"అవునూ..... ఆవిడిక్కడికెలా వొచ్చిందీ"...... "ఆ అబ్బాయితో కూడా వచ్చిందట," "అంటే ఆ అబ్బాయికి స్నేహితురాలా?" మొదలగు సంభాషణలు రాధిక చెవుల్లో పడుతూనే వున్నాయ్. అవమానంతో కుంచించుకుపోతోంది. తల్లీ తండ్రి రేణుక పక్కన కూర్చుని కన్యధారపోస్తుంటే, తన రత్నావళిగా అక్కడ కూర్చోలేకపోయింది.
"ఆనందమానందమాయెనే..... మా సీతమ్మ పెళ్ళికూతురాయెనే" అనే మంగళ వాద్యాల మధ్య, అక్షింతల వాన కురుస్తూ వుంటే, రేణుక మెళ్ళో మంగళసూత్రం కడుతూన్న, పెళ్ళికొడుకుని చూసి మురిసిపోతున్న తల్లిదండ్రుల మొహంలో, ఆనందంతో కూడిన గరరేఖని చూసి, తన బోసి మెడకేసి చూసుకుని నిట్టూర్చింది రాధిక.
మూడుముళ్ళూ పడిపోయాక, కట్నాలు చదవడం మొదలయింది. మధన్ పెళ్ళి, తల్లి పంపించిన చీర పాకెట్టుని తెచ్చి, రాధిక చేతికిచ్చాడు రేణుకిమ్మని.
"అదేమిటి మధన్. నువ్వే ఇవ్వు" అంది రాధిక.
"కాదు. బొట్టుపెట్టి నువ్వే ఇవ్వు. ఎవరిస్తే నేం?" అన్నాడు.
"చెల్లెల్ని దగ్గరగా చూసుకుని, మనసారా దీవించవచ్చుననుకుంటూ, మధన్ చేతిలోంచి, పొట్లం అందుకుని, ముందుకు వెళ్ళింది రాధిక.
"చెల్లీ....." అని కౌగలించుకుందామనుకుంది.
అంతలోనే "నమస్కారమండీ" అంది రేణుక. రాధికకి మొహాన కొట్టినట్టనిపించింది. మాటరాక ఎలాగో నవ్వు తెచ్చుకుని చిరునవ్వుతో, బొట్టుపెట్టి, చీర చేతికందించింది రాధిక.
"రత్నావళి కూడా ఏదో ఇస్తోంది" అంది ఒక కోకిల.
"ఊ..... ఎందుకివ్వదూ, బోలెడంత సంపాదనుండగా?" మరో కోకిల కంఠం.
"మొత్తానికి మంచి అందమైనదే మనిషే."
"కనకే మొగాళ్ళనలా తన చుట్టూ తిప్పుకుంటోంది మరి." మరి వినలేకపోయింది, తోటి సోదరీమణుల మాట.
రివ్వున వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. "మధన్. ఇహ పోదాం పద" అంది దుఃఖాన్నాపుకుంటూ.
"సరే"నంటూ లేచాడు మధన్.
భోం చెయ్యందే వెళ్ళడానికి వీల్లేదన్నారు శ్రీహరిగారు.
"రాధికకి విపరీతమైన కడుపునొప్పిగా వుంది. వెళ్ళిపోతాం" అన్నాడు మధన్.
చేసేదిలేక సరేనన్నాడు శ్రీహరిదంపతులు. ఎలాగో అందరినీ తప్పించుకుని. కారులో కూర్చునేసరికి తాతలు దిగొచ్చారు.
కారు కదిలింది. కన్నీటిపొరలు, చూపుకడ్డంగా వుండగా, అందరికీ నమస్కరించి, బయలుదేరింది రాధిక.
మనసంతా అల్లకల్లోలంగా వుంది. తమ పందిట్లో విన్నమాటలు, చెవుల్లో పదే పదే రింగుమంటున్నాయి. తలుచుకుని ఏడుస్తోంది రాధిక.
"లోకం కాకులు రాధీ..... ఏదో కూశారని, కుమిలిపోవడం కన్న, వాటిని లక్ష్యపెట్టక మన కర్తవ్యాన్ని మనం నెరవేర్చుకుపోవడం క్షేమం" అన్నాడు మధన్.
