Previous Page Next Page 
తృప్తి పేజి 25


    రోడ్డుమీదొక్క పిట్ట కూడా లేదు. తనకి భయమేసింది. వెనక్కి తిరిగి మళ్ళీ స్నేహితురాలి దగ్గరకని బయల్దేరింది. వెనకాలే ఓ వ్యక్తి తనతోబాటే నడుస్తున్నాడు. ఎవరో ఒకరు నడుస్తున్నారు రోడ్డుమీద అంతేచాలు అనుకుంది. కాసేపయ్యాక అతను చాలా పక్కకొచ్చేసి "వస్తావా?" అని లోగొంతుకతో అడుగుతున్నాడు.
    యమున బిక్కచచ్చిపోయింది. అరిచి గీపెట్టినా అడగడానికెవరూ లేరు. గబగబా అడుగులెయ్యసాగింది. తన గుండె వేగం తనకే తెలుస్తోంది.
    "ఎక్కడికే? ఈవేళ నిన్నెవ్వడూ రక్షించలేడు" అంటూ వేగం పెంచాడు వాడు.
    చుట్టుపక్కలెక్కడా ఇళ్ళు లేవు దూరదామన్నా. యమున పరుగు మొదలుపెట్టింది. ఆయాసం, ఏడుపూ కలిసొచ్చేస్తున్నాయి. ఎదురుగుండా ఓ స్కూటరొస్తోంది. గబగబా చెయ్యూపింది. అది ఆగకుండా వెళ్ళిపోయింది. వెనుకనుంచొచ్చి వాడు చెయ్యి పట్టుకున్నాడు. "అరవకుండా రా నీకూ నాకూ లాభం" అన్నాడు. అంత శక్తి ఎలా వచ్చిందో తెలియదు. ఈడ్చి చెంపదెబ్బ కొట్టింది. వాడు కిందపడ్డాడు. అప్పుడు గమనించింది. వాడు ముసలిగా ఉన్నాడు. దగ్గరదగ్గర యాభైఏళ్ళు మీదుండొచ్చు. ఇంకాలస్యం చెయ్యలేదు. శక్తికొద్దీ పరిగెత్తింది. ఎదురుగుండా ఓ గుడి కనిపించింది. దానిలోకి పోబోతుండగా "గుడి మూసేవేళయిందమ్మా, నేను తాళం పెట్టుకుని వెళ్ళిపోతున్నాను" అన్నాడు పూజారి.
    యమున చేతులు జోడించి చెప్పింది "కర్ఫ్యూ అని నాకు తెలియదు. మా ఇల్లు చాలా దూరం. ఎవడో వెధవ వెంటబడ్డాడు. మీరు కాసేపిక్కడే ఉండండి" అని.
    పూజారి వెనక్కి తిరిగిచూసి "అక్కడెవరూ లేందే?" అన్నాడు.
    "ఇప్పటివరకూ వున్నాడండీ, ఇప్పుడే ఎక్కడో నక్కి ఉంటాడు" అని చెప్పి రొప్పసాగింది.
    "లోపలికి రామ్మా" అని గొళ్ళెం తీసి తనూ లోపలికి నడిచాడాయన. టైము ఏడు దాటిపోతోంది. ఇంకాసేపటిలో ఇంటిల్లిపాదీ గగ్గోలయిపోతారని యమునకి తెలుసు. అది అమ్మవారి గుడి. "తల్లీ! నన్నింటికి చేర్చు, అమ్మా నాన్నల్ని తొందరగా చూడాలి" అని కళ్ళుమూసుకుని దణ్ణం పెట్టుకుని పర్సులోంచి ఐదురూపాయల కాగితం తీసి హుండీలో వేసింది. పూజారి తీర్థమిచ్చి ప్రసాదం పెట్టాడు. ఇంతలో పెద్ద చప్పుడుతో ఓ వందమంది కర్రలతో వచ్చేశారు. పూజారి "అమ్మా, నువ్వా విగ్రహం చాటునుండు" అని చెప్పి బయటికెళ్ళి వాళ్ళతో మాట్లాడుతున్నాడు.
    యమున విగ్రహం చాటునుండి భయంభయంగా చూసింది. పచ్చినెత్తురు తాగే గూండాల్లా కనిపిస్తున్నారు వాళ్ళు. పూజారి చెప్పే మాటలు వినకుండా ఒకడు "వెయ్యండిరా" అనడం, ఇంకోడు కర్రెత్తి కొట్టడం జరిగిపోయాయి. నుదుటిమీంచి రక్తం ధారగా కారిపోతుండగా అమ్మో అంటూ కుప్పకూలి పోయాడాయన. వాళ్ళందరూ వెంటనే పారిపోయారు.
