"ఇన్నాళ్ళు అక్కరలేనివాళ్ళం ఇప్పుడు కావలిసొచ్చామా మనం! అయినా మేనరికాలు నాకిష్టంలేదు" అని ఖచ్చితంగా చెప్పేశాడు తను.
"సరే అయితే! బయటి సంబంధాలు బోలెడొస్తున్నాయి. నువ్వు చూడటానికి కూడా రాకపోతే మీ అబ్బాయికేం అవసరం? అని అడుగుతారందరూ" అంటూ సాధిస్తోంది.
ఈరోజు పొద్దుటే అమ్మాయి హైదరాబాద్ చూడాలంటోంది. ఒక్కదాన్నీ పంపిస్తున్నాను. ఆదివారం పొద్దుట స్టేషన్ కెళ్ళి తీసుకొచ్చుకొమ్మని మావయ్య ఉత్తరం పంపాడెవరితోటో. అమ్మ బోలెడు సంబరపడిపోతోంది. ఆడపిల్ల దగ్గరగా మసిలితే కొడుకు కరిగిపోతాడనుకుంటోంది కాబోలు! అయినా ఆవిణ్ణనుకుని ప్రయోజనం లేదు. యమున సంగతి ఇక దాచకూడదు. సిగరెట్ వేలు చుర్రుమనిపించడంతో ఆలోచనల్లోంచి బయటపడి అవతల పారేశాడు. ఏమైతే అయిందని స్కూటర్ స్టార్ట్ చేశాడు.
అనుకోకుండా శేఖర్ ఇంటికొచ్చేటప్పటికి అవాక్కయిపోయింది యమున.
శేఖర్ని గుర్తుపట్టి "బావున్నావా నాయనా! ఇదిగో అప్పట్నుంచీ ఇలా మంచంమీదే వున్నాను. ఆయాసం ఎక్కువయిపోయింది" అంది కాత్యాయిని.
యమున మౌనంగా మంచినీళ్ళు అందించింది.
"ఎందుకొచ్చారు?" అని కళ్ళతో ప్రశ్నిస్తోంది.
"నాన్నగారు లేరా?" అడిగాడు.
"గుడికెళ్ళారు. తమ్ముడు టైపుకెళ్ళాడు"
మంచినీళ్ళ గ్లాసుతోపాటు చీటీ చేతిలోపెట్టి చదువుకొమ్మని సైగచేశాడు.
వంటింట్లోకెళ్ళి విప్పింది. "పదినిమిషాల్లో పార్కు దగ్గరికి రా, చాలా మాట్లాడాలి. లేకపోతే ఎప్పటికీ మాట్లాడను" అనుంది.
బయటికొచ్చి "ఇంకా వంటకాలేదు. ఇందాకే వచ్చాను" అంది రానన్నట్టుగా.
శేఖర్ లేచి "వెళ్ళొస్తాను" అని కాత్యాయినికి చెప్పి బయటికి నడిచాడు. వాకిలిదాకా వచ్చిన యమునతో చెప్పాడు. "సరిగ్గా పదినిమిషాలు చూస్తాను. లేకపోతే రాశానుగా" అని వెళ్ళిపోయాడు.
అన్నట్టుగా పదినిమిషాలు చూశాడు. యమున రాలేదు. లేచి బయటికి నడుస్తుండగా "శేఖర్" అని వినిపించింది. ఆగి చూశాడు. వెనుకనించి యమున వస్తోంది. తిరిగి వచ్చి సిమెంటు బెంచీమీద కూర్చున్నాడు.
యమున రాగానే "కూర్చో"మని చూపించాడు. కూర్చుంది.
"ఏమిటి సంగతి?" అడిగింది.
ఒళ్ళు మండిపోయింది శేఖర్ కి. "అసలేమనుకుంటున్నావు? పదిహేను రోజులయింది కలిసి. పిచ్చివాడిలా ఫోన్ చేస్తున్నాను. మీ ఆఫీసు చుట్టూ తిరుగుతున్నాను. అంత బిజీగా వున్నావా లేక నన్ను తప్పించుకోవడానికి కబుర్లు చెప్తున్నావా?" అన్నాడు.
యమున తలెత్తి చూసి చెప్పింది. "ఇదివరకటిలా కలుసుకోవడానికి కుదరదు. అమ్మ ఆరోగ్యం అంత బాగాలేదు. నాన్నగారు సరేసరి. నేను త్వరగా ఇల్లు చేరకపోతే వాళ్ళు తట్టుకోలేరు. అయినా తమ్ముడు కూడా పెద్దవాడయ్యాడు. ఎక్కడైనా మనని చూస్తే బావుండదు."
వెంటనే అతను "నీవైపు నుంచి బాగానే చెప్పావు. మరి నా సంగతాలోచించు. ఇంట్లో అమ్మ పోరెక్కువయిపోయింది. గుంటూరు నుండి మేనమామ పిల్లని కూడా తోలేస్తున్నాడు. ఏమనిచెప్పి తప్పించుకోను? ఎన్నాళ్ళు ఈ దొంగ ప్రణయం?" కోపంతో దవడ కండరం బిగుసుకుంది శేఖర్ కి.
