"శంకరం బావకి ఈ వూరు ట్రాన్స్ ఫర్ పెట్టుకున్నాక మీకు కబురు చెయ్యడం కుదరలేదే! కోడలికి ఈ ఊరు బ్యాంక్ లో ఉద్యోగం, ఇద్దరు పిల్లలు. రా లోపలికి" అంటూ చేటంత మొహం చేసుకుని పిల్చిందావిడ.
సింధు పిల్లల్ని తీసుకుని మళ్ళీ లోపలికి నడిచింది.
"అయినవాళ్ళింతకాలం కలుసుకోకుండా ఎలా వున్నారమ్మా?" అని ఆశ్చర్యపోయింది వర్ధనమ్మ.
"పోనీలెండి ఈ రూపంగానన్నా కలుసుకున్నారు" అంది సంతోషంగా కావేరి.
"ఒరేయ్ శంకరం! ఎవరొచ్చారో చూడు" అని కేకలు పెడుతూ లోపలికెళ్ళింది తులశమ్మ.
"అమ్మమ్మగార్నింత సంతోషంగా ఎప్పుడూ చూడలేదు నేను" అంది జయ.
శంకరం సింధూరని చూసి చాలా ఆశ్చర్యపోయాడు. "మీ మావయ్య ఒకసారి కలిసి బెంగుళూరులో ఇంజనీరింగ్ చేస్తున్నావని చెప్పాడు. నీ పెళ్ళికి కూడా రాకపోవడంతో మీ సంగతులు తెలియలేదు. ఈ ఊళ్ళో వున్నావని తెలిస్తే తప్పకుండా అమ్మని తీసుకొచ్చేవాడిని" అన్నాడు.
నర్మదని పరిచయం చేశాడు. తనకంటే పెద్ద ఉద్యోగస్తురాలని తెలియగానే నర్మద ముఖం వివర్ణమయిపోయింది.
సింధు తులశమ్మగారి భుజంమీద చెయ్యేసి "అత్తయ్య మీ పల్లెటూరిలోనే వుందనుకుంటున్నానిన్నాళ్ళూ. అమ్మ ఈసారొస్తే అడ్రస్ తెలుసుకుని వెళ్దామని కూడా రాసింది ఉత్తరంలో. ఇక్కడే వున్నారని తెలిస్తే చాలా సంతోషిస్తుంది" అంది ఆనందంగా.
శంకరం కూడా చాలా సంతోషపడ్డాడు సింధు ఆప్యాయతకి. పిల్లల్ని దగ్గరకు తీసుకుని ముద్దుచేశాడు.
"అబ్బాయేం చేస్తాడే?" అడిగింది తులశమ్మ.
"ఆయనా ఇంజనీరే అత్తయ్యా" అని అరుణ్ పనిచేసే కంపెనీ పేరు చెప్పింది. నర్మద టీ తీసుకొచ్చింది.
తులశమ్మగారే అందుకుని "ఈ పూటకుండి భోంచేసెళ్ళు. ఆలస్యమైతే బావ దింపుతాడు" అంది.
ఆవిడ చేతిలోంచి టీ కప్పు తీసుకుంటూ "ఈసారికి వదిలెయ్. ఆయన్ని కూడా తీసుకుని మరోసారి వస్తాను" అంది.
మళ్ళీ వాళ్ళ చుట్టాల గురించీ, వాళ్ళెక్కడుంటున్నదీ కాసేపు చర్చించుకున్నారు. "బావా! రేపాదివారం మీరంతా మా ఇంటికి రావాలి" అని ఆహ్వానించింది సింధు.
"అబ్బాయిని తీసుకుని మా ఇంటికి నువ్వేరావే" అంది తులశమ్మ మొహమాటంగా.
"అదేమిటమ్మా, అంత ప్రేమగా పిలుస్తుంటే" అని మందలించాడు శంకరం.
"తప్పకుండా వస్తాం" అన్నాడు సింధుతో.
