మూగ ప్రాణుల బంధమోక్షణం బొందించి
యాగవేదికల వాగమృతమ్ము చిందించి
సర్వార్ధసిద్దమౌ 'సౌజన్యముల పంట'
కాలూను నంట వైశాలి నర్తకి యింట!
ఆ ప్రభువు చూపు తాపత్రయం బెడబాపు;
ఆ దయామయు మాట అపవర్గముల మూట;
సర్వతో భద్రమౌ 'శాంత్యహింసల పంట'
కాలూను నంత వైశాలి నర్తకి యింట!
నా ప్రభువు నా కరుణమూర్తి నన్ను మన్నించారు
నా ప్రార్ధన ఆలకించారు నా పిలుపు స్వీకరించారు
ఎందరో కోటీశ్వరులు తమ మందిరాల కాహ్వానించినా
అందరినీ కాదని యీ ఆమ్రపాలినే అనుగ్రహించారు.
సంసార దుఃఖహరణాలు! చైతన్య పరిస్ఫురణాలు!
శాంతిదేవత కలంకరణాలు! సౌభాగ్య సమవతరణాలు!
అజ్ఞాన తమస్సు లణచు అహస్కరుని కిరణాలు!
శాక్యసింహుల శ్రీచరణాలు! సర్వదా నాకు శరణాలు!!
జగద్గురువు కీ నర్తకి స్వాగత మిస్తుంది నేఁడు;
జన్మజన్మాల సాధన సార్ధక మవుతుం దీనాఁడు;
గగనం పుష్పవృష్టి కురుస్తుంది; కరగి నీరవుతుంది భూమి;
పూజ లందుకుంటాడు నాస్వామి; బుద్ధం శరణం గచ్ఛామి."
అనుచు ఆనంద పారవశ్యమున నాట్య
మాడు ఆ యామ్రపాలి హర్మ్యమ్మునందు
అడుగు బెట్టిరి కారుణ్య మతిశయింప
పతితపావనులగు తథాగతుల వారు.
ప్రభువు కాళ్ళు కడిగె పన్నీట కన్నీట
ఆమ్రపాలి; సుగతుఁ డా శుభాంగి
శీర్షమును స్పృశించె శ్రీకరమ్మైన క
రమ్ముతోడ కనికరమ్ము తోడ.
"కొట్టిన రాజహంస గయికొన్నది చాలక నేను కోరుకొ
న్నట్టి యశోధరన్ కుటిలుఁడై వరియించెను; కావిపుట్టముల్
గట్టి మునీంద్రుఁడయ్యె"నని గౌతముపై పగబట్టి పంతముం
బట్టెను దేవదత్తుఁడు త్రపాపరిపూర్ణవిషణ్ణచిత్తుఁడై.
మగధ భూవిభుని కుమారుఁడైన యజాత
శత్రుతోడ కపట మైత్రి నెరపె;
బింబిసారు చెరను బెట్టించె నతనిచే;
బుద్దుఁడనిన ద్వేషబుద్ధి గరపె.
కొండొకనాఁడు శాక్యముని కొండలసందుల దారిలో సశి
ష్యుండయి వచ్చుచుండ గురిచూచి నగాగ్రమునందు వేచి కూ
ర్చుండిన దేవదత్తుఁడెద రోషము ద్వేషము పొంగులెత్త, పెన్
బండ నొకండు గౌతమునిపై దొరలించె కఠోరచిత్తుఁడై
"బండ బండ" "పైన బడె పైన బడె" నంచు
చెదరి పరుగులిడిరి శిష్యులెల్ల;
సాగిపోవుచుండె సర్వజ్ఞు డొక్కింత
శంక లేక, జంకు గొంకు లేక.
అధికారాంధుని కైవడి
అధఃపతన మంది ఆమహాశిల కరుణా
నిధి పాదకమలముల స
న్నిధిలో టక్కుమని నిలిచె నియమితభంగిన్.
తన చటుల ప్రయత్నము వృథాయయి నందుల కాత్మలోపలన్
గనలుచు దేవదత్తుఁ డధికారవికారమదప్రమత్తుఁడై
జననుత కీర్తిసాంద్రుఁడగు శాక్యమునీంద్రుని మీఁద మచ్చరం
బును విడఁ డింతయున్; శునకపుచ్చము వక్రత దీర్ప శక్యమే?