"నేను ముందేచెప్పాను. ఇంకా రెండున్నరేళ్ళు ఆగాల్సిందేనని. ఆగలేకపోతే మీ ఇష్టం. మీరు మేనరికం చేసుకున్నా లేక మరింకెవర్నన్నా చేసుకున్నా నేను తప్పుపట్టను" తల కిందికి వాల్చి, కొంగు మెలిపెడ్తూ చెప్పింది.
"శెభాష్! మంచిమాట చెప్పావు. ఆ మాటకోసమే ఎదురుచూస్తున్నాను. త్వరలో శుభలేఖలతో కలుస్తాను. పెళ్ళికోసం నేను పరితపించిపోతున్నాను. ఎవరైనా ఫరవాలేదు నాకు. ఆడదైతే చాలు" కఠినంగా చెప్తున్నా అతని గొంతులో బాధ తెలుస్తూనే వుంది.
"శేఖర్!" కళ్ళనిండా నీళ్ళతో తలెత్తి ఏదో చెప్పబోతున్న యమునని వారిస్తూ చెప్పాడు.
"నా గురించి చాలా బాగా ఆలోచించావు. చాలా సంతోషం. ఆడదాని గురించి ఎవరైనా తప్పుగా రాస్తే తిట్టుకునేవాడిని. మోసగత్తెలని చిత్రీకరిస్తే మొగవాడి చేతకానితనం అనుకునేవాడిని. కానీ ఎటువంటివాణ్ణైనా పిచ్చివాడిని చెయ్యగల సత్తా మీ జాతికుందని నిరూపించావు. నన్నో తెలివిలేని వెధవని చేసి ఆడించావు. నీ ఉద్యోగం, నీ అందం చూసుకుని నీకు గర్వమనుకుంటాను. ఆ విషయంలో నాకూ ఏం లోటు లేదు. కో అంటే కోటిమందొస్తారు. నీకంటే అందగత్తెనీ, నీకంటే గొప్ప ఉద్యోగస్తురాలినీ చేసుకోగలను. తరువాత నన్ను మోసం చేశావనొద్దు. నీ అంగీకారంతోటే చేబుకోబోతున్నాను" అని లేచి నిలబడ్డాడు.
యమున కూడా లేచి నిలబడి "నేచెప్పేది ఏమిటంటే..." అంటుండగా శేఖర్ ఆపమన్నట్టు చెయ్యి చూపించాడు.
"మీ ఆడవాళ్ళందరూ తెలివిగలవాళ్ళు, మేమే తెలివిలేని వెధవలమని మీ నమ్మకం. మీరు చెయ్యమన్నట్టల్లా చేసి, చెప్పిందల్లా వినాల్సిన ఖర్మ మాకేం పట్టలేదు. వస్తా" అని నడవసాగాడు.
యమున అతనికూడా రెండడుగులు వేసింది. ఏదో చెప్పాలనుకుంది కానీ అంతలోనే "ఎందుకు నేవెంటపడాలి? అతనికి ముందే చెప్పానన్నీ. ఇప్పుడిలా తొందరపడితే ఎలా? అతన్ని ఒప్పించడం కన్నా వ్యర్థమైన పని ఇంకోటి లేదు. తన పరిస్థితికి ఇప్పుడిప్పుడే పెళ్ళి చేసుకోవడం కుదరదు. ఏం చేస్తాడో, ఏం ఆలోచించుకుంటాడో అతనికే వదిలెయ్యడం మంచిది" అనుకుని అక్కడే ఆగిపోయింది.
బైక్ స్టార్ట్ చేస్తూ రెండునిముషాలు గడిపాడు శేఖర్. యమునక్కడే ఆగిపోవడం చూడగానే చర్రున మండింది. కానీ తమాయించుకున్నాడు. 'తనకేనా అహం! నాకు లేదా? ఆ విషయానికొస్తే నేనెందులో తక్కువా?' అనుకున్నాడు. వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయాడు.
అతను వెళ్ళినవైపే చూస్తూ ఉండిపోయింది యమున. పూర్తిగా అతని బండి చుక్కలా అయిపోయి మలుపు తిరిగి మాయమయిపోయేదాకా చూసింది. "నా శేఖరేనా అలా వెళ్ళిపోయింది? ఎప్పుడూ వెళ్ళిపోతానంటే 'అప్పుడేనా!' అని అడిగే శేఖర్ తనని ఎంత నిర్దాక్షిణ్యంగా వదిలి వెళ్ళిపోయాడు? ఒక్కసారి కూడా వెనక్కి తిరిగి చూడలేదు. తను చెప్పదలుచుకున్నది చెప్పనీయలేదు. ఇంత కఠినత్వం ఎక్కడినించి వచ్చింది? తన శరీరంలోంచేదో భాగం దూరం చేసేసినట్లనిపిస్తోంది. అసలిదంతా నిజమేనా!" ఇంటివైపు అడుగులేసింది యమున. చాలా నెమ్మదిగా అడుగులెయ్యసాగింది. వెనుకనుంచి హఠాత్తుగా 'నల్లపిల్లా! అనో, 'హలో హీరోయిన్' అనో పిలుపు వినిపిస్తుందని ఆశగా ఉంది. ఎంత నెమ్మదిగా నడిచినా ఇల్లు వచ్చేసింది. లోపలికెలా వెళ్ళిందో తనకే తెలియదు. మంచంమీద బోర్లాపడి వెక్కివెక్కి ఏడ్వసాగింది. శబ్దం రాకుండా నోట్లో కొంగు కుక్కేసుకుంది.