నర్మదతో కూడా "వెళ్ళొస్తా"నని చెప్పి బయటికొచ్చింది సింధు. కావేరి వాళ్ళు వరండాలోనే కూర్చునున్నారు. "అత్తయ్యని చూసిన సంతోషంలో ఈ పిన్నిగార్ని మరిచిపోకమ్మా" అంది వర్ధనమ్మ.
సింధు నవ్వేసింది.
సుధాకర్ తో చెప్పాడు శంకరం "మా మామయ్య కూతురు. బంధుత్వం దగ్గరే కానీ రాకపోకలు లేక ఒకళ్ళ సంగతులొకళ్ళకి తెలియవు ఇన్నాళ్ళనించీ" అని.
"ఇప్పటికన్నా కలిశారు. చాలా మంచిరోజు ఇవాళ" అన్నాడు సుధాకర్.
సింధు అందరికీ మరోసారి చెప్పి బయల్దేరింది.
సింధు వెళ్ళాక కూడా ఆమె గురించే చాలాసేపు మాట్లాడుకున్నారు రెండిళ్ళ వాళ్ళు. తులశమ్మగారు ఉత్సాహంగా మేనమామ గురించీ,అతని తెలివితేటల గురించీ, పిల్లల ప్రయోజకత్వాల గురించీ శంకరానికి చెప్తూనే ఉంది.
"వాళ్ళ గురించి చెప్పుకుని కడుపు నింపుకోడమేనా? వంట చేసేదేమైనా వుందా?" అడిగింది నర్మద కటువుగా.
తులశమ్మగారు టక్కున లేచి వంటింట్లోకెళ్ళిపోయింది. శంకరం బయటికి నడిచాడు.
* * * *
శేఖర్ కి చాలా అసహనంగా ఉంది. సిగరెట్ తీసి వెలిగించాడు. ఫోన్ చేస్తే యమున రావడానికి కుదరదంది. కర్ఫ్యూరోజు తరువాత ఆమె చాలా మారిపోయింది. బహుశా ఇంట్లోవాళ్ళు కట్టడి చేసుంటారు. ఆఫీసు అయిపోయాక నిమిషం కూడా ఎక్కడా గడపట్లేదు. వాళ్ళమ్మగారికి అప్పట్నుంచీ ఒంట్లో బావుండటంలేదనీ, త్వరగా వెళ్ళి వంటదీ చెయ్యాలనీ తను ఫోన్ చేసినప్పుడల్లా ఏదో ఓ వంక చెప్తోంది.
ఆఫీసు వదిలేవేల్టికెళ్తే "ఈ రోజు రావడానికి కుదరదు. ఏమీ అనుకోకండి" అంటూ తుర్రుమంటోంది.
ఆమె సంగతలా వుంటే ఇక తల్లి సంగతి మరోలా ఉంది. ఎవరో సంబంధం తెచ్చారు. చూడ్డానికి రమ్మనో, అసలు పెళ్ళెందుకు చేసుకోవో చెప్పమనో వేధిస్తోంది.
పులిమీద పుట్రలా పెద్దమావయ్య వాళ్ళ ఆఖరుది పెళ్ళీడుకొచ్చిందనీ మేనరికం చేసుకొమ్మనీ రాయబారం పంపాడు. ఆయనది గుంటూరులో పొగాకు వ్యాపారం. బాగా సంపాదిస్తూ ఇన్నాళ్ళూ అందర్నీ దూరం పెట్టాడు. ఈ మధ్యో పెళ్ళిలో శేఖర్ని చూసి అల్లుడిని చేసుకోవాలని మురుస్తున్నాడు. నాన్నగారికంత ఇష్టం లేకపోయినా ఆడవాళ్ళకి పుట్టింటిమీద మమకారం మెండుకదా! "మామయ్య లక్షలు గడించాడు. ఇద్దరూ ఆడపిల్లలే. శిరీషని చేసుకో. కొడుకయినా, అల్లుడైనా నువ్వేననుకుంటాడు" అని నూరిపోస్తోంది.