Previous Page Next Page 
రాబందులూ - రామచిలుకలు పేజి 29


    "మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను మేడం" రుద్ద కంఠంలో అన్నది సునంద.

 

    "ఈ చిన్న సహాయానికి అంత మాట లెందుకు సునందా! వెళ్ళు, భోజనం చేసి కాసేపు విశ్రాంతి తీసుకో."

 

    సునంద లేచింది.

 

    సునంద సేవా సమాజం చేరేప్పటికే మరో నలుగురు యువతులు కూర్చుని వున్నారు. వాళ్ళూ ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్ళేనని సునంద చూడగానే తెలుసుకుంది. తాళ్ళంతా సునందను ప్రత్యర్ధిని చూసినట్టు చూడసాగారు. సునంద మౌనంగా కూర్చుంది ఆలోచిస్తూ. లోపలికి వెళ్ళిన ముగ్గురూ ఒక్కొక్కరే ముఖాలు ముడుచుకొని బయటికి రావడం చూసింది సునంద.

 

    "ఏమండీ! ఏమడుగుతున్నారు?" అప్పుడే బయటికి వచ్చిన యువతిని నాలుగో అమ్మాయి ప్రశ్నించింది.

 

    "దాని బొంద అడుగుతోంది. ఈ ఉద్యోగం వచ్చేదీ పెట్టేదీకాదు. ముందే ఎవరికో బుక్ అయిపోయి వుంటుంది" అని సునందకేసి ఓక్షణం అక్కసుగా చూసి, రుసరుసా వెళ్ళిపోయింది.

 

    సునంద ఆ యువతి చూపుల్ని తట్టుకోలేకపోయింది. గిల్టీగా ఫీలయింది! ఆ అమ్మాయి అన్నమాట నిజమేనేమో? గ్రేస్ చెప్పింది కనక ఆ ఉద్యోగం తనకే ఇవ్వాలనే ఉద్దేశ్యం వుందేమో? పాపం వాళ్ళుకూడా తనలాగే ఎన్ని ఆశలు పెట్టుకొని వచ్చారో! తనకున్న మాత్రం రికమెండేషన్ కూడా వాళ్ళకు లేదేమో? వాళ్ళ కుటుంబ పరిస్థితులు తనకంటే కూడా అధ్వాన్నంగా వున్నాయేమో?

 

    సునందకు పిలుపు వచ్చింది.

 

    సునంద గుండెలు దడదడలాడాయి. పాదాలు తడబడుతున్నాయి. సునంద గదిలో ప్రవేశించింది.

 

    కుర్చీలో ఎదురుగా ఖద్దరు బట్టలతో కూర్చున్న స్త్రీని చూడగానే ఆమె పేరు "శిఖండమ్మ" అని గుర్తొచ్చింది. పేరుకు తగ్గ రూపం అనుకుంది.

 

    సునంద చేతులు జోడించింది. శిఖందమ్మ సునందను శల్యపరీక్ష చేస్తున్నట్టు కిందినుంచి పైకి చూసింది.

 

    "మిస్ గ్రేస్ నీకేమౌతుంది?" ఆ గొంతు ఆ శరీరానికి సంబంధించింది కాదన్నట్టు వుంది. సన్నగా వుంది స్వరం.

 

    "ఏమీ కాదండీ! నేను ఆ హాస్టల్లో వుండి చదువుకున్నాను."

 

    "ఊ ! నీ అర్హతలు?"

 

    సునంద సర్టిఫికెట్లు తీసి ఆమెకు ఎదురుగా బల్లమీద వుంచింది.

 

    "నీ పేరు?" భృకుటి ముడిచి అడిగింది శిఖండమ్మ.

 

    "సునంద!"

 

    సునంద కంఠం ఫోన్ గణగణలో కలిసిపోయింది.

 

    "హల్లో లూ గారా!" శిఖండమ్మ ముఖం క్షణంలో ప్రసన్నం అయింది.

 

    "నమస్కారం! ఎంత కాలానికి మామీద దయకలిగిందీ! అదీ అలా చెప్పండి? పనిమీదే చేశారన్న మాట?....

 

    "ఆఁ ఆఁ అదికాదు.... మీకు చెయ్యకపోతే ఎవరికి చేస్తానండీ. ఫేవర్.... ఆఁ ... పేరు?.... లలితా.... ఆమె ఇంటర్వ్యూకు రాలేదనుకుంటాను.... ఏమిటీ వేరే ఇంటర్వ్యూ చేస్తున్నారా.... బలేవారండీ...." అంటూ గది అదిరిపోయేలా నవ్వసాగింది శిఖండమ్మ.

