Previous Page Next Page 
ప్రణయ వీచికలు పేజి 22

సీత చివ్వున తలెత్తి చూసింది.
"కావచ్చు! కాని నీ ద్వారా వినాలని నాకోరిక. అంతేకాదు - ఇండియన్ ఫిలాసఫీ గురించి నువ్వు చెప్పినట్టు ఎవరూ నాకు చెప్పలేదు. వాళ్ళకు తెలిస్తేగా చెప్పడానికి?"
"నీకు నిజంగా నేను నీపక్కన వుండాలని కోరికగా వుందా?"
"అవును! వుంది. నా ఆలోచనల్ని చెప్పకుండా తెలుసుకోగలనని చెప్పావుగా?" నిటారుగా కూర్చుంది సీత.
"నీ కోరిక తప్పక తీరుతుంది. అయితే నీకు పూర్తి నమ్మకం వుండాలి."
"ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికే ప్రయత్నిస్తున్నాను."
అతను అదోలా నవ్వాడు.
ఎందుకు అలా నవ్వుతాడు? ఇతని తత్వం తనకు బొత్తిగా అర్థం కావడం లేదు. ఆ నవ్వు ఒకసారి ధైర్యాన్ని కలిగిస్తే, మరోసారి కృత్రిమంగా అన్పించి భయంవేస్తుంది. అది తనకు తెలిసే నమ్మకం ఉంచమంటున్నాడేమో. అతని నవ్వు ఒకటే! తనకే ఒకసారి ఒకోలా అన్పిస్తోంది. అసలు తను ఎవరో చెప్పడేం? ఈ సమాధుల్లో కన్పించాడేం?
సీత భయం భయంగా చూసింది. అతను గొల్లున నవ్వాడు. సీత తృళ్ళిపడింది.
"ఏమిటలా భయంగా చూస్తావ్? నేనెవర్నయినా నీకు హాని చేసేవాడిని కాదులే. అది సరే నీకు ఇక్కడ సంతోషంగా లేదా? జీవితం మీద ఆపేక్ష పెరగలేదూ?" సూటిగా చూస్తూ అడిగాడు.
"ఇప్పుడు నాకు చచ్చిపోవాలని లేదు. బతకాలని చాలా కాలం బతకాలని వుంది."
"గుడ్!" సాలోచనగా అన్నాడు అతను. "ఇప్పుడు సీత అనే పేరును నువ్వు సార్థకం చేశావు" మళ్ళీ అతనే అన్నాడు. చిన్నగా తనకు తనే చెప్పుకొంటున్నట్టు.
"అదీ నీ వల్లనే!"
అతను సమాధానం ఇవ్వలేదు. ఏదో ఆలోచిస్తున్నాడు.
"మళ్ళీ ఎప్పుడు కన్పిస్తారు?" అంది సీత.
"ఆ భగవంతుడికే తెలియాలి."
సీతకు చిరాకు వేసింది. "ఈ సస్పెన్స్ ను నేను భరించలేను."
అతను మళ్ళీ చిరునవ్వునే సమాధానంగా విసిరాడు.
"ఇలా రావడం కూడా మంచిపని కాదు. అయినా నువ్వు ఎలా వున్నావో కనుక్కోవాలనే కుతూహలంకొద్దీ...."
"అవన్నీ రాకుండానే తెలుస్తాయన్నావుగా?"
"ఆఫ్ కోర్స్- నీ సంతృప్తి కోసం ఒకసారి కన్పిద్దామని వచ్చాను. నా నియమాలను ఉల్లంఘించాను. ఎందుకో తెలుసా? నీకోసం."
"నీ వల్లనే నేను ఇండియా చూడగలిగాను. ఈరోజు ఇంత ఆనందాన్ని అనుభవిస్తున్నాను. లేకపోతే ఈపాటికి సముద్ర గర్భంలో..."
"అదంతా మర్చిపో."
"కాని నీగురించి...."
"తెలుస్తుంది. త్వరలో తెల్సుకుంటావు."
"ఆరోజు కోసం ఎదురు చూస్తుంటాను. ఇండియన్స్ లో ఆలోచనా శక్తి అధికం అనుకొంటాను. వారికి టెలిపతిలో నమ్మకం వున్నది. ఎంత దూరం వున్నా తమకు కావల్సినవారికే మెసేజ్ పంపించగలరు. అవునా? నువ్వే చెప్పావుగదూ?"
