సమాగమము
"మంగళమూర్తి! నీవొక సమస్యవు; నిన్ను గ్రహింపలేని ము
గ్దాంగన యీ యశోధర; దిగంతము లేలు దృగంతముల్ కళా
రంగము లయ్యె నా ప్రణయరాగిణి కంచు దలంచినాను; నా
మంగళసూత్రమే భువనమంగళసూత్ర మటం చెరుంగనే!
నాథుఁడ వంచు నమ్ముకొనినాను దయామయ! నిన్ను; నామనో
నాథుఁడ వీ క్రియన్ భువననాథుఁడ వౌట యెరుంగ; ఈ పనీ
వీథి నిబద్దమౌ మురళివే యనుకొంటిని; విశ్వధారుణీ
వీథి ప్రబుద్దుమౌ ప్రణవవీణవు నీవని యెంచనైతినే!"
నాథుని త్యాగపూర్ణకరుణాధుని వెన్నెల వెల్లువై ప్రజా
వీథుల పొంగులెత్తి ప్రభవించునులే సుఖశాంతి సస్యముల్;
ఆధునిక ప్రపంచము దయామయు బోధలలో యశోధరా
గాథలు బాధలున్ మరచి కాంచునులే అపవర్గమార్గముల్.
ఆమె హృదయవిపంచిపై ఆలపించు
భావగీతిక లవి వినంబడెనొ లేదొ
స్వామివారికి వివరింపలేము గాని,
అశ్రుసిక్తము లయ్యె సిద్దార్దు కనులు.
* * *
"తెలియనివాఁడ గాను వెలఁదీ! భవదీయ మదీయ మానసో
జ్జ్వల జననాంత రానుగత సౌహృదబంధము; నీ మనస్సు లో
తులు సకలమ్ము నే నెరుఁగుదున్; మురిపించెడు నీదు వాలు క
న్గొలకుల నీడలో చదువుకొంటిని విశ్వరహస్యకావ్యమున్.
అప్పు డదేదియో ఒక మహత్తరభావము గుండెలోపలన్
కుప్పలు తెప్పలై అలముకొన్నది; ఎవ్వరొ పిల్చినట్లుగా
చెప్పక సాగిపోయితిని; చెప్పిన నాఁడు కవోష్ణబాష్పముల్
చిప్పిలు నీ కనుంగవ చెలీ! నను కాలు కదల్ప నిచ్చునా?
కావి ధరించి నే నచట కానన మం దొక రావినీడలో
దేవి! తప మ్మొనర్చితిని తీవ్రముగా నిరుమూడు వర్షముల్;
జీవితమే అరణ్యముగ చేసితి విచ్చట క్లిష్టమౌ తపం
బీవు తలోదరీ! మరి సహించుచు మద్విరహాగ్ని కీలలన్."
* * *
స్వామి మానస్పందన మామె వినెను;
ఆమె మదిలోని భావాలు స్వామి కనెను;
శబ్దములతోడ పని లేని సరసహృదయ
భాష వారిది! మౌనసంభాషణ మది!
సువర్ణ కమలము
తోఁటమాలి 'సుదాసు' పూఁదోఁటలోని
తమ్మికొలనున పరమాద్భుతమ్ముగారు
ప్రభవ మందిన దొక సుప్రభాత వేళ
పసిఁడి రెక్కల శతపత్రపద్మ మొకటి.
సరసుని హృదయము కైవడి
సరసున వికసించి యున్న స్వర్ణసరోజం
బరసిన కుమారి 'మల్లిక'
మురిసిన చిత్తమ్ములో ప్రమోదము విరిసెన్.
కాంచన రాజీవంబును
గాంచిన ఆ చిట్టితల్లి గబగబ చని నే
త్రాంచలములు మెరయఁగ వి
న్పించెన్ జనకునకు తమ్మివృత్తాంతమ్మున్.
"ఏమి రం! గేమి సౌరభ! మేమి విరిగి!
ఇది యొక అపూర్వశతపత్రమే" యటంచు
ఆ సరోజమ్ము సొగసు సుదాసు మెచ్చె;
తండ్రి కూతుండ్ర హృదయ పద్మములు విచ్చె.
