ఎప్పుడు కళ్ళు తెరిచిందో ఆమెకే తెలియదు. "సీతా! నేను! ఇటు చూడు భయం లేదు." ఆ కంఠం అతని కంఠం. తను ఎక్కడున్నది? అతని తొడమీద తలపెట్టుకొని వున్నది. సీత చివ్వున లేచి కూర్చుంది. కళ్ళు పెద్దవి చేసి చూసింది. ఇతను ఇక్కడ ఎందుకున్నాడు? ఇతను ...మనిషి అన్పించింది. సీతా ఏమిటి అలా చూస్తావ్? నేను దెయ్యాన్ని కాదు. మనిషినే! నీకు డెక్ మీద కన్పించిన స్నేహితుడ్ని, భయపడకు." లాలనగా అన్నాడు అతను.
అవును! అతనే! కాని...కాని?
"నువ్వు...ఇక్కడ...ఎందు...కున్నావ్?" ఎలా? అనగలిగింది ఆమె.
నువ్వు వస్తావని... సీత కళ్ళు వెడల్పు చేసుకొని చూసింది. "నీకెలా తెలుసూ?"
"నాకు తెలుసు. నీకు నా అవసరం వున్నదని కూడా తెలుసు. ఈ రెండు రోజుల్నుంచి నేను కన్పిస్తే బాగుండును అని ఎన్నోసార్లు అనుకొన్నావు. అవునా?"
సీత తల ఆడించింది.
"నేను ఇక్కడకు వస్తున్నట్టు నీకు ఎవరు చెప్పారు."
సీత కొంత తేరుకున్నది.
"ఎవరు చెబితే ఏంలే? నేను రావడం ఇష్టంలేదా? చెప్పు వెళ్ళిపోతాను."
"ఇష్టమే?"
"అయితే లే" అతను చెయ్యి అందించాడు.
సీత భయం తీరిపోయింది. అనవసరంగా భయపడినందుకు సిగ్గుగా వున్నది.
ఆమె చెయ్యి పట్టుకొని అతను ఆమెను బయటికి నడిపించుకొని వచ్చాడు.
అక్కడ వున్న సిమెంటు బెంచీమీద ఇద్దరూ పక్కపక్కగా కూర్చున్నారు.
"మీరు కలకత్తాలో కన్పిస్తారనుకొన్నాను. ఇక మళ్ళీ కన్పిస్తారనుకోలేదు." అతని ముఖంలోకి చూస్తూ అన్నది సీత. అతను చిరునవ్వు నవ్వాడు. ఆమె అతన్ని మొదటిసారిగా వెలుగులో చూసింది. అతని శరీరపు రంగు ఇంగ్లీషు వాళ్ళ రంగు కంటే కొంచెం తక్కువగా వుంది.
భారతీయులు కూడా ఆర్యులే మనలాగ. నల్లటి వాళ్ళేకాదు, భారతీయుల్లో తెల్లగా వుండేవాళ్ళు కూడా వున్నారు. అయితే మనంత తెల్లగా వుండరు. కారణం ఆ దేశపు వాతావరణం అని ఆమెకు ఒకసారి తండ్రి చెప్పాడు. ఆ మాటలు గుర్తొచ్చాయి. "ఇతను భారతీయుడే అయివుండాలి" అనుకొన్నది.
"నాకు కన్పించకుండా షిప్ దిగి వెళ్ళిపోయారన్నమాట మాత్రంగా కూడా చెప్పలేదు. నేను ఎంత బాధపడ్డానో తెలుసా?" అతను మళ్ళీ చిరునవ్వు నవ్వాడు.
"చెప్పవేం? ఎందుకలా వెళ్ళిపోయావ్?"
"సమయం వచ్చినప్పుడు నీకే తెలుస్తుంది. ఇంకా ఎన్నో విషయాలు నాగురించి తెలుస్తాయి. అదిసరే నువ్వెలా వున్నావ్? సంతోషంగా వున్నావు గదూ? మీ బాబాయి నిన్ను సతాయించడం లేదు. అవునా?"
ఆమె కళ్ళు మిలమిలలాడాయి.