"అవును, కాని అందరికీ ఆ శక్తి వుండదని కూడా చెప్పాను."
"ఆ శక్తిని గురించి మీ అనుభవాలు వినాలని వుంది."
"ఒకసారి ఒక వ్యక్తి నా దగ్గరకు వచ్చి వాళ్ళ నాన్న చనిపోయాడనీ, తను వెంటనే వెళ్ళాలనీ చెప్పాడు. టెలిగ్రాం వచ్చిందా అని అడిగాను. రాలేదన్నాడు. రెండువందల మైళ్ళ దూరంలో వున్నాడు అతని తండ్రి. గంట క్రితమే తన తండ్రి చనిపోయాడనీ, అంత త్వరగా వార్త పంపించే సదుపాయాలు ఆ ఊరికి లేవనీ చెప్పాడు."
"తర్వాత ఏమైంది? అతను అనుకొన్నది నిజంగా జరిగిందా?"
"విను మరి! మా బాస్ అతను సెలవు కోసం అబద్ధం ఆడుతున్నాడనుకున్నాడు. ఎంత చెప్పినా వినిపించుకోలేదు. నిజం చెప్పాలంటే అతని మాటలు అప్పుడు నాకు కూడా పిచ్చివాడి ప్రేలాపనగా అన్పించింది. అతనికి కోపం వచ్చింది.
సెలవు చీటీ రాసిపడేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిన వారానికి అతని నుంచి నాకు ఉత్తరం వచ్చింది.
"ఏం రాశాడు?"
"అతని తండ్రి చనిపోయాడట. తనకు ఆ విషయం తోచినప్పుడే అతని ప్రాణం పోయిందట."
సీత కళ్ళు వెడల్పు చేసుకుని అతని ముఖంలోకి చూసింది.
"నేను నిన్ను చూడాలనుకొంటే ఆ విషయం నేను ఆలోచనల ద్వారా చెప్పాలన్నమాట."
"అవును."
"నా ఆలోచనలు నీకు విన్పిస్తాయా?"
"విన్పించడం కాదు - బుర్రకు తడతాయి. నువ్వు నాగురించి ఏమి ఆలోచిస్తున్నావో తెలుస్తుంది. అప్పుడు నేను రాగల పరిస్థితిలో వుంటే, నా అవసరం నీకు వుంటే వస్తాను."
ఆమె ఏదో అడగబోయింది.
అతను లేచి నిల్చున్నాడు.
"ఇక వెళతాను. నీ బాడిగార్డ్సు ఎదురు చూస్తున్నారు. ఇంకాసేపుంటే వెతుక్కుంటూ వస్తారు. అందుకే నేను త్వరగా వెళ్ళిపోవాలి. ఆ ఒకవిషయం ఈసారి యిలాంటి ప్రదేశాలు చూడాలనుకుంటే సిపాయిలను తీసుకొనిరాకు. సైన్యాధికారిని తీసుకొనిరా"
"ఎందుకూ! వాళ్ళిద్దరున్నారు. అవసరం అయితే కేక పెడితే వస్తారు."
"అవుననుకో" ఏదో ఆలోచిస్తూ అన్నాడు అతను. "రెసిడెన్సీలో బస చేసే వారి రక్షణ బాధ్యత అక్కడి సిబ్బంది వహిస్తుంది" అన్నాడు మళ్ళీ.
"అక్కడవాళ్ళు అంత జాగ్రత్తలు వహిస్తుంటే నాకెందుకో భయంగా అన్పిస్తోంది."
అతను అలవాటుగా నవ్వాడు.
"అలవాటు పడతావులే, తనను ఒక విలువైన నగగా చూడటాన్ని ఏ ఆడపిల్ల ఇష్టపడదు?"
"నగలగానా? నాకు నగలు లేవు. నగలంటే నాకు ఇష్టం. నువ్వు నన్ను నగతో పోలుస్తుంటే నాకు చాలా చిత్రంగా, ఫైరీ స్టోరీలోని రాజకుమారిని నేనేనేమో అన్పిస్తోంది" అన్నది అదోలాంటి అనుభూతితో, చుట్టూ పరిసరాల్ని మర్చిపోయినట్టుగా.
అతను సమాధానం ఇవ్వలేదు. తన నల్లటి కనుపాపల్ని ఆమె కళ్ళమీద నిలిపి లోతుగా చూస్తూ వుండిపోయాడు.

 Previous Page Next Page