మించిన వైరదృష్టి విషమించి, మహీశుని మావటీనికిన్
లంచములిచ్చి, బుద్ధి వికలంబుగ మద్యము గొంతుకంట ప
ట్టించి, మహోగ్రమౌ మదపుటేన్గును శాక్యమునీంద్రుపైకి దూ
కించె దురాశయుండు; తిలకించిన పౌరులు బెగ్గడిల్లఁగన్.
మత్తగజంబట! మదిరో
న్మత్తంబట! పైకి దూకెనట! తొణకఁడు కిం
చిత్తైన చిత్తమున శా
క్యోత్తంసుఁ డదెంత స్థైర్యమో! నిబ్బరమో!
తొండము మీఁద కెత్తుకొని దుందుడుకై యరుదెంచియున్ మదో
ద్దండత మాని, ముందరి పదమ్ము లొకించుక వంచి మత్తవే
దండము బుద్ధదేవుని పదమ్ములపై తలనుంచి వంగి ని
ల్చుండె నగస్త్యు ముందు వివశంబగు వింధ్యగిరీంద్రు కైవడిన్.
ఎన్నో భంగుల కుట్రపన్ని సుగతున్ హింసించి వంచింది ఆ
పన్నుం జేయఁగ దేవదత్తుఁడు మదిన్ భావించి భ్రష్టాత్ముఁడై
ఖిన్నుండై యకృతార్దుఁడై చివరకున్ గేల్మోడ్చి "మన్నింపుమో
యన్నా!" యన్న క్షమించె సోదరుని శాక్యస్వామి చిర్నవ్వుతో.
"అంగుళీమాలుఁడణు గజదొంగ గలఁడు
దారిదోపిడిగాఁడు; ఈ దారి మీరు
చనవల" దటంచు ప్రజలు హెచ్చరిక సేయ
నవ్వుకొని స్వామి ముందుకు నడచినాఁడు.
గొడ్డలి భుజాగ్రమున దాల్చి కొండబోయ
ముందునకు దూఁకె పరశురాముని విధాన;
పరశుహస్తమ్ము వాఁడు పై పయికి నెత్త
అభయహస్తమ్ము నెత్తె దయామయుండు,
భిల్లునిం గాంచి గుండె గుభిల్లు మనఁగ
బెదరి శిష్యులు కేకలు పెట్టినారు;
అట్టహాసమ్ము చేసె నయ్యడవి దొంగ;
మందహాస మ్మొనర్చె నెమ్మదిగ స్వామి.
స్వామి చిరునవ్వులో నెంత శక్తి గలదొ!
కేలుగవ నుండి గొడ్డలి క్రింద బడియె;
ప్రభువు చూపులలో నేమి ప్రతిభ గలదొ!
వాఁడు గురుదేవు పాదాల పైన బడియె.
"ఘాతుకుఁడ, దేవరా! మహా పాతకుఁడ, కి
రాతకుఁడ; నను గావు దొరా!" యటంచు
ప్రార్ధన మొనర్చు దొంగ శీర్షమ్ము నిమిరి
శిష్యునిగ బుద్ధదేవుఁడు స్వీకరించె.
ఆ దృగంతముల నయస్కాంత మున్నదొ!
కరములోన గలదొ పరుసవేది!
అడవిదొంగ యైన అంగుళీమాలుని
మంచి మానవునిగ మలఁచె స్వామి.
బరువుగుండె తోడ తెరువుదోపరి వాఁడు
గురువుగారి చెంత కూరుచుండి
వెక్కి వెక్కి యేడ్చి వేఁడి కన్నీళ్ళతో
చెప్పదొడఁగె నిట్లు స్వీయచరిత.
"స్వామీ! పూర్వము మాదొక
సామాన్య కుటుంబ మయ్య! జనకుఁడు వృద్ధై
మా మనుగడ కోసమే వే
రే మార్గము లేక బిచ్చ మెత్తఁగ వలసెన్.
పెద్ద కరవు వచ్చె; ముద్ద పుట్టకపోయె;
మాత క్రుంగి కుమిలి మంచమెక్కె;
'బువ్వ బువ్వ' యనుచు బుడుతల మేడ్వంగ
అయ్య మనసు నూరు వ్రయ్యలయ్యె.
అన్నము కొరకై గోడకు
కన్నము వేసెనని నగర కామందులు మా
కన్నయ్య చేతి వ్రేళ్ళను
క్రన్నన తెగగొట్టినారు కర్కశమతులై.