Previous Page Next Page 
తృప్తి పేజి 27


    తొందరగా దొరికింది ఇల్లు. కొంతమంది పిల్లలు బయట ఆడుకుంటున్నారు. "బాబు ఇక్కడ కావేరి అనీ..." అనడుగుతుంటే "మా మమ్మీయే రండి ఆంటీ" అంటూ చెయ్యిపట్టి లాక్కెళ్ళిందో ఆరేళ్ళ పిల్ల.
    అదో నాలుగ్గదుల పోర్షన్. ఎల్ షేపుతో నీటుగా ఉంది. "బామ్మా! మమ్మీ ఫ్రెండ్" అంటూ వాళ్ళ బామ్మగారి దగ్గరకు తీసుకెళ్ళింది. ఆవిడ లేచి 'అలాగా! రా అమ్మా' కూర్చో అంటూ కుర్చీ జరిపి మర్యాద చేసింది.
    "వెళ్ళి అమ్మను రమ్మను" అని మనవరాలితో చెప్పి వచ్చిన అమ్మాయిని నఖశిఖపర్యంతం చూసింది.
    "గులాబీరంగులో, పెదవులకి ఎర్రని లిప్ స్టిక్, పెద్దసిగ, సిగలో ఎర్రగులాబీ, కలంకారీ కాటన్ పెద్ద బోర్డరు చీరా, చెవులకి పెద్ద రింగులూ చూడగానే స్టైల్ గా కనిపిస్తూ మంచి హుషారుగా ఉంది. "భగవంతుడు కష్టపడి మలచిన అందమైన బొమ్మ" అనుకుందావిడ.
    ఇంతలో కావేరి బయటికొచ్చి "ఓహ్! మీరా! నేనసలు ఊహించలేదు. ఏమిటీ విచిత్రం! నాకు చాలా సంతోషంగా ఉంది" అంది చేయి పట్టుకుని వూపేస్తూ. మళ్ళీ అంతలోనే "అత్తయ్యా! నేను చెప్పలేదూ సింధు అని బస్ మేటు, పెద్ద పోస్టులో వున్నారని, ఈవిడే" అంటూ సంతోషంతో ఉక్కిరిబిక్కిరిగా చెప్పింది.
    ఆ పరిచయానికి సింధు గలగల నవ్వింది. వెంటనే వాళ్ళత్తగారు లేచి నిలబడి "మీరేనా! మా కోడలెప్పుడూ చెప్తూ ఉంటుంది" అంది.
    "అయ్యయ్యో! కూర్చోండి పెద్దవారు" అంది సింధు. ఆవిడ కూర్చుని సింధు గురించి కోడలు ఎంత గొప్పగా చెప్తుందో వర్ణించి చెప్పసాగింది. పిల్లలప్పుడే పూజ ఆటసామాన్ల బుట్ట దగ్గర బిజీ అయిపోయారు.
    "ఇప్పుడే వస్తా!" అంటూ కావేరి లోపలికెళ్ళింది. ఇంతలో జయ రెండు గ్లాసులతో మంచినీళ్ళు తెచ్చిచ్చి "మీరేనా సింధు, మా వదిన మీ గురించి చాలా చెప్పింది" అంది.
    సింధు నవ్వుతూ "మంచిగానా? చెడుగానా?" అంది.
    "మంచిగానే. మీకసలు గర్వంలేదనీ, మంచి కలుపుగోలు స్వభావమనీ" అని ఓ నిమిషమాగి నెమ్మదిగా "జయప్రదలా ఉంటారనీ" అంది.
    సింధు ఇబ్బందిగా మొహంపెట్టి "చివరిది అబద్ధం కదూ!" అంది.
    "మీ వదిన మీ గురించి కూడా చెప్పింది. నాకో చక్కని ముద్దొచ్చే ఆడపడుచుందనీ, ఆమె త్వరలోనే ఓ ముద్దొచ్చే పాపనియ్యబోతోందనీ" అని నవ్వేసింది సింధు.
    వర్ధనమ్మగారు లేచి వంటింట్లోకెళ్ళి, కిటికీ దగ్గరకెళ్ళి గట్టిగా "చూడవే! ఆవిడ గొప్ప ఇంజనీరయినా, డాక్టరు పట్టా పుచ్చుకుంటున్నా ఇసుమంతైనా గర్వంలేదు. ఎంత కలివిడి, ఎంత మర్యాద! అలా వుండాలి ఆడపిల్లన్నాకా. పెద్దలు ఊరికే అన్నారా? అన్నీ వున్న ఆకు అణిగిమణిగి ఉంటుంది ఏమీ లేని ఆకు ఎగిరిఎగిరి పడుతుంది అని" అంటోంది.
    పకోడీలు ప్లేట్లో పెడ్తున్న కావేరికి తెలుసు. నర్మద బయట కిటికీ దగ్గరే నిలబడి కాఫీ తాగుతోందనీ, ఈ మాటలన్నీ వినిపిస్తున్నాయనీ. సింధు టి.వి.యస్ ఆపి దిగుతున్నప్పుడే నర్మద చూసింది. "ఇంత అందంగా, స్టైల్ గా ఉన్నావిడ ఎవరా?" అన్న కుతూహలంతో బయటే నిలబడింది. వర్ధనమ్మ మాటలు ఎక్కడ తగలాలో అక్కడే తగిలాయి. దాంతో చివాల్న లోపలికెళ్ళి పోయింది మొహం ముడుచుకుని.
