Previous Page Next Page 
ఆత్మబలి పేజి 2


    "బాగుంది ఆలోచన. ఆ విషయం నాకు వదిలెయ్యండి. "ధీమాగా అన్నాడు మూర్తి. మూర్తికి ఊళ్ళో చాలామంది తెలుసు. మాలిని తెల్లబోయింది.
    "ఏమైనా తక్కువ పడితే నేను చూస్తాను" ఉదారంగా అంది సరోజిని.
    "వార్షికోత్సవం అంటే ఏదైనా ఎంటర్టైన్మెంట్ ఉండాలి. మనం ఏం ఏర్పాటు చెయ్యగలం?" సమస్య సృష్టించాడు కేశవ.
    "మనమే ఏదో ఒకటి వేస్తే సరి." నిర్లక్ష్యంగా అంది శోభ.
    "ఛీ! పాడు. మనం స్టేజిమీద వెయ్యటమా? మళ్ళీ మనం తలెత్తుకోగలమా?" ఈసడించింది మాలిని.
    "నేను వేస్తాను. నాకు నాట్యం కూడా వచ్చు. మా నాన్నకు రెండు లక్షలున్నాయి. నన్ననడానికెవరికీ గుండెలు లేవు. నేను అతి దర్జాగా తలెత్తుకోగలను." సగం వెక్కిరింపుగా, సగం గర్వంగా అంది సరోజిని.
    "నేను పాడతాను. నేను చేసే పనిలో తప్పులేనంత వరకూ నేనెవరి మాటలనూ లక్ష్యపెట్టను" నొక్కి నొక్కి అంది శోభ.
    "ఇంతకూ సరోజినీగారి నాట్యమన్నమాట!"
    "శోభగారి పాటతో......."
    "ఎవరైనా మంచి వక్తను పిలిపించి మాట్లాడమందాము" కేశవ అన్నాడు. ఆ సాంస్కృతిక సమాజంలో 'సంస్కృతి' కొరకు కాస్త పాటుపడేవాడు అతనొక్కడే!
    "ఆ విషయం మీరు చూసుకోండి" అంది శోభ.
    సాహిత్యంలో శోభ కంతంత మాత్రమే అభిలాష. ఎంతసేపూ ఆమె దృష్టి సంగీతం మీదనే.
    అలా కార్యక్రమం నిర్ణయమయిపోయింది. సరోజిని సుమబాలలా అభినయించడానికి నిర్ణయించుకుంది.
    ప్రకృతి వడిలో అప్పుడే కనులు విప్పిన కుసులబాల తన పరిమళాలతో ఊగిపోతున్న ప్రకృతిని చూసి క్షణికంగా గర్విస్తుంది. జగత్తు సర్వమూ సుమబాలను ఆరాధనాదృష్టితో చూస్తుంది. దేవ దేవుడే ఆ చిన్నారి పుష్పాన్ని పూజా ద్రవ్యంగా అంగీకరించి ఆశీర్వదించాడు. అంతలోనే తన రేకులు వడిలిపోవటం గమనించి కలవరపడుతుంది సుమబాల. తన ఆయుర్దాయం క్షణికమయినందుకు కుమిలిపోతుంది. అంతలో తెప్పరిల్లి ఏ ప్రత్యేకతా లేక చిరకాలం బ్రతికేకన్న సమస్త ప్రకృతినీ తన పరిమళాలతో పరవశింపజేసి దేవదేవుని ఆశీర్వచనాన్ని పొంది జన్మ సార్ధకం చేసుకున్నానన్న సంతృప్తితో ప్రకృతిలో లీనమయిపోతుంది.
    ఈ భావానికి గేయంలో ఆకృతి నిచ్చాడు కేశవ. తన గాత్రంతో ప్రాణం పోసింది శోభ. దానిని సభికుల హృదయాలలో ప్రతిఫలింపజేయటానికి సంకల్పించుకుంది సరోజిని.
    సరోజిని సౌందర్యవతి కాదు కాని నాజూకుగా ఉంటుంది. శాస్త్రీయమైన భరతనాట్యం నేర్చుకుంది. అందులోనూ అంత ప్రావీణ్యం సంపాదించకపోయినా ఫరవాలేదు. శోభగానం అందరినీ మంత్రముగ్ధులను చేసింది. మొత్తంమీద ప్రదర్శన జయప్రదంగా ముగిసింది.
    శోభను ఆ సమాజానికి కార్యదర్శిగా ఎవరూ ఎన్నుకోలేదు. అసలలాంటి ఎన్నికలు జరగలేదు. అయినా అందరూ శోభను వోట్ ఆఫ్ థాంక్స్ చెప్పమన్నారు.
    శోభ రంగస్థలంమీదకు వచ్చి ఆనాటి కార్యక్రమంలో సహాయపడిన అందరికీ కృతజ్ఞతలు చెప్పింది. "ఈనాటి పరిస్థితుల్లో దేశరక్షణకు చెయ్యవలసిన మహత్కార్యాలను వదిలి, మన కార్యక్రమంలో పాల్గొని, అమూల్యమయిన తన కాలాన్ని మనకోసం త్యాగంచేసిన శ్రీ రావుగారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెపుతున్నా"నని ముగించింది. చాలామందికి ఇది అర్థంకాలేదు. రావు పెదవులపై తళుక్కున చిరునవ్వు మెరిసి మాయమయింది.
    'జనగణమన'తో వార్షికోత్సవం ముగిసింది.


