Previous Page Next Page 
అగ్ని కెరటాలు పేజి 4

               
    అన్నట్టుగా ఆవిడ హైదరాబాద్ వెళ్ళఖపోవడం  చూసి శంకరి అడిగింది. "హైదరాబాద్ వెళ్లలేదేం, అత్తా?"

    "పెద్దన్నయ్య బాత్ రూంలో జారిపడి కాలింతలావు వాచిపోయింది! ఒకటే మూలుగుళ్లూ అరుపులూ, మనుమడి బర్త్ డేకండటూ ఇంకెక్కడ బయల్దేరుతాను? పైగా వదినందీ, "ఈ సమయంలో మీరు లేకపోతే నాకు తోచదు, వదినా! ఆయన నన్ను మంచం దగ్గిరినుంచి కదలనివ్వడం లేదు!" అని!"

    "మరి కాలుకి వైద్యం ఏదైనా చేయిస్తున్నారా?"

    "పెద్దింటి ఎల్లడు వచ్చి తోముతున్నాడు. కాకలు, కట్లు అన్నీ అవుతూనే వున్నాయి! ఈయన మూలుగుతూనే వున్నాడు.... అవునూ!  మీ వదిన ఉదయం నూతి దగ్గర ఏదో గొణుగుతూంది?"

    "ఏమో! నేను వినలేదత్తా!"

    "అక్కడే వుండి వినలేదంటావేం? నీ కళ్లలో తిరిగిన నీళ్లు నేను చటూడలేదనుకొన్నావేం? "షిపాన్ చీరలూ, కళ్ల కాటుకలూ ఇవన్నీ ఎవరికోసమో?" అంటుందా మీవదిన? మొగుడు పోయినంత  మాత్రాన వయసెక్కడ పోయిందే నీకు! తనకంటే ఏడెనిమిదేళ్లు చిన్న  దానివి కదూ? తెల్ల సైను బట్ట చుట్టుకొంటే తప్ప కళ్లు చల్లబడనట్టుంది. ఏం మనుషులో ఏమో! పైగా వితంతు వేషం వేయలేదనికోపం...... అందుకే  నేను చెబుతాను! నీ అత్తవారింటికి వెళ్లిపొమ్మని. పెళ్లి కాకముందు ఇది పుట్టిల్లు కాని, పెళ్లయ్యాక యిది పుట్టిల్లు కాదు అత్తింటి కంటే చెర అవుతుందని  అనుభవం మీద  చెబితే వినడం లేదు నువ్వు!  మీ బావగారికి నలుగురు కొడుకులు కదా! ఒకణ్ణి దత్తత తీసుకొంటే చచ్చినట్టు నీకు ఆస్తి పంచాల్సి వస్తుంది. నీకంటూ ఒక సంసారం, ఇల్లు ఏర్పడతాయి. ఇక్కడే వుండి పోతే నాలాగే అన్యాయమైపోతావ్!"

    ఆమె ఏదో ఒకటి అంటూనే వుంటుంది!

    శంకరి చాలా వాటికి జవాబు చెప్పదు. దూడనికట్టేసి ఇంట్లోకి వచ్చేసింది.



                      *    *    *    *


       
    నెలలు నిండడంతో జయలక్ష్మిని పుట్టింటి వాళ్లు పురిటికి తీసికెళ్లారు.

    పదిహేను రోజుల తరువాత ఆడపిల్ల పుట్టిందన్న కబురు వచ్చింది.

    బారసాలకంటూ వెళ్లిన ఆచారి భార్య, బిడ్డల్ని వెంటబెట్టుకొనే వచ్చాడు.

    బాలింతపని, పసిపిల్లపని అదనంగా మీదపడ్డాయి శంకరికి.

    అయిదోనెల వచ్చేవరకూ చన్నీళ్లలో చేయిపెట్టలేదు జయలక్ష్మి. పిల్ల బోర్లాపడి పాకడం నేర్చుకొంటూండగా జయలక్ష్మికి మళ్లీ వాంతులూ, వేవిళ్లూ మొదలయ్యాయి.

    శంకరికి పని.. .పని... పత్రికలూ, నవలలూ చదువుకోవడమంటే ఎంతో ఇష్టం శంకరికి. కాని కాస్త టైంకూడా వుండడం లేదు.

    ఒకరోజు, కొంచెం దూరపు బంధువూ, అత్తవరుసా అయిన ఒకావిడ తన యిరవయ్యేళ్ల కొడుకును వెంటబెట్టుకు వచ్చింది ఆచారి వాళ్లింటికి. ఆవిడ పేరు కనకమ్మ.

    రాకరాక వచ్చిన బంధువు అందునా ఆచారి చిన్నతనంలో ఆచారి తండ్రి నాలుగిళ్లు పౌరోహిత్యం చేసుకోవచ్చని కనకమ్మవాళ్ల వూరెళ్ళి రెండు మూడేళ్లున్నాడు. భార్య, పిల్లాడితో అప్పుడావిడ ఎంతో సాయంగా వుండేది ఆచారి తల్లికి తోటలో పండే కూరగాయలిచ్చేది. పాలు పెరుగు పోసిచ్చేది. అప్పుడావిడ పిల్లల్లేకపోవడంవలన ఆచారిని ఎంతో ముద్దుచేసేది!

    ఆ తర్వాత సంసారం సరిగా గడవక వున్నఊరు వచ్చేశాడు ఆచారితండ్రి.

    ఆచారి అదంతా గుర్తుచేసుకొని సాదరంగా ఆహ్వానించాడు కనకమ్మను. అన్ని మర్యాదలూ దగ్గరుండి జరిపించాడు. స్నానం భోజనాలయి విశ్రాంతిగా కూర్చొన్న తరువాత.

    "ఇక చెప్పత్తా! ఏమిటి సంగతులు? మామపోయాడని తెలిసినప్పుడు వద్దామనుకున్నాను. ఏదో పనులు అడ్డుపడ్డాయి! యింతకీ వీడేం చదువుతున్నాడు? పేరేమిటి?"

    "అచ్యుతమూర్తిరా! ఏ నోము ఫలమో! ఏయాత్ర ఫలమో వీడు పుట్టాడు వృద్దాప్యంలో అడుగుపెడుతున్న వేళ! లేక లేక పుట్టినవాడు! జరగాల్సిన గారాబమే జరిగింది. అది చేయాల్సిన చెరుపే చేసింది! సరిగా చదువు ఒంటబట్టలేదు!పది నాలుగుసార్లు తప్పాడు, కనీసం తండ్రికి వచ్చిన మంత్రాలయినా రాలేదు! స్కూల్లో చదువుతున్నాడుకదా ఆ పరీక్షలు పాసైతే ఏదో ఉద్యోగంచేసుకు బ్రతుకుతాడు లెమ్మని మంత్రాలు నేర్పలేదు తండ్రి! అటు రెంటికి చెడిన రేవడిలా తయారయింది వాడి బ్రతుకు చిన్న మట్టికొంప, దేవుడిమాన్యం ఒకటిన్నర ఎకరాతప్ప వేరే ఆస్తిపాస్తులేమున్నాయని."

 Previous Page Next Page