"అవును. ఆరోజు నువ్వు నన్ను రక్షించకపోతే ఇంత ఆనందం పొందగలిగేదాన్ని కాదు. మీరు చెప్పిన మాటలు నిత్యం మననం చేసుకొంటున్నాను. అవును. జీవితం అనుభవించడానికే. జీవితం విలువైనది కనుకే కోరితే లభించేది కాదు. ఆటువంటప్పుడు దాన్ని తుదముట్టించే అధికారం మనకు లేదు. మీరు ఎంత బాగా చెప్పారు!" తన్మయంగా అతని ముఖంలోకి చూస్తూ అన్నది.
అతను సమాధానం ఇవ్వలేదు. నువ్వు పక్కన వుంటే జీవితానికి ఓ అర్థం ఉన్నట్టు నాకు అన్పిస్తోంది. ఎన్ని యుగాలైనా ఇలాగే ఉండిపోగలననిపిస్తోంది. మీరు నాకు తరచు కన్పించాలి. ఎన్నో విషయాలు అడగాలి. ఎన్నో తెలుసుకోవాల్సిన ప్రశ్నలకు సందేహాలకు సమాధానాలు మీరే ఇవ్వగలరనిపిస్తోంది.
"ఎందుకనో?"
తమాషాగా కనులు వాలిపోయాయి.
"ఏమో! నాకు అలా అన్పిస్తున్నది."
"నేను కన్పించడం-నీకు జీవితం మీద ఆసక్తి ఏర్పడింది. అవునా?"
"అవును! మొదటి సమాధిలోకిరాగానే గుర్తొచ్చావు. ఇండియాలో మానవాతీతమైన అనుభవాలు చాలా వుంటాయన్నావు కదూ?"
"స్పిరిచ్యువల్"
"అవును! ఇక్కడకు వచ్చినప్పటి నుంచి నాకు అలాగే అన్పిస్తోంది."
"చాలా సంతోషం! సమాధుల్లో నీకు కేవలం రాళ్ళు మాత్రమే కన్పించకపోవడం - ఏదో అలౌకిక అస్థిత్వాన్ని లీలగా అనుభవించడం- నాకు సంతోషంగా వుంది." అన్నాడు అతను.
"అవును! నేను మాటల్లో చెప్పలేకపోతున్నాను. ఆ సమాధుల్లో చచ్చిపోయిన వాళ్ళ తాలూకు అవశేషాలు మాత్రమే వున్నట్టుగా నాకు అన్పించలేదు. వాళ్ళింకా బ్రతికే ఉన్నట్టూ, వచ్చేపోయేవాళ్ళను గమనిస్తున్నట్టూ అన్పించింది" అన్నది సీత తన అనుభవాన్ని మననం చేసుకుంటూ.
"ఇలాంటి అనుభవాలు చెప్పడానికి మనిషికి వచ్చిన భాష చాలదు. ఆ అనుభూతిని స్వయంగా తెలుసుకోవాలి. అది సరే! రెసిడెన్సీ మీద నీ అభిప్రాయం ఏమిటి?" మాట మారుస్తూ అడిగాడు.
"రియల్లీ థ్రిల్లింగ్" ఉద్రేకంగా అన్నది.
అతను ఆమె ముఖంలోకి చూశాడు. చిరునవ్వు నవ్వాడు.
"నీకు ఎవరో ఆ రెసిడెన్సీ తాలూకు ప్రేమకథలు విన్పిస్తున్నారు గదూ?" సీత తృళ్ళిపడి అతని ముఖంలోకి చూసింది.
"నీకెలా తెలుసు?"
"తెలుసు" అన్నట్టుగా చిరునవ్వు నవ్వాడు.
"కథలు ఎలా వున్నాయి?"
"రియల్లీ రొమాంటిక్!"
"అలాగా?" అదోలా చూస్తూ అన్నాడు.
"అవును! ఆ కథలు నువ్వే అక్కడుండి చెప్పగలిగితే ఇంకా థ్రిల్లింగ్ గా ఉంటాయి." ఆమె మాటలు అనేసి అంతలోకి నాలుక కరచుకొంది. కింది చూపులు చూడసాగింది. బుగ్గల్లో వెచ్చటి రక్తం చిమ్మింది.
"అక్కడ చాలామంది ఉన్నారుగా నీ సందేహాలను తీర్చేవాళ్ళు" అతని కంఠం నిర్లిప్తంగా పలికింది.