"నా క్షేమాన్ని కాంక్షించని సమాజం, నన్నర్థం చేసుకోలేని సమాజం నాకు వ్యర్థం. అటువంటి సమాజం కోసం, నా లక్ష్యాన్ని త్యాగం చెయ్యడం, తెలివితక్కువతనం రాధీ నిన్ను మనసారా ప్రేమిస్తున్నాను. చిన్ననాటి స్నేహబంధం, విడివడని వివాహబంధంగా మారాలని కోరుకుంటున్నాను. కాదనకు రాధీ....." ఆమె చేతులను తన చేతుల్లోకి తీసుకుంటూ, అర్థిస్తున్నట్టుగా అడిగాడు మధన్.
"నాకేదో భయంగా వుంది. నేను దురదృష్టవంతురాలిని. నా దురదృష్టంలో నీకు భాగం పంచాలనుకోవడం ఘోరం. నావల్ల నువ్వు ఎటువంటి పరిస్థితుల నెదుర్కోవలసివస్తుందో తలచుకుంటే గుండె దడదడలాడుతోంది. ఇప్పటికే నువ్వు నాకోసం ఎంతో త్యాగం చేశావు. సామాన్య మానవుడు చెయ్యలేని సాహసానికి కొడిగట్టి, నన్ను నరకం నుంచి లాగేశావు."
"రాధీ..... మనిషికి మనిషి సహాయం చేసుకోవడాన్ని త్యాగం అంటే పొరపాటు. అది మనకనీస ధర్మం ఇంతకీ నన్ను పెళ్ళిచేసుకోవడం నీకిష్టం లేదా?" రాధిక కళ్ళల్లోకి చూస్తూ అడిగాడు మధన్.
"ఎంతమాట సాక్షాత్తూ భగవంతుడే దిగొచ్చి నేను నీవాణ్ణి అంటే కాదనే మనుషుంటాడా?"
"మీపాదాల దగ్గర కాస్త చోటు దొరికితేచాలు. అదృష్టవంతురాలిని కానీ....."
"కానీ లేదు, ఏమీ లేదు" అంటూ, ఎడంచేత్తో స్టీరింగు పట్టుకుని కుడిచేత్తో ఆమె నోటిని మూసేశాడు మధన్.
"అబ్బ" అంటూ మెల్లగా అతని చేతిని పక్కకు నెట్టి తన చేతిని ఆమె రెండు చేతులలోకి తీసుకుని కళ్ళ కద్దుకుంది.
"స్టాఫ్" అంటూ కారు స్టాప్ చేశాడు మధన్.
"ఏం జరిగింది?" అంది కంగారుగా.
"షాక్"..... అన్నాడు.
"ఎక్కడ?" అంటూ స్టీరింగు కిటూ అటూ చూడసాగింది.
"ఇక్కడ" అంటూ తన గుండెల్ని చూపించాడు మధన్.
"ఛీ..... పొండీ" అంది రాధిక సిగ్గుపడుతూ.
"అండీయా..... ఇదేమిటీ కొత్త ప్రయోగం" అంటూ రెండుచేతులతోటి ఆమె భుజాలు పట్టుకుని దగ్గరకు లాక్కున్నాడు.
"సిగ్గుతో ముకుళించిన తామరపు పువ్వులా అతని హృదయంపై వాలిపోయింది.
అలా కొన్ని నిమిషాలు వారికి తెలీకుండానే నిశ్శబ్దంలో గడిచిపోయాయి.
"స్టార్ట్" అంది అతని భుజంమీంచి లేచి సరిగా కూర్చుంటూ రాధిక.
"ఓ.కే మేడమ్" అంటూ కారు స్టార్టు చేశాడు మధన్ ఉషారుగా.
"అప్పుడే వచ్చేశారేమిట్రా? పెళ్ళి నిర్విఘ్నంగా జరిగిందా?" అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది రాజేశ్వరమ్మ.
జరిగిందమ్మా..... కానీ నాకు టైంలేదుగా? అందుకే తొందరగా వచ్చేశాం" అంటూ సూట్ కేసు తీసుకుని తన గదిలోకి వెళ్ళిపోయాడు.
"రాధికా.... మీ అమ్మనీ, నాన్ననీ కలుసుకున్నావా?" ఆప్యాయంగా అడిగింది.
కలుసుకున్నాను. కానీ రాధికగా కాదు. డాన్సర్ రత్నావళిగా.
రాజేశ్వరమ్మ పరిస్థితిని అర్థం చేసుకున్నట్టుంది. మరేం మాట్లాడలేదు." స్నానంచేసి రామ్మా. టిఫిన్ చేద్దువుగాని" అంది.
రాధిక లోపలి కెళ్ళిపోయింది.
సూటూ బూటూ వేసుకుని ఆఫీసుకి సిద్దమయి "అమ్మా టిఫిన్ పెట్టు" అంటూ డైనింగ్ టేబిల్ దగ్గర కూర్చున్నాడు మధన్.
వేడి వేడి ఉప్మా, ప్లేటులోపెట్టి, టేబిల్ మీద పెడుతూ, ఎదురుగ్గా నిలుచుంది రాజేశ్వరమ్మ.
"అమ్మా ఇలా కూర్చో" అంటూ తన పక్క కుర్చీ చూపించాడు "చిన్నతనం పోలేదురా" అంటూ ముసిముసి నవ్వులతో వచ్చి కూర్చుంది.
"అమ్మా..... మా పెళ్ళికి వెంటనే ముహూర్తం పెట్టించమ్మా... రాధిక పెళ్ళికాకుండా ఇలా మనింట్లో వుండడం మంచిది కాదు."
రాజేశ్వరమ్మ ఆశ్చర్యంగా చూసింది కొడుకువంక, "ఇంత తొందరేమిట్రా?" అని.
"వాళ్ళమ్మగారూ, నాన్నగారూ రానీయ్. వాళ్ళొస్తే రాధిక వెళ్ళిపోతుందిగా. ఆ తరువాత అన్ని విషయాలూ మాట్లాడుకుని, ముహూర్తం పెట్టించొచ్చు."
'అదికాదు బాబూ.. వాళ్ళతో మాట మాత్రమైనా చెప్పకుండా మనం ఏర్పాటు చేసుకోవడం సభ్యత కాదు."
"అవునమ్మా.... ఒప్పుకుంటాను. ఈ సంగతులన్నీ, ఉత్తరం రాసి చెప్పొచ్చుగా."
"అలాగే ఇవాళే రాస్తాను."
రాధిక అక్కడికి రావడంతో వారి సంభాషణ ఆగిపోయింది ముదురు నీలం జార్జెట్ చీర అదే రంగు బ్లౌజూ, పచ్చని శరీరం మీద హత్తుకుపోయి, మంచి నీలపుముక్కలా అనిపించింది రాధిక. మధన్ ఆమెకేసి చూస్తూ వుండిపోయాడు. రాజేశ్వరమ్మ కూడా. "ఈ చీర నీకు బాగుందమ్మా" అంది.
చిరునవ్వు నవ్వింది రాధిక.
"సాగుమా ఓ నీలిమేఘమా" అని పాడుతూ, పక్కనే వున్న పళ్లేన్ని టిఫిన్ గిన్నె నీ అందించాడు రాధికకి. రాజేశ్వరమ్మా రాధికా కూడా నవ్వేశారు మధన్ ని చూసి.