"అలాంటివి చెప్పకూడదే. చాటుగా ఇచ్చి వుంటారు" అన్నది పక్కింటి సూర్యకాంతం.
"పట్నం పిల్ల ఈ ఊళ్ళో ఉండగలదంటే?" అన్నది శాంతమ్మ.
"ఆ వుండక ఏం చేస్తుందేమిటి? చేసుకున్నాక తప్పుతుందా" మరో కంఠం.
"ఇక్కడే ఎందుకు వుంటుంది? భర్తతో వెళ్ళి గుంటూరులో కాపురం పెడుతుంది" అన్నది సూర్యకాంతం కోడలు.
"చాల్లేవే నా కొడుకు నీ మొగుడులాంటి వాడు కాదు. పెళ్ళయిన తెల్లవారే పెళ్లాం కొంగు పట్టుకుని ఇల్లు వదిలి వెళ్ళిపోయి వేరు కాపురం పెట్టడానికి?"
బంగారమ్మ విసురుగా అన్నది.
అమూల్య అప్రయత్నంగానే క్రింది పెదవిని మునిపళ్ళతో నొక్కి వత్తుకుంది.
"ఏమే కోడలు పిల్లా మావాణ్ని తీసుకొని పట్నం ఉడాయిస్తావా?" అన్నది శేషమ్మ.
"ఏమే, గీమే అనొద్దు" అని అరవాలనుకుంది అమూల్య. అమూల్యకు ఇలాంటి సంభాషణలు వినడం కొత్త.
"కోడలు ఏం తెచ్చిందే బంగారమ్మా?"
అమూల్య లేచి పక్క గదిలోకి వెళ్ళింది.
"ఫ్రిజ్ తెచ్చిందా?"
"మీ కోడలు అదేమిటి ఇంట్లో కూడా చెప్పులు వేసుకుంటుందా?"
"పట్నంలో అలవాటనుకుంటాను"
బంగారమ్మ అమూల్య నగలు చూపిస్తుంటే, ఆడబిడ్డలు చీరల ప్రదర్శన పెట్టారు.
అమూల్యకు ఎక్కడలేని కోపం వస్తోంది.
"పల్లెటూరి మూక. బొత్తిగా సంస్కారం లేదు" మనసులోనే విసుక్కుంది.
ఆ రాత్రిభోజనాల దగ్గిర ముభావంగా ఉన్నది.
ఆడబిడ్డలు సరసాలు మొదలుపెట్టారు. అమూల్యకు వాళ్ళ మాటలు వింటుంటే వళ్ళంతా కంపరంగా వుంది.
"ఏం వదినా అంత మూగనోము పట్టావ్?" అన్నది చిన్నఆడబిడ్డ.
"అన్నయ్యతో గాని పోట్లాడావా?" అన్నది పెద్ద ఆడబిడ్డ.
"మీరు ఊరుకోండి? అది అసలే సిగ్గుపడుతూ ఉంటేను?"
బంగారమ్మ వడ్డిస్తూ అన్నది.
"అదీ ఇదీ" అంటూంటే అమూల్యకు ఎలాగో వున్నది.
"అమూల్య"
"ఊ"
"చివరకు నువ్వే జయించావ్?" ఆరాత్రి శ్రీధర్ అమూల్యను దగ్గరకు తీసుకుంటూ అన్నాడు.
శ్రీధర్ బాహువుల్లో ఒదిగిపోయిన అమూల్యకు ఆ పగలంతా కలిగిన చిరాకు ఇట్టే మటుమాయమైంది.
"నేనా మీరా జయించింది? అందరూ మిమ్మల్నే అదృష్టవంతుడంటున్నారు."
"అవును ఇంత అదృష్టం నాకోసం ఎదురుచూస్తోందని నేను కలలో కూడా ఊహించలేదు."
"ఈ పెళ్ళి మావాళ్ళెవరికీ ఇష్టం లేదు. అన్నయ్యకూ, చెల్లికి కూడా"
"అవును. నువ్వు నాకోసం పెద్ద త్యాగమే చేశావ్"
"ఆదిత్య అయితే పాపం...ఏడ్చేశాడు."
"వాడెవడు?"
"మిమ్మల్ని చూడకముందు అతన్నే చేసుకోవాలనుకున్నాను."
"ఎవరు? ఆ గిరజాలవాడేనా?"
"అవును"
"ఐసీ"
"ఏం జలసీగా ఉందా?"
"మరి వుండదా?"
"చివరి నిమిషంలో కూడా నేను అంగీకరిస్తే అమ్మ పెళ్ళి ఆపిస్తానన్నది."
"అలాగా?"
"అదే జరిగితే ఏం చేసేవాడివి?"
"బలవంతంగా ఎత్తుకెళ్ళి రాక్షస వివాహం చేసుకొనే వాడిని."
"కొయ్ తలెత్తి చూడటానికే భయపడేవాడివి?"
"నువ్వు చూడనప్పుడు చూసేవాడ్ని"
"దొంగచూపులా" కిలకిల నవ్వుతూ తలను శ్రీధర్ ఛాతి మీద ఆనించింది.
శ్రీధర్ అమూల్యను గాఢంగా గుండెలకు హత్తుకున్నాడు.
"నాకు చాలా సంతోషంగా వుంది" అన్నది అమూల్య.
"నాకంటేనా?"
"అవును. కాని మరోపక్క ఎందుకో దిగులుగా ఉంది."
"దిగులా?"
"అవును. అమ్మ మాటలు ఉండుండి గుర్తొస్తున్నాయ్."
"ఏమన్నది?"
"ఒకనాడు నేను పశ్చాత్తాపంతో ఏడుస్తూ తన దగ్గిరకు వస్తానని దీవించింది" దిగులుగా అన్నది అమూల్య.
శ్రీధర్ ఓ క్షణం మౌనంగా వుండిపోయాడు.
అమూల్య గడ్డం పట్టుకొని ముఖంపైకెత్తి కళ్ళల్లోకి పరిశీలనగా చూశాడు.