                                   2


    తన పక్కనే కారు ఆగిన చప్పుడుకు ఏదో ఆలోచించుకుంటూ నడుస్తూన్న శోభ ఉలిక్కిపడింది.
    "మీరెక్కడకు వెళ్తున్నారు?" కాదు దిగి అడిగాడు రావు.
    "ఎందుకు?" తీక్షణంగా అడిగింది శోభ.
    "నేను అశోక్ నగర్ వెడుతున్నాను; మీరు అటువైపే వెడుతూంటే లిఫ్ట్ ఇస్తాను."
    "నేనూ అశోక్ నగర్ కే వెడుతున్నాను."
    "అయితే రండి." కారు వెనుక తలుపులు తెరిచాడు రావు. "థాంక్స్" చెప్పి లోపల కూర్చుంది శోభ.
    "మీరు అశోక్ నగర్ లో ఎక్కడుంటున్నారు?"
    "చింతలపూడిలో మా ఇల్లు. అశోక్ నగర్ లో మా బంధువులున్నారు."
    'ఎవరని' అడగబోయి ఆగిపోయాడు. శోభ మాటలధోరణి అనవసర ప్రసంగానికి ఎడమిచ్చేదిలా లేదు.
    "చదువుకుంటున్నారా?"
    "తాలూకా ఆఫీసులో యు.డి.సి.గా పనిచేస్తున్నాను."
    "ఇంత రాత్రివేళ ఒక్కరూ వెడుతున్నారు, భయంగా లేదూ?"
    "నా చెప్పులు చాలా గట్టివి. నాకసలు భయంలేదు."
    డ్రైవ్ చేస్తున్నవాడల్లా వెనక్కు తిరిగి చూశాడు రావు.
    "ప్లీజ్! ముందుకు చూడండి. చీకట్లో నేనెలాగూ సరిగా కనిపించను." వెటకారంగా అంది శోభ. గతుక్కుమన్నాడు రావు. చాలా సిగ్గుపడ్డాడు. ఇంకేమీ మాట్లాడకుండా శోభ చెప్పిన గుర్తుల ననుసరించి శోభను వాళ్ళ బంధువులింటిదగ్గర డ్రాప్ చేసి వెళ్ళిపోయాడు.


                                      *    *    *


    మరునాడు ఆదివారం. పినతండ్రి గారింట్లో కాఫీ త్రాగి బస్ లో ఇల్లు చేరుకుంది శోభ.
    అన్నగారి కొడుకు చొక్కాలకు గుండీలు కుడుతూ కూర్చుంది ఉమ.
    శోభను చూడగానే సంభ్రమంతో "రాత్రి రాలేదేం అక్కయ్యా! ఎంత గాభరాపడ్డాననుకొన్నావ్?" అంది.
    "మా ఫంక్షన్ అయ్యేసరికి పొద్దుపోయింది. అందుకని ఏలూరులో మన బాబయ్యగారింట్లో ఉండిపోయాను" నవ్వుతూ చెప్పి లోపలకెళ్లిపోయింది.

 Previous Page Next Page