    కావేరి పకోడీల ప్లేటుతో బయటికి రాగానే "ప్లీజ్! నన్ను మొహమాటపెట్టి తినిపించాలని చూడొద్దు. పొట్టలో అస్సలు స్థలం లేదు. ఇప్పుడే పిల్లలతో హోటల్ కెళ్ళొస్తున్నాను" అంది. జయ బలవంతం చెయ్యబోతే కావేరి వారించింది. వర్ధనమ్మగారు కాఫీ కప్పులతో వచ్చి అందరికీ ఇచ్చింది. కావేరీ, సింధూ, జయా కాసేపు పిల్లల గురించీ, అల్లరి గురించీ కబుర్లు చెప్పుకున్నారు.
    ఇంతలో ప్రభ సుడిగాలిలా వచ్చి "వదినా! మా బాబినీ, అపర్ణనీ కాసేపిక్కడ ఆడుకోనీ, నేను ఎదురింటావిడతో మార్కెటుకెళ్తున్నాను" అంది.
    "నీకు మార్కెటెందుకే? అసలు వంటే చెయ్యవుగా!" అంది జయ నవ్వుతూ.
    ఆ శ్లేష పట్టించుకోకుండా "అబ్బా! కూరగాయల కోసం కాదులే! పక్కింటావిడ కొన్నలాంటి కర్టెన్లు కొనుక్కోవాలట మా ఎదురింటావిడ. తోడెళ్తున్నాను" అంది.
    కావేరి ప్రభని సింధుకి పరిచయం చేసింది. ప్రభ నమస్కారం చేసి, రెండు పకోడీలు నోట్లో వేసుకుని "ఈ చీరెక్కడ కొన్నారు? చాలా బావుంది" అంది.
    "తెలియదు! మావారు తెచ్చారు. థాంక్స్" అంది.
    ప్రభ తల్లి ఇచ్చిన కాఫీ ఆదరాబాదరా తాగేసి "రాత్రికేదైనా కూర పంపించు వదినా! పొద్దుటివేం మిగల్లేదు" అంటూ హడావుడిగా వెళ్ళిపోయింది. సింధు కావేరి వైపు చూసి అర్థవంతంగా నవ్వింది.
    సుధాకర్ వచ్చేవరకూ కూర్చుని, పరిచయాలయ్యాక "చాలాసేపయింది. నేవెళ్ళొస్తా" అంటూ బయల్దేరింది. పిల్లలకింకా ఆడుకోవడం తనివితీరలేదు. బలుస్తూనే బయల్దేరారు. "మీరు మీ కోడలితో మా ఇంటికి రావాలి" అంది వర్ధనమ్మనీ, జయనీ చూస్తూ.
    "అలాగే! నువ్వు కూడా వస్తూ ఉండమ్మా" అందావిడ ఆప్యాయంగా.
    కావేరి సింధుకి బొట్టుపెట్టి మల్లెపూల చెండిచ్చింది. సింధు వెంటనే సిగచుట్టూ పెట్టుకుంది. మనసులు కలిసినచోట అరమరికలుండవు.
    సుధాకర్ తో కూడా చెప్పి గేటువరకూ వచ్చింది సింధు. కూరలు కొంటున్న తులశమ్మ పక్కకి తప్పుకుంటూ "బంధువులమ్మాయా?" అని అడిగింది జయని.
    "కాదు వదిన స్నేహితురాలు, పేరు సింధూర. ఆవిడ ఇంజనీరింగ్ కాలేజీలో లెక్చరర్" అంటూ గొప్పగా చెప్పింది.
    అప్పటికే సింధు టి.వి.యస్ స్టార్ట్ చేస్తోంది. ఆవిడ కళ్ళజోడు పైకి తోసుకుంటూ నాలుగడుగులేసి "ఎవరూ? సింధూ!" అంది.
    సింధు వెనక్కితిరిగి చూసి "మీరూ... ఎక్కడో చూసినట్టుంది" అని "తులశమ్మత్తయ్య కదూ!" అంది.
    అంతలోనే ఆవిడొక్కవుదుట్న సింధుని కావలించుకుని "నా బంగారుతల్లి! ఎన్నాళ్ళయిందే చూసి, అమ్మ బావుందా? అన్నయ్యలెక్కడున్నారు?" అంటూ ప్రశ్నలు వేసింది.
    "అన్నయ్యలిద్దరూ అమెరికాలో వున్నారు. అమ్మ కూడా వాళ్ళ దగ్గరే ఉంటోంది. అప్పుడప్పుడూ గుంటూరొచ్చి పెద్దమామయ్య దగ్గరో ఆరునెలలు, నా దగ్గరో ఆరునెలలు ఉంటూ ఉండేది. ఇప్పుడు రెండేళ్ళయిందొచ్చి. మళ్ళీ ఈ సంవత్సరం రమ్మని రాశాను." అంటూ గడగడా చెప్పి, ఓ నిమిషమాగి "కావేరీ! ఈవిడ మా మేనత్త. నాన్నగారు అమెరికా వెళ్ళాకా, మేము మా మేనమామల దగ్గరకెళ్ళిపోవడం, అక్కడే మాకు అన్నీ సెటిలయి, పెళ్ళిళ్ళూ అవీ అయిపోవడంతో టచ్ పోయింది. నా పెళ్ళికి కూడా అత్తయ్య రాలేదు. తర్వాత నాన్నగారు పోయినప్పుడొచ్చి చూసెళ్ళి పోయిందంతే! మళ్ళీ ఇన్నాళ్ళకి అనుకోకుండా కలిశాం. మీరిక్కడున్నట్లు ఒక్కమాట కూడా నాకు తెలియబర్చలేదెందుకూ?" అడిగింది.

 Previous Page Next Page