"మధన్ పరాయివాళ్ళ మాటలయితే పెడచెవిని పెట్టొచ్చు. కానీ, 'నా' అనుకునే వాళ్ళే నవ్వులపాలౌతామేమో అని నన్ను చూసి భయపడుతూ వుంటే ఎలా బతకనువారి మధ్యన? ఏ ఆశ పెట్టుకు జీవించను? ఏం చూసుకు సంతోషించాలి మధన్. పైగా నా వల్లవాళ్ళకి కష్టాలుకొని తెచ్చినదాన్నవుతాను. నలుగురిలో తలెత్తుకు తిరగలేక, తల్లిదండ్రులను సుఖపెట్టలేక ఈ బతుకు బతకడం కంటే చావు మేలు-"
"రాధీ..... చావును కోరుకోవడం పిరికి లక్షణం. ఎవరో ఏదో అన్నారని, నిండు జీవితాన్ని బలిచేస్తాననడం మూర్ఖత్వం విజ్ఞులెప్పుడు ధైర్యంగా సమస్యల నెదుర్కొంటారు.
అయితే రాధీ...... నలుగురిలో తిరగలేని తలవంపులు తెచ్చేపని నువ్వేం చేశావ్? పసివయస్సులో ఎవరో ఎత్తుకుపోతే అది నీ తప్పా ఆ దుర్భర జీవితాన్ని గడపలేక ఆ విషవలయంలో నుంచి తప్పించుకు బయటపడి, ధర్మసమ్మతమైన జీవితాన్ని గడపాలని కోరుకోవడం నీ తప్పా? మానవత్వాన్ని మరచి సాటి మనిషనే సానుభూతి అయినా లేకుండా సమాజం దెప్పి పొడుస్తూంటే, అది నీ తప్పా? చెప్పు రాధీ! ఇవన్నీ సంఘం. నీ తప్పులుగా భావిస్తే, ఆ సంఘంతో నాకు సంబంధం లేదు. ఆ లోకం నాకఖ్కర్లేదు. వారి వేళ్ళతో వాళ్ళ కళ్ళే పొడుస్తాను. వాళ్ళనోళ్ళు మూయిస్తాను. ఆవేశంతో మాట్లాడుతున్న మధన్ ని చూసి ఆశ్చర్యపోయింది రాధిక.
"మధన్....." అంది అయోమయంగా.
"అవును రాధీ..... నేచెప్పినవన్నీ నిజాలే, చేసి చూపిస్తాను నేను నిన్ను పెళ్ళి చేసుకుంటాను." రాధిక చేతిని తన చేతిలోకి తీసుకుంటూ అన్నాడు మధన్.
"మధన్ నువ్వు ఉద్రేకంలో వున్నావు. ఉద్రేకం పాలపొంగులాంటిది. చల్లారిపోతే పొంగు ఆరిపోతుంది.
"ఉద్రేకమూ కాదు, ఉన్మాదమూ కాదు. ఉన్నమాట అంటున్నాను. రాధీ..... నేను నిన్ను పెళ్ళిచేసుకుంటాను.
"మధన్. పెళ్ళి..... నూరేళ్ళపంటే. ఏ ఒడుదుడుకులు లేకుండాసాగే సంసారమే స్వర్గం అవుతుంది. ఏ మాత్రం అవకతవకలు జరిగినా, జీవితాలే నరకప్రాయం అవుతాయి. అందుకు పెద్దలు, సాంప్రదాయమనీ, సమానత్వమనీ చూసి చూసి చేస్తారు పెళ్ళిళ్ళు అప్పుడే వివాహ బంధానికి ఒక పవిత్రత ఏర్పడుతుంది."
"పవిత్రత సాంప్రదాయాల్లో లేదు. మన మనసుల్లో వుంది."
'మధన్ నువ్వు చెప్పేవన్నీ నీతి పాఠాల్లో కనిపిస్తాయ్. కానీ, నిజజీవితంలో వర్తించవు. అడుగడుగునా, సమాజం నిన్ను వెలివేస్తూనే వుంటుంది. అవమానాల పాలు చేస్తూనే వుంటుంది. సమాజానికి ఏ ఒక్క వ్యక్తి ఎదురీదలేడు. ఈదడానికి ప్రయత్నించినా, ఓటమి తప్పదు.