 

    అవతల గొంతు ఏదో జోక్ వేసి వుంటుంది. శిఖండమ్మ సిగ్గుతో మెలికలు తిరిగిపోతుంటే సునంద కళ్ళు పెద్దవి చేసుకొని చూసింది.

 

    "బలేవారే! మీ కొంటెబుద్ధి పోనిచ్చారుగాదు....మీ లీలలు నేను ఎరగనివా ఏమిటి?.... సరే అలాగే....మీరు చెప్పడం నేను కాదనడమూనా.... తప్పకుండా.... ఉద్యోగం ఇచ్చినట్టే....అలాగే! రేపే వచ్చి డ్యూటీలో చేరమనండి.... ఈ ఇంటర్వ్యూ సంగతా? అంతా మన చేతిలో పనేగా? రిగ్రెట్ లెటర్స్ పంపిస్తే సరిపోయె.... అది మామూలే గదండీ.... మీకు మాత్రం తెలియనిది ఏముంది?" మళ్ళీ విరగబడి నవ్వింది.

 

    సునందకు విషయం అర్ధం అయింది. ఇదంతా కేవలం ఫార్మాలిటియేనా ? నాట్ సెలెక్టెడ్ అంటో రిగ్రెట్ లెటర్సు పంపిస్తారా?

 

    "మరి నా సంగతేం చేశారు?....అదేనండీ మా అబ్బాయి సర్జరీ.... సరే సరే! థాంక్సు! కేవలం ఐదు మార్కులేనట.... మీరే చూసుకుంటారనే ధైర్యం నాకుంది లెండి! అందుకే మళ్ళీ మళ్ళీ జ్ఞాపకం చెయ్యలేదు. సరి! సరి! అలాగే! సాయంత్రం కలుసుకుందాం! ఆ అమ్మాయికి ఎలాంటి కష్టం కలక్కుండా చూసుకొనే పూచీ నాది.... ఉంటాను. థాంక్సు...." అంటూ రిసీవర్ పెట్టి తలెత్తి, సునంద కన్పించగానే గతుక్కుమన్నది శిఖండమ్మ.

 

    సునంద గదిలో వున్నదనే విషయమే మర్చిపోయిన శిఖండమ్మకు సునందమ్మ మీద పట్టరాని కోపం వచ్చింది.

 

    "బి.ఏ. చదివావ్? ఆ మాత్రం బుద్ధిలేదూ?"

 

    సునంద ఓ క్షణం తెల్లపోయి చూసింది.

 

    "అలా చూస్తావేం? ముందు మినిమమ్ మేనర్స్ నేర్చుకో! ఆ తర్వాత ఉద్యోగానికి రా!"

 

    "ఏమిటండీ మీరంటున్నది?" సునంద నిటారుగా నిల్చుని అడిగింది.

 

    "అదికూడా చెప్పాలా? ఫోన్ ల్ ప్రైవేట్ కాన్వర్ సేషన్ జరుగుతున్నప్పుడు బయటికి వెళ్ళాలని తెలియదూ? మానెర్ లెస్ క్రీచర్! ఇంకా నిల్చున్నావేం? నడు బయటకు!" దాదాపు అరిచినట్టే అన్నది శిఖండమ్మ.

 

    "మాటలు సరిగా రానివ్వు! పబ్లిక్ ఆఫీసులో ప్రైవేట్ విషయాలు మాట్లాడుకుంటూ, నాకు సభ్యత తెలియదంటావా?" సునంద ముఖం కందగడ్డలా అయింది.

 

    "జాగ్రత్త ఎవరితో మాట్లాడుతున్నావో గుర్తుంచుకో!"

 

    "చూస్తూనే వున్నాగా? ఇంకా ఏం తెలుసుకోవాలి?"

 

    "ఏయ్! ఏమిటా పొగరు? ఉద్యోగంలేదు ఏమీలేదు ముందు బయటకు వెళ్లు."

 

    "నువ్వు ఉద్యోగం ఇస్తావని అనుకోవడంలేదు. ఇంతమందిని ఇంటర్వ్యూకి పిల్చి మరెవరికో ఇంటర్వ్యూకి కూడా రాని ఆవిడకు ఈ ఉద్యోగం ఇవ్వబోతున్నావని తెలిసింది. ఇంత అన్యాయమా?"

 

    "ఇస్తే ఇస్తాను. నా ఇష్టం! నువ్వెవరు అడిగేదానికి? నీలాంటి పొగరుబోతులకు ఉద్యోగం ఇస్తే ఇక మా సమాజం నడిచినట్టే!"