గలగల మటంచు సరసిలో అలలు కదల,
తళతళ మటంచు తనదు నేత్రములు మెరయ,
కొలనులో దిగి మల్లిక కోసి తెచ్చె
కనకరాజీవమును పెద్దకాడ తోడ.
తోఁటలో నున్న పూలన్నీ త్రుంచి తెచ్చి,
సజ్జలన్ నింపి, పయి స్వర్ణజలజ ముంచి,
సమ్ముదము మీరగా పట్టణమ్ములోన
అమ్ముకొనబోయి రెప్పటియట్లె వారు.
"జేతవనమున నాఁడు విచ్చేసినాఁడు
బుద్ధభగవానుఁ"డని విని పురములోని
జనులు పోసాగినారు హస్తాల పూల
దండలు ధరించి తండోపతండములుగ.
నాఁడు పువ్వులవెల గగనమున కంటె;
బంతిపూ వొండు రెండు రూప్యమ్ము లమ్మె;
కలువపూ వొక్కటియె ఐదు కాసు లమ్మె;
పసిఁడి పద్మమ్ము మాట చెప్పంగ నేల?
పది, ఇరువది, ముప్పది, నలు
వది, ఏబది యంచు స్వర్ణపద్మము మూల్యం
బది పెరిగి క్రమముగ అ
ర్వది, డెబ్బది దాటి వంద వరహా లయ్యెన్.
"ఎంత విలువైన చెల్లించి యీ సువర్ణ
పద్మము తథాగతుని పాదపద్మయుగళి
కర్పణము చేయవలె" నంచు ఆశ పడిరి
మగధ రాజ్యమ్ములోని శ్రీమంతు లెల్ల.
అంతలోన సుధాసుని అనుఁగు బిడ్డ
మల్లికకు తోచినది ఒక మంచి యూహ;
"ఇంత విలువైన పుష్పమ్ము నితరు లేల?
మనమె అర్పిమ్త మా దయామయున" కనుచు.
"తల్లి! నా మల్లి! వరహాల తల్లి! ఎంత
అందమగు నూహ చేసితి!" వని సుదాసు
చేత కలధౌత మయ జలజాత మూని
జేతవని కేగె తన తనూజాత తోడ.
మల్లిక భక్తబృందముల మధ్యమునం జని నిండుగుండెతో
మెల్లఁగ స్వామి పాదముల మీఁద సరోజము నుంచి మ్రొక్కినన్
చల్లని సత్కృపారసము జల్లుల నుల్లము పల్లవింపఁగా
అల్లన హస్తమెత్తి "శుభమ"స్తని దీవనలిచ్చె స్వామియున్.
ఆమ్రపాలి
"శాక్యరాజ్యస్వామి జాయ మాయాదేవి
లోకోత్తరమ్మైన లుంబినీవనములో
కడుపు చల్లఁగ కన్న 'కల్యాణముల పంట'
కాలూను నంత వైశాలి నర్తకి యింట!
కఠిన కర్కశ శరాఘాతమ్ముచే కూలి
వ్రాలు రాయంచ కుయ్యాలించి లాలించి
రక్షించు 'అక్షీణ దాక్షిణ్యముల పంట'
కాలూను నంత వైశాలి నర్తకి యింట!
రాజ్యమ్ము ప్రణయసామ్రాజ్యమ్ము విడనాడి
తళుకుచెక్కిళ్ళ ముద్దుల నందనుని వీడి
కదలి పోయిన 'విశ్వ కారుణ్యముల పంట'
కాలూను నంత వైశాలి నర్తకి యింట!
కదలి మహాభినిష్క్రమణంబు సాగించి
పల్లెపడుచు సుజాత పాయసమ్ము భుజించి
బుద్ధత్వమును గన్న 'బోధివృక్షము పంట'
కాలూనునంత వైశాలినర్తకి యింట!
కన్నీళ్ళతో జగత్కాలుష్యమును కడిగి
శాంతి కలహంసలకు కాంతిరెక్కలు తొడిగి
అజ్ఞానముల నణచు 'విజ్ఞానముల పంట'
కాలూను నంత వైశాలి నర్తకి యింట!
కరకు కత్తులుపెరకి కంఠాలు తెగనరకి
ప్రజల నెత్తురు త్రాగు గజదొంగలను గూడ
సాధువులుగా మార్చు 'సౌహార్దముల పంట'
కాలూను నంట వైశాలి నర్తకి యింట!