్థూలశరీరామూ వచ్చింది. కరిగిపేయిన కాలంగురించి ఎప్పుడూ నిట్టూర్పులు విడిచే ఆమె జీవితంలో చీకటి తప్పులున్నాయని చెప్పుకొంటారు జనం.
స్త్రీని దేవతను చేసి పూజించే ఈ పుణ్య భూమిలో, ఈ భరత భూమిలో స్త్రీకి ఖర్మగాలి వైవిధ్యమే ప్రాప్తిస్తె ఆమె బ్రతుకు ఇంచు మించు రుక్మిణమ్మ బ్రతుకులాగే తెల్లవారుతూవుంటుంది. రాజుగారి పల్లకీమోసేందుకు బోయీలు కావలసినట్టే ఈ సంసారుల అవసరాలు చూడడానికి రుక్మిణమ్మలూ, శంకరమ్మలూ కావాలి.
శుభకార్యాలకు ముందుండకూడదు. "ప్రొద్దున్నే విధవముండను చూశాం" అనిపించకూడదు. కాని, ఇంటెడు చాకిరీ పనికివస్తుంది.
మనిషి జీవితంలో చాలా మార్పు వచ్చింది. కాని స్త్రీ జీవితంలో, ముఖ్యంగా భర్తను పోగొట్టుకున్న స్త్రీ జీవితంలో పెద్దగా మార్పేమీ రాలేదు! వీరేశలింగంగారు విధవా పునర్వివాహం ఒక ఉద్యమంలా చేపట్టినా విధవల జీవితాల్లో పెద్దగా మార్పేమీ తీసుకు రాలేదు. ఎంత మంది స్త్రీలు ఈనాడు వితంతు చిహ్నాలను ధరించడానికి తిరస్కరిస్తున్నారు? ఎంత మంది పునర్వివాహం పట్ల ఆసక్తి చూపుతున్నారు? విధవలపట్ల జనం దృక్పధంలో మార్పేమైనా వచ్చిందా? ఈ ప్రశ్నలకు జవాబు ఏ మాత్రం సంతృప్తికరంగా వుండదు.
ఎక్కడో ఒకరో ఇద్దరో సాహసించి మళ్లీ పెళ్లిచేసుకొంటారనుకో! వాళ్లకి వెంటనే బంధు బహిష్కారమూ సమాజ బహిష్కారమూ జరిగిపోతుంది.
తనకు తెలుసు, రుక్మిణమ్మ జీవితంలాగే తన జీవితమూ తెల్లవారు తుందని. అప్పుడు రుక్మిణమ్మలాగే తనూ అక్కసు వెళ్లబోస్తుంది కాబోలు.. .అలా ఆలోచిస్తున్న శంకరి పెదవులమీద నిర్వేదపూర్వకమైన నవ్వు కదిలింది.
"అన్నట్టు చెప్పడం మరిచానే, శంకరీ! ఎల్లుండి నేను హైదరాబాద్ వెడుతున్నాను. పెద్దన్నయ్య కొడుకు మహేశుడు లేడూ? వాడి కొడుక్కిప్పుడు ఏడాది బర్త్ డేనో, ఏదో చేస్తారట. దానికి వచ్చి ఓ నాలుగు రోజులుండమన్నాడు. అసలు సంగతేమిటంటే, భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలంటూ వెళ్లిపోతారా? వాణ్ణి ఇంట్లో చూసుకొనే మనిషి లేదు. ఇన్నాళ్లు మహేశుడి అత్తగారుండేది. ఆవిడ చిన్న కోడలి పురిటికంటూ ఇకరానని చెప్పిందట. అదీ సంగతన్న మాట పైకి మాత్రం, "బర్త్ డేకి వచ్చి ఓ నాల్గు రోజులుండిపో" అన్న ఆప్యాయత! పూర్వజన్మలో పూలతో కాదు, రాళ్ళతో పూజచేసి వుంటాం దేవుడిని! అందుకే మనకీ కర్మ! ఏం చేస్తాం?"
"......."
అంతలో జయలక్ష్మివచ్చి పిలిచింది "మీ అన్నయ్య వచ్చాడు. కాస్త టీ పెట్టిద్దువురా. శంకరీ!"
"వస్తున్నా, వదినా!"
"ఇంత సుకుమారమేమిటే తల్లీ! మగడికి కాస్త టీ పెట్టిస్తేనే పొట్టలో బిడ్డ కందుతుందా ఏం?" రుక్మిణమ్మ దీర్ఘంతీస్తూ కదిలింది.
* * * *