 

    "మీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ సేవాసమాజం చేసే సేవ ఏమిటో అర్ధం చేసుకోగలను. నువ్విచ్చినా నీ దగ్గిర ఉద్యోగం చెయ్యను." సునంద గిర్రున వెనక్కు తిరిగింది.

 

    "మేనర్ లెస్ బ్రూట్!" గడపదాటుతున్న సునందకు విన్పించింది.

 

    వెనక్కు తిరిగెళ్ళి     శిఖండమ్మను ఈ చెంపా ఆ చెంపా వాయించాలనిపించింది సునందకు.

 

    బయటికివచ్చిన సునంద, గంపెడు ఆశతో కూర్చునివున్న అమ్మాయిని జాలిగా జూసింది. ఏదో చెప్పబోయి, చెప్పకుండానే చరచరా వెళ్ళిపోయింది.

 

    "ఈనాడు ఉద్యోగానికి కావాల్సిన అర్హతలు సర్టిఫికెట్లు కాదు. రికమెండేషన్స్. తళుకుబెళుకులు. అవి వున్నవాళ్ళకే ఉద్యోగాలు" అంటూ తన సర్టిఫికెట్లు మిస్ గ్రెన్ ఎదురుగావున్న బల్లమీద విసిరికొట్టి అన్నది సునంద.

 

    మిస్ గ్రేస్ ఓ క్షణం సునంద ముఖంలోకి చూసింది.

 

    "కూర్చో సునందా! ఏం జరిగింది?" తాపీగా అడిగింది.

 

    సునంద వెంటనే సమాధానం ఇవ్వలేక పోయింది. ఉబికివస్తున్న ఉద్రేకాన్ని అణచుకొనే ప్రయత్నంలో వుంది.

 

    "శిఖండమ్మ దగ్గరకు వెళ్ళావా?"

 

    "వెళ్ళాను!"

 

    సునంద జరిగిన విషయం చెప్పింది.

 

    మిస్ గ్రేస్ మౌనంగా విన్నది.

 

    "ఫెర్టిలైజర్స్ కంపెనీ మేనేజర్ను కలుసుకున్నావా?"

 

    "ఆఁ !" విరక్తిగా అన్నది సునంద.

 

    "అతను ఏమన్నాడు?"

 

    "అతనికి కావాల్సింది పనిచేసే వాళ్ళుకాదు మేడం! చాలా జుగుప్స కలిగించే ప్రశ్నలు వేశాడు" సునంద కళ్ళలో నీరు తిరిగింది.

 

    మిస్ గ్రేస్ సునందకేసి జాలిగా చూసింది.

 

    "అవన్నీ పట్టించుకుంటే ఎలాగమ్మా!"

 

    "పట్టించుకోలేదు మేడం! నా పరిస్థితుల్ని జ్ఞాపకం చేసుకుంటూ వినయంగానే సమాధానాలు చెప్పాను."

 

    "మరి ఏమన్నాడు?"

 

    "ఆయనకు కావాల్సిన అర్హతలు నాలో లేవట! ఖచ్చితంగానే చెప్పాడు."

 

    "ఇన్నిటికీ అతనికి కావాల్సిన అర్హతలు ఏమిటో?"

 

    "ఏం చెప్పమంటారు మేడం!" సునంద రుద్దకంఠంతో అన్నది.

 

    మిస్ గ్రేస్ కు అర్ధం అయింది.

 

    "పోనియ్ లే సునందా! బాధపడకు! అందరూ అలాంటివాళ్ళే వుండరు. ఎక్కడోచోట ఉద్యోగం దొరక్కపోదు. ధైర్యంగా వుండు!"

 

    "నాకు త్వరగా ఉద్యోగం కావాలి మేడం! ఎంత చిన్న ఉద్యోగమైనా ఫర్వాలేదు. ఏ మారుమూల గ్రామానికైనా వెళ్తాను" దీనంగా అన్నది సునంద.

 

    మిస్ గ్రేస్ ఒక క్షణం దీర్ఘంగా ఆలోచించి అన్నది.

 

    "నాకు మిసెస్ వైకుంఠం అనే ఒక సోషల్ వర్కర్ తెలుసు. ఆమెకు చాలా పరపతి వుంది. ఆమె తల్చుకుంటే ఏదో ఉద్యోగం ఇప్పించగలదు. ఆమెకు నాతో ఏదో పని వుందట వస్తానని ఫోన్ చేసింది...."

 

    మిసెస్ వైకుంఠం ప్రవేశించింది.

 

    "రండి! రండి! మీకు నూరేళ్లు ఆయుష్షు! మీ గురించే అనుకుంటున్నాం! మాటలలోనే వచ్చేశారు." మిస్ గ్రేస్ ఉత్సాహంగా ఆహ్వానించింది.

 Previous Page Next Page