Previous Page Next Page 
కరుణశ్రీ సాహిత్యం-2 పేజి 22

                                 


    వ్రేళ్ళు తెగిన తండ్రి విలవిలమని యేడ్వ
    ఖలులు నవ్వినారు కిలకిలమని;
    'పీడ విరిగె' నంచు పెద్దగా గంతులు
    వేసినారు నగరవాసు లెల్ల.

    చిన్ననాఁట నాదు కన్నుల గనుగొన్న
    ఘోరకలికి గుండె కుమిలిపోయె;
    తండ్రి ఋణము దీర్ప గండ్రగొడ్డలి పట్టి
    క్రూరరాక్షసుఁడుగ మారినాను.
    
    నగరవాసుల అంగుళుల్ నరికి, మాల
    గ్రుచ్చి, నా కంఠమున వేసికొంటి స్వామి!
    కొండదారులలో కాచుకొంటి; పిసిని
    గొట్టు ధనవంతులణు దోచుకొంటిని దొర!
    
    వేలకొలఁది చేతివ్రేళ్ళు ఖండించితి;
    దండ గ్రుచ్చి అరుత దాల్చుకొంటి;
    మది జ్వలించు ద్వేష మది చల్ల ఁబడదేమి
    స్వామి?" యనిన పలికె శాక్యమౌని.
    
    "హింస చేత హింస యెపుడు చల్లారదు;
    హింస ప్రేమ చేతనే శమించు;
    అగ్నిచేత అగ్ని ఆరిపో దెన్నఁడు;
    చల్లఁబడును జలము చల్లినంత."
    
                                            
    సౌందర్యముగ్దులౌ సుందరీ నందుల
        ఆర్త సేవా పరాయణులఁ జేసి
    ఘాతుకుండైన అజాత శత్రుని దుండ
        గములాపి ధర్మమార్గమును జూపి
    రోహిణీ జలముకై రోషాన పోరాడు
        శాక్య కౌళీయుల సఖ్యపరచి
    ఆనంద మొగ్గలాయన సారిపుత్రాది
        శిష్యుల కర్హతస్థితి నొసంగి
    కోటిస్వర్ణమ్ములను పోసి కొని "అనాథ
    పిండకుఁడు" భక్తితో సమర్పించినట్టి
    "జేతవనము"ను కాంతినికేతనమును
    స్వీకరించె ప్రశాంతి రత్నాకరుండు.
    
    "అవును వారే! కఠినాత్ములౌ నృపతుల
        మతులు మార్చిన తథాగతులవారు
    అవును వారే! దురహంకారులను పరా
        జితులఁ జేసిన తథాగతులవారు
    అవును వారే! నిరాశాంకితులకు పురో
        గతులు చూపిన తథాగతులవారు
    అవును వారే! మాన్యులగు అసామాన్య్లుల
        స్తుతుల నందిన తథాగతులవారు
    
    అవునవును వారె! పరమ దయార్ద్రమతులు
    పతితపావనులగు తథాగతులవారు
    రండు రం" డంచు తండోపతండములుగ
    జనము వత్తురు స్వామి దర్శనము కొరకు.
    
    "మల్లికా! ఆమ్రపాలి! క్షేమా! సుజాత!
    గౌతమీ! సుందరీ! విశాఖా! సునంద!
    వేగ రం" డంచు వేనకువేలు స్త్రీలు
    తరలి వత్తురు స్వామి బోధలు వినంగ.
    
    అలిక ఫలకాన దివ్యదీప్తులు వెలుంగ
    మందహాసమ్ము పెదవులఁ జిందులాడ
    శాంత గంభీర మోహన స్వరముతోడ
    పలుకు శాక్యర్షి శ్రోతలు పరవశింప.
    
    ఆ చిరునవ్వులో అందాల హరివిల్లు
        సన్నజాజుల వానజల్లు కురియు;
    ఆ కటాక్షమ్ములో రాకా శరచ్చంద్ర
        చంద్రికాపూరాలు జాలువారు;
    ఆ మధురోక్తిలో అమ్నాయపరమార్ధ
        విజ్ఞాన వాహినుల్ వెల్లి విరియు;
    ఆ పదస్పర్శలో అనురాగమయ వియ
        ద్గంగా తరంగాలు పొంగిపొరలు;
    
    అతఁడు "సర్వజ్ఞుఁ" డతఁడు "తథాగతుండు"
    "బుద్దుఁ" డాతఁడు "సర్వార్ధసిద్ధుఁ" డతఁడు
    కనుఁడు జనులార! కన్నుల కరవుదీర!
    వినుఁడు మనస్వామి బోధలు వీనులార!
    
                                          * * *
    
    "దుష్ట చిత్తులు దుష్ప్రవృత్తులగు జనుల
    వెంబడించును దుఃఖాలు విడువకుండ;
    బండి లాగెడు తరి వృషభములఁ గదిసి
    కదలి వెంటాడు శకట చక్రముల భంగి."
    