    యమున బయటికొచ్చి చీరకొంగు చింపి ఆయనకి కట్టుకట్టింది. "నావల్లే మీరు గుడి తెరిచారు. నన్ను క్షమించండి." అంది ఏడుస్తూ. ఆయన చేత్తో వారిస్తూ "నాకేం ఫరవాలేదమ్మా నువ్వెళ్ళిపో. త్వరగా ఈ మాత్రం వెళుతురుండగానే, దగ్గరలో తెలిసిన వాళ్ళుంటే తలదాచుకో. ఉన్మత్తులమ్మా. అసలే ఆడపిల్లవి" అన్నాడు మూలుగుతూ.
    "దగ్గర్లో ఎక్కడైనా ఫోనుందా?" అడిగింది ఏడుస్తూనే.
    "ఉందమ్మా. వెనుకవైపు ఇళ్ళున్నాయి. అందులో ఎర్రడాబా వాళ్ళ ఇంట్లో ఉంది" అన్నాడాయన లేస్తూ.
    యమున గబగబా అడుగులేస్తూ ఆయన చెప్పినవైపు నడక మొదలుపెట్టింది. పదడుగులెయ్యగానే ఇళ్ళు కనిపించాయి. కాస్త ధైర్యమొచ్చింది. మైకం కమ్మినట్టయి ఒళ్ళు తూలసాగింది. కళ్ళు మసకలు కమ్మి చెమట్లు పట్టాయి. భారంగా అడుగుతీసి అడుగువేస్తుండగా పక్కనించి రయ్యిమని మోటర్ సైకిల్ వెళ్ళింది. కాస్త దూరం వెళ్ళి ఆ వ్యక్తి వెనక్కి తిరిగి చూశాడు.
    యమున మనసు కీడు శంకించింది. మళ్ళీ ఓపిక చేసుకుని పరుగందుకుంది. అయినా అది వేగంగా తన దగ్గరకొచ్చేస్తోంది. బలవంతంగా మూసుకుపోతున్న కళ్ళని తెరుస్తూ పరుగుపెట్టడంతో కాలికి బలంగా ఓ పెద్దరాయి తగిలింది.
    ఆ ఎదురుదెబ్బకి ముందుకి తూలి బొక్కబోర్లాపడాల్సిందే. కానీ ఇంతలో అతను నడుంచుట్టూ ఓ చెయ్యి, భుజం చుట్టూ ఓ చెయ్యివేసి పట్టుకున్నాడు.
    కెవ్వుమంది యమున.
    "నేనే పిచ్చీ" అంటూ రెండు చేతులతో ఆమె తల పట్టుకుని బలంగా వూపాడు.
    పరిచితమైన కంఠధ్వనికి నెమ్మదిగా రెప్పలు విప్పింది. తను తన శేఖర్ చేతుల్లో వుంది. "ఇది కలా లేక నిజమా" అని ఆలోచించే శక్తి కూడా లేదు. "నేను ఇక్కడ...నీకు ఎలా...?" అంటూ వెక్కిళ్ళమధ్య మాటరాక, భోరున ఏడుస్తూ అతని బాహువుల్లో వాలిపోయింది యమున.
    ఆమె తల నిమురుతూ చెప్పాడు శేఖర్. "సాయంత్రం ఐదుగంటలకు మీ ఆఫీస్ కి ఫోన్ చేస్తే ఎవర్నో తీసుకుని హాస్పిటల్ కి వెళ్ళావనీ, ఆవిడ హాస్టల్లో ఉంటుందని చెప్పారు. వాళ్ళు చెప్పిన అడ్రస్ ప్రకారం హాస్టల్ కెళ్తే నువ్వెప్పుడో వెళ్ళిపోయావని చెప్పింది నిర్మల. వెంటనే మీ ఇంటికెళ్ళి చూశాను. నన్నెవరూ పట్టించుకోలేదు. మీ తమ్ముడెక్కడికో వెళ్ళాడట. అతని ఫ్రెండ్ ననుకొని మీ నాన్నగారంతా చెప్పుకొచ్చారు. మీ అమ్మగారు ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లిపోయారు. ఎనిమిదవుతోంది. క్విక్! తొందరగా ఎక్కు ఇంటికెళ్ళాలి" అన్నాడు. ఎలా ఎక్కిందో యమునకే తెలియదు. ఎక్కగానే అతని వీపుకంటుకుపోయి కూర్చుంది.
    సందుల్లోంచెక్కడెక్కడనుంచో తీసుకెళ్ళి ఇల్లు చేరేటప్పటికి ఎనిమిదిన్నర అయింది. మోటారుసైకిల్ ఆగగానే జనమంతా రోడ్డుమీదికొచ్చేశారు. యమునని చూడగానే కాత్యాయిని "వచ్చావా అమ్మా" అంటూ కౌగిలించుకుని కుప్పకూలిపోయింది.
    శరత్ "మీరెవరో దేవుళ్ళాగా అక్కని తీసుకొచ్చారు. చాలా థాంక్స్ సార్" అంటూ శేఖర్ తో చెయ్యి కలిపాడు.

 Previous Page Next Page