    దుమ్ము తుడిచిన నిలువుటద్దమ్ము నందు
    ప్రతిఫలించిన స్వీయ రూపమ్ము పగిది
    స్వచ్చమగు సన్మనుష్యుని స్వాంతమందు
    సృష్టముగా దర్శనమ్మిచ్చు సృష్టి యెల్ల.
    
    "పరమ భాగ్య" మారోగ్యమే నరుల కెల్ల
    "పరమ ధనము" సంతుష్టియే ధరణియందు
    "పరమ సఖము" విశ్వాసమే; తరిగిపోని
    "పరమ సుఖము" నిర్వాణమే ప్రాజ్ఞులార!
    
    కామమును బోలు అగ్ని లోకమున లేదు;
    ధరణి ద్వేషమ్ము వంటి భూతమును లేదు;
    మోహసమమైన వల జగమ్ముననె లేదు;
    ఆశవంటి మహాప్రవాహమ్ము లేదు.
    
    కరుణ శాంతి నిచ్చు; కరుణ కాంతి నొసంగు;
    కరుణ లేని నాఁడు ధరణి లేదు;
    కరుణ శుభము నిచ్చు; పరమసౌఖ్యము నిచ్చు;
    కరుణ లేని నరుఁడు గడ్డిబొమ్మ.
    
    "మంచి దృష్టి" మరియు "మంచి సంకల్పంబు",
    "మంచి భాషణంబు", "మంచి చర్య",
    "మంచి జీవనంబు", "మంచి ప్రయత్నంబు",
    "మంచి సంస్కృతి" యును, "మంచి దీక్ష".
    
    ఇదియె "అష్టాంగ మార్గ", మీ యెనిమిదింటి
    నభ్యసించిన మనుజు లనంతసుఖము
    లందుకొందురు; శాశ్వతానంద మబ్బు;
    నష్టమగు తృష్ణ; దుఃఖమన్నదియె రాదు.
    
    శోకమయమ్ము లోకమిది; శోకనిధానము తృష్ణ; లోక శో
    కాకరమైన తృష్ణను నిరాకరణం బొనరింపగావలెన్;
    ప్రాకృతమైన తృష్ణ నణపంగల వెన్మిది మంచి మార్గముల్;
    చేకొనుఁ డెల్లవారలును; జ్ఞేయము లీ చతురార్య సత్యముల్.
    
    క్షాంతి, దాన, శీల, సత్య, నైష్కర్మ్యముల్,
    శాంతిదయకములు సద్గుణములు;
    మరి ఉపేక్ష, వీర్య, మైత్ర్యధిష్టానాలు,
    ప్రజ్ఞతోడ పదియు "పారమితలు".
    
    ఈ "పారమితలు" పదియును
    చేపట్టిన మానవులకు శ్రేయము గలుగున్;
    పాపములు తొలఁగు; భవ సం
    తాపంబులు మలఁగు; చెలఁగు ధర్మపథమ్ముల్.
    
    దృఢమయిన కప్పుతో నొప్పు గృహమునందు
    వానజల్లు ప్రవేశింపలేని యట్లు;
    ఇల జితేంద్రియుఁడగువాని హృదయమందు
    చెడ్డ భావంబులవి ప్రవేశింపలేవు.
    
    విషయ సుఖలోలుఁడగు నవివెకి నెపుడొ
    మృత్యువు హఠాత్తుగా దిగమ్రింగివేయు;
    మైమరచి నిద్రపోవు గ్రామమును, వరద
    వెల్లువ అమాంతముగా ముంచివేయునట్లు.
    
    చిత్తము "ప్రమత్త" "మీర్ష్యా ప్రవృత్త" "మధిక
    చంచలము" స్వేచ్చమెయి సంచరించు నెపుడు;
    ఆ మనో మర్కటము సివాలాడకుండ
    వశమునం దుంచుకొనువాఁడె ఘనుఁడు.
    
    పరిగణింపరాదు పరుల దోషమ్ములు;
    పరితపింపరాదు పరుల సిరికి;
    పరిహసింపరాదు నిరుపేదలను గాంచి;
    పరవశింపరాదు భాగ్యములకు!
    
    బీదవాని పెదవిమీద చిర్నవ్వులు
    చిందునట్లు మీరు చేతురేని-
    వేయి స్వర్ణనిధులు వెలుఁగొందు మీముందు;
    వంద నందనములు కందళించు!!
    
    పలుకకుఁడు పరుషవాక్కులు;
    సలుపకుఁ డహితంబు సాధుజనులకు; గురులన్
    తల్లిదండ్రుల పూజింపుఁడు;
    తలపోయుఁ "డహింస పరమ ధర్మం" బనుచున్.
    
                                       * * *
    
    కరుణామయుఁ డగు బుద్దుని
    కరుణశ్రీవాణి విశ్వకల్యాణ గుణా
    కరమై, ఆచంద్ర దివా
    కరమై వెలుఁగొందు దిగ్దిగంతములందున్.

 Previous Page Next Page